Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 10


    తను వొక్కతే ఆ డబ్బుతో బ్రతకాలనే ఉద్దేశ్యం సుభద్ర కి యేనాడూ లేదు. కోరికలు త్రాచుల్లా పగపట్టి కాటు వేస్తుంటే వాటికి దూరంగా పారిపోలేక పోయింది. ఆ కాటుకి బూడిదై, మసై , నుసై పోయింది. అంతర్గతంగా సుభద్ర రెండు భాగాలుగా విదిపోతోంది యెప్పటి కప్పుడు మంచీ చెడూ చెరో పక్కగా నిల్చుని వాగ్వివాదం ప్రారంభిస్తాయి. ఒక్కసారి యీ కలహం లో 'మతి' పోదు కదా అనుకుంటూనే వుంటుంది.
    'మనం హైందవులం . ఒకసారి జరిగిందేదో డాన్ని బ్రతికి నన్నాళ్ళూ అనుభవించాలి. తప్పదు. తప్పటడుగుల్లో సుఖం లేదు నీతిగా బ్రతికే బ్రతుకులో ఏవీ వుంది. మనశ్శాంతి వుంది.'
    'చస్! అవన్నీ సిద్దాంతాలు. మనమేవీ ముక్కు మూసుకుని అడవుల్లో వుంటూ కంద మూలాలు తిని బ్రతకడం లేదు. ఈ జీవితాన్ని సన్యసుల్లా దోర్లించేందుకు. నా వల్ల కాదు. నేనేం చేయను? నన్ను ఈ కోరికలు సర్వనాశనం చేస్తున్నాయి.'
    'ఆ సంగతి నీ భర్త వుండగానే గ్రహించావు గుర్తు లేదూ. అప్పుడే అతని సమక్షం లో వోప్పేసుకుంటే క్షమించే వాడేమో.'
    'అదెలా సాధ్యం?'
    'ఎందుకు కాదు? నీ భర్త అతను. నిన్ను అర్ధం చేసుకున్నాడేమో వొకసారి గుర్తుకు తెచ్చుకో.'
    'లేదు. అలా ఏం జరగలేదు.'
    'అబద్దం . నువ్వు ఏది చేసినా తనకు యిష్టం అన్న మనిషి నిన్ను అర్ధం చేసుకోలేదనే అంటావా?'
    'నువ్వు అన్నది నిజమే. కానీ అయన దగ్గర నోరెత్తిందుకే ధైర్యం లేక పోయింది నాకు. అయన చచ్చిపోయినా , నేను జగదీశ్ ని చేసుకున్నానని తెలుస్తే తప్పకుండా తృప్తి పడతారు.'
    నవ్వింది అంతరాత్మ చాలా చిత్రంగా 'పిచ్చి సుభద్రా! జగదీశ్ నీలో ఏం చూసి చేసుకుంటాడు? అయినా అతన్ని అడిగి కనుక్కో. నిన్ను చేసుకునేది లేనిదీ. అతను మనిషి. నీకన్నా మామూలు మనిషి. మగవాడోయ్ సుభద్రా అతను మగవాడు. తుమ్మెద యెప్పుడూ ఆలోచించదు పువ్వు భారంగా వొంగి ఫలానికి లొంగి పోతోందని , రెక్కలు పోగొట్టుకుని భూమిలో కలిసి పోతోందనీ.'
    'నన్ను భయపెడుతున్నావు అనవసరంగా." అతను స్పష్టంగా చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకుంటా నని!
    'అదే అక్కడే పోరాబడుతున్నావు సుభద్రా! అతను నీలో ఏం చూసి చేసుకుంటాడు?'
    'అతను బాగా చదువుకున్న ఇంజనీరు. అతనికి వున్న సంస్కారం మామూలు మనుషులకి లేదు!
    'వెర్రి దానా! మామూలు మనుషులే ఆలోచిస్తారు పాప పుణ్యాలు . చదువుకున్న వాళ్ళు విజ్ఞానాన్ని ఆకళించుకుని దేన్నో, మరి దేనికో ముడిపెట్టి దేవుడు మిధ్య, పాప పుణ్యాలు మిధ్యా అనేసి వొళ్లు దులుపు కుంటారు. ఇంజనీరు అంటున్నావు. అతను మాత్రం, తన గృహ ప్రాంగణానికి వేసి నంత దిట్టమైన పునాది మరో యింటికి వేయడోయ్! నీ నమ్మకం చూస్తె జాలి వేస్తోంది. అదే నిజమైతే నీ అదృష్టం పండింది. నిన్ను అభినందిస్తున్నాను. చేసిన పని సరిదిద్దుకో. వెంటనే ఆ ప్రయత్నంలో వుండు. వూ కదులు....వెళ్లు.'
    'సరస్వతి?' బేలగా అంది సుభద్ర.
    'అవి బంధాలు. మార్గం వెతికావు. కదులు ముందుకి. నీకూ యీ యింటికి జగదీశ్ తో సంబంధం కలిసిన రోజునే ఆ క్షణాన్నే తెగిపోయాయి సంబంధాలు.'
    'అయితే నాకు వీళ్ళు యేవీ కారా?'
    'ఎలా అవుతారు? నీకు యిక్కడ వుండిందుకే అర్హతలు లేవు సుభద్రా. వాళ్ళు నీతోటి మనుషులు అంతే...'
    'సరస్వతీ, శ్రీనివాస్ లేకుండా నేనెలా బ్రతక గలను?'
    'జగదీశ్' వుంటాడు కదా'
    'అతన్ని ఎలా నమ్మడం?' సుభద్ర కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతూ చెంపలు తడుపుతున్నాయి.
    'చూశావా! నీకే నమ్మకం లేదు. అతని మీద. న్యాయానికీ; నీతికి కట్టుబడి బ్రతకాలి సుభద్రా. సంఘాన్ని పాడుచేయటం కాదు మన పని.'
    'అయ్యో నేను ఏమై పోను? నాకు యిప్పుడు ఏది దారి?' సుభద్ర నిలువునా నీరై పోయింది. పక్క మీద సరస్వతి గాడ నిద్రలో ములిగి పోయింది. సుభద్ర గది గుమ్మం దాటి రెండేసి మెట్లు వొక్కోసారి దాటేస్తూ జగదీశ్ గది వైపు పరుగులు పెడుతోంది.

                                  5
    రెండు మూడు రోజుల వరకూ శ్రీనివాస్ కంటికే కనిపించలేదు అవధాని గారు. శ్రీనివాస్ వూరి నుంచి వొచ్చాక కూడా అయన కనిపించక పొతే అతని మనసు బాధ పడిపోయింది. ఆ మాటే అన్నాడు అన్నపూర్ణ లో "ఏం పిన్నీ' యిన్నాళ్ళూ బాబాయి కనిపించలేదు ఊళ్ళో లేరా.'
    'పొలం వెళ్ళారు శ్రీనివాస్.'
    'అదేవిటి పిన్నీ ఆయన అలవాట్లు మారి పోయాయా. నేను లేకపోతె భోజనం కూడా చేసేవారు కాదు. అటువంటిది ఎందుకిలా మారిపోయారు?'
    'కొత్త పనులు తగులుకున్నాయి యీ మధ్య. అందుకే ప్రొద్దుటే వెళ్లి పోతున్నారు.'
    రాత్రి వచ్చినా కనిపించడం లేదు. ఏదో వుంది కారణం చెప్పండి పిన్నీ.'
    అన్నపూర్ణ నిట్టూర్చింది. శ్రీనివాస్ భోజనం ముగించి అరుగు మీద కూర్చున్నాడు. 'యేమైనా సరే పిన్నీ యివాళ అయన వచ్చేవరకూ యిక్కడే వుంటాను.'
    అన్నపూర్ణ అంది : 'అయన పలివెల వెళ్ళారు. ఈ రాత్రి వస్తారో లేదో.'
    'పోనీ పిన్నీ పుస్తకాలు తెచ్చుకుని యిక్కడే పడుకుంటాను. చదువు ఎక్కడ చదివినా వొకటే.'
    'రాత్రి వేళ వోక్కడి నీ యీ అరుగు మీద పడుకోవడం యేవీ బావుండదు. బాబాయి....'
    'పిన్నీ, 'శ్రీనివాస్ పిలిచాడు; ' నేను కులం లేని వాడినని బాబాయి బహుశా పంక్తి విస్తరి మానుకున్నారు కాబోలు.'
    'నేను చెప్పకపోయినా రేపు నీకు ఎలాగూ తెలుస్తుంది. రేపటి వరకూ నిన్ను ఆపడం దేనికి ? యిప్పుడే చెప్పేస్తాను.'
    'ఏవిటది పిన్నీ' కుతూహలంగా అడిగాడు శ్రీనివాస్.
    'రాధ తండ్రిని కనుక్కుందుకు నువ్వు వోద్దన్నా వినకుండా ఆయన్ని నేనే పంపాను.'
    'అయితే.'
    'మేము దిక్కులేక భిక్షం యెత్తి నంత మాత్రాన కులాన్ని కూలగొట్టు కునే స్థితికి దిగజారి పోలేదు . మాకూ వున్నాయి ఆత్మాభిమానాలు పరువు - ప్రతిష్టలు. చూడు అవధానీ! నీకంత మక్కువగా వుంటే మరో పిల్లను పెంచుకో. ఆ పిల్లని యిచ్చి పెళ్లి చేయి. అంతేకాని సంకీర్ణ జాతి పిల్లాడికి యిచ్చేందుకు మాకు ఖర్మ కాలలేదు.
    'ఒకవేళ అదే జరుగుతే డాన్ని గోదావరి లో పడేసి మేమూ దూకుతాం!' అన్నారట. ఆ మాటలు విని అయన తేలిగ్గా నవ్వేశారు . కానీ........
    'మీ బాబాయి మనసు ముక్కలై పోయింది. అయన నీ మొహం చూడలేక తప్పించుకు తిరుగుతున్నారు.'
    విరక్తిగా నవ్వాడు ? 'నేను చెప్పాను కదా పిన్నీ. నాకు మొదటి నుంచీ జరగబోయేది తెలుసును. అందుకు బాధలేదు. బాబాయి బాధపడి నాకు దూరమై పోవడం యేవీ బాగులేదు.'
    'అదొక్కటే కాదురా కారణం.'
    'మరి?'
    'రాధ చచ్చిపోయింది.
    శ్రీనివాస్ ఉలిక్కి పడ్డాడు. ఏవిటి పిన్నీ మీరు అనేది రాధ.' అతని కనుబొమ్మలు ముడి పడిపోయాయి. చీకటి లో గుడ్డి దీపం వెలుగులో అతని మొహం కళాకాంతులు లేకుండా వెలవెలా పోతోంది.
    'రాధ . మన రాధేనా పిన్నీ చచ్చిపోయింది. ఎందుకని,' అతను నమ్మలేకుండా వున్నాడు యింత పచ్చి నిజాన్ని.
    'నిజమే మనింటికి వచ్చి నువ్వు వుంటే కాస్సేపు కూర్చుని వెళ్ళిపోయేది . ఆ రాధే.'
    'ఎందుకనో?'
    అన్నపూర్ణ సరుదుకుని నెమ్మదిగా అతనికే వినిపించేంత స్థాయిలో అంది. 'డాన్ని మూడో పెళ్లి సంబంధం మనిషికి నిర్ణయించారు.'
    హటాత్తుగా శ్రీనివాస్ కళ్ళల్లో సుభద్ర కదిలింది. 'పిన్ని ' అతని అంతరంగం కుదించుకు పోయింది చితికి పోతూ . అభాగ్యులైన ఆడపిల్లలు యిష్టం లేని పక్షం లో చేసే తంతు యిదన్న మాట! మరి పిన్ని కి యిష్టం ఆయె చేసుకుందా?
    శ్రీనివాస్ అంతరాత్మ చిత్రంగా నవ్వింది. బ్రతుకు మీది ఆశ తెంచుకోలేని ఆడపిల్లలు పిన్ని మాదిరి అయిపోతారేమో.'
    'ఆ పిల్ల అసలు నీ కోసం చచ్చిపోయింది రా శ్రీనివాస్.'
    'పిన్నీ' శ్రీనివాస్ తెల్లబోయాడు.
    'అది నా వొళ్ళో పెరిగి పెద్దదైంది. డానికి సూటిగా మాట్లాడడం' అలవాటు. అందుకే ఆయన్ని పంపెను నేను.'
    'నీమీద ప్రేమ తెంచుకోలేక, భవిష్యత్ అలా గడపలేక వురి పోసుకుంది....'
    అన్నపూర్ణ యేడుస్తోంది.
    'యింక వినాలని లేదు పిన్నీ. మరి వస్తాను.' అతని హృదయం గాలికి రెపరెప లాడుతోంది. కటిక చీకట్లో కలిసి పోతుంటే అన్నపూర్ణ గుమ్మానికి అనుకుని నిలుచుండి పోయింది.

                           *    *    *    *

                  
    శ్రీనివాస్  పక్క మీద దొర్లుతూనే వున్నాడు. అతని కంటికి దూరమై పోయింది నిద్ర. మానసికంగా అతను దిగజారి పోతున్నాడు, పరీక్షలు యింక యెక్కువ రోజులు లేవు. సుభద్ర దగ్గర నుంచి సరస్వతి క్షేమ సమాచారాలు తెలుపుతూ వుత్తరాలు వస్తూనే వున్నాయి. కానీ అతని మనసు కీడునే శంకిస్తోంది. రెక్కలు గట్టుకుని వాలి పోవాలనే తపన. సరస్వతి మంచాన వుంది. పిన్ని ఆరోజు ఏందుకలా చేసిందో విశదంగా ఆలోచిస్తే అతని అణువణువూ జాలితో పొంగి పోతోంది. పిన్ని తప్పు యే మాత్రం చేయలేదు. తను అక్కడికి ప్రావరాఖ్యుడై పోయినట్లు ఆవిడను కఠినంగా యెలా శాసించ గలిగాడు? పాపం ఆవిడ మనసు యెంత దెబ్బతిని వుంటుందో? తను లొంగి పోవడం అనే ఉద్దేశ్యం యేవీ లేదు అతనిలో. రెండు మాటలు సానుభూతి తో అని వుంటే ఆవిడ పశ్చాత్తాపం తో కృంగి పోయేది. రాధ తనను గుడ్డిగా నమ్ముకుంది. ఆ విషయం తనతో అని వుంటే ?'
    'అట్టే వెర్రి వెర్రి వేషాలు వెయ్యక, అనేవాడివి.' అంతరాత్మ అట పట్టించింది.
    'ఛ! అది పిన్ని విషయం. పిన్ని మరొక వ్యక్తిని కోరుకుని వుంటే తను నిజంగా అభినందించే వాడె! శ్రీనివాస్ మనసు సుడి గుండం లో చిక్కుకుని గిరగిరా తిరుగుతోంది. వో గంట పడుకోవాలని కాలేజీ నుంచి యింటికి వచ్చేశాడు. తీరా వచ్చాక అనిద్ర కనుచూపు మేరలో యెక్కడా కనిపించడం లేదు. ఆ పిన్ని చలువ వల్లే తను గ్రాడ్యుయేటు అయ్యాడు.
    'పిన్నీ రెండు వారాలు, కాకపొతే నేల వోపిక పట్టండి. నేను వొచ్చేసి మీకు దారి చూపిస్తాను.' శ్రీనివాస్ కళ్ళు మూసుకుని నాలుగు గోడల మధ్య గట్టిగానే అన్నాడు.
    టంగున వొంటి గంట కొట్టారు దూరాన. మనసు పూర్తిగా వికలం అయిపొయింది. అతని కాళ్ళు మరి రూమ్ లో నిలువ లేదు. రామదాసు యింటి వైపుకు సాగాయి.

                          *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS