Previous Page Next Page 
మారిన విలువలు పేజి 9


     "సోడా డబ్బులు, ఈ సొమ్ము రేపిచ్చేస్తాను. అప్పన్నా " అన్నాడు.
    "తొందరేంటి బాబూ!" అన్నాడు అప్పన్న.
    "మరేం! ఇది నీ దగ్గర అప్పుకి విఘ్నేశ్వర పూజ అవుతుంది " అన్నాడు ప్రకాశం నవ్వుతూ.
    అప్పన్న ఇచ్చిన సొమ్ము పట్టుకొని ప్రకాశం వెళ్ళిపోయేడు.
    పంతులు మంచోడు. చురుకైనోడు. పాపం చదువే అబ్బకున్నది- అనుకొన్నాడు అప్పన్న.
    కొందరితో స్నేహం అనుకోకుండానే ఆరంభమవుతుంది. మరికొందరితో ఎంత ప్రయత్నించినా ముఖ పరిచయం స్నేహంగా మారదు. స్నేహం అన్ని సమయాల్లోనూ , సమాన వయస్సులో , సమాన ఫాయాలో ఉన్న వ్యక్తుల మధ్యనే కుదరాలనే నిబంధన లేదు. దున్నిన సారవంతమైన భూమిలో పడిన విత్తనం మొలకెత్తి, ఎంత బాగా పెరుగుతుందో ఒక్కొక్కసారి రాళ్ళ మధ్యన పడి లేచిన మొక్క అంతకు రెట్టింపుగా పెరుగుతుంది. అంతమాత్రాన రాళ్ళ కుప్పల్లోనే చెట్లు నాటాలని కాదు.
    సమవయస్కుల మధ్య స్నేహం వర్దిల్లెందుకు చాలా అవకాశాలు ఉంటాయి. ఆ వయస్సులో గొప్ప, బీద  తారతమ్యం లేకుండా అందరి ఆలోచనలు, ఆశలు రమారమి ఒక్కలాగే ఉంటాయి. కొందరికి కోరిన కోరికలు తీరుతాయి. కొందరికీ తీరవు. అంతే తేడా.
    అటువంటి సామ్యం అప్పన్న ప్రకాశాల మధ్య లేకపోయినా వారి పరిచయం స్నేహంగా మారింది. అప్పన్న ను ప్రకాశం చిత్రమైన పరిస్థితుల్లో కలుసుకొన్నాడు.
    సాధారణంగా బజారు పనులు ప్రకాశమే చేస్తాడు. కాని, ఆరోజు ఏ కారణాన్నో ప్రకాశం స్కూలు నుండి రావడం ఆలస్యం అయింది. రాత్రికి బియ్యం నిండుకున్నాయని తల్లి చెప్పడంతో సాంబశివం రేషన్ కార్డు, సంచి పట్టుకొని బయలుదేరాడు. అప్పటికి జానకి ఇంకా ఉద్యోగం చెయ్యడం లేదు. నెల పూర్తీ కావడానికి ఇంకా పది రోజులు ఉన్నదనగానే ఇంట్లో డబ్బు, వస్తువులు కూడా నిండుకుండేవి. మిగిలిన పది రోజులు అప్పో, సప్పో చేసి సుందరమ్మ రోజు గడుపు కొచ్చేది. ఇన్ని బియ్యమైనా ఇంట్లో ఉంటె ఎలాగో లాగా గడపుకోవచ్చని సుందరమ్మ ఇరుగు పొరుగిళ్ళలో అప్పు చేసి సాంబశివం చేతిలో డబ్బులు పెట్టింది.
    గుంటూరు చాంతాడులా అరమైలు దూరం వరకు వ్యాపించి ఉన్న క్యూలో , కొట్టుకుఫర్లాంగు దూరంలో తనకు స్థానం దొరికినందుకు సంతోషించేడు సాంబశివం. కొట్టు కట్టేవేళకు దొరికిన వాళ్ళకు బియ్యం దొరగ్గా, మిగిలిన వాళ్లు ఆ రాత్రి కి అక్కడ జాగారం చెయ్యవలసిందే. మరునాటి ఉదయం లేచి నిలిచేందుకు శక్తి లేని వాళ్ళు కూలబడిపోతే, వాళ్ళను మట్టుకొంటూ ముందుకు పోయేందుకైనా వెనుదియ్యటం లేదు మనుష్యులు. ఆకలి బాధ అటువంటిది.
    డబ్బు లేక కొందరు కడుపులు మాడ్చుకొంటుంటే , డబ్బున్నా తిండి గింజలు దొరక్క కొందరు పస్తులు ఉంటున్నారు. ఇంత ప్రయాసపడి ఆ గింజలు ఇల్లు చేరిస్తే, విస్తట్లో పెట్టుకున్న అన్నం చూసి కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఇవి గుర్రాలు తినే ఉలవలా, వరి అన్నమా అనే సందేహం వస్తుంది తింటున్నవాళ్ళకు.
    ఆ బియ్యం ఇచ్చేందుకైనా షాహుకారు మెహర్బానీ కావాలి. తెలిసినవాళ్ళకు కొట్టు వెనక్కు పిలిచి తొందరగా ఇస్తాడు. లేని వాళ్ళను రోజుల కొద్దీ నిలబెడతాడు. డబ్బున్న వాళ్ళ దగ్గర చిత్తం, చిత్తం అంటూ దరిద్రుల మీద విరుచుకు పడతాడు. ఆ ప్రదేశానికి వాడు రాజు. వాడి అజ్ఞ అందరూ పాలించవలసిందే.
    సూటిగా ముఖానికి కొడుతున్న ఎండకు చెయ్యి అడ్డు పెట్టుకొని ఓపిగ్గా నించున్నాడు సాంబశివం, తన వంతు వచ్చేవరకూ. తనకు ముందున్న మనిషి వెళ్ళి పోయేక రేషను కార్డు , డబ్బులు సెట్టి ముందున్న బల్ల మీద పెట్టేడు. పెట్టి కార్డు వైపు , సాంబశివం వైపు మార్చి మార్చి చూసి, "ఆ పొట్టబ్బాయి అన్నగారా మీరు?" అన్నాడు.
    'అవును" అన్నాడు సాంబశివం.
    "కిందటి మాటు ఆరువెట్టి పట్టుకెళ్ళేరే-- ఆ డబ్బులేవి?"
    "లేదే! మేం ఎప్పుడూ అరువు పెట్టం. పొరపాటుగా ఇంకెవరి గురించి అనుకొంటూన్నారో?"
    "ఏంటి , బాబూ , అలా మాట్లాడుతారు! ఏ పారం సేత్తున్నవాణ్ణి అరువిచ్చిన మనిషిని మరిసిపోతే ఇంక దివాలా తీసినట్టుకే! ఆ పొట్టాయన ఎర్రగా, దుబ్బుగా బుర్ర మీద జుట్టు, కాకీ నిక్కరు ఏసుకు తిరుగుతారు. అరి పేరేంటి? నోట్లో ఆడుతున్నది....?"
    షాహుకారు చేసిన వర్ణన ప్రకాశానికి సరిగ్గా సరిపోయింది. అయితే ప్రకాశం ఎందుకు అరువు పెట్టేడు? ఆ డబ్బు ఏం చేసేడు? ముందుసారి వాడు రేషను తేవడానికి వెళ్తున్నప్పుడు అన్నయ్య డబ్బు లెక్క కట్టి ఇవ్వడం తను చూసేడే! కనీసం ఈ విషయం ఇంటి దగ్గర ఎందుకు చెప్పలేదు? సాంబశివం ఆలోచిస్తున్నాడు.
    ప్రకాశం పేరు కోసం శెట్టి ఇంకా తంటాలు పడుతున్నాడు.
    "ప్రకాశమా?" అన్నాడు సాంబశివం.
    "అది గది బాబూ! ఆ ప్రకాశం మీ తమ్ముడు గారు కారా?"
    "అవును. మా తమ్ముడే. కాని వాడు అరువెందుకు పెట్టేడు?"
    "ఏమో, నాకేటి తెలుస్తాది?"
    "ఈ సంభాషణ సాంబశివానికి ఎంత అవాంచనీయంగా ఉందొ, వెనక నిలిచిన వాళ్ళకు అంతకన్న రెట్టింపు చికాకుగా ఉంది.
    "ఏమిటయ్యా! ఇవ్వవలసిన డబ్బిచ్చి బియ్యం వేగంతీసుకో నీ వెనక వాళ్ళకి మరి పనులు లేవా?"వెనక నుండి నాలుగైదు కంఠలు గర్జించాయి.
    "నేను ఈ సొమ్ము మాత్రమే తెచ్చెను. ఈ అప్పు సంగతి నాకు తెలీదు" అన్నాడు సాంబశివం మెల్లగా ముఖమింత చేసుకొని.
    సాంబశివం ఇటువంటి తిక్కా మొక్కీలు తిన ఎరిగిన వాడు కాడు. అసలు బజారు పనులు, బేరసారాలు అంటే అసలే అతనికి తెలియవు. ఆపైన అప్పు పెట్టి బ్రతిమాలు కోవడం అతని వశంలో లేని పని.
    తన కాలేజీ తన చదువు తప్పరెండో విషయం తెలియదు సాంబశివానికి. కాలేజి కి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఇంటి దగ్గర వంచిన బుర్ర క్లాసులోనే తిరిగి ఎత్తడం. అలవాటుపడిన పేవు మెంటు మీదుగా నడుచుకు పోతుంటే అప్పుడప్పుడు ఎదురు వచ్చేవాళ్లను డీ కొని వాళ్ళ చేత దీవెనలు తినడం కూడా పరిపాటే. ఎప్పుడైనా కాలేజీ ఆవరణలో కాస్త బుర్ర పై కేత్తితే , "ఆ....ఆ.... సాంబశివం! కాళ్ళ కింద చీమలు చచ్చి పోతున్నాయి. దిగువ చూసుకునడువు"అని విద్యార్ధులు పరిహాసం చేసేవారు.
    "వాడి మెడ నరాలు తెగిపోయేయిరా! అందుకే అది అలా వాలిపోతుంది. పాపం వాడెం చెయ్యగలడు?" కృత్రిమమైన సానుభూతి చూపించేవారు కొందరు.
    "కాదురా . కళ్ళెత్తి చూస్తె కాంతలంతా వెంట పడతారని సాంబశివానికి భయం."
    ఇలా ఎవరు ఎన్ననుకొన్నా సాంబశివం తన అలవాటు మాత్రం మార్చుకోలేక పోయేడు.
    "దానికేం లెండి, పంతులు గారూ" అన్నాడు సెట్టి ఆ సొమ్ము గల్లా పెట్టిలో పడేస్తూ.
    బియ్యం ఇస్తాడన్న ఉద్దేశంతో సాంబశివం సంచి ముందుకు పట్టెడు.
    "ఇంకా సానా పొద్దున్నాది. ఇంటి కెళ్ళి డబ్బులట్టుకు రండి" అంటూ సాంబశివం పక్కవాని కార్డు కోసం చెయ్యి ముందుకు పెట్టేడు సెట్టి.
    ఆ సొమ్ము ఇచ్చేందుకే తల్లి నానా అగచాట్లు పడి నలుగుర్ని అడిగి లేదనిపించుకొని కోన కేలాగో తెచ్చి ఇచ్చింది. మళ్ళా ఇప్పుడు డబ్బు కావాలంటే ఎక్కడ వస్తుంది? ఇంక డబ్బు దొరికేదాకా ఇంట్లో అంతా పస్తుండవలసిందే అనుకొన్నాడు సాంబశివం. ఎప్పుడూకోపం అన్నది ఎరగని వాడు ఆ సమయంలో తమ్ముడి మీద కోపం తెచ్చుకొన్నాడు. తిండికి లేక ఇంట్లో అంతా బాధపడుతుంటే , ఆడబ్బు ఏసినిమాలకో సిగరెట్ల కో తగలేసి ఉంటాడు. ఇంటికి వేల్లెకీ విషయంలో కాస్త గట్టిగా చీవాట్లు పెట్టాలి. మరీ ఇంత బాధ్యతా రాహిత్యంగా తిరిగితే ఎలా? అనుకొన్నాడు.
    సాంబశివం నిరాశ తో సిగ్గుతో తిరిగి పోబోతుంటే ప్రకాశం పరుగున వచ్చి అన్న చేతిలోని సంచి , రేషన్ కార్డు అందుకొన్నాడు. అన్న ముఖం చూస్తూనే డబ్బు విషయంలో శెట్టి తూలనాడి ఉంటాడని పసికట్టేడు.
    "నే బియ్యం తెస్తాలే అన్నయ్యా! నువ్వింటి కెళ్ళు. ఈ ఎండ నీ ఒంటికి పడదు. మళ్ళా తలనొప్పి రాగలదు." అన్నాడు ప్రకాశం. సాంబశివం ఏవిషయం చెప్పక ముందే ప్రకాశం అతని చేతిలోని సంచి, కార్డు లాక్కొని ముందుకు పోయేడు. తోసిడి లో సాంబశివం వెనక బడ్డాడు.
    "ఏం పంతులూ! సెప్తుంటే నీక్కాదూ? మీ అన్నిచ్చిన డబ్బు పాత బాకీకి సరిపోయింది. డబ్బిచ్చి బియ్యం తీసుకుపో.నే నియ్యనన్నానా?" అన్నాడు సెట్టి చిరాకుతో.
    'అది సరే , పోలయ్యా! పాతబాకీ చెల్లయింది కదా? ఇదీ తొందరలోనే సర్దేస్తాను. నెలాఖరు చూడు...."
    "ఏంటయ్యా! నివ్విట్టాంటి కబుర్లు చెప్తావు.మేము అరువు పెట్టం అంటాడు మీ అన్న. ఈ సోదంతా నాకేటి కాని, మరి అరువిచ్చేది లేదు." నిష్కర్షగా చెప్పెసేడు పోలయ్య.
    "చూడు, పోలయ్యా! నీ డబ్బు ఎగవెయ్యం.ఆ పాటి పరువు ప్రతిష్ట ఉన్నవాళ్ళమే .ఏదో ఇబ్బందిలో .....తెలిసిన వాడివి,ఆమాత్రం సర్ధకపోతే ఎలా చెప్పు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS