"మీ పెద్దింటోరితనం మీ దగ్గరే ఉంచుకొని,నా సేతిలో సొమ్ము పెట్టి మరీ సరుకు తీసుకెళ్ళండి. డబ్బు కాడికోచ్చేసరికి అంతా పెద్దోరే" అన్నాడు సెట్టి హేళనగా.
ప్రకాశం చేసేది లేక వెళ్ళి పోతుంటే , అతని పక్క నున్న వ్యక్తీ కొంగు ముడిలోంచి సోమ్ముతీసి, "ఎంతియ్యాలయ్యా, ఈయన కార్డుకి?"అన్నాడు.
సెట్టి కాస్త సేపు తెల్లబోయి అతని వైపు చూసి, 'అయిదున్నర" అన్నాడు.
ఆరు రూపాయి నోట్లు బల్ల మీద పెట్టి "ఊ కొలువు" అన్నాడు. ఇతడు ఎవరా అని ప్రకాశం చూస్తుంటే, "సంచి పట్టండి. పంతులు గారూ" అన్నాడు అతడు.
తన బియ్యం తీసుకొని లైను నుండి బయటి కెళ్ళి నించున్నాడు ప్రకాశం. అవసరానికి ఆదుకొన్న ఆ వ్యక్తికీ తన కృతజ్ఞత తెల్పుకొని ,ఆ సొమ్ము ఎలా అతనికి అందజేయాలో కనుక్కుందామని అతనికోసం ఎదురు చూసేడు. పది నిమిషాల్లో ఆవ్యక్తి బయటికి వచ్చేడు.
"ఇంకా ఇక్కడే నిలబడ్డారా , పంతులు గారూ! రాత్రి వంటకి ఇయే బియ్యం కామాల. తొందరగా ఇంటికి పొండి " అన్నాడు.
ఇంత సహాయం చేసి కనీసం తన నుండి కృతజ్ఞతైనా ఆశించని ఆ మనిషితో ఎలా మాట్లాడడమో ప్రకాశానికి అర్ధం కాలేదు.
"మిమ్మల్ని ఎక్కడా చూసినట్లు...."
'చూసుండరు. బాబూ! నా పేరు అప్పన్న. బజారు పక్క రవి చెట్టు సందులో నా కిళ్ళీ కొట్టున్నాది." తనను పరిచయం చేసుకొన్నాడు అప్పన్న.
"మీ సహాయానికి చాలా కృతజ్ఞుడ్ని."
"పెద్దోరు , మీరామాటనడం బాగులేదు."
"మా పెద్దరికం అక్కడ చూసేరు కదూ?"
"నన్నలా మన్నించకండి, బాబూ! అలవాటు లేదు. కొత్తగా ఉంటుంది."
"నాకంటే పెద్దవారు , మరెలా పిలవను?"
"అప్పన్నా అని పిలవండి , బాబూ. నన్నంతా అలాగే పిలుస్తారు. అది సరే కాని, బాబూ , బియ్యానికిచ్చిన సొమ్ము ఇంకో దాని కోసం తగలేట్టవచ్చా? తిండి గింజలు లేకపోతె ఇంట్లో ఎంత బాధగా ఉంటాది?" అవసరం లేకపోయినా వయసు అప్పన్నచే ఆ మాట పలికించింది.
"నేను చెడు ఖర్చులు పెట్టలేదు, అప్పన్నా. నాకు పరపతున్నాదన్న ధీమాతో బియ్యానికి డబ్బు లేక , ఇలాగే ఇరకాటన పడ్డ మరొకరికి అప్పిచ్చేను. ఇప్పుడు నావంతయింది. మనిషికి లేని పరపతి డబ్బుకున్నది. అప్పన్నా. అందుకే మనిషి జీవితాన్ని తన కొనగోటి చుట్టూ గిరగిర తిప్పుకొంటూన్నది డబ్బు" అన్నాడు ప్రకాశం.
"తమరు సదువుకున్నవోరు . తమకి తెలియందేముంది , బాబూ! మనిసి బతకాలంటే డబ్బు కావాలి మరి. డబ్బుకున్న ఇలువ డబ్బు కున్నది. అందుకే డబ్బు లక్షిందేవన్నారు. కాని, ఆ డబ్బుని ఇంటికి తెచ్చుకోడానికి మనసులు నానా గత్త రాతిని , నలుగురు బుర్రలు మొత్తి అల్లందరు ఏడుస్తుంటే తాము బావుకోవాలా? అని అనిపిస్తుంది నాకు.
"నీలో నీతుంటే నువ్వు నిజాయితీ గా బతుకుతే దేవుడు నిన్ను చల్లగా చూత్తాడనేవాడు మా అయ్య. అని ఆనాటికి ఈనాటికి రోజులు మారిపోయాయి. మనుసులు కూడా మారిపోయారు. ఆ కాలంలో పెద్దోడు, చిన్నోడు అనే బేధం లేకుండా పలుగూ, పారా బుజాన్నేసుకొని చుక్క దూరక ముందు పొలం పోయి, సూరుడు కన్ను సాటయేదాకా పాటుపడేవారు. ఇంటి కొచ్చి కడుపు నిండా బువ్వ తిని కమ్మగా నిద్దరోయేవారు.
"ఈ రోజుల్లో ఇవతల కాలు అవతల పెట్టకుండా అందరి జేబులు నిండి పోవాలనుకొంటారు. కష్టపడకుండా తమింట లక్షిందేవి ఘల్లుఘల్లు మానాలని ఆశపడతారు. తెరగా ఇంకోడు పెడితే తినింటికి అంతా తయారే. ఈ కాసింతపని చేసి పెట్టారా, బువ్వ పెడతా నంటే నా వల్ల కాదు బాబూ అంటారు. మనుషులు సోమరిపోతుల్లా మారిపోతున్నారు , బాబుగారూ!
'పెట్టి పుట్టిన అయ్యల మాట కాదు నే చెప్పేది. మాలాటి అలగాజనం కూడా సౌకాలు మరిగి కాయకట్టం సెయ్యడం నామోషి అనుకొంటున్నారు, బాబూ! నామట్టుకి నేను సేసిందేమిటి? మా అయ్య యవసాయం సేసి, కూతుళ్ళ కి పెళ్ళిళ్ళు సేసి, నలుగురు కొడుకుల కీ నాలుగు మడి చెక్కలు పంపకం పెట్టేడు. ఆడు కళ్ళు ముయ్యగానే ఆ బూమిని అమ్ముకొని ఇక్కడ కొట్టు పెట్టాబంటే పొలంలో పని సేయ్యనే కనే కదా, బాబూ! నీడ పట్టున కూకుని యాపారం సేద్దామని పుట్టి నూరు వదిలి ఇక్కడ పడ్డాను."
"వ్యవసాయం చెయ్యి; వ్యాపారం చెయ్యి; ఏది చేసినా తప్పు లేదు, అప్పన్నా! నువ్వన్నట్టు ఏ పని చేసినా కష్టపడి చెయ్యాలి. నిజాయితీ గా బతకాలి! రైతుబిడ్డని, నా తండ్రి తాతలు ఈ భూమి దున్ని బ్రతికేరు, చస్తే ఆ భూమిలో చస్తాను కాని, ఇంకోపని ముట్టను అని మూర్ఖంగా ప్రవర్తించక నీకు నచ్చింది, నవ్వు చెయ్యగలిగింది చేస్తున్నావు. అందులో తప్పేముంది?
"మీ అయ్య తనకున్న భూమిని నలుగురికి పంచేడంటున్నావు. నీకు నలుగురు బిద్దలుంటే నువ్వు దానిని మళ్ళా పంపకం పెడతావు. ఇలా చీలిపోతున్న భూమి అందరికీ తిండి పెట్టలేదు, అప్పన్నా. కొందరు భూముల్ని నమ్ముకొని బ్రతుకుటే, మరి కొందరు ఇతరమైనవృత్తులు ఎన్నుకోవాలి. అప్పుడే కుటుంబాలు అభివృద్ధి అవుతాయి. నువ్వు భూమి వదిలి కిళ్ళీ కొట్టు పెట్టేవు. నీ కొడుకు ఇంతకన్న పెద్ద వ్యాపారం చెయ్యచ్చు...."
"నాకు కొడుకులు లేరు, బాబూ. ఒక్క కూతురున్నది. తల్లి లేని పిల్ల. అటు వేపు ఎప్పుడేనా వస్తే మా కొట్టుకి రండి మా అమ్మడిని సూత్తూరు గాని."
"అలాగే. తప్పకుండా వస్తాను. సాధ్యమైనంత త్వరలో నీ సొమ్ము కూడా తీసుకొస్తాను."
"సొమ్ము కి ఊరిడిసి పోతారెంటి , బాబూ! ఈలు సూసుకొని ఇయ్యండి. మరి నేను సెలవు తీసుకొంటాను. మాటల్లో మీకు ఆలస్యం అయిపొయింది. మా ముసలాళ్ళ తో ఉన్న సిక్కే ఇది. మాటల్లో పడ్డామంటే మరి మతే ఉండదు.... ఎల్లండి , బాబూ! మరి వత్తా."
అప్పన్న వెళ్ళిపోయాడు.
అతడెం చదువుకోలేదు. పల్లెటూర్లో పుట్టెడు. కిళ్ళీ లమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు. అయినా కొంతమంది విద్యావంతుల కన్నా అప్పన్నే నయం అనిపించింది ప్రకాశానికి. తోటి మానవుల పట్ల సానుభూతి, తన జీవితంలో సంతృప్తి ఉన్న మనిషి ఎప్పటి కెనా బాగుపడతాడు అనుకొన్నాడు ప్రకాశం.
బియ్యపు సంచి పట్టుకొని ప్రకాశం ఇంట్లో కాలు పెట్టేసరికి సూర్యారావు అందరి మీద ఎందుకో ఎగిరి పోతున్నాడు. జానకి కూడా అంత వేడిగాను సమాధానాలు చెప్తున్నది. అప్పుడు జరుగుతున్న సంభాషణ ఏదైనప్పటి కి దానికి శ్రీకారం చుట్టింది తనే అని తెలుసుకున్నాడు ప్రకాశం.
"బియ్యం ఎలా తెచ్చేవు? సెట్టి అప్పు పెట్టేడా?" అని ప్రశ్నించేడు సాంబశివం. తనను అన్ని మాటలన్న షాహుకారు తమ్ముడికి ఆరువియ్యడానికి అతడి ముఖంలో ఏదైనా ప్రత్యేకత ఉందా అని నిదానించి చూస్త్గూ.
"ఎలాగోలాగ పుట్టించు కొచ్చేడు. అదే సంతోషం. ఇలా చూడు, కనకం . రెండు డొక్కులు బియ్యం బాగుచేసి ఎసట్లో పొయ్యి. బాగా పొద్దు పోయింది" అన్నది సుందరమ్మ.
"మరేం! నీ ముద్దు కొడుకు ప్రయోజకాత్వానికి నువ్వే మురిసిపోవాలి. ఏంరా, కిందటి సారి బియ్యాని కిచ్చిన డబ్బులు ఏ గంగలో కలిపేవు? ఎన్ని సినిమాలు, చూసేవు? ఎన్ని కట్తల బీడీలు కాల్చేవు?"
'అవసరానికి ఒకరికి అప్పు పెట్టెను. అన్నయ్యా."
"కానీ, ఆర్జన లేని వాడికి, నీకు అప్పు పెట్టె అధికారం ఎవరిచ్చారు? ఎంత తెచ్చినా కూటికి చాలక పైసలు లెక్కపెట్టుకుంటూ నేను చస్తుంటే!"
"అర్జనకి , అప్పు పెట్టడానికి సంబంధం లేదన్నాయ్యా! సొమ్ము అర్జించింది కి కొన్ని అర్హతలు కావాలి. అప్పు పెట్టిందికి సాటివారి పట్ల సానుభూతి , మానవత ఉండాలి."
"సానుభూతి, మానవత నీ ఒక్కడి సొత్తే అయి నట్లు మాట్లాడుతున్నావు. అల్లుడి సొమ్ము అత్తగారు ధారపోసిందన్నట్లు అన్న రెక్కలు ముక్కలు చేసుకొని నెల పొడుగునా చాకిరీ చేసి గడిస్తుంటే నువ్వు ఊరి వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తావు.? నాపట్ల చూపించరా ఆ సానుభూతి. ఇంతమందిని కూర్చోపెట్టి అన్నయ్య మేపుతున్నాడు. వాడి మాటని గౌరవిద్దాం . వాడికి చేదోడు వాదోడు గా ఉందాం అని మీలో ఒక్కరి కైనా ఉందిరా?
"మీ అందరి కన్న ముందు పుట్టిన నేరానికి మిమ్మలందర్నీ భరిస్తున్నాను. నా సుఖాలు, నా కోరికలు అన్నీ మీకోసం చంపుకుంటున్నాను. ఎప్పటికీ నాకీ బంధ విముక్తి? ఎప్పటికీ నాకీ బానిసత్వం తీరుతుందని రాత్రింబవళ్ళు పలవరిస్తున్నాను. నా బాధ మీకెవ్వరికీ కనపడలేదా? నా ఏడుపు మీకేవ్వారికీ వినపడలే? మాట్లాడరేం?"
"ఏం మాట్లాడడం అన్నయ్యా! మేమంతా నీకింత బరువయేమని నేనెప్పుడూ అనుకోలేదు. అలా తెలుస్తే ఈ బి.ఎ చదువు మానేసి ఏదో ఉద్యోగం చూసుకొనే వాడిని. అందరి బరువు బాధ్యతలు అభిమానంతో తండ్రిలా అన్నయ్య మోస్తున్నాడు. నా చదువు పూర్తయ్యేక నా చేతనైనదంతా చేసి అన్నయ్య ని సుఖ పెట్టాలని అనుకొన్నాను నేను. కాని మా బ్రతుకులు నీకు శాపం అని నేనెప్పుడూ భావించలేదన్నయ్యా!" అతి సున్నితమైన మనసు గల సాంబ శివం పై అన్నగారి మాటలు ఆశని పాతం లా పడ్డాయి. తన మనస్సులో ఉన్న భావం పూర్తిగా చెప్పక ముందే కళ్ళనీళ్ళు పెట్టుకొన్నాడు అతడు.
