ఏ విషయాన్నీ పది నిమిషాల పాటైనా మనసులో స్థిరంగా ఉంచలేని ప్రకాశం గడిచిన నెల రోజులుగా ఒక విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇంట్లో దానిని గురించి చెప్పక పోయినా చాలామంది స్నేహితుల సలహాలు తీసుకొంటున్నాడు. కొందరు ప్రకాశం చెప్పిన మాట వినగానే ఏదో చూడరాని వస్తువులు చూసినట్లు, వినరాని మాట వినినట్లు అసహ్యంతో ముఖం తిప్పుకొంటున్నారు. మరికొందరు ముఖం ముందు ఏమీ అనక పోయినా, "చదువు సంధ్యలు లేకపోయేక ఇంకేం చేస్తాడు? వాడి నుదుట ఇలాంటిదేదో రాసుందని మాకేనాడో తెలుసు. ఉట్టి మట్టి బుర్ర.'అని చాటుగా హేళన చేస్తున్నారు.
"ఇందులో చాలా సమస్యలు ముడి పెట్టుకొని ఉంటాయి ప్రకాశం. మన బ్రతుకు మన ఇష్టం వచ్చినట్లు మనంబ్రతుకుతామంటే కుదరదు. నలుగురి మధ్య బ్రతకవలసిన మనం వెనకా, ముందూ అన్నీ చూసుకోవాలి. నీ విషయం నీ ఒక్కడిదే కాదు. నీ ఇంటి వారందరికీ సంబంధించినది. బాగా ఆలోచించుకొని మరీ దీనిలోకి దిగు" అంటూ నిజమైన సలహా ఇచ్చేరు కొందరు పరిచయస్తులు.
శాంత అన్నయ్యతో వాదించి,దెబ్బలాడి కాలేజీ లో పి.యు.సి లోచేరింది. ఇంట్లో అంతా ఆమె మాటనుబలపరుస్తున్నప్పుడు తను కాదన్నా ఆగిపోయేది లేదనుకొని ఒప్పుకున్నాడు సూర్యారావు. కాని, శాంతకు సంబంధం స్థిరపడిన వెంటనే చదువు మధ్యలోనైనా ఆపివేయాలని ఒక షరతు పెట్టాడు.
అక్క సలహా మీద శాంత అందుకు ఒప్పుకొంది."ఈ రోజుల్లో పెళ్ళంటే మాటలతో పని కాదు, శాంతా! ఎంత డబ్బు పోయాలి! ఎందరి కాళ్ళు పట్టుకోవాలి! అన్నయ్య అందులో కృతకృత్యుడయ్యె సరికి నీ చదువు పూర్తవుతుంది. ఇప్పుడు మరేమీ వాదన పెట్టుకోకు" అన్నది జానకి.
చుక్కల్ని తాకుతున్న పెళ్ళి కొడుకుల ధరలు చూస్తుంటే , తన చెల్లెలి కడుపు కింత అన్నం పెట్టగల అర్హత గల వీరుణ్ణి తేవడం అంత సులువైన పని కాదు. అందర్నీ వ్యతిరేకించి శాంత చదువు మానిపిస్తే ఇంటా బయటా కూడా మాట పడవలసి వస్తుందనుకొన్నాడు సూర్యారావు. పదిరోజుల క్రిందట అతడు తెచ్చిన సంబంధం కూడా కట్నం చాలదని తిరిగి పోయింది. పిల్లకెంత అందమున్నా, అందానికి వలచి కట్నం తక్కువ చేసుకొనే తెలివి తక్కువ వాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేరని మరోమారు తెలిసి వచ్చింది సూర్యారావుకు.
ఇంక శాంత పెళ్ళి విషయంలో అతని కున్నదల్లా ఒక్కటే ఆశ. ఈ రెండేళ్ళు గడిచి సాంబశివం బి.పాసైతే ప్లీడరు రామారావు గారు పిల్లనిచ్చి పెళ్ళి చేసి అల్లుడికి బి.ఎల్ చెప్పిస్తామన్నారు. అయన అప్పుగానో, కట్నం గానో శాంత పెళ్ళికి కొంత సాయపడక పోరు. సాంబు బి.ఎల్. పాసై ప్లీడరీ చేస్తుంటే ఆమాత్రం అప్పు ఎలాగోలాగ తీర్చుకోలేక పోను. ఏ విధాన చూసినా శాంత పెళ్లి సాంబు చదువుతో ముడి పడి ఉన్నది. అప్పటి వరకు దాని కాలేజీ ముచ్చట తీరనీయడమే మంచిది అనుకొన్నాడు సూర్యారావు.
ఇంట్లో వాళ్ళు ఎంత పోరినా ప్రకాశం తన చదువు కొనసాగించేందుకు ఒప్పుకోలేదు. "నాకు వద్దు మొర్రో అంటే నన్ను చదువుకొమంటారు. శాంత చదువు కుంటానంటే సవాలక్ష సాకులు చెప్తారు. ఏం మనుష్యులర్రామీరు!" అన్నాడు ప్రకాశం.
"శాంత ఆడపిల్లరా, నాయనా! చదువుకొన్నా మానినా దాని బ్రతుకు గడిచి పోతుంది. నువ్వు మగాడివి . చదువు లేకపోతె ఎలా బ్రతకుతావు?" అన్నది సుందరమ్మ.
"అదే తప్పంటున్నానమ్మా! చదువు వల్ల ఏదైనా మంచి , ఉపయోగం ఉంటె అది అడ, మగ అన్న భేదం లేకుండా అందరికీ సరిగానే ఉంటుంది. చదువు కేవలం ఉద్యోగం కోసమే అనుకొన్నా అది ఈ రోజుల్లో ఆడవాళ్ళకి కూడా ఎంత అవసరమో అక్కని చూస్తె తెలుస్తుంది."
సుందరమ్మ మనసులోనే విసుక్కొంది. అందరూ శాంతకు, జానకికీ పోలికలు తేవడం ఆవిడికి ఇష్టం లేదు.మొగుడు వదిలి పుట్టింట పడున్న జానకికి, శుభ్రంగా పెళ్ళి చేసుకొని కమ్మగా కాపురం చేసుకోవలసిన శాంతకు సామ్యం ఏమిటి? అనుకొన్నది.
"పోనీలే అమ్మా! వాడికి చదవాలని లేనప్పుడు బలవంతం చేస్తే మాత్రం వస్తుందా? వాడి బ్రతుకేదో వాడిని చూసుకోనీ" అన్నది జానకి.
"వాడి బ్రతుకేదో వాడి ముఖం మీదే కనిపిస్తుంది. రెక్కలు ముక్కలయెలా పని చేసి చెమటోడ్చుకు బతక వలసిందే" అన్నది శాంత.
అప్పటి వరకు ఇక్కడా అక్కడా ఎండలో తిరిగి వచ్చిన ప్రకాశం ముఖం జేగురించి ఎర్రగా ఉంది. జుట్టు లోంచి చమట కాలువలు కట్టినట్లు నుదుటి మీదికి కారుతున్నది.
"నిజం శాంతా! నా బ్రతుకు నా ముఖం మీద కనిపిస్తుందంటావా? మా అందరిలోకి చిన్నదానివి. నీ మాట నిజం కావాలి. అప్పుడే వెళ్ళి అటో ఇటో తెల్చుకోస్తాను." అంటూ హుషారుగా వీధిలోకి పరుగు తీసేడు ప్రకాశం.
ఆ పరుగు అప్పన్న కిళ్ళీ కొట్టు చేరేదాకా అపనే లేదు. "ఏంటి, పంతులుగారూ, ఇంత ఎండలో వచ్చేరు? అంతలా అలిసి పోయారేంటి? ఎవరినీ తరుముకొంటూ రాలేరు కదా?" అన్నాడు అప్పన్న.
"ఏం లేదు, అప్పన్నా! నీతో కొంచెం మాట్లాడవలసిన పనుండి వచ్చెను. అట్టే బేరం వేళ కాదు కాబట్టి తీరిగ్గా మాట్లాడుకోవచ్చని ఇప్పుడు వచ్చెను. ఏదీ, కాస్త చల్లని నీళ్ళియ్యి. ముఖం కడుక్కుని వస్తాను." అన్నాడు ప్రకాశం.
అప్పన్న కుండలో నీళ్ళు సిల్వరు డొక్కుతో తీసి ప్రకాశానికి అందించేడు. అలసట తీరేలా రెండు మూడు సార్లు పుక్కిలించి ఉమ్మి ముఖం కడుక్కొని వచ్చేడు ప్రకాశం.
"సోడా తాగుతారా , పంతులు గారూ? అయిస్ పెట్టె లో ఉంది" అన్నాడు అప్పన్న పెట్టేమూత తీస్తూ.
ప్రకాశం చెయ్యి జేబులోకి వెళ్లి తిరిగి వచ్చింది.
"వద్దులే అప్పన్నా. కొంచెం మంచినీళ్ళుయ్యి" అన్నాడు.
"డబ్బులకేంటి ,బాబూ! తీసుకోండి. రేపిద్దురు గాని."
అప్పన్న పెట్టెలోంచి సోడా బుడ్డి తీసి, మూత తీసి ఇచ్చేడు. ప్రకాశం సోడా తాగడం ముగించేక ఇద్దరూ కబుర్ల లో పడ్డారు. ప్రకాశం తన పని ఏమిటో తెలియజేసేడు.
"ఒక విషయం లో నీ సలహా కావలసి వచ్చేనోయి, అప్పన్నా."
"ఏంటి, బాబూ! నాతొ పరాచకాలాడుతున్నారు?తమలాంటి చదువుకున్నోరికి నేను సలహా ఇచ్చే పోటోడినా?"
"ఇది విద్య, విజ్ఞానానికి సంబంధించిన ప్రశ్న కాదు, అప్పన్నా! అనుభవానికి సంబంధించింది. అంతేకాక నీ సహాయం కొంత కావాలి" అన్నాడు ప్రకాశం.
"చెప్పండి, బాబూ'! నాకు తెలిసిందైతే తప్పకుండా చేస్తాను." అన్నాడు అప్పన్న సర్దుకొని కూర్చుంటూ.
ఎక్కడ మొదలు పెట్టినా అవి కాస్తసేపు పస్తాయించి , ఎక్కడ మొదలు పెట్టినా చేరవలసిన గమ్యం తిండి, డబ్బూ, జీవితమే కదా అక్కడే మొదలు పెడతా ననుకొన్నాడు ప్రకాశం.
"ఆరోజు రేషనింగు షాపులో డబ్బులు లేక...."
ప్రకాశం చెప్తున్నంతసేపూ అప్పన్న అడ్డు తగలకుండా ఓపిగ్గా విన్నాడు. విన్న తరువాత అందులోని సాధక బాధకాలను తన బుద్దికితోచినంత మేరకు అలోచించేడు.
"మా పెద్దరికాలు నేతి బీరకాయల పోలిక, అప్పన్నా-- మమ్మల్ని మేము మోసగించుకొందికి మినహా ఎందుకూ పనికి రావు. ఆ రోజురేషన్ షాపులో కొట్టువాడు మా పెద్దరికం చూసి బియ్యం ఇచ్చేడా? చేతిలో పడ్డ డబ్బులు లెక్క పెట్టుకొని మరీ ఇచ్చేడు. ఈ కాలంలో అంతా ధనలక్ష్మీ మహిమ, అప్పన్నా."

"అది సరే అనుకోండి. ఇంతకీ నన్నేం చెయ్యమంటారు?"
అప్పన్న చెయ్యవలసిందేమిటో ప్రకాశం చెప్పేడు. "సరే ,బాబూ! నా చేత నైనంతా చేస్తాను." అన్నాడు అప్పన్న.
అప్పన్న భరోసా అందుకొని ప్రకాశం హుషారుగా ఈల వేసుకుంటూ బయటికి వచ్చేడు. ఈ రోజు శాంతకు మల్లెపూలు కొనాలనుకొన్నాడు. అంతలో జేబు ఖాళీ అన్న సంగతి గుర్తుకు వచ్చి, వెనుతిరిగి వెళ్ళి అప్పన్న దగ్గర పాతిక పైసలు తీసుకొన్నాడు.
