
ఎంత కూడదను కున్నా కానీ, మాధవరావు వ్యక్తిత్వం ఇందిరను ఆకర్షించింది. ఆడది అంటే కొద్దిగా చులకనగా చూసినా, ఇందిరను మాత్రం చాలా గౌరవించే వాడు. మాట్లాడడం లో చాలా దుడుకుతనం ఉన్నా, నిజానికి మనిషి చాలా గంబీరుడు. అనాలోచితంగా ఆవేశానికి లోనయి ఏ పనీ చెయ్యడని పిస్తుంది. అతనిలో ఇంకొక ఆకర్షణ ఏమంటే, అతని చురుకైన మేధ. చాలా తొందరగా ఒక నిర్ణయానికి వస్తాడు, జాప్యం లేకుండా. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు నిర్విచారంగా. మొత్తం మీద అతనిలోని ఏ గుణాలనయితే ఇందిర మొదట్లో ఏవగించు కుందో, ఆ గుణాలే అతన్ని ఇవాళ మరింత ఆకర్షకంగా చేశాయి. అతను ఇందిర కోరినట్టుగా ఆమెతో స్నేహం చేశాడు. కానీ ఇందిర ఊహించినట్టుగా ప్రేమ పాఠాలు వల్లించలేదు. తన నించి ఏమీ కోరని వ్యక్తిని ఎలా తిరస్కరిస్తుందామె? అతన్ని అవమాన పరచాలనే కోరికా, అటువంటి పరిస్థితి ఏర్పడకూడదన్న ఆదుర్దా ఆమెలో అంతర్గతంగా ఉండి, ఆమెను అయోమయంలో పడేశాయి. ఆలోచించిన కొద్దీ అగమ్య గోచరంగా ఉంటె , ఆలోచన మానివేసింది. ఒకసారి జోగి వేళాకోళం చేశాడు "శత్రువు మిత్రుడేలా అయ్యాడు, ఇందిరా? ఏసుక్రీస్తల్లె రెండో చెంప చూపుతున్నాడా?' అంటూ.
'అదేం కుదరదు నా దగ్గిర . అవకాశం ఇంకా రాలేదు కానీ, పగ తప్పకుండా తీర్చుకుంటాను." అంది ఇందిర కళ్ళు మెరిపిస్తూ.
"పగా? అంత పెద్ద మాటలాడకు ఇందిరా! ఇదంతా చూస్తుంటే నాకో తమాషా అయిన అనుమానం వేస్తుంది."
"ఏమిటి?"
"అమ్మబాబోయ్....నే చెప్పను. చెపితే నన్ను బతకనిస్తావూ?"
"చెప్పకపోతే బతకనిస్తానెమో ముందు చూడు."
"ఫరవాలేదు . చెప్పకుండా చావడానికి తయారే గానీ, చెప్పి బతకడానికి ధైర్యం లేదు నాకు."
"పోనీ;లే . తొందర లోనే నీకు శుభవార్త చేబుతానుగా ఎలా అతన్ని ఇరుకులో పడేసేదీ."
"శుభవార్త తొందర్లో నే చెబుతాననే నేనూ అనుకుంటున్నాను."
అతని మాటల్లోని అర్ధం లీలగా తెలిసినా , ఏమీ అనలేదు ఇందిర జోగీ కూడా శ్రుతి మించనివ్వలేదు.
* * * *
అక్టోబరు , నవంబరు కులాసాగా గడిపేసింది ఇందిర తన స్నేహితులతోటో. లేక మంజుల మాధవరావు ళ తోనో. చూడగలిగినన్ని సాంస్కృతిక కార్యక్రమాలను చూసింది. గోపాలరావు గారికీ, సుందరమ్మ గారికీ మంజులను మాధవరావు కివ్వాలనే ఆలోచన ఉన్నట్లు మొదట ఇందిర కనిపెట్టిందప్పుడే. మాధవరావుతో మంజులను అన్ని చోట్ల కూ పంపేవారు కానీ కేవలం జంటగా ఇద్దరినీ పంపడం ఇష్టం లేక ఇందిరను తోడుగా వెళ్ళమనేవారు. ఆ పని ఇందిర కెప్పుడూ రుచించదు.
"మంజు ఆ కూచిపూడి నృత్యానికి పోవాలంటుంది ఇందూ. మాధవరావు తీసుకు వెడతానన్నాడు. కాస్త నువ్వు కూడా వెళ్ళమ్మా వాళ్ళతో" అంటూ సుందరమ్మ గారు చెప్పినప్పుడు అట్టే ఆనందించ లేదు ఇందిర. ఏదో వంక చెప్పి వెళ్ళకూడదని అనుకుంది. కాని మరునాడు కాలేజీ కి ఫోను చేసి మాధవరావు అభ్యర్ధించినప్పుడు కాదనలేక పోయింది. అది మొదలు ఇటు సుందరమ్మ గారు , అటు మాధవరావు కూడా ఇందిర మీద ఒత్తిడి తెచ్చేవారు. ఎటొచ్చీ మంజుల మాత్రం ఏమీ పట్టనట్టు కులాసాగా తిరిగేది. మంజుల ఏమను కుంటున్నదో , ఆమె అభిప్రాయా లేమిటో అడిగేందుకు ఇందిరకు సాహసం లేకపోయింది.
మొదట్లో మాధవరావు పేరు ఎత్తితే బుగ్గ లెర్ర చేసుకునే మంజుల అతనితో చాలా చనువుగా మాట్లాడ్డం గమనించింది ఇందిర. ఇదివరలో ప్రేమను గురించి, పెళ్లిని గురించి చర్చలు జరిపినప్పుడల్లా సిగ్గుతో కుంచించుకు పోయిన మంజులే, ఇప్పుడు ధైర్యంగా తాపీగా అటువంటి చర్చల్లో పాల్గొంటుంది. అదీకాక ఒక్క మాధవరావు మాత్రమే ఉన్నప్పుడు మంజుల ఇందిరను అతనితో మాట్లాడుతుండమని చెప్పి, ఏదో పనిలో నిమగ్నురాల యిపోవడం మొదలెట్టింది. నిజంగా పని ఉండడం వల్ల అలా చేస్తుందో లేక.......ఇంకేదన్నా ఆలోచనతో అలా ప్రవర్తిస్తుందో ఇందిరకు అర్ధం కాలేదు. ఆమె తలితండ్రులు ఆమెను మాధవరావు కిచ్చి వివాహం చేయాలని ఆలోచన చేస్తున్న విషయం మంజులకు తెలుసో, తెలియదో?
తన మనస్సేమిటో తనకు తెలియదు. మంజుల అభిప్రాయమేమిటో కూడా తెలియదు. ఎటొచ్చీ మాధవరావు మాత్రం తన యందు కించిత్తు ఆసక్తి చూపిస్తున్నట్టు మాత్రం గ్రహించిందామె. కానీ మంజుల తో చాలా చనువుగా, సన్నిహితంగా మెలిగే మాధవరావు కు ఆమె అంటే ఏ విధమైన అభిప్రాయం ఉందొ తెలియలేదామెకు. ఇందిరతో సాధారణంగా క్లుప్తంగా మాట్లాడుతూ ఉండే మాధవరావు మంజులతో తెగ వాడుతాడు. ఇందిరతో ఉంటె మాట అవసరం లేదని అనుకుంటాడెమో.
పైకి అంత ఆనందంగా కనపడ్డా, లోపల్లోపల ఇందిర మధన పడుతూ ఉంది. అందుకే కాలేజీ కి సెలవు లిచ్చినప్పుడు తృప్తిగా నిట్టూర్చింది ఇందిర. ఈ గొడవ లన్నిటికీ దూరంగా పోతుంది రెండు రోజుల్లో. 'విశాఖపట్న పు సముద్రపు గాలికి ఈ కలతలూ, ఆవేశాలూ క్షణంలో యెగిరి పోతాయి' అని భావించింది ఇందిర.
* * * *
ఇంటికి ఏమేం పట్టుకు వెళ్ళాలో లిస్టు తయారు చేసుకుని షాపులన్నీ తిరిగింది ఇందిర. స్నేహితురాలు గౌరీ తో కలిసి డిల్లీ లో కోన తగిన, కొనగలిగిన వస్తువులన్నంటినీ కొంది. డిల్లీ ప్రత్యేకత ఏమిటంటే , డబ్బెక్కువగా ఉంటె ఖర్చు పెట్టేందుకు వీలుగా అందమైన ఎయిర్ కండిషన్డ్ షాపు లుంటాయి. కానీ చేతిలో పైసలు తక్కువగా ఉంటె అవే వస్తువులు జన ఫద్ లో పేవ్ మెంట్ మీదే కొనుక్కోవచ్చు చవగ్గా. కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియమ్ లో చీరలూ, టిబెట్టు శరణార్ధుల దగ్గిర పళ్ళేలూ, బొమ్మలూ , లడఖ్ షాపుల్లో పూసలూ-- ఒకటేమిటి బండెడు సామాను కొని అలసిపోయిన దేహాన్ని బస్సు స్టాపు దగ్గిరికి చేరవేసింది ఇందిర. సెక్రటేరియట్ దాకా పోయే బస్సు రాగానే గౌరీ వెళ్ళిపోయింది అందులో. టాక్సీ గానీ, టూపీటరు గానీ దొరికితే బాగుండునని ఆశగా చూస్తున్న ఇందిర తన ముందుకు వచ్చి ఆగిన నీలం కారుని దాని యజమానినీ చూసి తికమక పడింది. అతని రాక వల్ల, అంతవరకూ ఆమె పొందిన ఆనందం అడవుల్లో కి పారిపోయినట్టని పించింది. అతనితో పాటు అతని చుట్టూ పరిభ్రమించే ఆలోచనలూ, అర్ధం లేని ఆందోళన లూ ఇందిర ను కలత పరుస్తాయి.
అతను పట్టు పట్టడం తో తప్పనిసరిగా సామాను వెనక సీట్లో వేసి, ముందు కూర్చుంది ఇందిర.
"ఎప్పుడు ప్రయాణం?" ట్రాఫిక్ లైట్లు ఆకుపచ్చ రంగు మారేదాకా కారు ఆపి అడిగాడతను.
"రేపు సాయంత్రం."
"దారుణం. నాకు చెప్పనైనా లేదేం? ఇప్పుడు నాకు కనబడక పొతే మీరు వెళుతున్న విషయం తెలిసేదే కాదు గదూ?"
"అతని కెందుకు తెలియాలి? తెలిసి ఏం చేయగలడు?' అని తన్ను తాను వ్యర్ధంగా ప్రశ్నించుకుంది ఇందిర. అయిదు నిమిషాలు మౌనంగా గడిపిన తరవాత హటాత్తుగా అన్నాడు మాధవరావు." నేను ఆఫీసు నుంచి వస్తున్నాను. మీ కభ్యంతరం లేకపోతె ఎక్కడన్నా కాస్త కాఫీ తీసుకుని పోదామా?"
"నన్ను ఏ టాక్సీ స్టాండు దగ్గిరన్నా దింపేయ్యండి."
ఇందిర సమాధానం అతనికి బాధ కలిగించింది.
బొమలు ముడిచి "మీ ఇష్టం మిమ్మల్ని ఇంటి దగ్గిరే దింపేస్తాను ముందు అలాగయితే" అన్నాడు.
తన దురుసు తనానికి పశ్చాత్తాప పడిందామె.
"నేను బాగా అలసిపోయాను. కారులో నించి దిగేంత ప్రయాస కూడా ఓర్చుకోలేననిపిస్తుంది ." వివరించింది అర్ధం చేసుకోండని అభ్యర్దిస్తున్నట్టు.
"నెవ్వర్ మైండ్" అన్నాడు మాధవరావు కారు లింక్ రోడ్డు మీదకు పోనిస్తూ.
ఇందిర భారంగా నిట్టూర్చింది. చెప్పలేని బాధ ఏదో గుండెల్ని కొస్తుంది. ఆలోచన మాని, హృదయం చెప్పినట్టు చేస్తే బాగుండునని అనిపించినా, అలా చెయ్యలేక పోతుందామె.
చక్కని రోడ్డు, మెల్లిగా చీకట్లు కమ్ముకుంటున్న ఆకాశం, దూరంగా ప్రవహిస్తున్న యమున-- మొత్తం మీద కారు మీద విహారానికి అద్భుతంగా ఉన్నాయి పరిసరాలు. బెలా రోడ్డు మీద ఉన్న లడాఖీ మందిరం చేరువన కారు ఆపాడు మాధవరావు.
"మిమ్మల్ని దిగమనడం లేదు కానీ, రెండు నిమిషాలు మాట్లాడేందుకు నా కనుమతి ఇవ్వండి." తాపీగా ఇందిర వంక తిరిగి కూర్చుంటూ అడిగాడు మాధవరావు.
ఎదురుచూడని ఈ పరిణామానికి చకిత అయింది ఇందిర.
"మీరు ఇప్పుడు వెళ్లి మూడు, నాలుగు వారాల దాకా తిరిగి రారు కదూ?"
"ఊ."
"అందుకే మీరు వెళ్లేముందు కొన్ని మాటలు చెప్పాలని పించింది నాకు. సెలవుల్లో మీరు ఈ ఊరికి దూరంగా ఉండి పూర్తిగా ఆలోచించు కోవచ్చు. నా మాటల్ని మననం చేసుకుని, నన్నర్ధం చేసుకోడానికి ప్రయత్నించ వచ్చు."
ఇందిర భయపడ సాగింది. మిన్ను విరిగి మీద పడబోతున్నట్టున్న ఈ పరిస్థితిని ఎలా దాటడమా అని ఆలోచించ బోయింది. కానీ మెదడును కూడదీసుకుని ఆలోచించే శక్తి ని కోల్పోయిన ఇందిర నీరసంగా తల తిప్పి, దూరాన ప్రశాంతంగా ప్రవహిస్తున్న యమున వంక చూసింది.
"మీరు వినదల్చు కోలేదా?" పరుషంగా అడిగాడు మాధవరావు , ఇందిర ఉదాసీనత చూసి.
"చెప్పండి ." అతని వంక తిరిగింది ఇందిర.
"నేను బాగా ఆలోచించు కున్నాను. చూడండీ....నాకు మీరు... మీరంటే నాకు...ఎలా చెప్పను? నీకు తెలియదా.... ఇందిరా? నిన్ను ప్రేమిస్తున్నానని, గ్రహించినట్టురుకుంటావెం? చెప్పు, నీకు నేనంటే ఏ విధమైన ప్రేమా లేదూ?..." గబగబా అన్నాడతను ఇందిర కళ్ళల్లోకి చూస్తూ.
ఇందిర శరీరంలో రక్తం గడ్డ కట్టుకుపోయింది. ఆమె కళ్ళల్లోకి చూస్తున్న అతని చూపులు ఆమె నరాలు పట్టు తప్పేట్టు చేశాయి. వెన్నులోంచి వణుకు రాగా, మొహాన్ని చేతుల్లో దాచుకుంది ఇందిర.
"ఏం ఇందిరా ......నేనంటే నీకు.....నీకిష్టం లేదూ ?" ఆదుర్దాగా అడుగుతున్నాడతను.
ఇందిర కు మాట్లాడ్డానికి మాటలు దొరకలేదు. తనకేం కావాలో , ఏది వద్దో కూడా తెలియటం లేదు ఇందిరకు ఆ క్షణం లో. మధురమైన అతని కంఠధ్వని వినబడకుండా అక్కడి నించీ పారిపోవాలనుకుంది ఒక క్షణం. మరుక్షణం లోనే 'జీవితాంతం అతనలా మాట్లాడుతుంటే చాలు ఇంకేమక్కర్లె." దని భావించింది.
ముఖం మీద అడ్డు పెట్టుకున్న చేతులను తప్పించి ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ "చెప్పు, ఇందిరా" అన్నాడతను జీరబోయిన గొంతు తో.
అతని స్పర్శ కాళ్ళ దగ్గిర నించీ కళ్ళ దాకా మంటలేత్తించింది ఇందిరకు. మెరిసే కళ్ళను ఆర్పకుండా అతని చూపుల్లో కలిపింది. ఆమె చేతులు రెండూ మెల్లిగా అతని హస్తాలను పెనవేసుకున్నాయి. అలా ఎంతసేపు న్నారో ఇద్దరికీ తెలియదు.
"మనం పెళ్లి చేసుకుందాం ఇందిరా...నువ్వు నాకు కావాలి" అన్నాడు మాధవరావు తన ముఖాన్ని ఇందిర ముఖానికి మరింత చేరువగా తెస్తూ.
హటాత్తుగా ఇందిరకు మెళుకువ వచ్చిందీగాడ సుషుస్తిలోంచి. ఎందుకిలా అయిపోతుంది తను? ఏమిటీ ఆకర్షణ? తన కర్తవ్యం గుర్తుకు వచ్చింది. ఔను , అనాలి......అతన్ని.....కానీ ఎలా?
అదురుతున్న పెదవులతో మాటలు తడబడుతుండగా ఇందిర అంది . "ఉహూ. అలా జరగదు......జరగడానికి వీల్లేదు.....నన్ను వదలండి. ప్లీజ్...."
ఒక్క మాటుగా ఇందిర బలంగా అతని చేతుల్ని నెట్టి వేసింది. ఆశించని ఈ మార్పు తెల్లబోయి చూశాడతను. మొహం చేతుల్లో ఇముడ్చుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలెట్టిన ఇందిర అతని కర్ధం కాలేదు.
ఆమెను దగ్గిరికి తీసుకోవాలన్న కోర్కెను బలంగా అదిమి పెట్టి "ఇందిరా , ఎందుకిలా? ఎందుకు వీల్లేదో చెప్పు....ఏడవకు ఇందిరా..." అన్నాడు ఆమెను సముదాయిస్తూ.
"చిన్నక్కని చూడ్డానికి వచ్చి.. ఇప్పుడు నన్నెలా......నేనెలా......ఛీ......." అవేశాపడిపోతున్న ఇందిర మాటలు అతనికి అంతు పట్టలేదు.
"ఏమిటి ఇందిరా, నువ్వనేది?' అని అడిగాడతను ఇందిర కొంచెం స్తిమితపడ్డాక.
"దయచేసి నన్నడగకండి. నేను మిమ్మల్ని......చేసుకుంటాను.....అని ఎలా ఊహించగలిగారూ? అదెలా సాధ్యమను కున్నారూ? కళ్ళెత్తి వెర్రిగా అంటున్న ఇందిర ను కళ్ళ ప్పగించి చూస్తూ కూర్చున్నాడతను.
"నువ్వేమంటున్నావో నీకే తెలియదు ....నేను చెప్పేది విను."
"నేను వినను. నన్ను దింపేయ్యండి" అంటూనే అతని నించీ పారిపోవడమే తన జీవిత లక్ష్య మన్నట్టు కారు తలుపు తెరుచుకుని దిగబోయింది ఇందిర . మాధవరావు చటుక్కున వంగి చేయి జాపి ఇందిర ను తిరిగి లోపలికి గుంజాడు. తలుపు గట్టిగా వేసి, కారు స్టార్టు చేశాడు.
