"నీకిప్పుడు మాట్లాడడం ఇష్టం లేకపోతె , ఇంటి దగ్గిర దింపేస్తాను."
కళ్ళ వెంబడి ధారగా నీరు కారుతుంటే కిటికీ లోంచి పైకి అయోమయంగా చూస్తూ కూర్చుంది . ఆమె దీనావస్థ అతన్ని విచలితుడ్ని చేసింది.
"ఎందుకు ఇందిరా, నానించీ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నావు?' అని అడిగాడు.
జవాబుగా వెక్కివెక్కి ఏడ్చింది ఇందిర.
అతని వంక మాట్లాడకుండా కారు పోనిచ్చాడు.
"ఇంటి దగ్గిరికి వచ్చాం. కారు అపనా కాస్సేపు.... ముఖం అదీ తుడుచు కుంటావా?"
"అక్కర్లేదు.' చేతి సంచీ లోంచి వణికే చేతుల్తో రుమాలు తీసుకుని గబగబా ముఖం తుడుచుకుంది.
"ఇందిరా, నువ్వెందుకో ఉద్రేక పడుతున్నావు . రేపు మళ్ళీ కలుస్తాను. తాపీగా మాట్లాడుకుందాం."
"నన్నింకా బాధపెట్టకండి. మీరు రేపు నన్ను కలవడానికి ప్రయత్నించా రంటే , మళ్ళీ మీ ముఖం ఈ జన్మలో చూడను. చెపుతున్నాను."
"ఇందిరా!........"
ఇంటి కెదురుగా కారు ఆపి, చౌకీదారుని పిలిచి ఇందిర సామాను అతని చేతికిచ్చి పైన పెట్టమన్నాడు మాధవరావు.
గబగబా గేటు దాటుతున్న ఇందిరను చెయ్యి పట్టుకుని ఆపాడు అతను.
"ఇందిరా ఆలోచించుకో. నువ్వేమంటూన్నదీ నా కర్ధం కావటం లేదు. నువ్వెప్పుడూ మాట్లాడగలవను కుంటే అప్పుడే నాకు చెప్పు. నిన్ను నిర్భంధించదలుచుకో లేదు" అని చెయ్యి వదిలేసి, వెనక్కి తిరిగి చూడకుండా కారెక్కి వెళ్ళిపోయాడతను.
ఎలాగో ఇంట్లోకి చేరుకొని తన గదిలో పడ్డది . అదృష్టవశాత్తూ నాయర్ తప్ప ఇంట్లో ఎవరూ లేరు. కుటుంబం అంతా తెలిసిన వాళ్ళింటికి ఎవరింటి కో వెళ్లారట. ఆమె ముఖం చూసి నాయర్ మొదట గాభరా పడ్డాడు. తల బద్దలై పోతుందని గొణిగి తన గదిలోకి పోయి తలుపు గొళ్ళెం పెట్టి పక్క మీదికి వాలింది ఇందిర.
నిజం గానే తల వెయ్యి చెక్కలై పోతున్నది. స్పృహ తప్పిపోతే బాగుండుననుకుందామె. ఆలోచనల సుడి గుండం లో చిక్కుకున్న ఇందిరకు దారీ తెన్నూ తోచడంలేదు. తనేం చేసిందీ? ఏం చెయ్య బోతున్నడిప్పుడు? తను మొదటిసారిగా చూసిన మాధవరావూ, ఆ తరవాత జరిగిన సంఘటన లూ తెర మీద బొమ్మలా కనబడుతున్నాయి . నవ్వుతున్న మాధవరావు, భ్రుకుటి ముడిచిన మాధవరావు, ఆలోచనలో పడ్డ మాధవరావు ....ఎటుచూసినా అతనే కనబడుతున్నాడు.
గట్టిగా కణతలు నొక్కుకుని తల దిండులో దాచుకుంది. కళ్ళు గట్టిగా మూసుకుంటే కనబడదని . కానీ మనో నేత్రాన్నేలా మూస్తుంది?
ఒకసారి ఎప్పుడో నిజంగా తలనొప్పి వచ్చి నుదురు రాసుకుంటూ కూర్చుంది ఇందిర. నిజానికి కొంచెం జ్వరం కూడా తగిలింది. కానీ ఎవరికీ చెప్పలేదు హడావుడి పడతారని. తన బాధ ఒక్క మాధవరావే గుర్తించాడు.
"ఎందుకలా బాధపడుతూ కూర్చుంటారు? పోయి పడుకోండి కాస్సేపు తగ్గుతుంది" అన్నాడు మందలిస్తూ.
"ఏమిటి ఇందిరా, ఏమయింది?" అని అడిగారు పక్కనే కూర్చున్న సుందరమ్మ గారు.
"ఏం లేదు, కొంచెం తలనొప్పి గా ఉంది."
"ఉండదూ మరీ. రాత్రంతా మెలుకవ గా కూర్చుంటావు పుస్తకం ముందేసుకుని. తెల్లారితే ఉద్యోగమా, మరి, చదువయిపోయింది కదా ఎందుకే అమ్మాయి అంత శ్రమ పడతావంటే ఏమిటేమిటో చెబుతుంది. అయినా ఉద్యోగాలేందుకు ఆడపిల్లలకి, ఒళ్ళు నలగగొట్టుకోడానికి కాకపొతే?........ఏదీ, చెయ్యి చూడనీ. ఆహా, జ్వరం తగిలినట్టే ఉంది. ఒళ్ళు వెచ్చగా ఉంది. మంజూ, ధర్మామీటరు తేవే.....' ఏకబిగిని ఉపన్యాసం ఇచ్చారు సుందరమ్మ గారు. వద్దువద్దని ఎంత చెప్పినా వినకుండా జ్వరం చూసి నూటొక్కటి డిగ్రీ లుందని తెలిశాక కోపగించు కున్నారు సుందరమ్మ గారు.
'అంత బాధనీ, దాచుకోక పొతే , చెప్పరాదమ్మా , మందన్నా ఇచ్చేవాళ్ళం?"
"పెద్ద బాధేం లేదు అత్తా, కొంచెం తలనొప్పి తప్ప. తగ్గిపోతుంది" అంది ఇందిర మాటల కోసం వెతుక్కుంటూ.
"చూశావటయ్యా , ఇదీ వరస. నాకు ధైర్యం చెబుతుంది........" మాధవరావు తో ఫిర్యాదు చేశారు సుందరమ్మ గారు.
"కొందరంతేనండీ. తమ బాధ ఇతరులతో పంచుకోడానికి ఇష్టపడరు అంతే." కంఠం లో చిత్రమైన బాధ ధ్వనిస్తుంటే అన్నాడతను.
తను చేసిన రభస కు సిగ్గుపడి అక్కణ్ణించి వెళ్ళిపోయింది ఇందిర.
ఇంకోసారెప్పుడో టిక్కీ నీ, గాబ్లూనీ, వాళ్ళ తమ్ముడు నరెనుడ్నీ తీసుకుని ఏదో నార్మన్ విజ్ డమ్ సినిమాకి తీసుకెళ్ళింది. పిల్లలంటే ఇందిర కసలు ప్రాణం. సరదాగా వాళ్ళల్లో ఒకదానిలా మెలిగి సినిమా అయ్యాక ఇంటికి తీసుకు వచ్చింది వాళ్ళని. అప్పుడు ఇంట్లోనే ఉన్న వాసన్, మాధవరావు లు ఇందిరను గేలి చేశారు చిన్న పాపాయి అంటూ. అతిగా వాగే గాబ్లూ తాము చేసిన ఆకతాయి పనులు ఇందిర పిన్ని మీద గౌరవంతో చెబుతుంటే మటుకు చాలా మెచ్చుకున్నారిద్దరూ.
"మీ ప్రత్యేకత పిల్లలనుకుంటాను" అన్నాడు మాధవరావు నవ్వుతూ.
తానెంతో సిగ్గు పడిందప్పుడు.
పిచ్చిగా తనాబీ వంక చూస్తూ గతించిన రోజులను జ్ఞాపకం చేసుకుంటుంది ఇందిర. మెల్లిగా ఆవేశపు ఉదృతం తగ్గి కొంత కోలుకుంది. అందుకే మంజుల వాళ్ళు తిరిగి వచ్చేసరికి తలనొప్పేతన నలా చేసిందని చెబితే నమ్మారు వాళ్ళు. ఎక్కువ తిరిగినందుకు సన్నగా చివాట్లు పెట్టి పడుకో బెట్టారు సుందరమ్మ గారు. నిద్రకూ మెళకువకూ మధ్యన గడిపింది ఇందిర ఆ రాత్రి అంతా. తెల్లవారు ఝామున కునుకుతున్న ఇందిరను ఎవరూ లేపలేదు.
క్రితం రోజు జరిగిన విషయం మరిచి పోవడానికి గట్టిగా ప్రయత్నించి కొంతవరకూ కృతకృత్యురాలయింది ఇందిర. మధ్యాహ్నం జోగీ ఫోన్ చేసినప్పుడు మాత్రం జోగీ కంతా చెప్పాలనిపించినా చెప్పలేక "నా మనస్సు బాగాలేదు జోగీ. ఇంటికి వెళ్ళాక ఉత్తరం రాస్తాను." అంది. జోగి ఎన్ని ప్రశ్నలడిగినా ఉపయోగం లేకపోయింది.
రైలు టయిమయ్యేటప్పటికి గబగబా సామాను సర్దుకుని టాక్సీ లో కూర్చుంది ఇందిర. మంజులా వాళ్ళతో. ఇందిరను పంపడానికి గోపాలరావు గారూ, సుందరమ్మ గారూ వచ్చారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పారు సుందరమ్మ గారు. ఇందిర వెళ్ళడం మంజుల కిష్టం లేదు. ఆమెని ఇందిరతో పంపడాని కిష్టపడలేదు సునరమ్మ గారు.
"రెండు రోజులు ముందరగా వచ్చేయ్, ఇందూ. కాలేజీ కి వెళ్ళే ముందు ప్రయాణపు బడలిక తీర్చుకోవచ్చు." హెచ్చరించారు సుందరమ్మ గారు, మూడోసారి.
"నాకు ఉత్తరాలు రాస్తావా, బద్దకిస్తావా?' మంజుల నిలదీసింది.
"అమ్మనీ, నాన్ననీ అడిగానని చెప్పామ్మాయ్ గోపాలరావు గారు కదులుతున్న రైలుతో నడుస్తూ చెప్పారు.
అందరికీ చెయ్యి ఊపుతూ గుమ్మం దగ్గిరే నుంచుంది ఇందిర. మంజు వాళ్ళకి పది గజాల వెనగ్గా, పుస్తకాల దుకాణం దగ్గిర నిలబడి తన వంకే చూస్తున్న మాధవరావు కనబడ్డాడామెకి. ఇందిర తనని చూసిందని గుర్తించి అలాగే నుంచున్నాడతను. క్షణం సేపు సందేహించి అతనికీ చెయ్యి ఊపింది ఇందిర. అతనూ చెయ్యి ఊపాడు తిరిగి రమ్మన్నట్టు.
వేగాన్ని పుంజుకున్న రైలు అందర్నీ వెనక్కి నెట్టేసి ముందుకు చొచ్చుకుపోతుంది అంతే. తాను కూడా గతాన్ని వదిలి భావిలోకి పోవాలని ధైర్యంగా అనుకుంది ఇందిర.
* * * *
బెజవాడ దాటినప్పటి నించీ ఎదురుచూసిన వాల్తేరు రానే వచ్చింది. కిటికీ లోంచి తల పైకి పెట్టి సమీపిస్తున్న ఫ్లాటు ఫారాన్ని కళ్ళతో వెతికింది ఇందిర. అన్ని తలల్లో నూ కృష్ణమూర్తి గారి మెరిసే బట్టతలా ప్రత్యేకంగా కనబడింది. జోడులోంచి పరిశీలనగా చూస్తున్న కళ్ళ జత ఇందిర ముఖాన్ని, ఊపుతున్న చెయ్యి నీ చూసి ఆనందంతో రెపరెప లాడింది. చేతి సంచితో చెంగున ఫ్లాటు ఫారం మీదికి గెంతిన ఇందిరను దగ్గిరికి తీసుకుని, తల నిమిరి "ప్రయాణం కులాసాగా జరిగిందా తల్లీ?' అని అడిగారు కృష్ణ మూర్తి గారు.
"ఆ, ఉండు. సామాను దింపనీయ్" అంటూ తండ్రి చేతుల్లో నించి పైకి వచ్చి తనతో పాటు ప్రయాణం చేసిన గుజరాతీ ఆవిడను తన సామాను కూలీకి గుర్తు చెప్పమని అడిగింది. సామానంతా దింపు కున్నాక, ఆవిడకి వీడ్కోలు చెప్పి, కృష్ణ మూర్తి గారితో స్టేషను దాటి వచ్చింది. ఉన్న రెండు టాక్సీ ల్లో ఒకదాన్ని బేరం చేసి (మీటరు ప్రశ్నే లేదు వాల్తేరు స్టేషన్లో) సామాను నీ, శరీరాల్నీ అందులో చేరేశాక తృప్తిగా నిట్టూర్చింది ఇందిర.
