Previous Page Next Page 
నిష్టూర ప్రేమ పేజి 8


     "ఉహూ! దీనికి అర్ధం చెప్పలేనండి. కానీ చిత్రకారుడు చెప్పదలుచుకున్నదేమిటో నాకు తెలిసిందనుకుంటాను. ఈ రంగులూ, రిక్లైనింగ్ ఫిగరూ కూడా ఒక రకమైన సంచలనాన్ని కలగ జేస్తున్నాయి. ఈ పచ్చని పిట్ట మన దృష్టి ని బంధించడం .......కేవలం.....క్షమిచండి, నేను చెప్పలేను కానీ ణా కవగాహన అయింది" చాలా నిజాయితీ గా అన్నాడు ఇందిర నవ్వింది.
    "సంతోషించాం గానీ, పదండి. ఈ మాత్రానికేనా నన్ను లాక్కు వచ్చారిక్కడికి?"
    "ఒక్క క్షణం ఉండండి. మిగతావి కూడా చూసి పోదాం."
    మౌనంగా హాలంతా తిరిగి చూశారు , హుస్సేన్ రచించిన "గుర్రాలు", "ఖురాను చదువుతున్న ఫకీరు" బొమ్మలను చాలా మెచ్చుకున్నాడతను.
    "పత్రికల్లో రాసేవాళ్ళ దగ్గిర కొన్ని మాటలు నేర్చుకో వాలండీ మనం. లేకపోతె మన కర్ధం కానిదాన్ని ఇతరుల కర్ధమయ్యే టట్టు చెప్పలేం, వాళ్ళ లాగ." ఒక మూల బల్ల దగ్గిర కళ్ళ జోడు పెట్టుకుని కూర్చున్నాడొకాయన. వీళ్ళని "అభిప్రాయం రాయండి" అంటూ అడిగాడు. "ప్రదర్శన పరమాద్భుతంగా ఉంది. ఎల్లో బర్డ్ మరీ ముఖ్యమైన ఆకర్షణ అనవచ్చు" అని వ్రాసి ఇందిరకు చూపించి నవ్వాడు మధవరావు.
    ఇంటిదగ్గిర ఇందిర ను దింపాడు కానీ, ఇంట్లోకి వెళ్ళలేదు అతను.
    'అత్తయ్యా, మామయ్యా కోపగిస్తారు , మీరు ఇంతదాకా వచ్చి, ఇంట్లోకి రాలేదని తెలిస్తే."
    "అసలు నేను వచ్చిన విషయం మాత్రం తెలియడమెందుకూ?" ఆపైన మీచిత్తం. గుడీ వేనింగ్" అని చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు.
    సాలోచనగా ఇంట్లోకి నడిచింది ఇందిర.

                               *    *    *    *
    తరవాత కలుసుకున్నప్పుడు జోగీందర్ అడిగాడు, "ఏమిటి , ఇందిరా, ఈ మధ్య ఇంత మిస్టీరియస్ గా ఉంది నీ నడవడి" అని.
    "నన్ను వేళాకోళం పట్టించక్కర్లేదులే, జోగీ. ఒక ఫ్రెండ్ రమ్మంటే పోవలసి వచ్చింది."
    "ఎవరు , బాబూ, నన్ను మించిన ఫ్రెండ్?"
    "ఒక తెలుగాయన!"
    "ఎవడయితే నేం -- అదృష్ట వంతుడు."
    "దురదృష్ట వంతుడను సరిపోతుంది. మనం మొదటి సారి కలుసుకున్నామే లాబోహిమీ లో..... గుర్తుందా?... ఆరోజున ఒకతను పలకరిస్తే తెలిసినాయన అని చెప్పలేదూ? జ్ఞాపక ముందా?"
    "ఆ, కానీ అతని అదృష్టానికి ఏమొచ్చింది?"
    'అదో పెద్ద కధలే."
    "చిన్నగా చేసి చెప్పకూడదు?"
    "వినే ఓపిక ఉంటె చెబుతాను. ముందు ఈ విషయం చెప్పు. నాతొ హెయిలీ రోడ్డు దాకా వస్తావా? అమెరికన్ లైబ్రరీ లో పుస్తకాలు రిటర్న్ చెయ్యాలి."
    "తమరి అజ్ఞ. మెల్లిగా కబుర్లు చెప్పుకుంటూ నడిస్తే సరి. ఏం? నడవగలరా గాజు బొమ్మ గారూ?"
    "సరే, నామీదే డబ్బు అదా చెయ్యదలుచు కుంటే, నేనేం అనగలమా? పద."
    కన్నాట్ సర్కస్ రణగోణధ్వని లో నించి బయట పడి, బార కంబా రోడ్డు మీదికి వచ్చేదాకా ఇద్దరూ మౌనం వహించారు.
    "చెప్పు, ఇందిరా."
    "తమాషా కాదు. నే చెప్పేది సరిగ్గా విను. మన దౌర్భాగ్య దేశం లో ఆడపిల్ల లంటే అందులోనూ పెళ్లి కాని, పెళ్లి చేసుకోదలిచిన ఆడపిల్ల లంటే మగాళ్ళ కీ మరీ ముఖ్యంగా కాబోయే పెళ్లి కొడుకు లకి చాలా చులకన."
    "ణా ఒక్కడికి తప్ప. కదూ , ఇందూ?"
    'అటువంటి వైఖరి నాకు పరమ అసహ్యాన్ని కలగ జేస్తుంది. నీకు తెలుసుగా నా కిద్దరు అక్కలనీ? పెద్దక్క పెళ్లి ఎప్పుడో అయిపొయింది. బావగారు కూడా సంస్కారీ, ఉన్నత భావాలు కలవాదూను. మానీరూని వాళ్ళే దగ్గిర ఉంచుకుని చదివించారు. నీరూ నిజంగా చాలా నెమ్మదస్తురాలు. నువు చూడలేదు గానీ, మా ఇంటికి దీపం లాంటిది. తెల్లగా , పొడుగ్గా చాలా అందంగా ఉంటుంది. శ్రావ్యంగా పాడుతుంది కూడా. అయితే పరమ ఆడది. కావ్యాల్లో అభివర్ణించే అబల. మెచ్చుకుని, ముద్దు చేస్తే తనకు సాటి లేదని పిస్తుంది. చిరాకు పడి, విసుక్కుంటే చితికి పోతుంది. నిరుపమ నేమ్మదీ, అందమూ చూసి  చాలా సంబంధాలు వచ్చాయి. అందులో మాధవరావోకడూ. మాకు తెలిసినాయన పెళ్లి చూపు లేర్పాటు చేశాడు. చూసి వెళ్ళిపోయాక అంతా ఒప్పుకున్నట్టుగా తాంబూలాలు పుచ్చుకోవడమే తరవాయి అన్నట్టుగా ప్రవర్తించాడు. సరే, అన్ని సంగతలూ మాట్లాడుదామనుకునేసరికి తనకు పిల్ల నచ్చలేదన్నాడట. అంతటితో ఊరుకోవన్నాలేదీ మహానుభావుడు. మధ్యవర్తి తో నీరక్క అతి నెమ్మదిగా జీవం లేనట్టుందనీ, కాస్త ఇకనైనా ప్రాణం ఉన్నట్టు కనిపించక పొతే ఎవరూ చేసుకోరనీ ఏమిటేమిటో వాగాడట. ఈ సంబంధం తెచ్చినాయన పొరపాట యిందని , తనా సంబంధం తేకుండా ఉండవలసిందనీ ఒకటే అనుకున్నాడు. ఇతను నాకు పరిచయం అయిన వెంటనే ఎవరో తెలిసి పోయింది. నాతొ కాస్త గ్రంధం నడపడానికి సిద్దంగా ఉన్నాడు. అతన్ని కాస్త ఎడిపించాలని నేను నిర్ణయించు కున్నాను. నెమ్మదస్తులు కాని ఆడపిల్లల తడాఖా చూపించ దలుచు కున్నాను. ఇప్పుడు చెప్పు, నేనేమన్నా తప్పుపని చేస్తున్నానేమో?"
    క్షణం సేపు అలోచించి జవాబిచ్చాడు జోగీందర్ .
    "అలా కాదు ఇందిరా, అతన్ని ఎందుకు సూటిగా మంద లించకూడదు? అతను ప్రవర్తించిన తీరు అంత బాగా లేదనుకో. కానీ కుర్రతనం తప్ప అందులో ఇంకేం లేదనుకుంటాను. అయినా నువ్వు అతన్ని మెత్తగా చివాట్లేసి మందలించవచ్చుగా. ఇంత రాద్దాంతం దేనికి?"
    "ఇందులో రాద్దాంతం ఏముందీ? చివాట్లు వేసినంత మాత్రాన మనుషుల స్వభావం మారదు జోగీ. తగిన విధంగా బుద్ది చెప్పి, భాదపడితే తప్ప, తనవల్ల ఇతరులెంత బాధపడింది తెలిసి రాదు."
    "నువ్వు మరీ విపరీతంగా ఆలోచిస్తున్నావు , ఇందూ. కధల్లో జరిగినట్టు జరగాలంటే కుదరదు. ఇది జీవితం."
    "మరే, ఒక్కొక్కప్పుడు ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్........"
    "అతనంటే నీ కిష్టం లేనప్పుడు అతన్ని ఉపేక్షించకూడదు?"
    "ఇష్టం కూడానా ? అతనంటే నాకు పరమ చిరాకు. నిజం, అతనంత అహంకారి ని నువెప్పుడూ చూసి ఉండవు. చక్కని వాడనీ, ధనికుడనీ, ఆడపిల్లలు తన వెంట పడతారని అతని కెంత గర్వమో నీకు తెలియదు."
    మాట్లాడకుండా నవ్వాడు జోగీ.
    "నవ్వుతావెం?"
    "మరీ బాగుంది. నవ్వకూడదనేమన్నా రూలుందా? సరే కానీ నువ్వు పుస్తకాలిచ్చేసి వాస్తవా, లేక అగుతావా కాస్సేపు?"
    "ఓ గంట రిఫరెన్సు పని ఉంది."
    "అయితే నేను ణా దారిన పోతాను. లైబ్రరీ అంటే నాకు తలనొప్పి."
    గేటు దగ్గిరే సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు జోగీందర్.
    
                                  *    *    *    *
    ఆదివారం పొద్దున్న షీలాలో ఆడుతున్న తెలుగు సినిమా చూడ్డానికి పోయారందరూ. ఇందిర కు పెద్దగా చూడాలని లేకపోయినా , నలుగురితో కలిసి వెళ్ళడానికి ఇష్టపడింది. అదీకాక దాదాపు నగరంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ అక్కడ చేరుతారు. తోటి తెలుగు వాళ్ళని కలవడం లోనూ, తెలుగులో మాట్లాడు కోవడం లోనూ ఒక సరదా ఉంటుందీ ప్రవాసాంధ్రులకు. దియేటర్ చేరగానే ఎన్నో కలకలలాడే తెలుగు ముఖాలు కనబడ్డాయి . కుశల ప్రశ్నలయ్యే సరికి సినిమా మొదలు పెట్టె సమయమయింది. దాంతో అందరూ హడావుడిగా తమ తమ స్థానాల్లో కి పోయి కూర్చున్నారు. సినిమా అతి సామాన్య మైనదే అయినా, అందరూ ఆనందించారు దాన్ని చూసి. ఇదే సినిమా కాకినాడ లోనో, బెజవాడ లోనో చూసినట్లయితే ఇంత రక్తి కట్టేది కాదు. తమ భాషకూ, తమ వారికీ దూరంగా ఉన్న ఈ ఆంధ్రులకు తెలుగు మాటా, తెలుగు ముఖమూ విని చూసి ఆనందించడం ఒక్కటే చాతవును. ఇంటర్ వెల్ చాలా తొందరగా వచ్చిందను కున్నారు ప్రేక్షకులు. పైకి వెళ్లి టీలు, కోకాకోలాలు తాగుతూ రాజకీయాలు చర్చిస్తూ నుంచున్నారు.
    గోపాలరావు గారి స్నేహితులు చాలామంది వచ్చారు. అందరూ గుంపుగా చేరి అన్ని రకాల విషయాలూ ముచ్చటించు కుంటున్నారు.
    "మీరూ వచ్చారే" అన్న సుపరిచితమైన గొంతు విని తల గిరుక్కున తిప్పి చూసింది ఇందిర. వెనకాలే నుంచుని ఉన్నాడు మాధవరావు.
    "అమ్మా మాధవ్ కూడా వచ్చారే." మంజుల వార్త ప్రసారం చేసింది.
    "సినిమా ఎలా ఉంది?' ఇందిర అడిగింది.
    "నా తలకాయలా ఉంది."
    "ఏమోయ్ , పది రోజుల నించీ కనపడ్డం మానేశావు బొత్తిగా." గోపాలరావు గారు నిలవేశారు.
    "అతిగా వచ్చి మిమ్మల్ని విసిగించటం తెలివైన పని కాదు."
    "అవేం మాటలోయ్? నువ్వు మా ఇంట్లో ఒకడి కింద లెక్క. ఇంకా మొహమాట మేమిటి?"
    "మరీ బెట్టు చెయ్యక ఈ పూట భోజనానికి రావయ్యా. అడివారమేగా." సుందరమ్మ గారు అందుకున్నారు.
    "లేదండీ , నా కింకో పని ఉంది. ఈసారికి క్షమించండి."
    "అసలు మీకే మా సాహచర్యం విసుగెత్తి ఉండాలి." అపవాదు వేసింది మంజుల.
    "వాసన్ మద్రాసు నించి నిన్ననే వచ్చాడు. మీ కభ్యంతరం లేకపోతె రేపు సాయంత్రం వచ్చి కలుస్తాం. సరేనా?"
    "మంచిది" అన్నారు గోపాలారావు గారు.
    సినిమా మళ్ళీ మొదలయింది. మొదటి సగం కాస్త చురుగ్గానే నడిచినా, మిగతా భాగం మాత్రం తల నొప్పి కలిగించింది. యధాప్రకారం హీరో యిన్ కష్టాలు, హీరో గారి అర్ధం లేని అనుమానాలూ, ముష్టి యుద్దాలూ, క్షమించడాలు , గ్రూప్ ఫోటో."
    హాల్లోంచి పైకి వస్తుంటే ఇందిర వాళ్ళ వెనకాలే వచ్చాడు మాధవరావు.
    "మరిచి పోకండి. వస్తారు కదూ రేపు. మంజుల హెచ్చరించింది."
    "తప్పకుండా" అని మంజులతో చెప్పి, ఇందిర వేపు తిరిగాడతను.
    "మీరూ రేపు ఎలాగూ ఇంట్లో ఉంటారను కుంటాను."
    "ఏం?"
    "నేను వస్తున్నానుగా."
    "నవ్వాలా?"
    "మీ కభ్యంతరం లేకపోతె." ముఖం సాధ్యమైనంత గంబీరంగా పెట్టాడు.
    తల పక్కకి తిప్పుకుని , చిన్నగా నవ్వుకుంది ఇందిర.
    తల వంచి గొంతు తగ్గించి "వెళ్లి వస్తాను, ఇందిరా" అని జనం లో కలిసి అదృశ్య మయి పోయాడు.
    అతని మాటలూ, కంఠధ్వని ఇందిరలో అపూర్వ మైన అనుభూతిని కల్గించాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS