Previous Page Next Page 
నీళ్ళు రాని కళ్ళు పేజి 9


    ప్రేమ, సరదా అనేవి రెండు రకాలు. కడుపులో నుంచీ మనస్పూర్తిగా త్రికరణశుద్ధి గా ఉన్న ప్రేమ, సరదా మొదటిది, తన పబ్బం గడుపుకునేందుకు నటించే ప్రేమ, సరదా రెండోది. మొదటి దాని కన్న రెండా దానితోనే ఎంతో నమ్మకం కలగ జేస్తారు కొంత మంది. ఈ రెంటి లో వాడి వ్యవహారం ఏ కోవకు చెందిందో నీకు తెల్సునా సుభా" అన్నది అత్తయ్య. మంచం మీద పడుకున్నదల్లా లేచి కూర్చున్నది. నేనూ నా మంచం మీద కూర్చున్నాను.
    "ఇష్టపడి పెళ్ళి చేసుకున్న భార్య విషయం లో రెండో రకమైన ప్రేమను ఒలకబోస్తారంటారా. వారిలో నటన లేదండి. కాకపోతే మాట మాత్రం పెళుసు. మనసు మంచిది."
    నా పొట్ట మీద చేత్తో నిమురుతూ "ఈ మాట ఇక్కడ్నించే వచ్చిందా" అన్నదావిడ.
    "పోనీ వారు నటిస్తున్నారనే అనుకుందాం. మీ అభిప్రాయం చెప్పండి."
    ఆవిడ ఒక్కసారి నిట్టూర్చి నడుం వాల్చి కళ్ళు మూసుకుంది. నేను కూర్చునే ఉన్నాను.
    "నేను కన్న తల్లిని కాకపోయినా త్రికరణ శుద్ధి గా ఆ పరమాత్ముడి సాక్షిగా వాణ్ని కన్నతల్లి కన్న ఎక్కువ వాత్సల్యం తోనే పెంచి పెద్ద వాణ్ని చేశాను. మీ మావగారు ఎ మునిసిపాలిటీ లో బిల్ కలెక్టరు చేసి కాలం గడిపారే తప్ప పెద్ద ఉద్యోగ మేం చెయ్యలేదు. అయన జీవితంలో సాధించింది ఈ ఒక్క చిన్న యిల్లు మాత్రమే కట్టగలిగారు. తల్లి పోయేసరికి మీ అయన నాలుగేళ్లవాడు. నా కడుపున పుట్టిన ఇద్దరూ మగ పిల్లలూ పోవటంతో వీడి మీద నాకు గల మాతృవాత్సల్యం నాకు తెలీకుండానే మర్రి చెట్టుల విస్తరించింది. ఎట్లా పెంచానో నా ఆత్మకూ ఆ పరమాత్మ కూ తెలుసు.
    వాడూ పి,యు.సి వరకూ చదివి సర్వీస్ కమిషన్ పరీక్ష పాసై ఉద్యోగం లో చేరాడు. అప్పర్ డివిజన్ లోకి వచ్చి మూడేళ్ళ యింది. వాడికి అన్ని రకాల దుడుకు తనమూ ఉంది. మాట తొందర. అభిప్రాయాలు తొందర. అనుకున్నది సాధించేంత వరకూ నిద్ర పోడు ఉచ్చు వేసినట్లు. వల పన్నినట్లు మనిషి ని తన గుప్పిట్లో కి తెచ్చుకుంటాడు. తల్లిగా నేను చెప్పలేక పోయినా భార్యగా నువ్వు తెల్సు కోవలసిన విషయాలు ఎన్నోఉన్నయ్యి. క్రమేపీ నువ్వు తెల్సుకోవాలి. ఎన్నో సంబంధాలు అయిదారు వేలకు పైగా కట్నం ఇస్తామంటూ వచ్చాయి. ఆ పిల్లల్నీ చూశాడు. సుతిమెత్తని మనస్తత్వం కలవారూ, చదువు కున్న ఉద్యోగం చెయ్యటానికి ఇష్టపడని ఆడపిల్లలూ వాడి దృష్టి కి అనలేదు. ఒకవేళ అట్లాంటి వారు తటస్థ పడి పెళ్లయినా వాడి చేతులో వారు నెగ్గుకు రాగాలరనే నమ్మకం నాకూ లేదు. డబ్బు సంపాదించటం లో , జల్సా గా ఖర్చు పెట్టడం లో, వాడికి వాడె సాటి. నిన్నూ నీ మనస్తత్వాన్నీ ఎన్నో రకాలుగా తరచి చూసే వారి గీటు రాయికి తట్టుకుని మేలిమి వన్నె బంగారం లా నిలబడ్డావు. కనుకనే కట్నం లేకపోయినా నిన్ను పెళ్ళి చేసుకున్నాడు. ఆడది కదా అణిగిమణిగి ఉన్నవాడికి గిట్టదు. ప్రతి విషయం లోనూ ఆధిక్యత చూపిస్తూ రెట్టిస్తాడు. కళ్ళనీళ్ళు తెప్పిస్తాడు. కౌగలించుకుని బుజ్జగిస్తాడు. నీళ్ళు కారి పొయామో ధ్వజమెత్తి  పాతాళ లోకంలోకి వంపుతాడు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు. నోరు పెట్టుకుని చెలామణి అవుతారు. జట్టు పట్టుకుంటారు. వాడికి కావలసింది అలాంటి గడుసుతనం కాదు. వాడి అభిప్రాయాలు మాటలు అదేనమ్మా, క్రాస్ వర్డ్ పజిల్లాంటి ఆ అభిప్రాయానికి అనేక వ్యాఖ్యాలుం'టాయి. సరైన మాటలు పడితే నవ్వేస్తాడు. కాని వెంటనే రెండో పేజీలు తయారు చేస్తాడు. తన జీవిత భాగస్వామి గా ఎన్నో రకాలుగా నిన్ను పరీక్షించిన తరువాతనే నిన్ను పెళ్లాడంటే కనీసం ఒక తప్పులో నైనా వాడి ఫజిలు  పూర్తీ చెయ్యగలవనే నా నమ్మకం. దానికి ప్రాతిపదికగా మొన్న నీ జీతం తీసుకున్నాడు కదూ" అన్నాదావిడ.

                             
    చెప్పినంత సేపూ కధగా విన్నా, విరేచనాల చాక్ లైట్ చప్పరించినంత పనైంది.
    నాకెందుకనో రెండు ప్రశ్నలు వెయ్యాలనిపించింది.
    "వారు పర స్త్రీ వ్యామోహితులా" రెండో ప్రశ్న వెయ్యలేక పోయాను.
    "నేనెట్లా చెప్పగలను భార్య కనిపెట్టవలసిన విషయం" ముభావంగానే అన్నదావిడ.
    "నేను వార్ని మార్చగలననే నమ్మకం మీకున్నాదా అత్తయ్యా"
    కావలసింది మార్పు కాదమ్మా. సంసారం లో కలతలు రాకుండా చూచుకోటం. మాటలతో వాడి మనస్సుని ఆకట్టు కోటం. ఆ నిప్పు ల మీద ఎప్పటి కప్పుడు నీళ్ళు చల్లుతూ ఉండాలి."
    "ప్రతి నేలా జీతం వారికే ఇవ్వమంటారా" "పరిస్థితి అదుపులోకి తెచ్చుకోవలసినదానివి నువ్వు. నేను వద్దన్నా ఆగేది కాదు"
    ఆ రాత్రి నేను నిద్రపోలేదు. మూడో రోజున వారు కాకినాడ నుంచీ వచ్చేశారు. యధాప్రకారం జరిగి పోతున్నది.
    వారికి వచ్చే ఉత్తరాలు ఆఫీసు అడ్రసు కే వచ్చేవి. ఇంటి అడ్రసు కు వచ్చేవి కావు. రోజూ ఆఫీసు కు వచ్చే టపా లో జవాను ఎవరి ఉత్తరాలు వాళ్ళకు ఇచ్చేస్తాడు. ఆరోజున ఆఫీసరు గారు యు.డి.సి  ల నందర్నీ పిలిచి యేవో ఆఫీసు కాగితాల విషయం చెప్తున్నారు. తతిమ్మా ఆఫీసు స్టాఫంతా వాళ్ళకు అయన ఏం చెప్తున్నారో నని వరండా లో పక్క పక్కన నిలబడి వింటున్నారు. ఈ సమయం లో ఆఫీసు జవాను ఉత్తరాలన్నీ తెచ్చి నా బల్ల మీద పడేశాడు. అడ్రసులు చూశాను. వారికి ఒక కవరూ, ఒక శుభలేఖ వచ్చాయి. కవర్ని నా డ్రాయర్లో వేసి శుభలేక వారికి ఇవ్వమని జవానుకు ఇచ్చాను. ఆ పెళ్ళి శుభలేఖ వారి పై తల్లి గారి వద్ద నుంచీ వచ్చింది. వారమ్మాయి పెళ్ళి. పైతల్లంటే వారి కన్న తల్లి అక్కగారు. కాకినాడ లో పై తల్లి భర్త ప్లీడరు. వారి పేర వచ్చిన కవరు నెమ్మదిగా చించి చదివాను. నా కళ్ళు బైర్లు కమ్మాయి. మతిపోయి నంత పనైంది. అది వారి స్నేహితురాలు రాసిన ఉత్తరం. అమ్మాయి పేరు శోభ. ఉత్తరం లో   ఏ విశేషాలు లేవు. ఎల్లుండి ఆదివారం కొవ్వూరు నుంచీ వస్తున్నాననీ రాజమండ్రి స్టేషను లో సాయంత్రం అయిదు గంటలకు కలవమనీ.
    ఉత్తరం వారికి పంపటమా మానటమా అని ఎంతో ఆలోచించాను? పంపకూడదనే నిశ్చయించు కున్నాను. ఆ ఉత్తరాన్ని భద్రంగా దాచాను.
    పావుగంట గడిచాక స్టాప్ అంతా ఎవరి సీట్లోకి వాళ్ళు వచ్చేశారు. అప్పటికే ఆ శుభలేఖ వారి బల్ల మీద పడేశాడు జవాను. నేను ఏమీ ఎరగనట్లే నా కాగితాలు టైప్ చేసుకుంటున్నాను.
    యధాప్రకారం కాఫీ, టిఫిన్ పంపారు. ఈ పద్దతి నాకు నచ్చక పోయినా వార్ని పూర్తిగా అర్ధం చేసుకోవటానికి వారు చెప్పినట్లే నడుచుకోవాలి కదా!
    సాయంత్రం ఇంటికి వెళ్లాం. రాత్రి భోజనాలు కూడా అయాయి. ఆ శుభలేఖ సంగతి తల్లితో గాని నాతొ గాని చెప్పలేదు. కారణం నాకూ అర్ధం కాలేదు. నేనూ వారి ఉత్తరాలు చూడనట్లే ఉండాలి గాని చూసినట్లు తెలీకూడదు. ఈ ఉత్తరాల దాపరికం వారి మనస్తత్వానికి మరో గీటు రాయి.
    మామూలుగానే నన్ను పలకరించారు. ఒక పక్క వారి స్నేహితురాలి కవరు. మరో పక్క దాచి పెట్టిన శుభలేఖ. నా మనస్సులో ఆవిర్లు తేలుతున్నది. కాని నేను బయట పడకూడదు కదా!
    అత్తయ్య చెప్పిన సంగతులు నాలో రోద చేయ్యసాగాయి. వారికి ఎదురు తిరక్కూడదు. మంచితనం తోనే మనస్తత్వం తెల్సుకోవాలి.
    'అట్లా ఉన్నావెం సుభా. ఏమిటా ఆలోచన' అన్నారు.
    "నా మనస్సు మీకు కానుకగా ఇచ్చి చాలా రోజులైంది. ఇంకా నేనెట్లా ఆలోచిస్తాను.'
    "నా మాట నాకే ఒప్పగించావు. మనస్సు ఆలోచనా లేకపోతె ఉద్యోగం ఎట్లా చేస్తున్నావ్."
    "నాది ఉద్యోగపు మనస్సు. టైపిస్టు హృదయం మీరన్నట్లు ఆఫ్టరాల్ టైపిస్టు ని పెళ్లయింది కనుక ఆఫ్టరాల్ భార్యని అంతేనా"
    నవ్వుతూ దగ్గరకు తీసుకో బోయారు. మా ఇద్దరి మధ్యా శోభ నిల్చున్నట్టె ఉన్నది.
    "నా మనస్సు మీకిచ్చాక బొత్తిగా మీ అభిప్రాయాలు తెలియటం లేదు. కాస్త విశదీకరించాలి" లేచి కూర్చున్నాను.
    "ఏమిటో"
    "నాలో ఏం చూసి నన్ను పెళ్ళాడారు. నా సౌందర్య శోభ ను చూసి అనుకుందా మంటే అంత శోభాయమానమైన సౌందర్యం నాలో లేదు కదా"
    "సౌందర్య శోభ కొందరి లోనే ఉంటుంది. అలాంటి వారు నాకు తెలుసు, నీ తెలివితేటల్ని, ఉద్యోగం చెయ్యాలనే నీలో ఉన్న కాంక్ష నీ చూసి పెళ్లాడాను. కాని నీ తెలివితేటలు రాణింపు కు రావాలంటే నాలాంటి భర్తే నీకు కావాలి" అన్నారు.
    "నా తెలివి తేటలతో, నా ఉద్యోగ కాంక్షతో మీరు కాపురం చేస్తున్నారు కాని, నాలోని స్త్రీ సహజమైన మానవత్వంతో , కోరికలతో , అభిరుచులతో ప్రేమానురాగాలతో , మనస్సుతో హృదయంతో కాదన్న మాట."
    వారు ఎగతాళి గా చూస్తూ నవ్వారు. "తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని, భర్త పొందు కావాలనీ కోరుకునే ప్రతి వివాహిత స్త్రీ లోనూ నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఉంటయ్యి. అవన్నీ నీ ఒక్కదాని సొత్తే కాదు. వ్యభిచారి విషయం లో ఒక్క స్త్రీ త్వమూ, డబ్బూ మినహా మరేమీ ఉండవు."
    "వ్యభిచారి అంటే"
    "డబ్బుకు శరీరాన్ని అమ్ముకునేది"
    "స్నేహం లో శీలాన్ని అర్పిస్తే అది వ్యభిచారం కాదు."
    కాస్త గతుక్కు మన్నారు. పై పళ్ళతో క్రింది పెదవిని కొరుక్కున్నారు. గోళ్ళు కొరుక్కుని కిటికీ లోంచి అవతాల పారేశారు. మెటికలు విరుచుకున్నారు. ఎడం చేత్తో గడ్డాన్ని నిమురు కున్నారు.
    "హోటల్లో డబ్బిచ్చి భోజనం చేస్తే అది అన్నాన్ని కొనుక్కు తిన్నట్లే అవుతుంది. అదే ఊరికే మనస్పూర్తిగా ఆకలి గొన్న వారిక పెడితే అతిధి సత్కారం అవుతుంది. అంతే తేడా."    
    నా మనస్సు భగభగ లాడుతున్నది. ఈ మనిషిలో మంచీ మానవత్వం పూర్తిగా లేకపోలేదు కాని అవి వక్ర మార్గం లో పరిభ్రమిస్తున్నాయి. వాటిని అదుపులో పెట్టాలి. కాని కొంత వ్యవధి కావాలి.
    'అతిధికి నాలుగు రూపాయలు తాంబూలం లో పెట్టిస్తే ఇంకా మంచిది కదూ" అన్నాను.
    "నిజం , ఇంతకీ నువ్వు శీలం అర్ధించిన ఆ స్నేహితుడేవరు సుభా."
    నా వళ్ళు మండి పోయింది. అభిమానం పొంగి పొర్లు కొచ్చినా కన్నీరు రాలేదు.
    "ఆ సమయం వచ్చినప్పుడు ఆ స్నేహితుడేవరో, స్నేహితురాలేవరో మీరే చూస్తారు." అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS