అక్కయ్య కు చిన్న బుచ్చుకోవటం కూడా తెలీదు. "సుభా, త్వరగా వచ్చేయ్ అని నవ్వుతూ నిల్చుంది.
నేను వారితో టాక్సీ ఎక్కాను. నాకు తెలియకుండా నా కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి.
వారికీ తల్లి లేదు. చిన్నప్పుడే తల్లి పోయింది. తండ్రీ రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆ సవతి తల్లే వార్ని పెంచి పెద్ద చేసింది. ఆవిడకూ ఇద్దరు పిల్లలు పుట్టి పోయారు. తరువాత సంతానం కలగలేదు. వారని కన్న తల్లి కన్నా ఎక్కువ ప్రేమతో, మమకారం తో పెంచి పెద్ద చేసింది. కన్న ప్రేమ ఆమెకు దూర మయినా ఈ పెంచిన ప్రేమ ఆవిడ గారి నరనరాల్లో జీర్ణించి పోయింది ఆవిడ లోకానికి సవతి తల్లి. కాని యదార్ధానికి కన్నతల్లి కన్న మిన్న. ఆవిడ పేరు యశోదమ్మ. వారి తండ్రి పోయి నాలుగేళ్ల యింది. తల్లీ కొడుకు ఉన్న ఆ ఇంట్లో కోడలుగా ప్రవేశించాను నేను. అది వారి స్వగృహం. వేరే ఆస్తి లేదు. మరో మూడు రోజులు గడిచాయి. సెలవు అయిపొయింది. ఇద్దరం ఆఫీసులో జాయిన యాం. రోజూ తొమ్మిదిన్నర కల్లా ఇద్దరం భోజనం చేసేవాళ్ళం. భోజనాలయి ఆ కంచాలు కడిగి అత్తయ్య కు సాయం చేసి నేను ఆఫీసు కు వెళ్ళటానికి సిద్దపడే సరికి పదిం బావయేది.ఇద్దరం బయల్దేరి ఆఫీసుకు వెళ్ళే వాళ్ళం. సాయంత్రం ఆరుగంటల కల్లా ఇద్దరం బయల్దేరి వచ్చేవాళ్ళం.
జీవితంలో మార్పు కనిపించే సరికి ఇంటి వాతావరణంతో పాటే ఆఫీసు వాతావరణం లోనూ మార్పు వచ్చినట్టు కనిపించేది. అందులోనూ భార్యాభర్తలు ఒకే ఆఫీసు లో పని చేస్తున్నప్పుడు ఆ మార్పు ఇంకా సహజం.
ఒకటో తారీఖు న జీతం వచ్చింది. మా పెళ్ళి పదిహేనో తారీఖు న అయింది. ఆరోజు నుంచే వారి భార్య ను, అంటే పద్నాలుగో తారీఖు వరకూ నేను తలిదండ్రుల అధీనం లో ఉన్న పిల్లను, వారి మనస్తత్వం కనిపెట్టాలని ఒక చిన్న తమాషా చేద్దామను కున్నాను.
ఏదో సామెత చెప్పినట్లుగా నా కన్న వారే రెండాకులు ఎక్కువ చదివారు. జీతం తీసుకుని ఇంటికి రాగానే వారన్నారు.
"సుభా. ఈ రోజు నుంచీ మనిద్దరి జీతాలూ కలిసే వాడుకుందాం. ఖర్చులు పోను మిగిలింది బ్యాంకు లో దాచుకుందాం. ఏదీ నీ జీతం ఇవ్వు ఖర్చులకు ఓ ఇరవై రూపాయలు తీసుకో" అని జీతం ఇవ్వమన్నట్లుగా చెయ్యి జాపారు. క్షణం సేపు విస్తు పోయాను. ముఖం లో ఆభావం కనపడనీయలేదు.
"నా జీతం మీద మీకు హక్కు పదిహేనో తారీఖు నుంచీ సంక్రమించింది. మొదటి పద్నాలుగు రోజుల జీతం మీ కివ్వనక్కర లేదు. ఆ జీతం మా నాన్నగారికి ఇస్తాను" అన్నాను. వారు ఎగతాళి గా నా బుగ్గ గిల్లి "మైడియర్ సుభా పెళ్లి నాటికి పద్నాలుగు రోజుల ముందే తాంబూలాలు పుచ్చుకుని లగ్నాలు పెట్టుకున్నాం. ఆరోజు నుంచీ నువ్వు నాదానివే. కనుక నెల జీతం మీదా నాకు హక్కున్నది భామా మణీ" అన్నారు. నిజంగా నాకు నోట మాట రాలేదు. జీతమంతా వారికి ఇచ్చేశాను. ఒక్క పైసాకూడా నేను తీసుకోలేదు.
"జీతం అంతా ఇచ్చేశావెం కోపం వచ్చిందా మనస్సులో కోపం ఉన్నా పైకి నవ్వు ముఖంతో అడిగారు.
"జీతం నా కెందు కండీ. మధ్యాహ్నం పూట మీరే కాఫీ టిఫిన్ ఇప్పించండి. కావలసిన బట్టలు, వెచ్చాలూ మీరే తెస్తారు. ఇంక నాకు డబ్బుతో పని లేదు' అంతకన్నా మాట్లాడలేక పోయాను.
వారం గడిచింది. సరిగ్గా మధ్యాహ్నం రెండు కాగానే జవాను చేత కాఫీ టిఫిన్ తెప్పించి నాకు పంపేవారు. నేనేమీ అనేదాన్ని కాదు.
పెళ్లి కాని రోజుల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆడదాని ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని గురించి ఎన్నో కలలు కనేదాన్ని. ఆఫీసుకు వెళుతున్నా, ఇంటికి తిరిగి వస్తున్నా ఉద్యోగం చేస్తున్నాననే ధీమా నా మనస్సులో పల్టీలు కొట్టేది. పెళ్ళితో అదే మారిపోయింది. ఏదో పెద్ద అప్పు తీర్చటానికి మాత్రమే ఉద్యోగం చేస్తున్నట్టున్నది. చేతులో అయిదు పైసలు ఉండేది కాదు ఖర్చులకు తీసుకుంటే వారు అంటారని కాదు కాని నా జీతం మీద అంత నిష్కర్షగా ఎందుకు అధికారం చూపిస్తున్నారో నాకూ అర్ధం కాక అర్ధమయ్యే లా చేసుకుందామనే దీక్షతో ఈ నిర్ణయానికి వచ్చాను. ఏమిటో నాలో నాకు తెలీకుండానే ఉక్రోషంతో కూడిన అభిమానం తలెత్తింది.
ఒకరోజు రాత్రి అన్నారు.
"జీతం తీసుకున్నానని కోపం వచ్చిందా సుభా."
'లేదు, నా మనస్సు నే మీకు కానుకగా ఇచ్చినప్పుడు నా జీతం మీకివ్వటం లో కోపం ఎందుకూ. నా మనస్సే మీ దగ్గర ఉన్నప్పుడు అసలు కోపం మాత్రం ఏ ముఖం పెట్టుకుని నా దగరకు వస్తుంది.' అన్నాను. ఏదో విజయ గర్వంతో ఉన్నట్లుగా నావైపు చూశారు.
రోజూ భోజనాలు కాగానే ఆఫీసు కి వెళ్ళే ముందు మా ఇద్దరి కంచాలూ నేనే కడిగి ఆ కాస్త సమయంలో అత్తయ్య కు ఇంటి పనిలో కొంచెం సాయం చేసి ఆఫీసు కి బయల్దేరేదాన్ని. అట్లా ఇంటి పని కొదొఆ నేనే చెయ్యటం వారికి నచ్చేది కాదు.
ఒకరోజున గడియారం ఆగిపోయింది. టైము తెలీలేదు. వారు ఆఫీసు కి వెళ్ళ టానికి తయారయాడు.
"సుభా పదిన్నరయింది ఇవాళ ఆఫీసు కు రావా ఏమిటి" కోపంతో కేకేశారు.
"ఇదుగో అయిదు నిమిషాల్లో వచ్చేస్తున్నా" అన్నాను. వెంటనే అత్తగారి మీద కోప్పడ్డారు.
"పిన్నీ. సుభా ని పెళ్లి చేసుకుంది నాతొ పాటు గా ఉద్యోగం చేసి నాలుగు జీతం రాళ్ళు తేవటానికి. వంటింట్లో నీకు సాయం చేస్తూ అప్పలమ్మ లా ఇంటి పని చెయ్యటానికి కాదు. నాకు పెళ్ళయి కోడలు కాపరానికి రాగానే నీకు అత్తగారి హోదా వచ్చిందను కుంటున్నావేమో. అదేం కాదు"
కొడుకు ఇంతమాట అంటారని ఆవిడ అనుకోలేదు. కాకపోయినా ఆవిడ మనస్సులో అత్తా కోడలనే దృష్టే లేదు. నన్ను ఎంతో ఆదరణ గా చూసేవారు. వంటపనిలో సాయం చెయ్యటానికి వస్తే "వద్దమ్మా, ఇద్దరం చేసే పనేది లేదక్కడ నువ్వే ధన్నా చదువుకో. త్వరగా తెమిలి ఆఫీసుకు వెళ్ళు. ఏమీ లేకపోతె గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకోండి అనేది. అటువంటిది కొడుకు ఈ మాటనేసరికి ఆవిడ ఖిన్ను రాలైంది.
"సుభా నా మీద నీకు గౌరవం ఉన్నదనే అనుకుంటున్నాను. అదే కనక నిజమైతే ఈరోజు నుంచీ నువ్వు ఇంటి పనిలో జోక్యం పెట్టుకోవద్దు. వెళ్లమ్మ వెళ్ళు." లేనిపోని ఈ అభాండానికి మనస్సులో బాధపడుతూ అన్నదావిడ. నేనేం మాట్లాడకుండా ఆఫీసు కు బయల్దేరాను.
కలెక్టరాఫీసు లో పనుండి వారు కాకినాడ వెళ్ళారు. రెండు రోజుల వరకూ రారు. మర్నాడు ఉదయమే కాకినాడ వెళ్ళబోతూ "సుభా, నేను లేనని అత్తయ్య తో ముచ్చట్లాడుతూ ఆఫీసు మాట మర్చిపోయేవ్ ఉద్యోగం చేసే ఆడవాళ్ళంటే నాకున్న సదభిప్రాయం లో వెయ్యో వంతయినా పిన్నికి లేదు. అయిదున్నర కల్లా ఇంటికి వచ్చెయ్యి. ఆవిడతో ఎక్కువగా కలగ చేసుకుని మాట్లాడకు." అన్నారు.
మనస్సులో నొచ్చుకుని ఊరుకున్నాను. సాయంత్రం ఆరు గంటలకు బయల్దేరి మామూలు వేళకే ఇంటికి వచ్చాను. కాకినాడ వెళ్ళే ముందు రెండు రూపాయలు నా చేతులో ఉంచి ఖర్చులకు వుంచుకో మన్నారు. ఈ మనిషి ప్రవర్తన ఇంత నీచంగా ఉన్నదేమా అని బాధపడి కానీ చూద్దామని మనస్సు సరి పెట్టుకున్నాను.
రాత్రి భోజనాలయాక ఎవరి పక్కల మీదికి వాళ్ళు చేరాం. అప్పటికి రాత్రి ఎనిమిది గంటలే అయింది.
"వాడు నీతో సరిగ్గా ఉంటున్నాడా సుభా' అన్నది అత్తయ్య.
అత్తయ్య వేసిన ఈ ప్రశ్నకు నేను ఆశ్చర్య పడకపోయినా ఈ కొడుకును గురించి ఆవిడ జీవితంలో కొన్ని బాధలు పడిందేమో నని అనుమానం కలిగింది.
"అదేం లేదత్తయ్యా. నేనంటే వారు చాలా ప్రేమగా ఉంటారు. నాతొ సరదాగానే ఉంటారు." అన్నాను.
అత్తయ్య నవ్వుతూ నా బుగ్గలు నిమిరింది. ఆవిడ హృదయం అగ్నిపర్వతమో. మంచు కొండో నాకు తెలీలేదు.
