5
నేను కాపురాని కి వెళ్ళిన రెండు మాసాల్లో అమ్మా, నాన్నా రెండు మూడు సార్లు వచ్చి చూసి వెళ్ళారు. కాని నేను అక్కడికి వెళ్ళలేదు.
ఆరోజు ఆదివారం . సోమవారం ఉదయం వస్తానని చెప్పి ఆదివారం ఉదయమే నాన్నగారింటికి వెళ్ళాను. అమ్మా, నాన్న ఎంతో సంతోషంగా నా సంసార పరిస్థితులు అడిగారు. ఆడపిల్లగా అక్కయ్య కు ఉండవలసిన అదృష్టం కూడా నాకే కలిగిందను కున్నారు. తృప్తిగా చూశాడు నాన్న.
"పోనీలే దాని రాత అట్టా ఉన్నా నీ అదృష్టమన్నా ఇట్లా ఉన్నది చాలా సంతోషం తల్లీ" అని అన్నది అమ్మ. అక్కయ్య నన్ను ఎగాదిగా చూసి "కొంచెం చిక్కినట్లున్నావేమే సుభా" మీ అయన మంచివాడేనా" అని తన సహజ ధోరణి లో నవ్వింది.
"ఎంతో మంచివారు . అసలు మంచి చెడ్డలకు కొలత, తూకమూ లేదు కదా. మన మనస్సునే త్రాసు లో తృప్తి అనే రాయి వేసి తూచకోవలసిందే" అన్నాను.
"అయితే ఇంక ఇక్కడే ఉండిపోతావుగా"
నెత్తి గోక్కుంటూ అన్నది.
"ఛీ శకున పక్షీ" అన్నది అమ్మ.
సాయంత్రం అయిదు గంటలైంది. నా గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. గృహ కృత్యపు విషయం లో సంసార గుట్టు రచ్చ కెక్కించి నందువల్ల ప్రయోజనం శూన్యం. ,మనస్సులో మెతగ్గా ఉన్నా వివరాలు తెల్సుకోటం లో మెతకదనం పనికి రాదు. గుడ్డుగా ఉన్నప్పుడే గూడు తప్పించాలి గాని పిల్ల యిం తరువాత గూడు వెతుక్కుంటూ అదే వస్తుంది.
స్నేహితురాలింటికి వెళ్ళొస్తానని చెప్పి పావు తక్కువ ఆరు గంటల కల్లా రాజమండ్రి స్టేషన్ కు చేరాను. సరిగ్గా ఆరు గంటలకు రైలోచ్చింది. ఆ శోభ ఎవరో తెలీదు. కాని తెల్సుకోవాలి.
ప్రయాణీకు లంతా జట్కా ల్లో, రిక్షాల్లో , కార్ల లో వెళ్ళారు. కొందరు నడిచి వెళ్ళారు. ఒకమ్మాయి స్టేషను లోనే ఒక బల్ల మీద కూర్చుంది. చేతులో ఒక చిన్న లెదర్ సూట్కేస్ ఉన్నది.
అంత అందమైంది కాదు, అనాకారీ కాదు. ఆ కళ్ళల్లో ఆకర్షణ ఉన్నది. చుట్టూ ఒకసారి చూసి నిట్టూర్చింది. నేనూ పక్కనే కూర్చున్నాను.
"ఈ రైల్లో దిగారా" అన్నాను.
"అవునండీ. మా వాళ్ళింటి కి వెళ్ళాలి స్టేషన్ కు రమ్మని ఉత్తరం రాశాను. వాళ్ళు రాలేదు. వాళ్ళ ఇల్లు తెలీదు."
"మీ పేరు."
"శోభ. మీరిక్కడికి వెళ్ళాలి."
"ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు, స్నేహితురాలు అనకాపల్లి వెళుతుంటే రైలేక్కించుదామని వచ్చాను. ఈ జనాన్ని చూస్తుంటే కాస్త కాలక్షేపం మీరు చదువుతున్నారా . మీవారేం చేస్తున్నారు.
విరోధినైనా స్నేహంతో నే ఆదరణగా మాట్లాడి పడగొట్టాలి.
"బి.ఏ చదువుతూ మానేశాను. ఆర్ధికంగా ఇబ్బంది, తండ్రి లేరు. అమ్మ ముగ్గురు పిల్లలూ నా కన్న చిన్నవాళ్ళు. ఆస్తి లేదు. చడువేట్లా సాగురుంది. ఒక జీవితం బలి అయితేనే గాని కొన్ని సంసారాలు గడవవు. నాకు మావారంటూ ఎవరూ లేరు." పేలవంగా నవ్వింది. బాధపడుతూనే జాలిపడ్డాను. అమ్మాయి మీద సానుభూతి కలిగినా ఆ ప్రలోభాన్ని తల్చుకుంటే అసహ్యం కలిగింది. కనువిప్పనేది అందరికీ కలగదు. అందుకు కారణం, సంస్కారం లేకపోవడమే కాదు, ఆర్ధిక పరిస్థితులే ప్రధాన కారణం.
"బి.ఎ వరకూ చదివా నన్నారు. ఉద్యోగ ప్రయత్నం చెయ్యలేదా."
హూ. ఉద్యోగం అదీ చేశాను. అన్నీ అయినయ్యి."
మళ్ళీ ఒక్కసారి ఎవరి కోసమో చూసింది. హతసురాలై నట్లుగా కూర్చుంది.
"మళ్ళీ మీకు తిరుగు రైలు ఇప్పుడు లేదేమో మా ఇంటికి వెళదాం రండి మా వారు ఏదైనా ఉద్యోగం ఇప్పించగలరేమో అడుగుతాను. అయన చాలా ఉదార స్వభావులు. చేతనైనంత వరకూ తప్పక సాయం చేస్తారు."
"మీవారేం చేస్తున్నారు. మీ ఇల్లెక్కడ. మీరు .
"మేజిస్ట్రేట్ ఆఫీసు లో ఉద్యోగం. రండి వెళదాం."
సందేహించింది. రానన్నది. బలవంతం చేశాను" ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ కలిగించాను. రాత్రికి ఉంది ఉదయమే వెళ్లి పోతానన్నది. ఇంటి దగ్గర బయల్దేరే టప్పుడే అమ్మకు చెప్పాను. స్నేహితురాలింటి దగ్గర్నుంచీ మా ఇంటికి వెళ్లి పోతానని. అమ్మ నవ్వి సరే నన్నది. కొత్త కాపురమని అమ్మ ఊహ.
శోభా, నేనూ ఇద్దరం రిక్షా ఎక్కి మా ఇంటికి వెళ్ళాం. తల్లీ, కొడుకు ఇంట్లోనే ఉన్నారు.
ఒకరి నొకరు చూసుకుని నిర్ఘాంత పోయారు. నేను ఏమీ తెలీనట్లే అన్నాను.
"మా స్నేహితురాలు రాణి అనకాపల్లి వెళుతుంటే రైలెక్కించటానికి రాజమండ్రి స్టేషను కు వెళ్లాను. ఈ అమ్మాయి కనుపించింది. స్టేషన్ కు రమ్మని ఉత్తరం రాస్తే చుట్టాలు రాలేదుట."
"మనింటి కెందుకు తీసుకోచ్చావ్" విసుగ్గా అన్నారు.
"సాటి ఆడపిల్ల. పరిస్థితులు చెప్పింది. మీరేదయినా ఉద్యోగం ఇప్పిస్తారేమో నని నేనే రమ్మన్నాను. ఆడపిల్ల రాత్రి పూట ఎక్కడుటుందని మనింటి కి రమ్మన్నాను. "ఏదయినా ఉద్యోగం ఇప్పించండి. పాపం మీకు ఎంతయినా పుణ్యం ముంటుంది.
కోపం, దుఖం, ఆవేశం పొంగి పొర్లు కోస్తున్నా వాటన్నిటి కీ ధైర్యం, మనో నిబ్బరం అనే అడ్డుకట్ట వేశాను. ఆ కట్టకు గండి ఎప్పుడు పడుతుందో నని నాకే అనుమానంగా ఉన్నది.
"మీది ఏవూరండి" ఆ అమ్మాయిని అడిగారు.
"కొవ్వూరు."
"మీ పేరు"
"శోభ."
"ఏం చదివారు."
"బి.ఎ చదువుతూ మానేశాను. ఉద్యోగం ఇప్పిస్తారనే ఆశను కలిగించారు. మీ భార్య"
'ఆవిడ మీకు తెలుసా"
"లేదు"
"అవకాశం దొరుకుతే ఉద్యోగం ఇప్పిస్తాను. ఈ రాత్రికి ఉండి రేపు ఉదయమే వెళ్ళి పొండి మీ చుట్టాలకు మీరు రాసిన ఉత్తరం చేరలేదేమో."
"కావచ్చు."
అత్తయ్య కూడా అన్నీ వింటూ నిల్చున్నారు. నిజంగా వీళ్ళిద్దరూ గుండెలు తీసిన బంట్లు. ఎంత తెలివిగా ఒకరినొకరు తెలినట్లుగా మాట్లాడుతున్నారు, అని అనుకున్నాను.
'పిన్నీ , ఈ రాత్రికి ఈ అమ్మాయి ఇక్కడే భోజనం చేసి ఉంటుంది. లోపలికి తీసుకు వెళ్ళు సుభా" అన్నారు.
ఆ ఇద్దరి ముఖ కవళికలు చూస్తుంటే నాకు కోపమూ, నవ్వూ వస్తున్నాయి. వారన్నట్లు శోభ వేశ్య కాదు. కాని అతిధి సత్కారాలు పొందుతున్న జాణ నా పరిస్తితిలోనే మరొక స్త్రీ ఉండి ఈ సంఘటనే తారస పడితే ఎంత యుద్ధమో చేసేవాళ్ళు. నా సుఖాన్ని పంచుకోటానికి వచ్చిన శోభను చూస్తుంటే నా మానసిక పరిస్థితి అట్లాగే ఉన్నా అల్లరి చేసి బజారిక్కే కన్నా ఈ విషయం లో వారి వేలుతోనే వారి కన్ను పోడిపించాలనే నిర్ణయానికి వచ్చాను. ఎంత చదువుకుని ఉద్యోగం చేసుకునే అడదయినా ఉదాత్త భావాలు ఉన్నా తన భర్త పర స్త్రీ లోలుడు కావటానికి ఇష్టపడదు. నుయ్యో, గొయ్యో చూసుకోవటం పాతాకాలపు పద్దతి. జుట్లు పట్టుకుని పోట్లాడు కోవటం రెండో రకం ప్రాధేయపడి బ్రతిమాలు కోటం కొంత విజ్ఞత గల స్త్రీ లక్షణమే కాని నేను అనుసరిస్తున్న పంధాకు ఎంతో మనో నిగ్రహమూ, ఓపికా కావాలి. నా మొండి ధైర్యమే నన్నీ విధంగా చెయ్యమని పురి కోల్పింది.
వారు భోజనం చేశాక మేం ముగ్గురం కూర్చున్నాం పై కబింకంగా ఉన్నా లోపల ఎంతో బయపడుతున్నది శోభ. అన్నం కూడా సరిగ్గా తినలేదు. "కొత్తచోటయినా సాటి ఆడవాళ్ళ దగ్గర భోజనం చెయ్యటానికి అంత ఖంగారు పడతారేం శోభా. మన వల్ల ఏ దోషం లేనప్పుడు భయపట్టమనేది అద్దంలో మన ముఖాన్ని చూచి మనమే భయపడుతున్నట్టుగా ఉంటుంది."
శోభ మనస్సు కుతకుత లాడిపోతున్నది.
"అబ్బే ఏం లేదండీ. ఆకలిగా లేదు."
'అనుకున్నది ఒకటి అయింది మరొకటీ అయితే ఎంత చదువుకున్నవాళ్ళమైనా ఖంగారు పడిపోతాం. తప్పులు చెయ్యట మనేది , నీతిని పాటించక పోవటమనేది స్త్రీ పురుషులిద్దరి విషయం లో ఒకటే అయినా సాంఘిక వ్యవస్థలోని ఆచారాన్ని బట్టి అనుసరించే విధానాన్ని బట్టి ఉంటుంది. అవునంటారా."
"మీరన్నది నిజమే."
కూర ముద్ద తిని పచ్చడి కలుపుకున్నాం. అత్తయ్య ని మాట్లాడవద్దని ముందే సైగ చేశాను.
"ఆకలిదప్పులు స్త్రీ పురుషులిద్దరికీ ఒకటే. శారీరక వాంచా, కోరికా ఒకటైనా యౌవనం లో పొంగు ఒకే ప్రాతిపదిక మీద ఏర్పడినా, స్త్రీకి శ్రీలం ప్రాణం కన్నా ఎక్కువ అన్నారు. శీలసంరక్షణార్ధం ప్రాణాన్నయినా త్యజించ మన్నారు. కాని పురుషుడికి అంత కట్టుదిట్టమైనటువంటి కఠినమైనటు వంటి నిబంధనలు ఏర్పాటు చెయ్యలేదు. అందుకనే స్త్రీ శీలానికి వెల కట్టారు వెలయాలిని శరీరం అమ్ముకుని బ్రతుకుతున్న దన్నారు. పరస్పర ఉద్రేకాలకి అవినాభావ సంబంధం ఉన్నా ఆ ఉద్రేకాలు తీర్చుకోటానికి పురుషుడు స్త్రీకి డబ్బిస్తున్నాడు. అంతేకాని పురుషుడు తన శరీరాన్ని అమ్ముకుంటున్నాడని ఎవ్వరూ అనరు. నా సిద్దాంతం మీద మీ వ్యాఖ్యానం" అన్నాను.
