"మంచిదే . కానీ కొన్ని సమయాల్లో అబద్దం ఆడి తీరాలని పెద్ద లంటారు. ఇల్లాలిని పదుగురు కట్టిన యింటిలో యేడిపించకూడదు నాయనా!" ఇక్కడ మీకేమీ లోటు లేదు లే కాని నీ కష్టం లో బతికితే గౌరమ్మ కు గర్వం వుంటుంది' నువ్వన్న తృప్తి ఆమెకు వద్దా? నీ గురించే గానీ యెదుటి వాళ్ళ గురించి ఆలోచించవా?"
"ఉద్యోగం నిజం చెప్పి గడిస్తాను. అప్పుడు అందరికీ తృప్తి వస్తుంది. ఈరోజు తృప్తి తో తొందరపడను. శాశ్వత తృప్తి కోసమే నా ప్రాకులాట. నన్ను డిస్మిస్ చేసిన ఆఫీసరు ఆరోజు తృప్తి పడ్డాడు. కానీ రాను రాను యేమైంది? ఒక్కగాని ఒక్క కొడుకు పోయాడు."
"నువ్వేం చెయ్యలేక పోయావుగా? తొందరపడి బాధ పడింది నువ్వూ, నీ కుటుంబం. ఒకరికి అన్యాయం చేసినందుకు అతనిని బాధ పెట్టిందేవరు ? అందరికీ న్యాయానిచ్చే దేవుడు. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడ్తారు నాయనా? నువ్వూ నేనూ చేసిందేమిటి?"
"మన దేశంలో మీలా అని వూరు కోవటం వలెనే యింత అవినీతి తాండ విస్తోంది. దేవుని కోపం నేను చూడొచ్చానా? మనిషి కోపంతోనే నాకు పని. అంచేత అన్యాయం అవినీతి కనిపించినప్పుడల్లా నాకోపం ప్రజ్వరిల్లు తుంది. దానితో ప్రక్క బెదురు వుండవలసిన వాళ్ళకు వుంటుంది." కాస్త గొంతుక తగ్గించి "మామ్మగారూ-- ఈ యింటి గల అమ్మ బెడ వడ్డీలకు డబ్బు అప్పు ఇస్తోందని పైకి రాసేసాను."
"మీ కెందు కండి?-- అన్నయ్య ను హాయిగా బతక నిచ్చేటట్లు లేరు. పదండి యెక్కడికో పోదాం" గౌరీ చిరాకుగా అనగానే మామ్మ నవ్వుతూ. " ఇంత నిజాయితీ గా పోయేవాళ్ళ ని లోకం బతకనివ్వదమ్మా! ఆ బాబు లోకంతో జగడమాడి బతక గలడు. ఎటొచ్చీ పాపం నీ గురించే విచారం." అంటూ వెళ్ళిపోయింది. ఆ వేళ నించి భార్య భర్తలో, యెడ ముఖాలు పెడమొఖాలై పోయాయ్. యెదురుగుండా వున్న యింటి గల అమ్మ ముఖం చూడటానికే గౌరికి సిగ్గు వేస్తోంది. ఆమె ఇంటికి దేనికి వచ్చినా, యెందుకు పిలిచినా ఆమె గుండె బితుకు బితుకు మంటోంది. పై కేక్కడికో రాసిన కాగితం చింపించేటట్లు అన్నయ్య తో చెప్పి చెయ్యించాలి. లేదా అంటే ఆవిడ విజ్రుంభిస్తుంది. అన్నయ్య తల వంచేస్తాడు. ఆ ఉద్దేశ్యంతో నే మెల్లగా అన్నయ్యతో చెప్పింది.
"ఫరవాలేదు. ఈ రోజుల్లో యెవరో రాసిన కాగితం చూసి యేక్షను తీసుకునేటంత స్థితికి ఆఫీసరు రాలేదు."
గౌరికి మనసు కుదుట పడింది. సూర్యం ఈలోగా తండ్రి దగ్గర నించి వచ్చిన రెండు ఉత్తరాల సంగతి యెవరికి చెప్పలేదు. రెండు నెలలై అతను యింటికి డబ్బు పంపలేక పోయాడు. తను యిలా చెయ్యటం వలన అక్కడ యెంత యిబ్బంది పడ్తారో తనకు తెలిసి మరీ ఏం చెయ్యలేక పోయాడు. గోవిందరావు యిక్కడకు చేరినట్లు తెలుసుకున్న తండ్రి ఆ పామును వదిలించుకోకపోతే నీ బ్రతుకు అల్లకల్లోలం చేస్తాడని రాసాడు. అమ్మ వుండేటప్పుడు అతనికి సంసార బాధ్యతే వుండేది కాదు. ఇప్పుడు తనకు సంసారం సాగించటం చేతకావటం లేదు. అతని చెయ్యి వెనక్కి లాగటం తెలీదు. డబ్బంతా ఖర్చయ్యాక అవసరానికి యింకోకర్ని అడగటానికి మనసు చచ్చి పోతోంది. ఐనా ఒకోసారి ఈ బ్రతుకంతా యింతే అన్న నిరాశ ఒకోసారి పెనవేసుక వస్తోంది. ఏవిటీ దరిద్రం అని ఒకోసారి విసిగి పోయేవాడు. డబ్బు యిబ్బందులతో పాటు యింట్లో బావ వలన ఏదో ఒకలా అలజడి అతని చెవులలో పడేది. బావను యెందుకిలా గొడవ చేస్తారని అడగలేడు. అడిగితె ఏం అవుతుందో తనకు తెలుసు. తొందరపడి గౌరికి అన్యాయం చెయ్యటం తనకు యిష్టం లేదు. అందుకే వోర్పుతో మెసిలాడు. వోర్పుతో మనిషి చిక్కి పోయాడు. చివరకు ఒకనాడు గోవిందరావు తో చెప్పాడు. "ఒక మిత్రుడు ఒక ఉద్యోగం సంపాదించాడు ఇందులో యింటర్వ్యూ లూ యేవీ ఉండవు. మీరు రేపే చేరండి" ఏవో ఎకౌంటు లు రాయటం శెట్టి గారు చెప్పినట్లు చెయ్యటం."
"కోమటి వెంకయ్య కొలువా?" అన్నాడు.
"ఏదో ఒక కొలువు. మీరు మీ పనేదో చేసుకోనటం. ఒకరితో పేచీలు పెట్టుకోకండి.'
"అయితే మీరు నన్ను పేచీ కోరు కింద కట్టేసారన్నమాట." "మీరు కాదండి. అవతలి వాడు పెచీకి దిగేరకం. మీరు పేచీ కోరుతో పేచీలు పడకుండా మీ పని సవ్యంగా చేసుకో,మంటున్నాను."
"కూర్చొని తింటున్నా నన్నవాదు నా కెందుకు? ఆ నరకం లో కాలు పెట్తున్నాను!"
"మీ మంచితో స్వర్గం చెయ్యండి!" అన్నాడు సూర్యం.
"నరకం యెప్పుడూ స్వర్గం కాదు!"
"ఎక్కడా నరకం లేదు. యెక్కడా స్వర్గం లేదండి. మన మనసును బట్టి స్వర్గ నరకాలు సృష్టించుకుంటాం!"
"మనుషుల్లో ఆకారా లున్నట్లే మంచి చెడ్డలకీ వున్నాయ్. మంచిని చెడు అనలేం. చెడును మంచి అనలేం. మంచి మనిషి చెడుకు లోన్గిపోడు. దానికి హతమారుస్తాడు."
"అదే మిమ్మల్ని చెయ్యమంటూన్నాం" చెడ్డ వాళ్ళలో చెడుని హతమార్చండి గానీ వాళ్ళను చంపకండి" అన్నాడు సూర్యం.
గౌరీ భోజనాలకు పిలవటం తో అప్పటికి సంభాషణలు ఆగిపోయాయి.
* * *
విధిలేక పనిలోకి వెళ్తున్నట్టు గోవిందరావు అగుపించాడు. మనిషి యెప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లు వుండగానే సూర్యం ఒకసారి "ఉద్యోగం నచ్చలేదా?" అని ప్రశ్నించాడు. "ఇంకా చెయ్య మంటారా?" అని యెదురు ప్రశ్న వేసాడు. "మీ యిష్టం!' అని సూర్యం అక్కడ నించి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాడు చాల రాత్రి వరకు రాలేదు. అతను వచ్చాక "మీకు కోపం వచ్చింట్లుంది. సహజమే. కూర్చుండబెట్టి నన్ను నా కుటుంబాన్నెంత కాలం పోషిస్తారు?"
"మీరెందు కలా ఆలోచించాలి?"
"ఈ లోకం వేపు చూస్తె రాను రాను అసహ్యమవుతుంది!"
'అంటే మీలో యెదుటి వారి తప్పులను మన్నించ గలిగే ప్రేమ లేదు!"
"బావుంది. ఖూనీ చేసే వాడిని ప్రేమించమంటున్నారు!"
"తప్పు చెయ్యకుండా ఎవ్వడూ బ్రతకలేడు. ఒకడు తప్పు చేసాడని వాడిని అసహ్యించుకునే అలవాటు పడితే రేపొద్దున్న తనే ఖర్మం కాలి తప్పు చేసే తనపై తనకే అసహ్యం కలుగుతుంది. ఎప్పుడైతే తన్ను తాను అసహ్యించు కున్నాడో చాలా చెడ్డ పరిణామాలకు దారి తీసే అవకాశం వుంది."
"ఒకడిని అసహ్యించుకోనిది వాడిని మరమత్తు చెయ్యలేం. ప్రేమిస్తే వాడి తృప్తి మీద రాజుకున్న అభిమానంతో ఆ తప్పు లను క్షమిస్తాం. క్షమాపణ రుచి చూసిన వాడు మరింత తీపెక్కి అంతకంటె చెడ్డ పనులు చేస్తాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు మీ పెద్దలే!"
'అది దేవుని బాధ్యత."
"కనపడని దేవుని పేరు చెప్పి పాపాల నన్నిటినీ యీ లోకంలో పెరగ నిస్తున్నాం. దేముడైనా మనిషి అవతారా లెత్తే పాపాలను కడిగాడా? యీ పాపాలను కడిగే మనిషేదేవుడంతటి వాడవుతాడు."
"ఏం చెయ్యడాని కైనా మనిషి ముందు బ్రతకాలి. బ్రతకాలంటే కడుపు నింపే అధరువుండాలి. అప్పుడే మనిషికి ఒక హోదా వస్తుంది. హోదాతో శక్తి వస్తుంది. శక్తి లేకుండా మీరే పాపాలు కడగలేరు. ఆ శక్తి కోసం ముందుప్రాకు లాడండి."
"నా మనసే నా శక్తి. దానిని తృప్తి పరచినన్నాళ్ళూ నన్ను నిటారుగా తిండి లేక పోయినా నిల్చోనిస్తుంది."
"తిండి లేకపోతె నీరసం మనిషికే కాదు, మనసుకు కూడా వస్తుంది. మీరు తృప్తి పరుస్తున్నా మన్నది మనసు కాదు. మనసు తృప్తి యెన్నడూ యెరగడు. ఎప్పుడైతే తృప్తి ఎదిగిందో మీరు పాపాలు కడగలేరు కదా, యింకే వున్నతినీ సాధించ లేరు. తృప్తి, యెరగక పోవటం వలెనే ఎన్నెన్నో ఘన కార్యాలు, మనిషి చేయగలుగుతున్నాడు. తృప్తి మనసును మట్టి ముద్దలా ఒక చోటనే వుంచుతుంది. మీరు తృప్తి పరుస్తోంది ఆత్మను. మనసుకు ఆత్మకు వంతెన వేస్తె గానీ మీరనుకున్న తృప్తి రాదు. ఆ తృప్తి వెలుగుతో సమానం. అసహ్యంతో ఆ వెలుగు రాజుకోదు. ప్రేమతో రాజుకుంటుంది. ప్రేమించిన వాడు యెదుటి వానిని చంపలేడు , అసహ్యించుకున్నవాడే చంపగలడు. ఒకరు కష్టపడి సృష్టించినది ధ్వంసం చెయ్యగలడు ధ్వంసం చేసే మనస్తత్వం కలవాడు యెప్పుడూ సృష్హించలేడు. ప్రళయ రుద్రుడు సృష్టి కర్త బ్రహ్మ పని చెయ్యలేడు. మిమ్మల్ని మీరు ప్రేమించటం వలెనే బ్రతక గలుగుతున్నారు. మీరు తప్పు చేస్తే యెలా సమర్ధించుకుంటారో యెదుటివాడ్ని మీరు ప్రేమిస్తే అలానే సమర్ధిస్తారు. మీ తప్పును ఒప్పుకునే ధైర్య సాహసాలు మీకు వుంటే మీరెలా పశ్చాత్తాప పడ్తారో యెదుటి వాళ్ళ తప్పులను ఒప్పుకునే ధైర్య సాహసాలను సృస్తించడానికి ప్రయత్నించండి. వాళ్ళను ధ్వంసం చెయ్యకండి." ఇంత పెద్ద సమాధానానికి గోవిందరావు క్లుప్తంగా----
"గోముఖ వ్యాఘ్రాలను బ్రతక నియ్యి,మంటారు."
"అవును. ఈ లోకంలో గోవుల అవసరం, వ్యాఘ్రాల అవసరం -- రెండూ వుంది. పులిని ఆవు చెయ్యలేరు. అవును పులి చెయ్యలేరు. అది ప్రకృతి విరుద్దం."
"పులి గ్రామాల మీద పడి మనుషులను చంపుతుంటే చూస్తూ వూరుకోమంటారు? మీ ఫిలాసఫీ నాకేం నచ్చలేదు. తప్పు చేసినవాడు శిక్ష అనుభవించవలసిందే!"
"శిక్షించే అధికారం మీకు యీయలేదు."
"తోడి మనిషిగా నాకా అధికారం వుంది. అధవా ఆ అధికారికి యెరుక పర్చే కనీస బాధ్యత నాకుంది. మా నాన్న యెవరి కర్మకు వాడు పోతాడనే వాడు. నేను అలా అనే తెలివి తక్కువవాడ్ని కాదు. వాడు సంఘంలో బ్రతుకుతూ అన్యాయం యెందుకు చెయ్యాలి? ఒకడి అన్యాయంతో బాధపడుతూ సహించే అవసరం సంఘానికి కెందు కుండాలి? వాడు సంఘ జీవిగా ప్రవర్తించే బాధ్యత , సవ్యంగా నడిచే వారిలో వుంది. రోజు రోజుకూ కాలే కడుపుల సంఖ్య వేలాదిగా పెరుగుతున్నప్పుడు అన్యాయంతో పెద్ద నోర్లు విప్పే వాళ్ళకు చోటు లేదు. అలాంటి వాళ్ళ నోట్లో గడ్డే కుక్కుతాం!"
సూర్యం యిక వాదించలేకపోయాడు. అప్పటికే చాలా రాత్రయింది. ఆ రాత్రి సూర్యం సరిగ్గా నిద్ర పోలేదు. గోవిందరావు అన్నదాంట్లో ఏదో సత్యం వున్నట్లు, ఆ సత్యాన్ని తను ఒప్పుకోకుండా ఆత్మ వంచన చేసుకుంటున్నానన్న అనుమానం తనను వేధించుకు తింటోంది. అతను పాత క్రొత్తల కలయిక. గోవిందరావు వర్షాలకు క్రొత్త నీటితో పరుగులెడుతున్న సెలయేరు లాంటి వాడు. సూర్యం కాలవ ద్వారా కొంత క్రొత్త నీటిని కలుపుకున్న చెరువు లాంటి వాడు. తనలో నాచుతో పాటు కలువ పువ్వులున్నాయ్. అనాచు ను తను విసర్జించలేడు తరతరాల బట్టి పెరిగిన నాచు అది. ఆ నాచు వుండబట్టే చెరువులో నీరు కదలక పోయినా శుభ్రంగా వుంది. పదుగురూ త్రాగటానికి పనికి వస్తుంది. అతను పాతను విసర్జించ లేడు గోవిందరావు లో పాత అన్నది లేదు. మేఘాల నించి రాలిన కొత్త నీరది. కొండలో, దాగున్న చెత్త చెదారాన్ని త్రోసుకుని వస్తోంది. సెలయేరు యెంత దూరమో పోలేదు. కొంతదూరం పరవళ్ళు తోక్కాక మెల్లగా పారే నిర్మల గంగా ప్రవాహం లో చేరి సముద్రం లో కలిసి పోతుంది. అనుకోకుండా అంతం ఎదురవుతుంది. చెరువు అలసి పోదు. అది నిశ్చలంగా వుంటుంది.
