Previous Page Next Page 
నాలుగు మంచాలు పేజి 10


    సూర్యం కు గోవిందరావుకు  అదే బేధం. పనిలో చేరి నేలరోజులు దాటినా గోవిందరావు జీతం భార్య చేతనైనా యీయ లేదు. డబ్బు యిబ్బంది చాలా హెచ్చుగా వుంది. సూర్యం అడగలేక తికమక పడ్తుంటే గౌరీ పోల్చుకుని అడిగింది.
    "ఏం? మీ అన్నయ్య అడగమన్నాడా?"
    "నేన్ అడుగుతున్నాను."
    "ఎలాంటి వాడి దగ్గర వుద్యోగం లో వేసాడు. ఉత్తి పేచీకోరు, పిసినారి నెంబరు వన్. రేపూ యెల్లుండి అంటున్నాడు. కోపం యెలా కాసుకుంటూన్నానో నాకే తెలీదు."
    "మీకు పుణ్యం వుంటుంది. అన్ని పౌరుషాలు కాల్చుకొని మీ చేత నాలుగు రాళ్ళు రానీయండి. ఇప్పటికే అన్నయ్య అప్పులతో వేగిపోతున్నాడు."
    "పెద్ద పరుగుల కెందుకు పోవాలి? అప్పు లెందుకు చెయ్యాలి? అతని కంటే సగం తెచ్చుకున్నవాడు పదిమంది పిల్లలతో బతకలేదూ? ఉండు అడుగుతాను!"
    "మీకు పుణ్యం వుంటుంది. మీరడిగితే నన్ను చంపుకు తిన్నట్టు. వాడి చెయ్యి పెద్దది -- మనసు కనికరమైనది!"
    'అక్కడికి నా మనసులో కనికరం లేనట్టు!"
    "అలా అన్నానండీ!"
    "మరి నీ వుద్దేశమేంటి? మీ అన్నయ్య గురించి నా అభిప్రాయం చెప్పమంటావా?"
    కోపంతో ముఖం త్రిప్పి మౌనంగా వున్న భార్య వేపు తొంగి చూసి "మీ అన్నయ్య నీలాగే చీరే కట్టుకుని వుండవలసింది. మగవాడికి వుండవలసిన పోరుషం లేదు-- మీసాలు అసలే లేవులే -- వెన్నముక లేదు-- మనకో" అంటూ వున్న మీసాలు మెలివేసాడు. గౌరీ అక్కడ నించి పెరట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు యిరవై అప్పుడు పది చొప్పున జీతం యిచ్చినట్లు తెచ్చి భార్య చేత పెట్టాడు గోవిందరావు. అల్లుడి ఆర్జన అని చెప్పకుండా అందులోనిది కొంత సూర్యం తండ్రికి పంపించాడు.

                                         5
    ఈ మధ్య అప్పుడప్పుడూ యింట్లోనే వుంటున్నాడు . భార్య పన్లోకి వెళ్లమంటే శలవు పెట్టానంటాడు. గౌరికి అనుమానం వేసింది.
    "ఏం పేచీ తెచ్చుకున్నారు?'
    'నేను పేచీ కోరునని ముద్ర వేసుకున్నాను.'
    గౌరీ పెద్ద నిట్టూర్చింది.
    "నేనంటే విసిగి పోయావు కదూ? నన్నెందుకు పెళ్ళాడావ్ ? యోధుని భార్య సుఖం గూర్చి తాపత్రయ పడదు. నువ్వు ఎప్పుడూ సుఖం గురించే తాపత్రయ పడతావ్. మన యిద్దరికీ నప్పలేదు.'
    గౌరీ కళ్ళల్లో నీరు తిరిగి పోయాయ్. చీర కొంగుతో కళ్ళు వత్తుకుంటూ.
    "మీ నోట అనరాని మాటలు అంటున్నారు. నేనేం తప్పు చేశాను చెప్పండి? నేను మీకు తగని భార్యనని తోస్తే నన్నెందుకింకా యిలా బ్రతకనిస్తారు? మీకు లేని సుఖం నాకెందుకు? పదండీ-- మీరే అడవులకు రమ్మన్నా వస్తాను. మీరు ముందు-- తరవాత సుఖం .'
    గోవిందరావు నవ్వుతూ "హాస్యానికి అన్నాను. గౌరీ . నీ సంగతి నాకు తెలీదా?
    "అవునండీ -- హాస్యంతో అనవలసిన మాటలా యివీ? కన్నవారిటింకొచ్చి అసలే చులకనై పోయాను. మీరే చులకన చేస్తే యింకేవరు చెయ్యరు? పదండి. ఎక్కడో ఒక పాక చూడండి. మీ కష్టంతో బ్రతుకుతాను.'
    'మళ్ళీ వుద్యోగం దొరికే వరకూ యిక్కడే వుండాలి?'
    "ఏం? యీ వుద్యోగం పోయిందా?'
    "ఇంకా లేదులే -- త్వరలో పోతుంది'
    'ఏమైందండీ?'
    'ముసలాడు కష్టపడి వ్యాపారం చేసాడు. వాడిలో కొద్దిగా న్యాయం వుంది. వాడు పిసినారనుకో. అలా పిసినారిగా సంవత్సరాల తరబడి ఆస్థి కూడబెట్టాడు. ఈ కొడుకులు వెధవలు తలెత్తి వాడు యాభై సంవత్సరాలలో గడించింది ఒక్క యేటితో గడించాలని ఏం చేస్తున్నారో తెలుసా?'
    "ఏం చేస్తున్నారు?'
    'నా చేతే దొంగ రాతలు రాయిస్తున్నారు . సోడా బుడ్డి లలో దొంగ సారా నింపి సోడా బుడ్లు గా అమ్ముతున్నారు. ఈ వెధవలు సంఘం లో లీడర్స్ గా చెలామణి అయిపోతున్నారు. ఒక  నత్తి వెధవ మ్యునిసిపల్ కౌన్సిలర్. ఇంకో వెధవ చాలా పెంకి వెధవ -- రౌడీ వెధవ -- వాడు యూత్ ఫ్రంట్ లీడర్.
    'వాళ్లతో తగువు తెచ్చుకోలేదు కదా?'
    "భయపడక నన్నెవరూ ఏం చెయ్యలేరు.'
    'రౌడీ వెధవ అంటున్నారు. నాకు భయం వేస్తోంది.'
    'వాడి కంటే మనం రౌడీ వాళ్ళం.'
    'తొందరపడి ఏం చెయ్యకండి. మీకు పుణ్యం వుంటుంది.'
    గౌరీ మనసెందుకో ఆందోళన పడసాగింది. ఇలాంటి ఆందోళన యిదివరకు లేదు. అన్నయ్యతో చెప్దామనుకుంది. చెప్పి అతని మానసు మరింత పాడు చెయ్యడ మెందుకని వూరుకింది గానీ మనస్సేందుకో సంక్షోభపడుతోంది. నెలాఖరు వారం. ఇంట్లో చాలా యిబ్బంది గా వుంది. అప్పటికే రెండు సార్లు యెవరి దగ్గర అప్పు తెచ్చాడో రెండు పదులు తెచ్చింది ఖర్చు అయిపోయాయి. గోవిందరావు రెండు రోజులు పనికి వెళ్ళలేదు. సూర్యం బావ పనికి  వెళ్లలేదని ఆ వేళనే అతనికి వినిపించేటట్లు కొద్దిగా విసుక్కున్నాడు. ఆ విసుగు  యింట్లో డబ్బు లేదని తెలిసాక వచ్చింది. అది పోరాపాటున వచ్చింది. ఆ విసుగు బాటు విన్నాక కాఫీ త్రాగకుండానే గోవిందరావు వెళ్ళిపోయాడు. రాత్రి పది గంటలకు గానీ రాలేదు. గౌరీ తో పాటు సూర్యం కూడా ఆతృతగా చూసారు. గోవిందరావు తాగిన వాడిలా జోగుకుంటూ వచ్చాడు. చీకట్లో అతని ముఖ భంగిమలు యెవరూ చూడలేదు. వచ్చి అరుగు మీద వాలు కుర్చీలో కూలబడ్డాడు.

 

                           
    "భోజనానికి లేవండి."
    "ఆకలి లేదు.'
    'మీకోసం చూస్తూ అన్నయ్య కూడా తినలేదండీ.'
    'చెప్పానా? ఆకలి లేదని' కాస్త గసిరాడు.
    గౌరీ దగ్గరగా వచ్చింది. ఒంటి మీద చేయ్యివేస్తే ఒళ్ళంతా వెచ్చగా వచ్చింది.
    'జ్వరం వచ్చిందన్నయ్యా' అంది . సూర్యం గతుక్కు మన్నాడు. ఎన్నడూ ఒక జబ్బు ఎరగని యితనికి జ్వరం యెందుకొచ్చింది?
    'మందు తేనాండీ?'
    'అఖ్కార్లేదు. లంఖణం తో పోతుంది' మీరు భోజనం చెయ్యండి.'
    సూర్యం నాలుగు మెతుకులు నమిలి లేచి పోయాడు. గోవిందరావు రాత్రంతా జ్వరంతో మూలుగుతున్నాడు, మధ్యను కడుపులో నొప్పితో బాధపడుతున్నాడు. ఆ రాత్రంతా సూర్యం కు మగత నిద్దరే. ఎన్నేన్నో ఆలోచనలు వస్తున్నాయ్. జీవితం మీద విసుగు పుట్తోంది . యెంత సర్దుబాటు చేసుకుని బ్రతుకుదామన్న యేవో చికాకులు, బాధలు వెంట తరుముకుని వస్తూనే ఉన్నాయ్. ఈ వెంట తరుముకు వచ్చే బాధల పై బాణాలు ప్రయోగించడానికి ఆ డబ్బు బాణాలు తన దగ్గర లేవు. డబ్బు విలువ తనకు బాగా తెలిసింది. ఈ రాత్రే. ఇంక యే మిత్రుని అడిగే పరిస్థితిలో లేడు. తన ఖర్చుకు తనే ఏవగించుకున్నాడు. ఈ నెల సినిమాకు తనెందుకు వెళ్ళాలి? రాత్రి నిద్దర పోయే ముందు యీ కప్పు పాలు తనెందుకు త్రాగాలి? రెండు కూరలు బదులు ఆవకాయ ముక్కతో యెందుకు తినలేక పోవాలి? ఆఫీసులో పది గంటలకు టీ మానేస్తే కొంత మిగిలేదే? ఐనా తన స్వంతం కోసం ఏం ఖర్చు పెట్టెస్తున్నాడు, తన తోటి వారితో పోల్చి చూస్తె తన ఖర్చు చాలా తక్కువ. ఎవడో యాచిస్తే కాదనలేడు. ప్రతి ఆదివారం పాతిక మంది బిక్షకులికి బియ్యం  యెందుకు వెయ్యమనాలి? ఏదో కీర్తి కోసం ప్రాకులాడి బ్రతుకుతున్నా ననిపించింది. ఎదుటి వాని నొప్పింపక తాను నొచ్చుకోక ధన్యుడనవ్వాలనే తాపత్రయమే తన్నిలా తన తండ్రి లా నత్త గుళ్ళ ను చేస్తున్నదేమోనన్న అనుమానం కలగసాగింది. తనను తనే అసహ్యించు కుని గోవిందరావంటే అభిమానంతో చూడసాగాడు. ఎందుకో గోవిందరావు లో నిజాయితీ తనకు నచ్చింది. గోవింద రావుకు డబ్బు లేదు, హోదా లేదు, నలుగురి లో గౌరవం లేదు, పలుకుబడి అంతకంటే లేదు. అతను యీ సంఘం లో సాధారణ వ్యక్తీ. ఐనా తన వ్యక్తిత్వాన్నే ఒక బాణం గా చేసుకుని చెడును శిక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు. నిరాధారంగా ఆధారంతో మన్నవాళ్ళ ను కదుపుతున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS