సూర్యం తండ్రి , గౌరిని తోడ్చుకొని వచ్చాడు. గౌరీ చిక్కిపోయింది. 'ఏవమ్మా వచ్చావా?' అంటే జవాబు చెప్పకుండా తల దించుకొని యింట్లోనికి వెళ్ళిపోయింది. ఈ రెండేళ్ళ లో గౌరీ యెంతగా మారిపోయింది? సగర్వంగా వారం రోజులుండి అన్నయ్య ముక్కు పిండి కోరిన చీరలు తీసుక పోవలసిన గౌరీ ఇలాంటి పరిస్థితులలో తన యింట్లో కాలు పెట్టినందుకు సూర్యం కు యెక్కడ లేని ఆవేదన కలిగింది. దానికి తోడు తండ్రి కూతురును వినిపిస్తోందనైనా ఆలోచించకుండా అల్లుని పెడసరం గూర్చి యెన్నెన్నో సంఘటనలు భారతం లా అల్లుకుపోతూ చెప్పుకు పోతున్నాడు. తను తప్పించు కోవాలన్నా వీలుపడనీయకుండా 'విని తీరాలన్నట్లు' పట్టు పట్టి చెప్తున్నాడు. ఈ సంఘటనతో గౌరీ మరింత పలచబడిపోయింది. అమ్మా, నాన్న తిరిగి వెళ్ళిపోయాక సూర్యం ఆ రాత్రి భోజనం దగ్గర మెల్లగా అన్నాడు.
'నాన్న సంగతి నీకు తెలీదా? తను మంచి తోవ అనుకున్నదంట్లో నడిచే వాళ్ళనే గౌరవిస్తాడు. లోకంతో తను జగడమాడడు. తనతో ఒకరు జగడమాడితే సహించలేడు. ఈ లోకం లో నత్త గుల్లలూ ఉంటాయ్, పెద్ద పులులూ వున్నాయ్. అతను చెప్పినదంతా విని బావను వదిలేస్తాననుకున్నావా? అయన కోసం వుద్యోగం ప్రయత్నిస్తున్నాను. అతను నా దగ్గర వుంటే నాకూ సహాయంగా వుంటుంది.'
గౌరీ లో యీ మాటలు వుత్సాహాన్ని కలిగించాయ్. నిరాశతో నిండిన మనసులో ఆశ మెల్ల మెల్లగా అల్లుకోసాగింది. ఆ మరుసటి రోజునే ఆమెలో మార్పును గమనించాడు.
4
ఇంట్లో యెక్కడ వుండవలసినవి అక్కడ వుంటున్నాయ్. ద్వారాలకు అల్లిక గుడ్డలు కట్టింది. అవి చూడటానికి కామోసు విశాల యింట్లో అడుగు పెట్టింది. ఒకరి నొకరు పరిచయం చేసుకున్నారు. ఏం వరసలు పెట్టుకుందామని ఆలోచిస్తూనే పేర్లు పెట్టె పిల్చుకోసాగారు.
"గౌరీ కి యెన్ని రకాల అల్లికలు తెలిస్తాయ్ పల్లెటూర్లో వుండి యివన్నీ యెలా నేర్చుకున్నావమ్మా! నీకు తీరిగ్గా వున్నప్పుడు మా విశాల కు కాస్త నెర్పుదూ" అని మామ్మ కోరింది. అందువల్ల విశాల ముఖం అప్పుడప్పుడూ సూర్యం ఇంట్లో ప్రత్యక్ష మయ్యేది. సూర్యాన్ని చూడగానే ఖంగారు గా లేచి వెళ్ళిపోయేది.
'అంత కంగారు దేనికే విశాలా? మా అన్నయ్య అంత గడుసువాడు కాడే?'
జవాబుగా "ఫో గౌరీ" అన్నట్లు చూసి వెళ్ళిపోయేది. ఒకసారి తెల్లని తలగడ గలేబు మీద రంగు దారాలతో లత అల్లి ఆ క్రింద "గుడ్ లక్" అని యింగ్లీషు అక్షరాలూ కుట్తోంది. అంతలో వచ్చిన సూర్యాన్ని చూసి లేచి పోతుంటే "కూర్చుందూ! మా అన్నయ్య యిటు రాడులే" గాని గౌరీ బలవంతాన కూర్చో బెట్టింది. సూర్యం ఒకసారి తొంగి చూసి "ఎవరికి గుడ్ లక్?" అన్నాడు.
"ఎవరి కోసం యివన్నీ కుట్తోందో వాళ్ళకే అన్నయ్యా. విశాల యెప్పటి నుంచే సంసారం కోసం అంతా పోగు చేసుకుంటోంది."
"తెలివైన పిల్లలు ముందు గురించి ఆలోచిస్తారు."
విశాల సిగ్గుతో తలదించేసుకుంది. ఆ ప్రక్కనే వున్న పుస్తకం వేపోకసారి చూసి "నవలలు చదువుతోందా?"
"శలవులుగా యిప్పుడు. యీ పిచ్చి బాగా పట్టుకుంది. "గౌరీ అందుకోగానే "చదవ వలసినదేదో నిర్ధారించుకొని చదవటం మంచిది. అడ్డమైనా చెత్తా చదవటం వలన మనసులో చివరికి హత్తుకునేదేదీ వుండదు."
"ఆ మంచిది యెలా వస్తుంది గౌరీ?" అంది విశాల.
"అడిగితె వస్తుంది!" అన్నాడు సూర్యం. "యేవో మంచి పుస్తకాలు తెచ్చి పెట్టన్నయ్యా ఇద్దరం చదువు కుంటాం!"
"అలానే---తెస్తానులే."
సూర్యం తనకు నచ్చిన పుస్తకాలు తెచ్చి యిచ్చేవాడు. మొదట్లో నచ్చక పోయినా రాను రాను ఒక్కొక్కటి నచ్చేవి. ఆ వూహల్లో పడి వాటిలో పాత్రలనే అప్పుడప్పుడూ తలచు కొనేవారు. ఒకోసారి గౌరీ, విశాల యిద్దరూ చర్చించుకోవటం కూడా కద్దు. అలా వుండే బదులు యిలా యీ చివర్న వుంటే బావుండేది. ఒకసారి అన్నయ్యతో కూడా, ఒక నవల గురించి అంటే,
"మనం అనుకున్నట్లు ఏదీ జరగదు. జరిగితే మనిషి దేవుడై పోతాడు. ఇంకోలా జరగటం మూలానే జీవించగలుగుతున్నాం." అన్నాడు.
గౌరీ పెళ్లి కాకముందు యెన్నో కలలు కన్నది, యెన్నెన్నో విధాల సుఖ పడ్తాననుకుంది. తీరా పెళ్లి అయ్యాక జరిగిన దేమిటి? ఇంకోలా జరగటం మూలాన జీవించ గలుగుతున్నానంటే నమ్మటమెలా. "ఏవిటో నీ మాటలు నా కర్ధం కాలేదు అన్నయ్యా!"
"నీ సంగతే తీసుకో. లోకం బావను అసహ్యించు కోవటం తో నీలోనూ అతని పై కొద్దిగా నైనా చిరాకు కలిగి వుంటుందా లేదా?"
గౌరీ అవునన్నట్లు మౌనం దాల్చింది.
"నువ్వు యింకా గాడంగా ఆలోచించు . అతను న్యాయంగా బతకాలను కుంటున్నాడని నీకు తోచగానే అతని పై యెంత అభిమానం ముంచు కొస్తుంది. ఆ అభిమానం మనం అనుకోవటం కంటే యింకోలా జరగటం మూలాన వచ్చింది. ఆ అభిమానం కలకాలం వుంటుంది. మనం అనుకున్నట్లు హాయిగా బ్రతకటానికి అతను అన్యాయానికి తల ఒగ్గితే మనిషిగా నువ్వతనిని గౌరవించలేవు."

తన భర్త వున్నతిని యీ లోకంలో గుర్తించిన వాడొకడున్నాడన్న తృప్తి గౌరీ లో చొచ్చుకుంది. "ఉన్నతమైన బ్రతుకు, ప్రక్రియ, కళ , యే గొప్పది డబ్బుతో విలువ కట్టలేం. సత్యం ధర్మంతోకొలుస్తాం."
అన్నయ్య యింత తమాషాగా మాట్లాడటం యెప్పుడు నేర్చుకున్నాడా అని గౌరీ విస్తుపోయింది. కన్నవారింట్లోనూ, భర్త దగ్గర పొందలేని మనశ్శాంతి యిక్కడ ఆమెకు కలగసాగింది. ఆ శాంతి ముందుకు జీవితం ఒక మర్గాన పడుతుందన్న ఆశ వలన వచ్చింది.గాయపడ్డ మనసును యిక్కడ సూదులతో యెవరూ పొడవలేదు. అప్యాయంతో మంచి మాటలతో గాయాలను మాన్పు తున్నారు. విశాల రానురాను తనకు దగ్గర వుతోంది. ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది చెల్లెల్ని సంతోష పరచాలని డబ్బు కూడా ఖర్చు పెట్తున్నాడు'. ఆమె వచ్చేటప్పుడు రెండే రెండు చీరలతో వచ్చింది. అందులో ఒక చీర అక్కడక్కడ చిరిగి వుంది. అప్పుచేసి, ఆమెకు నాలుగు చీరలు కొన్నాడు. చేతి పిల్లకు డబ్బా పాలు అలవాటు చేసాడు. సరియైన ఆహారంతో యిద్దరూ తేరుకున్నారు.
ఇలాంటి పరిస్థితిలో గోవిందరావు దిగబడ్డాడు. ముందుగా తెలియ పర్చకుండా వచ్చిన బావను ఆశ్చర్యపడి పలుకరించాడు. అతను అప్పటికే దెబ్బలు తిని వున్నాడు. అ గాయాలను మళ్లీ చీల్చకుండా కప్పలనే తాపత్రయంతో యెన్నో మంచి కబుర్లు చెప్పాడు. ఉద్యోగం కోసం ప్రయత్నం హెచ్చుగా ప్రారంభించాడు. తనకు వచ్చే జీతం యింత మంది తినడానికి, తండ్రికి మిగిల్చి నెలానెలా పంపించడానికి సరిపోవటం లేదు. ఇక్కడా అక్కడా చేతి అప్పులు చెయ్యవలసి వచ్చేది. ఉద్యోగం లేకుండా కూర్చున్న గోవిందరావు తోలి ప్రశ్న "ఆ యింటిగలవిడ యీ లోగిలి యెప్పుడు కొన్నది? యెలా కొన్నది? ఆరుగురు ఆడపిల్లలలో నలుగురికి అంతంత కట్నం యిచ్చి యెలా పెళ్ళి చెయ్య గలిగింది?"
'అతను పోలీసు డిపార్టుమెంటులో ఉండేవాడట."
"పదుగుర్ని దోచి కట్టించిన యింట్లో వున్నారు. ఎప్పుడో గాలి వాన వస్తే, గోడలు కూలి పోతాయండి బావగారు!'
"అందాక యిక్కడే వుండాలి. ఈ యిల్లు నేను ఖాళీ చేస్తే పదిహేను నుంచీ పాతిక రూపాయలకు అద్దె పెరుగుతుంది!"
మరి నాలుగు రోజులు పోయాక అన్నాడు "ముష్టి వాళ్ళు వస్తే కర్ర పట్టుకొని మరీ వెంట తరుముతోంది . అలాంటిది పట్టు బట్టలు కట్టుకుని శివాలయాని కెందుకు వెళ్లాలి?"
ఈ మాటలు యింటి గలావిడ చెవిలో పడిపోయాయి. ముఖం బీకరంగా పొంగించి బంతు ల్లాంటి బుగ్గల నించి యేవేవో గోనుక్కుంది. ఆ గొణుగు సూర్యంతో పాటు గౌరీ కూడా విన్నారు.
"గౌరీ, గౌరీ . యీ యింటావిడ గుట్టు అంతా లాగేసాను. రూపాయికి బేడ వడ్డీ లట-- లోగుల్లె కాదు, మూడు అంతస్తులు మేడలు కట్టించేదూ?"
"ఎవరి బిడ్డవు నువ్వు. మీ అన్నయ్య ఆ కుటుంబం లో తప్పు పుట్టాడు."
"అతని మర్యాద కాపాడండి. మీకు పుణ్యం వుంటుంది."
ఆ వేళ రాత్రి సూర్యం సంతోషంగా యింట్లో కాలు పెట్టేసరికి యింటి యజమాని కబురు పెట్టాడు.
"చూడండి సూర్యం గారూ-- ఇన్నాల్లై మా యింట్లో వున్నారు. మా యింటి పిల్లాడి లా మర్యాదగా మెసలారు. యెదిగిన పిల్లలున్న కొంప మాది. అందులో ఎదురెదురిల్లు. అదీ కాకుండా మా పెద్ద అల్లుడికి యీ వూరు బదిలీ అయ్యేటట్లు వుంది. వాడికి యిల్లు అవసరం కావచ్చు. ఇప్పటి నుంచే మీకు చెప్పితే మంచిదని చెప్తున్నాను! అంతే మరేం కాదు."
"మా యెవరి వల్లైనా మీకు యిబ్బంది కలిగిందా?"
"అబ్బే లేదు....మా అవసరం.... అంతే."
పోలీసు డిప్లమాసి ఉపయోగించాడు యింటి పెద్ద. ఇంట్లోకి రాగానే గోవిందరావు అడిగాడు.
"నా మీద చాడీలు చెప్పాడా?"
"లేదు!"
"అయితే యింత తొందరగా యెందుకు పిల్చాడు?"
"వాళ్లకి యిల్లు అవసరం వుందట. ఖాళీ చెయ్యమని నోటీసిచ్చాడు."
"మంచిది. ఒక పాక మ్యునిసీ పాలిటీ జాగాలో పన్ను కట్టి కట్టుకుందాం బావ గారు. హాయిగా వుంటుంది."
"అలాగే కానీ-- మీకు ఉద్యోగానికి యింటర్వ్యూ వచ్చింది. ఒక ఖాళీ కి పది మంది వస్తున్నారట. మీ తెలివి తేటలు చూపించాలి మరి!"
"అలాగే" అంటూ గోవిందరావు ధైర్యంగా చెప్పాడు. గోవిందరావు యింటర్వ్యూ నుంచి తిరిగి వచ్చాక యేమైంది అని అడిగాడు సూర్యం.
"ఇన్నాళ్ళూ ఎక్కడా వుద్యోగం చెయ్యలేదా అని అడిగితె, చేశానని చెప్పాను. ఎందుకు మానేసారంటే జరిగినతంతా చెప్పాను."
'ఆ గొడవంతా యెందుకు చెప్పారండి."
"అబద్దం ఆడి వుద్యోగం సంపాదించ మని మీరూ చెప్తున్నారా?"
సూర్యం జవాబు చెప్పలేదు. రెండు నెలలో మరి రెండు యింటర్వ్యూ లకు వెళ్ళాడు. తిరిగి వచ్చాడు. గౌరీ గింజుకునేది. ఇంట్లో వూరకనే కూర్చోబెట్టి తిండి పెట్టటం సామాన్యమా? దానికి తోడు అతని సిగరెట్ల ఖర్చు, బట్టలు, అన్నయ్య పెట్తున్నాడు. ఎలాగో ఒకలా వుద్యోగం లో చేరమనేది. ఈ వుద్యోగం విషయమై యిద్దరికీ పేచీ వచ్చింది.
"ఒక్క అబద్దం ఆడని సత్యవ్రతులా? అన్నయ్య -- ఒక్కడు యెంతని వేగుతాడు?'
'నా మనస్సుకు తృప్తి లేని వుద్యోగం నేను చెయ్యను!"
"అవును యెందుకు చేస్తారూ? వూరంతా తిరిగి వచ్చేసరికి వండి పెట్తున్నాను !"
"వారం రోజులు ఆకలితో వుండమంటే తృప్తిగా వుంటాను గానీ, అబద్దం అడి వుద్యోగంలో చేరను."
"మీ నుంచి విచారంతో మా అన్నయ్య మళ్ళీ చిక్కిపోయాడు. మీ తృప్తి మాట దేముడేరుగు? పాప ముఖం చూసైనా యెలాగో వుద్యోగం లో చేరండి. నన్ను తలెత్తుక వుండనియ్యండి." అంటూ గౌరీ బ్రతిమాలింది. బ్రతిమాలటం ప్రయోజనం లేకపోవటం వలన శాశించినట్లు మాట్లాడింది. నిష్టూరాలాడింది. అప్పటికీ యెక్కడా వుద్యోగం లో చేరలేదు. చేరదామన్న ఏదీ దొరకలేదు. 'అలాంటి మంచి వుద్యోగాలు మా అన్నయ్య చూపిస్తే కాలదన్నారు. ఇప్పుడెం దారి!"
"మీ నాన్నలా నువ్వూ నన్ను చంపుకు తింటున్నావా?" అన్నాడో సారి. దానితో గౌరీ కన్నీరు తెచ్చుకుంది. "నా కుండవలసిన గర్వం నాకు వద్దండి. నలుగురూ వేలెత్తి మన వైపు యెందుకు చూపించాలి? బాధ్యత యెలాగో ఒకలాగ బతకనిస్తుంది."
'అక్కడికి నీకే బాధ్యత వున్నట్లు నాకు లేనట్లు. మీ అన్నయ్య యింటి కి వచ్చాక మాటలు నేర్చావు. ఇది మంచిక్కాదు చెడ్దకే. తరువాత విచారిస్తావ్!"
గౌరీ కాస్సేపు అశాంతి తో పెనుగు లాడి కన్నీరు తుడుచుకుంది. అతని గొంతుక విన్న పొరుగు మామ్మ పెరటి నించి వచ్చి కన్నీరు కారుస్తున్న గౌరీ వైపు చూసి కలగ జేసుకుని
"ఏం నాయనా? ఈ అమాయకురాలిని యెందుకలా ఎడిపిస్తావ్?"
"నన్నేడవమంటారా మామ్మగారూ? ఏడవటానికి నేనేం తప్పు చెయ్యలేదు. నిజం చెప్పినందుకు నేనూ నా కుటుంబం తిండి లేక బాధపడొచ్చు -- కానీ నా కున్న మనస్సులో తృప్తి యింకేవరి కుంటుంది?"
