"మీరు చాలా మంచివారిలా ఉన్నారు. ఈ యింటికి వచ్చేవారి చర్యలలో రాక్షసత్వము నిండి ఉంటుంది. ఒకోసారి చచ్చిపోతామని అనిపిస్తుంది." ఆమె యెడ అతని హృదయము దయతో నిండిపొయినది. తన హృదయము పై వాల్చిన తలపై తన గడ్డము ఆన్చి ఆమె చుట్టూ చేతులు చుట్టాడు.
"ఈ వెలుతురులో మిమ్మల్ని సరిగ్గా చూడలేక పోతున్నాను. లైటు వెయ్యనా?"
"వద్దు, వద్దు చీకటిని చూడాలంటే సంతోషము. వెల్తురును చూచే ధైర్యము లేదు." ఆమె అతన్ని సోఫాలోకి మృదువుగా తోసి, అతని చేయి ముద్దు పెట్టుకుని, అతని నోటికి పానీయము నింపిన గ్లాసు అందించింది. ఈసారి ఒకరి నొకరు చూచుకునే అవకాశము లభించింది. అతని నోటి దగ్గర గ్లాసు ఉంచి చిరునవ్వులు చిందించే ఆమె ముఖము పాలిపోయినట్టే అయింది. గ్లాసు జారి అతని వడిలో పడిపోయింది.
"మీ.......మీరా........ఆనంద్" అస్పష్టంగా పలికింది , వెనక్కు వాలిన అతను సరిగ్గా కూర్చున్నాడు . అతను నోరు విప్పే లోపలే ఆమె కుప్పలా అతని పాదాల వద్ద వాలిపోయింది. ప్రక్కకు త్రిప్పి ఆమె ముఖము రెండు చేతులలోకి తీసుకున్నాడు. పరీక్షగా చూచి ఉలికిపడినాడు. ప్రక్కకో బాంబ్ ప్రేలినట్టయింది. అతని తల తిరుగసాగింది. వెంటనే, ఒక చేత్తో ఆమె నలాగే పట్టుకుని, రెండవ చేత్తో బల్లమీదున్న సోడా సీసాలో మిగిలిన సోడా అంతా గడగడ త్రాగేశాడు. ఆమె నెత్తి , తేర లోపల ఉన్న పడక పై పడుకోబెట్టాడు. అతని అనుమానము నివృత్తి చేసుకోడానికి, అటు ఇటు స్విచ్ కోసము వెతికాడు. తలుపు దగ్గర కనిపించింది. లైట్ వెలిగించాడు. వెల్తురులో ఆమె శరీరము చూడలేకపోయాడు. మంచము పై నున్న రగ్గు కాళ్ళ పై కప్పాడు. ఒకవైపు తల వాల్చి పడుకున్న ఆమెను చూచాడు. అదే గుండ్రంగా, కళకళలాడే ముఖము, పెద్ద కన్నులు, చిన్న నోరు, విశాలమైన నుదురు . ముఖానికి రంగు పూసుకున్నందువల్ల ఛాయ ఎక్కువగా కనిపిస్తుంది. తన యౌవనము సార్ధకము చేసిన కన్య. ఊర్వశి గా యెలా మారింది. సురేఖే నిశ్చయముగా సురేఖ. ఆమె కూడా తనను గుర్తించింది. అతని తల తిరిగిపోసాగింది. అతని హృదయ స్పందన చెప్పనవసరము లేదు. వెంటనే మూలకు కనిపించిన కూజాలోని నీరు తెచ్చి, ఆమె ముఖాన చల్లాడు. అటు ఇటు కదిలి కళ్ళు తెరిచింది. ఆమెకు తన ముఖము చూపించలేదు. ఓహ్! ఆమె అడిగే ప్రశ్నలకు తన వద్ద జవాబు లేదు. అతని మనసు ఆమెకు దూరంగా పారిపొమ్మని హెచ్చరించింది.
"ఆనంద్....' అస్పష్టమైన పిలుపు వినిపించింది. వెనుతిరిగిన చప్పుడు కూడా కారాదని వెనుకకే మెల్లగా నడుస్తూ గుమ్మం చేరాడు.
'ఆనంద్ ఆగండి....' గుమ్మము లోంచి చూచాడు. ఆమె లేచి కూర్చుంది. ఆమెను చూచే ధైర్యం లేదు. రెండేసి మెట్లు ఒకేసారి దిగుతూ క్రిందికి వచ్చాడు. హల్లో వృద్ద వేశ్య, వరహాలు కూర్చుని వున్నారు.
"ఆనంద్ అగు.....మీతో మాట్లాడాలి....' పై నుండి కేకలు వినిపిస్తున్నాయి. అతను అవేమీ లెక్క చెయ్యలేదు. నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ వడివడిగా బయటకు వచ్చాడు.
'అదేమిటి బాబూ! అలా వెళ్ళిపోతున్నారు? కొన్నిసార్లు ఏం రోగమో పెంకిగా ప్రవర్తిస్తుంది." వృద్దురాలి మాటలు వినిపిస్తున్నాయి.
"బాబుగారు! నన్ను మరిచి పోయారా?' వరహాలు వెంట బడ్డాడు. క్రొత్త చోటు, చూచి నడవాలనే జ్ఞానము కూడా కోల్పోయాడు. రెండు మూడు చోట్ల పడబోయి ఆగిపోయాడు. వరహాలు పిలుపు విని ఆగిపోయాడు. వాడు తెగించిన వాడు దొంగని అరిచినా అరవగలదు. "ఏమిటండి అలా వచ్చేశారు. పెంకి గా ప్రవర్తిస్తే అంటించక పోయారు!" పళ్ళు కొరికాడు.
"ఎవరూ పెంకి గా ప్రవర్తించలేదు. నాకు తొందరగా వెళ్ళాసిన పని వుంది" పర్సు లో నుండి పది రూపాయలు అతనికిచ్చాడు. తను వెళ్ళిన ఇంటి నుండి పరుగెత్తుకు వచ్చే స్త్రీ మూర్తి కనిపించింది. వెంటనే వరహాలు ను వదిలి కారు వైపు పరుగెత్తినట్టే వెళ్ళి తాళము తీశాడు. స్త్రీ మూర్తి , వరహాలు యిరువురు వస్తున్నారు.
"ఆగండి బాబుగారూ! ఊర్వశి మీతో మాట్లాడాలిట..." తొందరగా కారులో కూర్చుని , స్టార్ట్ చేశాడు. ఆమె వగరుస్తూ కారును చేరింది. వంటి నిండా దుప్పటిచుట్టుకుంది. "ఆగండి . నా మాట వినండి." అతను విననట్టే కారును పోనిచ్చాడు. చాలా దూరమువరకు అతని ఆమె దీనమైన పిలుపులు వినిపిస్తూనే వున్నాయి. వెనుకకు మరిలి ఆమె విషయము కనుక్కోవాలనిపించింది. కాని అతని హృదయము ఏదో విచిత్రమైన భీతికి లోనయింది.మేను రోడ్డుకు వచ్చాక కారాపి, గాలి పీల్చుకున్నాడు. నాలుక పిడుచ కట్టినట్టు అయింది. మూయబోతున్న రెస్టారెంట్ తెరిపించి రెండు గ్లాసుల నీళ్ళు త్రాగాడు. జేబులో నుండి రుమాలు తీసి నుదుట పట్టిన చెమట ఒత్తుకున్నాడు. కారులో కూర్చున్నాడు. మనసు సురేఖ వైపు లాగుతున్నా, కారు ఇంటి వైపు సాగిపోయింది. ఇల్లు చేరి హాలులో దీపము చూచి అతని గుండె ఆగినంత పని అయింది. నిదుర పట్టనప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు పూర్తీ అయి జనగణమన అయ్యే వరకు వింటుంది అరుణ. తనలోని చంచలాన్ని గ్రహిస్తే! వరండా మెట్ల పై నిలబడి తనను తాను సంభాళించుకున్నాడు. అతని కోసమే యెదురు చూస్తుందేమో, కారు చప్పుడు విన్నట్టుంది. తనంతట తానె తలుపు తీసింది అరుణ.
"అక్కడే ఆగిపోయారేం? రండి."
"ఆ......ఆ....ఉక్కగా ఉంది సుమా" అన్నాడు కదలకుండానే. ఆమె అతని దగ్గరగా వచ్చి నిల్చుంది. అతనిలో ఆవేశము, కాంక్ష యెప్పుడో హరించుకు పోయాయి. ఆవేదన గుండెలను తొలచి వెయ్యాసాగింది. సురేఖ యేమిటి , వేశ్యా గృహము లో దర్శనము ఇవ్వట మేమిటి?
"పడక కుర్చీ తెమ్మంటారా? యెంతసేపు నిల్చుంటారు?"
"అక్కరలేదు. మెట్ల పై కూర్చుంటాను." అతను మెట్లపై కూర్చో బోయాడు.
"కారు షెడ్డు లో పెట్టలేదు. మళ్ళీ బయటకు వెళ్తారా?"
"లేదు.' త్వరగా వెళ్లి కారు షెడ్డు లో పెట్టి వచ్చాడు. అతను కూర్చున్నాక, సరసనే తనూ కూర్చుంది.
"నేను యెక్కడికి వెళ్లానని అడగవెం?"
"ఆమాత్రము ఊహించలేనా? సినిమా కెళ్ళారు కదూ! యేవో స్టంట్ సినిమా అయి ఉంటుంది. తిరిగి వచ్చారు అవునా?' నవ్విందామే.
"లేదు అరుణా! ఇంట్లో కరువైన ఆనందాన్ని కొనుక్కుందామని వెళ్లాను. జీవితాంతము సరిపడే బాధను కొనుక్కుని వచ్చాను."
"అసలు మీరేం మాట్లాడుతున్నారు.
"యెంత అమాయకురాలవు....నేను మాటాడేది అర్ధం కావటము లేదా? నేను వేశ్యా గృహములో అడుగు పెట్టాను." అరుణ పకపక నవ్వింది.
"బావుంది. పరిహాసమాడటానికేం దొరకలేదా? మీరు వేశ్యాగృహాని కేగటమా? దారి ఎటో తెలుసా?' వెక్కిరించింది.
"నమ్మకపోతే నీ ఖర్మ.' విసుగ్గా చూచాడు.
"ఆమె యెవరో గాని యెంత మంచిదండీ. మీ ఆవిడ యెదురు చూస్తుంది ఇంటికి పోమ్మందా?"
"కాదు....' ఏం చెప్పాలో తెలియలేదు.
'అబద్దమాడినా సమర్ధించుకునే తెలివితేటలుండాలి ." ఆమె మరోసారి నవ్వి అతని భుజము పై తల వాల్చింది.
'అరుణా! ఆనంద్ వచ్చాడా?' ఆవులిస్తూ సరస్వతమ్మ వచ్చింది.
"వచ్చారత్తయ్యా." అతనికి దూరము జరిగింది. ఆనంద్ కు నవ్వు వచ్చింది. తల్లికి నిదుర లో కూడా కోడలి క్షేమము కావలయునన్నమాట. అతను లేచి లోపలికి వచ్చాడు. వెనుకాలే భార్య కూడా వచ్చింది.
"అరుణా! ఒక దిండు, దుప్పటిలా ఇవ్వు. కిటికీ దగ్గర క్యాంప్ కాట్ లో పడుకుంటాను." నెమ్మదిగా అడిగాడు.
'అదేం? మేడ మీద చల్లగా ఉంటుందిగా?'
"ఒంటరిగా పడుకోవాలంటే ఏదో దిగులు, ఏం తోచదు." అన్నాడు. ఆమె జాలిగా అతని వంక చూసింది. అత్త మీద కొన్ని క్షణాలు కోపము కూడా వచ్చినది. తమ విషయాలు తమకు తెలియవా? భర్త దగ్గరుండి కబుర్లు చెప్పినంత మాత్రములో ఏం మునిగి పోయిందో....వెంటనే ఆప్యాయంగా అనే మాటలు గుర్తుకొస్తాయి.
"ఏజన్మ పాపమో, ఇలా వెంటాడుతుంది. అమాయకురాలు. ఆబల దాన్ని సాధిస్తే ఏం వస్తుంది?' అదే మరో అత్తగారయితే తన స్థితి మరో విధంగా వుండేది" ఆమె పై కోపగించుకున్నందుకు తనను తానే నిందించుకున్నది. క్యాంప్ కాట్ వాల్చి ,దాని పై పడక అమర్చింది.
"దిండు చాలు" అన్నాడతను. విననట్టే పడక వేసి, అతనికి ధోవతి తెచ్చి ఇచ్చింది. అతను తల వంచే అందుకున్నాడు. సరస్వతమ్మ గదిలోకి వెళ్ళి కూర్చుంది.
"మీకు ఒంట్లో బావుండనట్టుంది." అతని నుదురు తాకి చూసింది. చెమట పట్టి చల్లగా వుంది.
"ఏం లేదు, నిదుర వస్తుంది." పడక పై వాలి పోయాడు.
"పాలు తెమ్మంటారా?"
"వద్దు కళ్ళు మంటలు గా వున్నాయి. లైటు అర్పేయి." ఆమె లైటు అర్పి వెళ్ళిపోయింది. అత్త, కోడళ్ళ సంభాషణ లీలగా వినిపిస్తుంది అతనికి అబద్దమాడాడు. కాని నిదుర అతన్ని దూరము నెట్టినది. అర్ధరాత్రి వరకు దొర్లుతూనే గడిపాడు. కళ్ళు మూసుకుంటే అతని కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు కదలాడసాగేయి. అవి చూడటము ఇష్టము లేదు. కళ్ళు విప్పి చీకటి ని చూస్తూ చాలాసేపు కూర్చున్నాడు. తరువాత లైటు వేసుకుని, హల్లో బల్ల పై నున్న వారపత్రిక తీశాడు. ఒక కధ చదవగానే విసుగు వచ్చింది. ఇంకా పాత కధలే , పాత దీమ్ తీసుకుని రాయటమే. ప్రేమ....తల్లి తండ్రులంగీకరించపోవటము. అమ్మాయి ఆత్మహత్య చేసుకోవటము , అబ్బాయి పిచ్చి వాడవటము . కాలము మారింది. ఒకవేళ ప్రేమించినా, తల్లిదండ్రులు అడ్డు పెట్టరు. పెట్టినా వివాహం ఆగిపోదు. ఒకవేళ ఆగిపోయినా పరిస్థితులకు తల వంచి యెవరి మానాన వారు బ్రతుకుతారు. ఏ సినిమా చూచినా, ఏ కధ చదివినా ప్రేమ విరహము, దుఃఖము....అతని ఆలోచనలు సాగనివ్వలేదు. అతని ముందు ప్రశ్నగా సురేఖ రూపము ప్రత్యక్షమయింది. "నీవు అంతేగా! అని నిలదీసి అడిగినట్టయింది. లేచి లైటు అర్పి బయటి తలుపు తీసుకొని వెళ్లి వెన్నెలలో పచార్లు మొదలు పెట్టాడు. ఈగల్లా చుట్టుముట్టిన ఆలోచనలు అతడిని పీడించి పిప్పి చేయసాగేయి. యెక్కడో నాల్గు గంటలు కొట్టిన శబ్దము వినిపించింది. ఉలిక్కిపడి లోపలికి వచ్చి బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. అలసట బలవంతంగా అతడిని నిదురా దేవి వడిలోకి నెట్టింది.
"లేవండి, తొమ్మిది దాటింది." అరుణ తట్టి లేపినప్పుడు బలవంతంగా కళ్ళు విప్పాడు. కాని రెప్పలు బరువుగా వాలిపోయాయి. ఆమె అతని వంటిని తాకి చూచింది.
'అత్తయ్యా ఒకసారి వస్తారా?' అమ్మనేందుకు పిలుస్తున్నావని భార్యను అడగాలని లేచి కూర్చోవాలని యెంతో ప్రయత్నమూ చేసి విఫలుడయ్యాడు.
"ఏమిటమ్మా! సరస్వతమ్మ రావడమూ, అతని ఒంటి మీద చేయి వేసి చూడటమూ వెంటనే డాక్టరు కు కబురు పంపడము నిముషాల మీద జరిగిపోయాయి. డాక్టరు వచ్చాడు. నిదుర లేమివల్ల వేడి చేసిందని చెప్పి మందు పంపిస్తానని వెళ్ళిపోయాడు. అత్తా, కోడండ్ల ఆదుర్దా ఇంతా అంతా కాదు, రంగారావు మంచము వద్దే కూర్చున్నాడు.
'అరుణకు ఆపరేషన్ అయితే సంతానము పొందే ఆశ లేదని డాక్టర్లు చెప్పారుగా? అదే మనసులో పెట్టుకుని బాధపడుతున్నాడులా ఉంది" తండ్రి తన అభిప్రాయము వెలిబుచ్చాడు.
"ఏం బాధో, ఏం రాతో. ప్రపంచములో యెవరికి నాలాంటి రాత వద్దు . ఏనాడు చేసుకున్న పాపమో." తల్లి కళ్ళు ఒత్తుకోవటము కనిపించింది.
"మీ పాపమూ కాదు . నా పాపమే నన్ను కాటేసింది." అని యెలుగెత్తి అరవాలనిపించింది. శక్తి కూడదీసుకోలేక ఊర్కున్నాడు. రంగారావు భోజనానికి వెళ్ళాడు. దూరంగా నేరస్త్గురాలి వలె తలవంచుకుని మహా విచారంగా కూర్చుంది అరుణ.
'ఆరూ!" నీరసంగా పిలిచాడు.
"ఏమిటండీ? దాహంగా ఉందా?' చివ్వున లేచి వచ్చింది.
'అంత విచారము దేనికీ? నా దగ్గర కూర్చో. నిదుర వస్తుంది."
'అలాగే" అతని చేతులు నిమురుతూ కూర్చుంది. అతనికి నిదుర రావడము లేదు. కాని తను నిదుర పోనిదే ఆమె లేవదని తెలిసి బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. అతనూహించినట్టే అతని పై సన్నని దుప్పటి కప్పి వెళ్ళిపోయింది. అతని మనస్సు ఈరోజు గతము వేపు కళ్ళెము లేని గుఱ్ఱము లా పయనిస్తుంది. యెంత ప్రయత్నమూ చేసినా మనో వేగాన్ని అపలేకపోతున్నాడు. ఒక్కరోజు జ్వరము చేసిన బలహీనపు ముద్రే కావచ్చు.
