Previous Page Next Page 
వంశాంకురం పేజి 10

 

    ఆనంద్ తన హైస్కూల్ విద్య ముగించాడు. ఇంట్లో నల్గురు కుమారులున్నప్పుడు ఏ కోర్సు చదివించాలన్న సమస్యే రాదు. వారి అభిరుచులను, వారు తెచ్చుకునే మార్కులను బట్టి ఏదో కోర్సు చదివిస్తారు. రంగారావు గార్కి ఏకైక పుత్రుడు ఏ కోర్సు చదివించాలన్నది సమస్యగా మారింది.
    "ఇంటర్ మీడియట్ బయాలజీ తో చేయించి డాక్టర్ కోర్సు చదిచించవోయ్. ఒక్కడే కులదీపకుడాయే. ఇంజనీరింగ్, కలెక్టర్ అంటూ కూర్చుంటే, వాడెక్కడో దేశాలు బట్టి తిరుగుతాడు. డాక్టర్ అయితే హాయిగా ఇంట్లోనే ప్రాక్టీసు పెట్టుకుని మీ కళ్ళ ముందు ఉంటాడు." స్నేహితుల సలహా.
    "నిజమే. రేపే అప్లికేషన్ తెప్పిస్తాను." రంగారావు అంగీకరించాడు. సాయంత్రమెవరో బంధువులు వచ్చారు.
    "ఒక్కగానొక్క కొడుకు. వాడి పేరు ప్రతిష్టలు నలుమూలలా ప్రాకాలని లేదా సరస్వతమ్మ. డాక్టర్ అయితే డబ్బు వస్తుందేమో గాని, హోదా , పలికుబడి ఎక్కడుంటాయి? నా మాట విని హాయిగా అబ్బాయిని కలెక్టర్ చెయ్యండి." బందువుల సలహా.
    "చూద్దాము మనము అనుకున్నవన్నీ అవుతాయా ! వాడి యిష్టమేముందో?"
    "వాడికేం తెలుసమ్మా? మనము సరియైన దారిలో పెట్టాలి గాని, ఏరా ఆనంద్ కలెక్టరవ్వాలని లేదూ?" ఆవిడ భర్త అడిగాడు. గారబముతో పద్దెనిమిది సంవత్సరాలకు మెట్రిక్యులేషన్ పాసు చేసిన ఆనంద్ సిగ్గుతో తల వంచాడు. వారు వెళ్ళిపోయాక తల్లి తండ్రులు చాలాసేపు చర్చించారు.
    'అవునండి. మనకున్నది ఒక్కడు . వాడు కలెక్టరు అవ్వాలని లేదూ?"
    "ఉంది. దానికి కాంపిటేషన్ ఎగ్జామ్స్ అవి ఉంటాయి."
    "ఉంటేనేమీ మనవాడు చదువడంటారా? అదే చేయించాలి."
    "మీ తమ్ముడు ఇంజనీరింగ్ చదివించమని రాశాడే."
    "రాయడానికేం? మా అక్క ప్లీడరీ చదివించమని వ్రాసింది. అవన్నీ చదివిస్తామా? కలెక్టరంటే , హోదా, సంపాదన అన్నీ ఉంటాయి. '
    'సరే, మొదట కాలేజీ చదువు పూర్తీ చేయనివ్వు. ఫస్టు క్లాసు లో పాసయితే చూద్దాము." రంగారావు అన్నాడు. కలెక్టర్ చదివించే ఉద్దేశ్యముతో అతనిని ఆర్ట్స్ తో కాలేజీ లో చేర్పించారు. అందరూ ఒక్కగానొక్క కొడుకమ్మా. అనటము ఆనంద్ కేదో ప్రత్యేకంగా కనిపించేది. దానికి తోడూ కాలేజీ వాతావరణము స్నేహితులు, క్రొత్త క్రొత్త అలవాట్లు అబ్బసాగేయి.

 

      
    "మా కొంప లో అర్గురము చచ్చామురా. నీలా ఒక్కకోడుకునే అయితే, ఈపాటికి విజయవాడంతా కొననూ?' స్నేహితుడు శర్మ అనేశాడు.
    "ఒరేయి శర్మా, విజయవాడ కొని ఏం చేస్తావురా? విజయవాడ లో ఉన్న అందాన్ని, ఆనందాన్ని కొంటానని అను." మరో స్నేహితుడు పాల్ అనేవాడు.
    "నిజమురా చక్కని దుస్తులేసుకుని, ఒత్తయిన క్రాపు నుదుట పడేలా దువ్వుకుని చేతిలో స్టైలుగా సిగరెట్టు పట్టుకొని కృష్ణా బేరేజి పై తిరుగుతుండాలీరా, తస్సదియ్యా-- అటు ఇటు వెళ్ళే కన్యలంతా నిన్నే చూడరూ?"
    "అవునురా. మాలాంటి వారి మంటే బ్రతుకు తెరువు కోసము చదువుతాము. నీకేం తక్కువ? మీనాన్న పిల్ల జమిందారు. హాయిగా అనుభవించు." పాల్ సలహా. ముగ్గురిలో అరమరికలు లేవు. స్నేహితుల బలవంతం తో , తండ్రిని అడిగి ఖరీదయిన సూట్లు కుట్టించాడు. కెమెరా కొన్నాడు. సిగరెట్లు త్రాగడము, దినానికి కనీసము రెండుసార్లు స్నేహితులతో హోటల్ కెళ్ళటము నేర్చుకున్నాడు. అతనికి అడ్డు లేదు. అందరూ అతన్ని ప్రోత్సహించి స్టూడెంట్ యూనియన్ , సెక్రటరీ గా పోటీ చేయమని బలవంత పెట్టారు.
    "నాకేం వస్తుందిరా, అసలే స్టేజి ఫియరు. రేపు ఏదో ఫంక్షన్ అయితే కనీసము ఓట్ ఆఫ్ థాంక్స్ అయినా చెప్పవద్దా."
    "మహారాజులా చెప్తావు. స్టేజి ఫియర్ లేందేవరికి? మన ఇంగ్లీషు మాష్టారు పాఠము చెప్తున్నప్పుడు చూడు ఒళ్ళంతా చెమట పట్టి ఉంటుంది. అయ్యగారు ఇంటి నుండి అరఇంచ్ మందము కోటింగ్ వేసుకుని, ఫ్రెష్ గా వస్తాడు. ఫస్టు పిరియడ్ అయ్యాక చూడు ముఖము నూనె కారుతుంది." శర్మ భుజము తట్టాడు.
    'అవునురా ఆనంద్! అవతల వాడికి తనలాంటి వారే లేరని చాలా పొగరు. మాకు ఉత్సాహంగా వున్నా ఆపర్వతాన్ని డీ కోనేశక్తి లేదురా. నీకేం హాయిగా డబ్బుంది. దాన్ని ఉపయోగించటానికి అనుమతి ఉంది. స్టేజి మీద మాట్లాడటము పుట్టుకతో రాదు, ఒకటి రెండు ఫంక్షన్ లయితే అది అలవడుతుంది. శర్మ అభిప్రాయాన్ని పాల్ బలపరిచాడు.
    "ఏమోరా భయంగా ఉంది. చదువు పాడవుతుందని నాన్నగారు కోపగిస్తారు."
    "ఓరి అపర శ్రీరామ చంద్రా! చదువు మొదటి సంవత్సరములో యెవరూ చదవరని నాన్నగారితో చెప్పలేవురా?" శర్మ నీరసముగా చూచాడు.
    "ఎందుకురా ఇంత పొడవూ, ఒడ్డూ ఉన్నావు. పుషింగ్ నేచర్ లేదురా , పిరికి వాడివి. మేము పెద్దపులి నోట్లో తలపెట్టమన్నట్టు భయపడతావెంరా?" పాల్ వెక్కిరించాడు. ఇతరత్రా స్నేహితులు పరిచయమున్న వారు బలపరిచారు.
    "స్టేజి పై మాట్లాడే వారంతా అసమాన పండితులంటావా? మొన్నటికి మొన్న మన కల్చరల్ అసోసియేషన్ కు సెక్రటరీ గా ఉన్న అతను ఏమన్నాడు. "ఐ టుక్ద్ద్ అల్ మై ప్రైజెస్' టుక్ద్ద్ అనే శబ్దం ఉందిరా? ఏదో నాల్గు సార్లు మాట్లాడితే వస్తుంది. వాక్యము సరిగ్గా మాట్లాడలేనివాడు సంవత్సరము నెట్టుకు రాలేదూ?"
    "అవునురా , నువ్వు పోటీ చేయకపోతే మేమంతా సత్యాగ్రహము చేస్తాము" అందరూ ఇన్ని రకాలుగా పోత్సహిస్తుంటే ఆనంద్ ఉత్సాహము పుంజుకుని , నామినేషన్ ఫారాలు దాఖలు చేశాడు. రంగారావు అడ్డు చెప్పలేదు. కొడుకు అడిగినంత డబ్బు ఇస్తున్నాడు. ప్రచారము జోరుగా సాగింది. ప్రతి విద్యార్ధిని హోటల్ కు తీసుకుని వెళ్లి ఫలహారాలు స్వీట్స్ యిప్పించారు. ప్రచారము ముమ్మరముగా సాగింది. ఎన్నికల రోజు ఆనంద్ కు భయము పట్టుకుంది. తన ఏజెంట్లు గా, పాల్, శర్మ వెళ్ళారు. హోటల్లో ఓ మూల కూర్చుని కాఫీని ఒక్కగుక్క తాగుతూ, ఓ దమ్ము సిగరెట్టు పీల్చుతూ క్షణమో యుగంగా గడిపాడు.
    "ఆనంద్....హిపు వూరే....ఆనంద్ హిపు వురే ....." నినాదాలు వినిపించి, వీరుడిలా లేచి వెళ్ళాడు. స్నేహితులు చేతుల పై కెత్తి ఊరేగించారు. వారము రోజులు విజయవార్తలు చెప్పుకుంటూ. సంతోషంగా పార్టీలు ఇస్తూ గడిపారు ఆనంద్, అతని స్నేహితులు.
    "స్టూడెంట్ యూనియన్ సెక్రెటరీ గా గెలిచావు. సంతోషము పాథ్యేతర విషయాలు కూడా ముఖ్యమే కాని, పాఠాలు కూడా చదవాలి --  తండ్రి యిచ్చిన సలహాను అనుసరించి ఆనాటి నుండి చక్కగా చదవాలని ప్రణాళిక తయారు చేసుకున్నాడు. కాని మరురోజే విద్యార్ధి సంఘము సమావేశమై, స్టూడెంటు యూనియన్ ఇనాగ్రల్ ఫంక్షన్ జరపాలని తీర్మానించారు. ముఖాతిధిని యెవరిని పిలవాలని రెండు రోజులు చర్చలు జరిపి కడకు నిర్ణయించుకున్నారు. ఆ తరువాత చక్కగా పాడే వారెవరని నాటకాల యందాసక్తి గలవారిని, వెతికి, కార్యక్రమము నిర్ణయించుకుని, ఫలానా రోజు ఫంక్షన్ అని అనౌన్స్ చెయ్యడానికి మరో పదిహేను రోజులు తరిగిపోయాయి. కరపత్రాలు వేయించి, ఆహ్వానితులేవరేవరా అని నిర్ణయించుకుంటుండగా , ప్రెసిడెంట్ కు, ట్రెజరరుకు తగదా పడింది. స్టూడెంట్స్ అందరికీ రిఫ్రెష్ మెంట్స్ ఇవ్వాలంటాడు ప్రెసిడెంట్. కాదు ఖర్చులు చాలా అవుతాయి యూనియన్ మెంబర్స్, స్టాప్ ఆహ్వానితులే అంటాడు కోశాధికారి. వారిద్దరికీ రాజీ కుదర్చటానికి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు బయట తిరగాల్సి వచ్చేది. తండ్రికి ముఖము చూపించలేక తప్పుకుని తిరిగేవాడు . అనుకున్న రోజు రానే వచ్చింది.
    'అమ్మా! ఈ ఇన్విటేషన్ కార్డు నాన్నగారి కివ్వు. సాయంత్రము మీరిద్దరూ రండి."
    "నువ్వే ఇవ్వలేకపోయావు?"
    "ఈ మధ్య చదువు అశ్రద్ధ చేస్తున్నానని నాన్నగార్కి కోపంగా ఉందమ్మా. ఈ ఫంక్షన్ అయితే ఏం పని వుండదు."
    "కోపం దేనికిరా? ఒక్కడవు. మా ఆశలన్నీ నీమీదే. అందుకే చక్కగా చదువు కోవాలని అంటాము.' తల్లి నవ్వింది.
    "ఇకముందు నువ్వే చూస్తావుగా?" తల్లికి  టైరు కొట్టి బైట పడ్డాడు. ముఖ్యాధితిని పరిచయము చెయ్యటము అధ్యక్షుని వంతు అయితే, ధన్యవాదాలు అర్పించటము ఆనంద్ వంతు. పాల్ రాసుకొచ్చిన కాగితము చూచి మరోసారి చదివాడు. కంఠతా వచ్చినట్టే అనిపించింది.
    "ఒడ్డూ, పొడవుండగానే సరికదురా , ఠీవిగా నిల్చోవాలి.' శర్మ నిలబడి చూపాడు. జేబులో చెయ్యి యెలా పెట్టుకొవాలో, టై యెలా సర్దుకోవాలో చూపాడు. ఇంగ్లీష్ స్టైలు గా ఎలా మాట్లాడాలో పాల్ చూపాడు.
    "తెలుగు వారే వస్తారు తెలుగులో చెబితే ఏంరా?"
    "ఒరేయి! ఇది బడి కాదురా కళాశాల. ఇక్కడ బోధనా భాష ఇంగ్లీష్ లో ఉంటుందిరా దద్దమ్మా."
    "ఎవడ్రా వీడు! ఇంత పిరికి సన్యాసిని కాలేజీ లో ఎందుకు చేరావురా? అమ్మ కొంగు పుచ్చుకుని "శ్రీరాముని దయ చేతను" అని పద్యము చదవరా."
    "మిమ్మల్ని అడగడము నాదే తప్పురా. ఊర్కోండి." కసురుకున్నాడు. ఆనంద్ అదృష్టమేమిటంటే అతను స్టేజి యెక్కకమునుపే డ్రామాలతో, పాటలతో విసిగిపోయిన ఆహుతులు, విద్యార్ధుల తల్లి తండ్రులు, ఇతర విద్యార్ధులు వెళ్ళిపోయారు. ఉన్న కొద్ది మంది డ్రామా లో , వేషాలు వేసేవారి తల్లితండ్రులు , బంధువులూ, స్నేహితులు , వారి ముందు ఫంక్షన్ ఆఖరు అయ్యాక, పాఠము అప్పగించినట్లు చెప్పాడు. కొడుకుని స్టేజి పైన , మైక్ ముందు చూసిన సరస్వతమ్మ కళ్ళు మెరవడము , కొడుకు చూచాడు. అతనికి యెక్కడ లేని ధైర్యము వచ్చింది. ఆరోజు గడిచింది. ఆనంద్ తేలికగా నిట్టూర్చాడు. రెండు రోజులు అలసట తీర్చుకున్నాడు. మూడో రోజు కాలేజీ కి వెళ్ళాడు. నాల్గోరోజు నుండే ఫస్ట్ టర్మ్ సెలవులిచ్చారు.
    "ఒరేయ్ ఈ సెలవులలో ఏటన్నా వెళదామురా >" పాల్ ప్రతిపాదించాడు.
    "పాల్! ఇంట్లో వారు కర్ర పుచ్చుకుంటారు. మనమీ మూడు నెలలు పుస్తకము ముట్టాముట్రా? మొదటి నెల లెక్చరర్లు రాక, వచ్చినా పుస్తకాలు లేక గడిపాము. రెండవ నెలంతా, ఎలక్షన్ల తో గడిచిపోయింది. మూడవ నెల ఫంక్షన్ కాగానే సెలవులిచ్చారు. నీకేమయినా మతి ఉందా?"
    "మతి ఉందిరా. రెండు షేక్ స్పియర్ డ్రామాలు, తెలుగులో రెండు పద్యాలు, ఎకనామిక్స్ లో రెండు చాప్టర్లు ...' శర్మ వెక్కిరించసాగెడు.
    'శర్మా! రెండు, రెండే కూడితే, చాలా అవుతాయి రెండు డ్రామాలు చెబుతున్నప్పుడు క్లాసు కే వెళ్ళలేదాయే. ఈ సెలవులలో యెవరితోనైనా చెప్పించుకోవద్డా?" ఆనంద్ దిగులుగా చూచాడు.
    "నీ పేరు మీదుగా మా ఇంట్లో వారిని ఒప్పించాలనుకుంటే నువ్వే పంగనామాలు పెడుతున్నావు. వెళ్దాము పదరా.' శర్మ, పాల్ వెళ్ళిపోయారు. రాత్రి పడుకునేటప్పుడు నాల్గు గంటలకు అలారము కీ యిచ్చి పడుకున్నాడు.
    "అమ్మా రేపటి నుండి చదవాలి. "అని తల్లికి చెప్పాడు. అలారము యెప్పుడు మ్రోగిందో ఎప్పుడాగిపోయిందో అతనికి తెలియనే తెలియదు. ఉదయభానుడు తన రధానికి కళ్ళేలు బిగిస్తూ ఆనంద్ వంక తీక్షణంగా చూచాడేమో చురుక్కు మంటే లేచాడు. అతనికి అలారము పీసు మీదా, అమ్మ మీదా విపరీతమైన కోపము వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS