Previous Page Next Page 
ఇంద్రధనుస్సు పేజి 9

 

    మరుసటి రోజు సుందరమ్మ అన్నయ్య వచ్చారు. అతని భార్యకు పురుడు పోసుకునే సమయానికి సుందరమ్మ ను ఇంటి పనులు చూసుకోవటానికి రమ్మని అడిగాడు. శారద విషయంలో అశాంతి, చేనులో ముదురుతున్న కంది, ఆనపకాయలు వీటి వల్ల ఆవిడ వీలులేదంది. అందాకా వింటూ కూర్చున్న రత్నమ్మ , శారదను తీసుకు వెళ్ళమంది. అందరూ సరేనన్నారు. శారదను రహస్యంగా పిలిచి సుందరమ్మ చెప్పవలసిన విషయాలు చెప్పి పంపించింది.
    శారద, మరునాడు రాఘవయ్య మామతో కలిసి కృష్ణాపురం బయలుదేరి వెళ్ళింది. కృష్ణాపురం మదనపల్లె-- తిరుపతి రోడ్డుకు ఏడు మైళ్ళ లో ఉన్న కుగ్రామం. ఆ గ్రామం దాకా ఇంకా ఇరవయ్యో శతాబ్దం నాగరికత పాకలేదు. ఆ ఊళ్ళో విద్యుచ్చక్తి లేదు. పోస్టాఫీసు లేదు. వారానికి ఒకసారి భాకరా పేట నుండి పోస్టు జవాను వస్తాడు. ఆ ఊళ్ళో ఇంకా రైలు చూడని వాళ్ళూ, మోటారు ప్రయాణం చేయని వాళ్ళూ ఉన్నారు. ఆ గ్రామానికి రాఘవయ్య కరణం. అతని మాట ఆ ఊళ్ళో సుగ్రీవాజ్ఞ.
    శారదకు ఆ ఊరు చాలా బాగా నచ్చింది. మనసులోని బాధ పొంగినప్పుడల్లా చుట్టూ ఉన్న సుందర ప్రకృతి మనసులోని గాయాలను మాన్పేది.
    కృష్ణాపురానికి వెళ్ళిన మూడవ రోజు శారదకు తాను కడుపుతో లేనని తెలిసిపోయింది. ఆవిడ మనస్సులో చెప్పరానంత సంతోషం కలిగింది. వెంటనే ప్రకాశానికి ఉత్తరం వ్రాయాలను కుంది. కానీ గుండె చాలలేదు. సిగ్గూ, భయమూ కలిగాయి. తాను గర్బవతి కాకపోయినంత మాత్రాన తన శీలం చెడకుండా లేదని జ్ఞాపకం వచ్చింది. అందువల్ల ప్రకాశానికి ఉత్తరం వ్రాసేపాటి సాహసం కలుగలేదు. ఆ మూడు రోజుల తర్వాత కవరు తెప్పించి రత్నమ్మ పేర ఉత్తరం వ్రాసి పాలేరు చేతి కిచ్చి భాకరా పేటలో పోస్టు చేసి రమ్మంది.

                                  
    నాలుగు రోజుల తర్వాత ఉత్తరం అందుకున్న రత్నమ్మ చదివి తెల్లబోయింది. ఈ పెళ్ళి తప్పించడానికి తను చేసిన ఆఖరి ప్రయత్నం కూడా ఇలా వృధా కావడం ఆవిడకు నచ్చలేదు. తాను చేసిన అన్ని ప్రయత్నాలు వృధా అయ్యాయి. శారద కడుపుతో ఉందంటే ప్రకాశం పెళ్ళికి ఒప్పుకోడనుకుంది. కానీ అతడు అందుకు కూడా తెగించాడు. శీలం చెడినదాన్ని, కడుపుతో ఉందన్న దాన్నీ పెళ్ళి చేసుకుంటానని అన్న వాణ్ణి అతడ్నే చూసింది. అదెందు వల్లనో ఈ కాలపు కుర్రకారు ఇలా తయారవుతున్నారు.
    ఆ విషయాన్ని తాను ప్రకాశంతో అంటే -- "చూడు , అత్తయ్యా, అన్నీ చూసి పెళ్ళి చేసుకుంటామనుకో . ఆ పిల్ల శీలవతి అవడానికి దాఖలా ఏమిటి/ అంతేగాకుండా శారద విషయం వేరు' అన్నాడు. తనకు కోపం, అసహ్యం కలిగాయి. రత్నమ్మ ఉత్తరాన్ని చింపి వేసింది. ఉత్తరం వచ్చిన విషయాన్ని ప్రకాశానికీ, విశ్వనాధయ్య కూ, సుందరమ్మ కూ తెలుప గూడదనుకుంది. ఇంతకూ ఏం లాభం? ఆ ఉమాపతి అయిపే తెలిసి రావటం లేదు. కాలేజీ కి ఉత్తరాలు వ్రాస్తే జవాబు రావటమే లేదు. విశ్వనాధం డబ్బు కూడా పంపటం లేదు లాగుంది. మొన్న ఆ ప్రకాశం వెళ్ళి వచ్చాడు. అతణ్ణి అడిగితె బాగానే ఉన్నాడన్నాడు. అడ్రసడిగితె మరిచి పోయానన్నాడు.
    పొలం వద్ద నుంచి విశ్వనాధయ్య , సుందరమ్మ రావటంతో రత్నమ్మ ఆలోచనలు ఆగిపోయాయి. రత్నమ్మ గబగబా ఉత్తరం చించిన ముక్కలు  ఏరి దిబ్బలో పారేసి వచ్చింది. విశ్వనాధయ్య గారు భోజనానికి లేస్తుండగా ప్రకాశం వచ్చాడు. విశ్వనాధయ్య గారు ప్రకాశాన్ని భోజనానికి లేవమని బలవంతం చేశారు. ప్రకాశం, విశ్వనాధయ్య గారు కలిసి భోజనం చేశారు. ఇద్దరూ వెళ్ళి వీధి అరుగు మీద కూర్చున్నారు. ఫాల్గుణ మాసం కూడా దాటుతుండడం వల్ల కాస్త ఉమ్మగా ఉంది వాతావరణం. ప్రకాశం ఎందువల్లో మాట్లాడకుండా గంభీరంగా ఉన్నాడు.
    విశ్వనాధయ్య గారు ఎందుకని అడిగారు.
    "జగన్నాధం నా కొంప ముంచే ప్లాను వేస్తున్నాడు.' అన్నాడు ప్రకాశం తల వంచుకునే.
    'అంటే?"
    'కుంభం రాయణి కాలవ కింద దొరువు నానుకొని ఉన్న తన బావిని లోతు చేయిస్తున్నాడు."
    "చేస్తే....?"
    "దాని పక్కనే ఉన్న మా బావిలో ఊట పైనే ఉంది. మా బావికీ, వాళ్ళ బావికీ మధ్య దూరం పది పన్నెండు మూరలు కూడా లేదు. జగన్నాధం తన బావి మరి రెండు మట్లు లోతు చేయిస్తే మా బావి ఎండిపోతుంది."
    'అలాగైతే గతి?"
    "ఏమీ తోచటం లేదు. అందుకనే మీ దగ్గరకు వచ్చాను.'
    "నాకూ ఏమీ తోచటం లేదు. ఇంతకూ అంత కార్పణ్యం ఎందుకు?"
    "ఉంది. జగన్నాధం చాలా పెద్ద ఎత్తు వేశాడు. అతడు ఊళ్ళో చేస్తున్న దుర్మార్గాలకు అన్నిటికీ నేను అడ్డు పుల్ల వేస్తున్నాను కదూ? అందువల్ల నన్నేలాగైనా లోబరచు కోవాలను కున్నాడు. తన కూతురు ఇందిరను పెళ్ళి చేసుకోమన్నాడు. వీల్లెదన్నాను."
    విశ్వనాధయ్య గారు ఆలోచనలో పడ్డారు. ప్రకాశం పెళ్ళి మాట ఎత్తగానే అయన ముఖం నల్లగా మాడిపోయింది. ప్రకాశం ఇది గమనించాడు.
    "ఇందిర తిరుపతి లో ఇంటరు చదువుతున్నప్పుడు భానుమూర్తి అని నా స్నేహితుణ్ణి ప్రేమించింది. అతణ్ణి మన హైస్కూలు కు టీచరు గా వేశారు. పది రోజుల క్రితం వస్తానని రాశాడు. కానీ అర్ధర్లు చేరటం లో ఆలస్యం జరిగిందిట. మళ్ళీ ఈరోజు వస్తానని ఉత్తరం రాశాడు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారు."
    "జగన్నాధం ఒప్పుకుంటాడా?"
    "ఆ మాట నేను ఇందిరను అడిగాను. పెళ్ళి నాకండి, మా నాన్నకు కాదు-- అంది."
    అంత గంబీరంగా ఉన్న విశ్వనాధయ్య గారు ఫక్కున నవ్వారు. ఇందిర లాంటి వాళ్ళు వంద కొకరుంటే అడజాతి బాగుపడి పోను. విశ్వనాధయ్య గారికి విమల జ్ఞాపకం వచ్చింది. వందమంది విమల లాంటి వాళ్ళ కన్న ఒక్క ఇందిరే ఎంతో కార్యవాదినిగా ఉంది. అవును. తను రాజకీయాలలో ఉన్నప్పుడు తనను అందరూ మరీ కార్యవాదిగా ఉండకూడదని సలహా ఇచ్చారు.
    "నాకేమీ తోచటం లేదండి." అన్నాడు ప్రకాశం.
    విశ్వనాధయ్య గారు ఉలిక్కిపడి, "రేపు ఆలోచిద్దా" మన్నారు. ప్రకాశం వెళ్ళిపోయాడు.
    ప్రకాశం ఇల్లు చేరేసరికి ముంగిట్లో కూర్చున్న సావిత్రమ్మ , "నీకోసం తిరుపతి నుంచి భానుమూర్తి అని ఒకతను వచ్చాడు" అంది. ప్రకాశం తొందరగా గదిలోకి వెళ్ళాడు. భానుమూర్తి, ఇందిర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ప్రకాశం ఆశ్చర్యపోయాడు.
    'ఇందిరా నీకేమైనా టెలిపతీ ఉందా?" అన్నాడు.
    భానుమూర్తి, ఇందిరా నవ్వారు.
    "ఏమిట్రా భానూ, తెగ లావై పోయావు!" అన్నాడు ప్రకాశం.
    "లేదన్నయ్య . సన్నగా అయిపోయారు' అంది ఇందిర.
    'అవును. నీ కలాగే అవుపిస్తుంది."
    ఇందిర సిగ్గుతో సగమై పోయింది.
    "అబ్బా ఆకలి, అమ్మా ఆకలి , బాబూ ఆకలి' అన్నాడు భానుమూర్తి రాగయుక్తంగా.
    "తిందాం, తిందాం. కాని , ఇందిరా , ఈ ఆకలి పక్షితో ఎలా ఎగుతావో ఏమిటో నాకు భయంగా ఉంది."
    "జైలు భత్తెం" అంది ఇందిర కొంగు చాటునుంచి.
    "హా లక్ష్మణా! నా గతేమిటి? రక్షించు రక్షించు."
    ఇందిర నవ్వలేక కడుపు పట్టుకుంటుంది.
    ప్రకాశం అన్నాడు. "చూడరా, భానూ ఇందాకా పుట్టెడు చింతతో బాధపడ్డాను. నువ్వు కనపడ్డావో లేదో చింత చెల్లా చెదరై పోయింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళకు నువ్వొక కోర్సు యివ్వాలోయ్. నీతో ఒక గంట గడిపితే వాడు నాకు పెళ్ళి చేయమని కూర్చుంటాడు."
    భానుమూర్తి చిరునవ్వుతో వింటున్నాడు.
    "అన్నయ్యా, విశ్వనాధయ్య గారితో మాట్లాడావా?" అంది ఇందిర , అసలు విషయం జ్ఞాపకం వచ్చి.
    ప్రకాశం భారంగా తల పంకించాడు.
    "ఏమన్నారు?"
    "ఏమీ అనలేదు."
    "నా కగమ్యగోచరముగా నున్నది. నా భావన కందని విషయము నొకదానిని మీరు ముచ్చటించుచుంటిరి మీ దృష్టి కి దెచ్చుటకు కడుం గడు విచారించుచుంటి" అన్నాడు భానుమూర్తి.
    ప్రకాశం వివరంగా చెప్పాడు. అంతా గంబీరంగా విన్నాడు భానుమూర్తి.
    "నువ్వు వెళ్ళు, ఇందిరా . ఎనిమిది కావస్తోంది. మళ్ళీ మీ నాన్నగారు అంగారకుడై పోయేరు" అన్నాడు ప్రకాశం.
    "వెడతాను. అయినా భానుమూర్తి గారూ, మా నాన్నను నా ఎదుట తిట్టినా ఫరవాలేదు లెండి" అంది ఇందిర.
    "అబ్బో! ఏమిటో అనుకున్నాను. అమ్మాయి గారికి బ్రహ్మాండమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందిరా ప్రకాశం "-- కళ్ళు పెద్దవి చేసి అన్నాడు భానుమూర్తి.
    ఇందిర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ప్రకాశం, భానుమూర్తి భోజనానికి లేచారు. ఊరి రాజకీయాల గూర్చి, విశ్వనాధయ్య గారిని గూర్చి, పాత స్నేహితులను గూర్చి మాట్లాడు కున్నారు.
    పెరట్లో మంచాలు వేసుకొని ఇద్దరూ పండుకున్నారు. సావిత్రమ్మ గారు తలుపు గడియ వేసుకొన్న తరువాత శారద విషయం వివరంగా చెప్పాడు ప్రకాశం.
    "చాలా మంచి పని చేస్తున్నావురా . ఇందువల్ల నీ జీవితంలో ఎంతో సుఖం ఉంటుంది. కానీ, చూడు, నువ్వావిడని తక్కువగా చూడకూడదు." అన్నాడు భానుమూర్తి.
    ఆర్ద్రత నిండిన ఇద్దరు యువకులు మల్లె పూల వాసనలు రేపిన తలంపులతో హాయిగా నిద్ర పోయారు.
    
                                 *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS