వాచీ అమ్ముకు రావటానికి బజారు లోకి వెళ్ళిన ఉమాపతి సాయంకాలం ఏడు గంటలకు గది చేరాడు. విమల ఆ సరికి తన సామాను సర్దుతుంది. ఉమాపతి తల దిమ్మెర పోయింది.
"ఏమిటి, విమలా ఇది? ఎందుకీ సర్దడం?" అన్నాడు.
'అలా కూర్చో చెబుతాను" అంది చాలా గంబీరంగా.
ఉమాపతి బొమ్మలా కూర్చున్నాడు. తన సామానంతా ట్రంకు లో సర్ది విమల వచ్చి ఉమాపతి పక్కలో కూర్చుంది. ఉమాపతికి విమల ప్రవర్తన చాలా కొత్తగా కనిపిస్తుంది. ఆలోచనతో ఆవిడ కనుబొమలు ముడేసుకోవడం ఆవిడ కంఠంలో గంబీర్యం ధ్వనించడం ఉమాపతి ఎరుగడు. ఆశ్చర్యంగా విమలను చూస్తూ కూర్చున్నాడు.
"మన ఇద్దరికీ ఋణం తీరిపోయింది, డార్లింగ్!' అంది విమల.
ఉమాపతి తల పెట్రేగి పోయింది.
"ఎందుకూ?" అన్నాడు.
"కారణం అడగటం మన ఇద్దరి ఆదర్శాలకూ విరుద్దం."
"కాదు . ఎందుకు నన్నిలా చేసి వెడుతున్నావు? నేను నిన్ను గౌరవంగా చూట్టం లేదా/ సరైన సౌకర్యాలను సమకూర్చడం లేదా?"
"కారణం అడగకూడదని చెప్పాగా? నేను వచ్చినప్పుడు నువ్వు ఎందుకొచ్చావని నన్ను అడగలేదు. ఈరోజు వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నావని అడక్కూడదు. ఎందుకోచ్చాను. కారణం నాకే తెలీకుండా వెళ్ళిపోతున్నాను."
"కారణం నాకు తెలుసు."
"ఏమిటి?"
"నా దగ్గర డబ్బున్నంత వరకు నాతో ఊగులాదావు. డబ్బయి పోయింది. ఈ వాచీతో అమ్మే వస్తువులు గూడా అయిపోయాయి. ఇప్పుడు నేను చెరుకు పిప్పిలాంటి వాణ్ణి. అలాంటి వాడితో నీకేం పని/ వెళ్ళు. డబ్బున్న వాణ్ణి నాకంటే ఆరోగ్యంగా ఉన్న వాణ్ణి చూసుకో."
విమలకు టక్కున కోపం వచ్చింది.
'అలా నోటికొచ్చిన చెత్తల్లా మాట్లాడవద్దు' అంది.
"నా మాటలు నీ కప్పుడే చెత్తగా కనిపిస్తున్నాయి. ఇంకెవరి మాటల్లోనో నీకు తియ్యదనం కనిపించి ఉంటుంది. నీకోసం నా చదువు నాశం చేసుకున్నాను. రేపు నెలలో పరీక్షలు. పరీక్ష ఫీజు కూడా కట్టలేదు. మనమిద్దరమూ ఇలాగే....."
"కీవితంతం నీతోనే ఉంటానని నేను ఎప్పుడూ నీతో అనలేదే!"
"నేను అనుకున్నాను."
'అది నీ యిష్టం . నేను కూడా ఫైనల్ మెడిసిన్ వదులుకున్నాను. ఎవరి కోసం? నీ కోసం కాదు. నా ఆదర్శాల కోసం . కానీ, ఉమాపతీ నువ్వూ మామూలు మగాడివేనని ఈరోజు అర్ధమైంది. నీలో కూడా ఆడదాన్ని జీవితాంతం ఖైదీ చేయాలనే అభిప్రాయం ఉంది. లేకుంటే నే వేడతానంటే వద్దనవు" అంది విమల.
ఉమాపతి జవాబు చెప్పలేదు. అలాగే మౌనంగా కూర్చున్నాడు. విమల కూడా మాట్లాడలేదు.
"నాకు ఆలస్యమౌతుంది. వెళ్ళాలి" అంది విమల కాస్సేపటికి.
"నన్ను సర్వనాశనం చేసి ఎక్కడికి నువ్వు వెళ్ళేది?" అన్నాడు ఉమాపతి కోపంతో.
"ఏం? వెళ్ళనీవేమిటి? వెడుతున్నాను. ధైర్యం ఉంటె అడ్డగించు. ' ట్రంకు చేతికి తీసుకుని విమల బయల్దేరింది.
ఉమాపతి కోపంతో ఒళ్ళు మరిచిపోయాడు. లేచి విమల చేతిలోంచి ట్రంకు లాక్కున్నాడు. విమల పెనుగు లాడింది. ఒక్క తోపు తోశాడు. గోడకు గుద్దుకుని నేలమీద పడింది. తల గోడకు తగిలి దిమ్మెర పోయింది. మోచేయి దెబ్బ తగిలింది. ఏడుస్తూ అక్కడే కూలబడింది. ఉమాపతి కిటికీ లోంచి బయటకు చూస్తూ నిలబడ్డాడు. విమల వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది.
తాను విమల కోసం జీవితం నాశనం చేసుకొన్నాడు. ఆ కృతజ్ఞత విమలకు లేకపోయింది. విమల కూడా ఆడదే కదూ? మరి కృతజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది? విమల ఏడుస్తుంది. ఉమాపతి ఒక నిర్ణయానికి వచ్చాడు.
'విమలా!" పిలిచాడు.
విమల పలకలేదు.
విమల వద్దకు వెళ్ళి చెయ్యి పట్టి నిలబెట్టాడు. నేలమీద పడున్న ట్రంకు అందుకుని బయటికి వచ్చాడు. భయంతో విమల అనుసరించింది. ఇద్దరూ వీధిలోకి వచ్చారు. ఉమాపతి జట్కాను పిలిచాడు.
"ఎక్కు' అన్నాడు విమలతో. ట్రంకు పెడుతూ. విమల బండిలో కూర్చుంది.
"తీసుకెళ్లవోయ్" అన్నాడు బండి వాడితో.
బండి కదిలింది. విమల ఆశ్చర్యంగా ఉమాపతి కేసి చూస్తూ ఉండిపోయింది. బండి రెండు నిమిషాల్లో అదృశ్య మైంది. భారంగా అడుగులు వేస్తూ ఇంట్లోకి వచ్చాడు ఉమాపతి. ఇల్లు బోసిగా కుంకుమ లేని విధవ నుదురు లా ఉంది. ఉమాపతి మనస్సు కూడా శూన్యం గానే ఉంది. మంచం మీద కాస్సేపు కూర్చున్నాడు. మనసంతా అదోరకంగా మారిపోయింది. తనకు ఈ అదర్శాలనుతల కేక్కించింది విమలే. తనకూ, విమలకూ పరిచయం ఏర్పడే నాటికి తనకేమీ తెలీదు. తరువాత ఆ పరిచయం ప్రేమగా మారింది. తను విమలను చాలా నిష్కల్మషంగా ప్రేమించాడు. ఒకరోజు ఆ విషయం సముద్రపు హోరులో విమల చెవిలో చెప్పాడు. విమల ఫెళ్ళున నవ్వింది. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ లేదంది. ఉన్నదల్లా పరప్సర ఆకర్షణా, హంచా మాత్రమే నంది. నైసర్గికమైన ఆ వాంఛనూ, ఆకర్షణనూ దొమ్మలేని నైతిక వాదులు ప్రేమ అని పిలిచి అన్యాయం చేశారని చెప్పింది. శీలం అన్నది ఆడదానికీ, మగవాడికి అనవసరమని చెప్పింది.
రోజు రోజుకూ ఈ విషయాలు తన తలకూ ఎక్కాయి. తను కూడా స్వేచ్చా ప్రణయ వాదాన్ని ఆమోదించాడు. ప్రచారం చేశాడు. కానీ ఇదంతా ఒక ఆడది తన స్వార్ధం కోసం చేస్తున్న పనని తనకు తోచలేదు. ఛ! విమలనని ఏం లాభం? అడబుద్ది ననాలి. అడబుద్ది ఎప్పుడూ వక్రమే. ఏ మగవాడి జీవితం నాశనమైనా అందుకు కారణం తప్పకుండా ఆడదే. ఆడదాని హృదయంలో ప్రేమ లేదు . ఒట్టి కోరికలు. శరీరంలో రక్తం కాదు ఉన్నది, కల్మషత్వం , స్వార్ధం. అందుకే ఎవరో మహానుభావుడు సరిగ్గా అన్నాడు -- ప్రతి ఆడదానికి ఏ క్షణం లోనైనా సరే ఇద్దరు మగాళ్ళ మీద మనసుంటుందని . ఛ! తాను ఆడదాని చేతిలో మోసపోయాడు. తన చదువు తో,పరువు మర్యాదలతో ఒక ఆడదానికి పాదాభిషేకం చేశాడు. ఇక జీవితంలో ఆ పని చేయడు. ఆడదాన్ని నమ్మడు. ఉమాపతి మనస్సు ఆలోచనలతో కాలిపోయింది. కడుపులో కోపం, అవమానం , ఆకలి పట్లు తప్పుతున్నాయి. హోటలు కు వెళ్ళాలను కున్నాడు. తల దువ్వుకోవటానికి నిలువుటద్దం ముందుకు వెళ్ళాడు. తన ప్రతిబింబం తనకే గుర్తు దొరకటం లేదు. తల పూర్తిగా చెదిరిపోయింది. దువ్వుకోవటానికి దువ్వెన కోసం వెదికాడు. ఎక్కడా కనిపించలేదు. విమల తీసికెళ్ళి ఉంటుంది. ఉమాపతి కి బిగ్గరగా నవ్వాలని పించింది. అలాగే చింపిరి తలతో గదికి తాళం వేసి బయలుదేరాడు.
మద్రాసు వీధులు సందడిగా, పసందు గా ఉన్నాయి. చుక్కల నంటే భవనాలూ, చూరు జారిన గుడిసేలూ సంఘానికి ప్రతి బింబం లాగు ఉన్నాయి. కృష్ణ పక్షం కాబోలు; చంద్రుడు యిప్పుడే ఉదయించాడు. వెన్నెల భవనాల మధ్య నుంచి చారలు చారలుగా కనిపిస్తుంది. మోటార్ల హారన్లు, రిక్షాల గంటలూ వింటూ హోటలు కెళ్ళి భోజనానికి కూర్చున్నాడు ఉమాపతి.
"హల్లో! ఇఫ్ ఐ యామ్ కరెక్ట్ -- మీ పేరు ఉమాపతనుకుంటాను." ఎదురుగా కూర్చున్న వ్యక్తీ పలకరించాడు.
ఉమాపతి, సారధిని గుర్తు పట్టాడు. ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ ఇద్దరూ భోజనం చేశారు. సారధి ఉమాపతి ని తన గదికి రమ్మని పిలిచాడు. తను ఉన్న మానసిక స్థితిలో ఎవరో ఒకరు మాట్లాడడానికి ఉండడం మంచిదని ఉమాపతి సారధి గదికి వెళ్ళాడు.
సారధి గది చాలా శుభ్రంగా ఉంది. అన్ని రకాల పుస్తకాలూ అందంగా షెల్ఫు లో చక్కగా అమర్చి ఉన్నాయి.
"ఈ పుస్తకాలన్నీ మీరు కొన్నవేగా?' ఉమాపతి అడిగాడు.
'చాలా కొన్నవే. నాకు పుస్తకాలు కొనడం ఒక పిచ్చి. అందులోనూ సెక్సు, ఎకనామిక్స్ పుస్తకాలు" అన్నాడు సారధి కుర్చీ తెచ్చి వేసి.
'సారధి గారూ, మీకొక విషయం చెప్పాలి" అన్నాడు ఉమాపతి , తలవంచుకొని.
"చెప్పండి."
"విమల నన్ను వదిలేసి వెళ్ళిపోయింది."
"సక్సెస్! గ్రాండ్ సక్సస్! ప్రకాశం నాతొ మీ పురాణం చెప్పినప్పుడు సరిగ్గా నేనిలాగే జరుగుతుందని జోస్యం చెప్పాను. అలాగే నా మాట జరిగి తీరింది. చూశారా, డబ్బండీ , డబ్బు! మీ దగ్గర తైలం ఖాళీ కాగానే మరో గని చూసుకుంది. అందుకే నండి ఆ మహానుభావుడు అన్నిటికీ ధనమే మూలం అన్నాడు. మన పాత వాళ్ళున్నారు చూశారూ -- వారు మరీ ఘటికులు. 'ధన మూలం ఇదం జగత్' అన్నారు."
ఉమాపతికి విసుగు పుట్టింది. తన గుండెను కలుస్తున్న మాటను చెప్పితే సానుభూతి గా ఒకమాటైనా అనకుండా ఉపన్యాసం ఇస్తున్నాడేమని చిరాకు పడ్డాడు.
"మీరేవర్నీ ప్రేమించటం లేదూ?' ఉడుకు మోతుతనం తో అడిగాడు ఉమాపతి.
"నే నవర్నీ ప్రేమించటం లేదు. కానీ నన్నొక అమ్మాయి ప్రేమిస్తోందట! ఆవిడ మా ఆఫీసులో క్లర్కు. నన్ను ప్రేమిస్తున్నానని ఉత్తరాలు రాసి నా ఊపిరి తీస్తోంది."
"ఇంకేం ?" ఎగతాళి గా అన్నాడు ఉమాపతి.
"కాని , దాని వేన కేముందో ఆలోచించారా? పెద్ద ఆర్ధిక సూత్రం! ఆవిడో ఎనభై రాళ్ళు సంపాదిస్తుంది. నేనొక నూట ఇరవై సంపాదిస్తాను. ఇంకా ఎక్కువ సంపాదించే సూచన లున్నాయి. భవిష్యత్తు లో. నాకు సంఘంలో రచయిత గా అంతో ఇంతో పేరుంది. ఇవన్నీ చూసి ఆవిడ నా ప్రాణం తీస్తుంది. కానీ నా బొంద. ప్రేమేమిటండి!ప్రేమ!! అది పుస్తకాల్లో తప్ప జీవితంలోలేదు."
చివరి ముక్క ఉపామతికి సూటిగా తాకింది. అవును. ఆడదానికి ఎప్పుడూ స్వార్ధం ఉంటుంది.
"మీరు పరీక్షకు చదువుతున్నారా?" సారధి ప్రశ్నించాడు.
"వాటి సంగతి విమల మైకంతో నాకు తట్టనే లేదు. ఫీజు కూడా కట్టలేదు" విచారంగా అన్నాడు ఉమాపతి.
'అలాగైతే ఊరి కేడతారా?"
"ఏ ముఖం పెట్టుకొని వెళ్ళడం? అదీగాక అక్కడి కెళ్ళితే పెళ్ళి చేసుకోమంటారు. ఈ జీవితంలో ఆడదాని మీద సానుభూతి చూపదలుచుకోలేదు."
'ఆడదాని మీద సానుభూతి చూపగూడదనుకుంటే పెళ్ళే చేసుకోవాలి. అదేగా చాలామంది హాబీ! జోకులేందుకు గానీ ఇక్కడే ఉంటారా?"
అవునన్నట్లు తలూపాడు ఉమాపతి.
ఆ రాత్రి ఉమాపతి సారధి గదిలోనే పడుకున్నాడు.
* * * *
