Previous Page Next Page 
ఇంద్రధనుస్సు పేజి 8

 

    శారదకు కళ్ళు చీకట్లు కమ్మాయి. ఇంకా తన జీవిత పుష్పం వికసించనే లేదు. దానికొక ప్రత్యెక సౌందర్యం , తావి, తనలోని జీవన మాధుర్యాన్ని తుమ్మెద రాయడు త్రాగుతుంటే కలిగే మధురానుభూతి తెలియవు. కానీ....కానీ దాని కప్పుడే రేకులు రాలిపోయేలా ఉన్నాయి. రత్నమ్మ వెళ్ళిపోయింది. ప్రొద్దు గూట్లో పడింది. శారద దీపమైన లేని చీకటి గదిలో అలాగే కూర్చుని ఉంది.
    "ఏమిటమ్మా , అలా ఉన్నావు?' సుందరమ్మ వచ్చి ప్రశ్నించింది.
    శారద చెప్పింది.
    సుందరమ్మ శారదను కౌగలించుకొంది. ఇద్దరూ నిశ్శబ్దంగా ఏడ్చుకున్నారు.
    "ఏది జరగకూడదో అదే జరిగింది. ఇందుకు ఎవర్ని అనీ లాభం లేదు. చివరకు దేవుడికి కూడా నీమీద దయ లేదు. ఇద్దరు చేసిన పాపానికి ఒక్కరికే శిక్ష!' అంది సుందరమ్మ.
    శారద భోజనం చేయలేదు. సుందరమ్మ కూడా భోజనం చేయనేలేదు. రత్నమ్మ భోజనం చేసి పడుకుంది.
    "ఎందుకలా అదోలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా?' భోజనం వద్ద విశ్వనాధయ్య గారు సుందరమ్మను అడిగారు.
    "ఏం లేదు . బాగానే ఉన్నానే!' పొడిగా నవ్వుతూ అంది సుందరమ్మ.
    విశ్వనాధయ్యగారు సెనగ వామి వద్దకు కాపలాకు వెళ్ళిపోయారు. రాత్రి పది గంటలైంది. ఇంట్లో అందరూ పడుకున్నారు గానీ, ఎవరి మనసూ విశ్రాంతి గా లేదు.
    శారద మనస్సు ఆలోచనలతో నాలికలు పేలికలుగా చీలిపోతూ ఉంది. తాను శీలం చెడిన కన్య! పైగా  కడుపుతో ఉంది! ఇలాంటి తాను ప్రకాశానికి భార్యగా ఎలా తగుతుంది? శారద చుట్టూరా చూసింది. చీకటి నిశ్శబ్దం. గది తలుపు తీసుకొని నడవ లోకి వచ్చింది. ఎవరూ లేరు. దొడ్డి దోవ గుండా బయలుదేరింది. గంట పదకొండు దాటకున్నా ఊరు పూర్తిగా మాటు మణిగిపోయింది. గుడ్డి కాంతిని చిమ్ముతున్న పంచాయితీబోర్డు ఎలక్ట్రిక్ దీపాలు, కడుపులో కాకతో నిద్రరాని కుక్కలు ఊరిని ఏలుతున్నాయి. ప్రకాశం యిల్లు చేరి కిటికీ లోంచి తొంగి చూసింది. ప్రకాశం పడుకుని చదువు కుంటున్నాడు. మెల్లగా తలుపు తోసింది. గడియ వేసి ఉంది. తలుపు చప్పుడుకు ప్రకాశం లేచి వచ్చి తలుపు తీశాడు. ఎదురుగా శారద నిలబడి ఉంది. ఆశ్చర్యం, సంతోషం, ఉద్వేగం అతనిలో ముప్పిరి గోన్నాయి.
    "లోపలికి రా , శారదా!" అన్నాడు.
    శారద అడుగులో అడుగేసుకుంటూ వెలుతురు లోకి వచ్చి నిలబడింది. ప్రకాశం , శారద కేసి చూచాడు. ఏడ్చి, ఏడ్చి కళ్ళు ఉబ్బి ఉన్నాయి. బుగ్గల మీద కన్నీళ్లు చారికలు కట్టాయి. కళ్ళకు కాటుక, ముఖంలో కుంకుమ -- ఏమీ లేవు.
    "ఏం శారదా, అలా ఉన్నావు?' ఏమనాలో తెలియక ఏదో అడగాలని అన్నాడు.
    శారద జవాబు చెప్పలేదు. బుగ్గల మీదుగా ధార కడుతున్నాయి కన్నీళ్ళు.
    "ఏం శారదా?"
    "........."
    "అమ్మ ఏమైనా అందా?"
    కాదన్నట్టుగా తల ఊపింది.    
    "మరింకేమిటి, శారదా?"
    "శారద ఏడుస్తుంది కాని జవాబు చెప్పలేదు.
    'చెప్పు శారదా, ఎందుకిలా ఏడుస్తున్నావు?"
    "నన్ను ....పెళ్ళి చేసుకోకండి."
    ప్రకాశం త్రుళ్ళిపడ్డాడు.
    "ఎందుకూ?"
    శారద తల వంచుకుంది.
    "ఎందుకు శారదా?"
    శారద గిరుక్కున తిరిగి బయలుదేరింది.
    "అగు శారదా. నా మాటకు జవాబు చెప్పు. నన్ను పెళ్ళి చేసుకోవడం నీకిష్టం లేదా? ఇష్టం లేకపోతె చెప్పు. తాంబూలాలు పుచ్చుకున్నా ఫరవాలేదు. విశ్వనాధం మామయ్యతో చెబుతాను.'
    "కాదు"
    "ఎందుకు నన్నిలా బాధపెడతావు? చెప్పు, శారదా కారణం చెప్పు." ప్రకాశం గొంతు జీరపోయింది.
    "నేను....నేను....గర్భంతో...." తర్వాత మాట్లాడలేక పోయింది. సిగ్గుతో నాలుక చీలిపోయి నట్లని పించింది. శరీరంలో రక్తం కాళ్ళలో నుంచి జారి పోయినట్లయింది.
    ప్రకాశం తలలో రక్తనాళాలు ఒక్కసారిగా చిట్లి పోతున్నాయి. నోటమాట రాలేదు. అలాగే కిటికీ లోంచి బయటకు చూస్తూ కాస్సేపు నిలుచున్నాడు.
    "అ..త..డు ఎవరు?" కాస్సేపటి తర్వాత శాంత గంబీర స్వరంతో ప్రశ్నించాడు.
    "మామయ్యా కొడుకు....."
    "మీరిద్దరూ పెళ్ళి చేసుకొంటారా?"
    శారద తల అడ్డంగా తిప్పింది. మళ్ళీ కాస్సేపు నిశ్శబ్దం గదిని పాలించింది. ఇద్దరి మధ్యా విద్యుద్దీపం మహర్షి ముఖం తేజం లాంటి కాంతిని చిమ్ముతుంది.
    "నే వెడతాను. ఈ పెళ్ళికి మీరు ఒప్పుకోకండి. నేను మీకు తగను. వెడతాను."    
    "ఎక్కడికి?"
    "తెలీదు."
    "జీవితానికి గమ్యం లేకపోవటం చాలా చెడ్డది!"
    "నాకు జీవితం మీద ఆశ లేదు. నేను వెడతాను."
    "వెడుదువు గానీ. నువ్వు చెప్పినట్లు మామయ్యతో చెబుతాను. కానీ, ఒక్కమాట . ఈ ...ఈ ... సంగతి ఎవరెవరికి తెలుసు?"
    "మా అమ్మకు , అత్తయ్యకు."
    "ఇంకా కొన్నాళ్ళ కిది అందరికీ తెలుస్తుంది. అప్పుడు నిన్నెవరు పెళ్ళి చేసుకుంటారు, శారదా?"
    "ఎవరూ చేసుకోరు. అందాకా నేను ఉండనే ఉండను" అంది తలవంచుకునే.
    'అందుకే.... నిన్ను నేను చేసుకుంటాను. నువ్వు ఉండకపోతే మరో శారద నాకు దొరకదు."
    శారద తల ఎత్తి చూసింది. ఆవిడ ప్రకాశాన్ని తల ఎత్తి చూడటం ఇదే మొదటిసారి. అతని పెదవుల మీద వెన్నెల లాంటి చిరునవ్వు. ఆ కళ్ళల్లో అనంతమైన జిజ్ఞాస.
    శారద హృదయంలో దుఃఖం వెల్లువలా పొంగింది. ఆ దుఃఖాన్ని ఆవిడ తనలో అణుచుకోలేక పోయింది. ప్రకాశం, శారద భుజం మీద చేయి వేసి బుగ్గల మీద కారుతున్న కన్నీళ్ళు తుడిచాడు.
    "ఏడవటం చాలు. ఆడదాని జీవితమే కన్నీళ్ళు. ఉన్నవంతా ఇప్పుడే కార్చేస్తే అవసరం వచ్చినప్పుడు అవి కూడా లేకపోతె జీవితంలో శాంతే లేకపోతుంది."
    శారద గట్టిగా ప్రకాశాన్ని వాటేసుకుంది. అతని హృదయంలో తల దాచుకుంటే ఆవిడకు శాంతి లభించింది. అతని స్పర్శ కండలో ముల్లు గుచ్చుకున్నట్లుగా, ఉమాపతి స్పర్శలా లేదు.
    ఎవరో తలుపు దబదబ బాదారు. ప్రకాశం వెళ్ళి తలుపు తీశాడు. విశ్వనాధయ్య గారు, సుందరమ్మ లోపలికి వచ్చి శారదను చూచి కొయ్యబోమ్మల్లా గైపోయారు.
    విశ్వనాధయ్య గారు అవమానంతో తలెత్తలేక పోతున్నారు.
    "ప్రకాశం , నీకు తీరని ద్రోహం చేయబోయాను. దైవానుగ్రహం వల్ల తప్పింది. పెద్ద వాణ్ణయినా చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. క్షమించు."
    విశ్వనాధయ్యగారు కంఠం లో నుంచి మాటలు ఒక్కటొక్కటే బయటపడ్డాయి. వారి కళ్ళలో ఉన్న కన్నీళ్ళు చెంపల మీదికి జారబోతున్నాయి.
    "దైవానుగ్రహం ఉంది కనుకనే తప్పించుకోబోయిన అదృష్టం చేతికి చిక్కింది. ఇందాకా శారద అంతా చెప్పింది. పెళ్ళి తప్పక జరుగుతుంది. మీరు వెళ్ళండి."
    "ప్రకాశం!"
    "అవును, ప్రకశాన్నే నేను. మీరు వెళ్ళండి." విశ్వనాధయ్య గారు ఏమేమో చెప్పబోయారు. కానీ ప్రకాశం వినిపించుకోలేదు.
    ప్రకాశం మళ్ళీ మంచం మీద కూర్చున్నాడు. దీపం వెలుగుతుంది. గదంతా కాంతి నిండి కిటికీ గుండా బయటికి పొర్లుతుంది. ప్రకాశం హృదయం కూడా తృప్తితో, ఆనందంతో నిండి ఉంది.
    మళ్ళీ తలుపు కొట్టిన చప్పుడు.
    ప్రకాశం కాస్సేపు అనుమానించి వెళ్ళి తలుపు తీశాడు.
    "ఏరా, ఇంకా పడుకోలేదూ?' అంది లోపలికి వచ్చిన సావిత్రమ్మ.
    "లేదమ్మా."
    'హరికధ చాలా బాగుంది.' అంది మళ్ళీ.
    "ఏం కధ?"
    "విరాటపర్వం లో కీచక వధ.'
    కీచకు డనగానే ఉమాపతి ప్రకాశం మనస్సులో మెదిలాడు. వెళ్ళి పడుకున్నా, తృప్తితో నిండిన మైకంతో రెప్పలు కరచు కుంటున్నా ఆ ఊహ చెరిగిపోలేదు. ద్రౌపది కళ్ళలో అంత శాంతిని చూసినా కీచకుని లో కామం ప్రకోపించింది. శారద ముఖంలోని పవిత్రముద్ర , కళ్ళలో అంత శాంతి చూసినా ఉమాపతి బలవంతం చేయగలిగాడు. ఎలా వీలయిందో? కోరి వచ్చినప్పుడు శారద సౌందర్యవతి గానీ మిగిలిన సందర్భాలలో కాదె! శారద సౌందర్యం ఆకర్షిస్తుంది కానీ రక్తాన్ని వేడెక్కించి , నరాల్ని చీల్చి వ్యామోహపరచదే! చాలామంది స్త్రీలకూ రూపానికి, హృదయానికీ సంబంధం ఉండదు. కానీ శారద లో అలా కాదు. శారద హృదయమే శరీరం. ఆవిడ శరీరమే హృదయం.....
    ప్రకాశానికి చల్లని గాలి జోల పాడింది. హాయిగా నిద్రపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS