Previous Page Next Page 
మమత పేజి 9

 

    ఒకే అనుభూతిలో సుఖం - దుఃఖం రెండూ నిండిపోవడమంటే ఏమిటో ఇప్పుడు స్వామి మనస్థితిని ఊహించిన వారు అర్ధం చేసుకోగలరు. ఆకస్మికంగా  తల్లిని చూడటం తనకు నిస్సంశయంగా సంతోష కారణమే. కాని అప్పటి తన పరిస్థితి యెటువంటిది? డబ్బు కోసం తాను ఆడరాని అబద్దం ఆడినట్లు నిశ్చయించుకుని తనను అందరూ నీచంగా చూస్తారు. ఈ సంగతి తెలిసిన తర్వాత తను హెడ్ మాష్టారుగారికి ఎలా చూపించగలడు ముఖం. బళ్ళోనూ, ఊళ్ళోను పని కట్టుకొని ప్రతిమనిషి కి తనను ఒక అబద్దాల కోరుగా చిత్రించి యాగీ చేయకుండా వదిలి పెడ్తాడా . శకుని పిలికలున్న ఆ పరాంకుశం ? శారదమ్మ గారు , పావని -- అందరూ కూడా తనను నిజాయితీ లేని మోసగాడి క్రింద జమకట్టి గది ఖాళీ చేయమన కుండా వుంటారా? ఇంత అల్లరి జరిగింతర్వాత మరొకరు మాట నమ్మి తనకు తలదాచుకుంటానికి చోటిస్తారా?
    రోడ్డు దగ్గర నుంచి యింటికి నడిచి వస్తున్నంత సేపూ యిటువంటివి లక్ష ప్రశ్నలు స్వామిని వేధించడం మొదలెట్టాయి. అనుకోకుండా యింత ఆకస్మికంగా తల్లి ఎందుకు బయలుదేరి రావలసివచ్చిందో అతనికి అంతు చిక్కలేదు.
    'ఎలా చిక్కిపోయావురా తండ్రీ! తిండీ వసతీ సరిగ్గా అమిరినట్లు లేదు- పాలు పెరుగూ దొరుకుతున్నాయిట్రా? నిన్నొక యింటి వాణ్ణి చేస్తేగా! నాకీ బెంగ తప్పదు.'
    రఘుపతిగారి యింటికి వచ్చేవరకూ సీతమ్మ గారు ఇదే ధోరణి లో మాట్లాడటం జరిగింది. అంతవరకూ పరిపరి విధాలుగా అలోచించి,గత్యంతరం లేక మొండి ధైర్యం తెచ్చుకున్నాడు స్వామి. ఏం జరిగినా తాను చేయగలిగిందేమీ లేదని అర్ధమయింది. 'మా అమ్మగారు' అంటూ స్వామి పరిచయం చేయగానే 'మీకు వంట్లో -- ' అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది శారదమ్మ గారు. 'ఆ పెద్ద రోగం లెండి. వయస్సు మీద పడటం లా. మునుపటి వోపికపోయింది' అంటూ మామూలు ధోరణిలో సమాధానం చెప్పింది సీతమ్మ గారు.
    ఆ విషయంలో అంతకుమించి సంభాషణ దొర్లకపోవడంతో కుతకుత ఉడుకుతున్న స్వామి మనస్సుకు రవ్వంత ఉపశాంతి కలిగింది.
    కాళ్ళు కాడుక్కోంది వదిన గారు పాపం అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు' అంటూ కలివిడిగా వరస కలిపింది శారదమ్మ గారు.
    అటువంటి యింట్లో అంత చక్కటి వసతి కుదిరినందుకు సంబర పడిపోయిన సీతమ్మ గారు రఘుపతిగారింట్లో బోజనాలయ్యాక 'నా బెంగ తీరిపోయింది రా స్వాములూ. ఎంత సంప్రదాయమైన కుటుంబం. పరాయింట్లో తిండి తిన్నట్లు లేదనుకో' అంటూ తిరిగి వెళ్ళి వంట గదిలో శారదమ్మ గారితో కబుర్ల లో మునిగి పోయింది.
    చీకటి పడిం తర్వాత గానీ భారతి దగ్గర నుంచి తిరిగి రాలేదు పావని. ఇంట్లో మరొక మనిషి కనిపించడంతో , అంతకు ముందు జరిగిన పోట్లాటను తిరిగి ప్రారంభించకుండా మౌనంగా భోజనం ముగించి, ముసుగు వేసుకు పడుకుంది పావని.
    'అమ్మాయికి సమబందాలేమన్నా చూస్తున్నారా వదినగారూ!'
    "చూస్తున్నా మనుకోండి. ఏమైనా ఆ కళ్యాణ ఘడియ రావాలిగదా?'
    'చాలా నిమ్మదైన పిల్లండీ మీ అమ్మాయి' అంది సీతమ్మ గారు. పావని మౌనానికి మూలకారణం అంతకుముందు తల్లితో జరిగిన మహా సంగ్రామమని తెలియక. పావనిని గురించి అంత చల్లటి మాట వినడం శారదమ్మ గారికి జీవితంలో మొదటిసారి అనుభవం. అందుకనే 'ఏం నిమ్మదిలెండి ' అని ఊరుకుంది.
    ఆ రాత్రికి గాని తల్లి ఆకస్మికంగా బయలుదేరి రావడానికి గల ఆసలు కారణం స్వామికి తెలియలేదు.
    శారడంమగారు మరొక పెట్టె మంచమిచ్చింది. తల్లి కొడుకు ఒకే గదిలో పడుకున్నారు. అంతా సర్దు మణిగింతర్వాత 'నిన్న సాయింత్రం మామయ్యా వచ్చాడురా' అంది సీతమ్మ గారు.
    'ఏ మామయ్య ?' అన్నాడు స్వామి.
    'మంగపతి మామయ్య.'
    ఆశ్చర్యమనిపించింది స్వామికి.
    నిజానికి తను రెండు కుటుంబాల మధ్యనూ అన్ని సంబంధాలు తెగిపోయి - రెండవసారి - పది సంవత్సరాలు దాటింది. ఇన్నాళ్ళు మేనమామ ప్రసక్తి లేకుండానే గడిచిపోయింది తన జీవితం. ఇన్నాళ్ళు గడిచాక - ఇన్నేళ్ళు గడిచాక - ఆయన పనిగట్టుకొని తమ యింటికి రావలసిన అవసరం కనిపించలేదు స్వామికి ఎంత ఆలోచించినా.
    కూతురు పుట్టగానే - తన తండ్రి బ్రతికున్న రోజుల్లో - సంబరిపడి పోతూ పనిగట్టుకొని తమ ఊరొచ్చి -- 'ఊరీ అల్లుడూ!నీకు పెళ్ళాం పుట్టిందిరా!' అంటూ పట్టనంత పటిక బెల్లం గడ్డ తన నోట్లో పెట్టి - తనను  ఆకాశానికి ఎత్తిన మంగపతి మామయ్యాను తాను మరిచిపోలేడు.
    ఆ తర్వాత -- తన తండ్రి పోయి నెల తిరగక ముందే 'యింక బ్రతికుండగా నేనీ గడపలో కాలు బెట్టను సీతమ్మా!' అంటూ తన తల్లినీ బెదిరించి శపథం చేసి, బిగ్గరగా కేకలు వేసుకుంటూ తమతో అన్ని బంధాలు శాశ్వతంగా తెంచుకున్నట్లు నడిచిపోయిన మంగపతి మామయ్యా కు తానెలా మరిచిపోగలడు స్వామి. ఎంత చిన్నతనమైతే మాత్రం ఆనాటికి తనకు/
    శ్రీదేవి పుట్టినప్పుడే 'నీ పెళ్ళాంరా స్వాములూ? నీకోసమే నాకడుపున పుట్టినదిరాస్వాములూ ' అంటూ క్షణక్షణం మాట్లాడిన మామయ్య - చివరకు శ్రీదేవిని మరొకరికిచ్చి వివాహం చేస్తూ - తమకు శుభలేక కూడా పంపలేదన్న మాట మాత్రం- ఎలా మరిచిపోగలడు స్వామి?
    ఆనాడు కూడా సీతమ్మ గారు బాధ పడలేదు. కనీసం పడినట్లు కనిపించలేదు. 'డబ్బుకోసం రెండో పెళ్లి వాడికి చేసి శ్రీదేవి గొంతు కోశాడురా అన్నయ్యా!' అంటూ నిట్టూర్చింది. ఆ తర్వాత నెల తిరగకుండా నే శ్రీదేవి భర్త మరణించి నప్పుడు -- 'బంగారు తల్లి- దాని బ్రతుకు బండలు చేశాడురా అన్నయ్యా' అనుకుంటూ విలవిల లాడిపోయింది.
    ఇంత జరిగింతర్వాత తను యింటికి పనిగట్టుకుని మంగపతి మామయ్య ఎండుకోచ్చాడో స్వామికి అర్ధం కాలేదు.
    'ఎందుకొచ్చాడమ్మా మంగపతి మామయ్య.?'    
    'శ్రీదేవి జీవితం అలా అయిపొయింది నీకు తెలుసు గదా ? అచ్చటా ముచ్చటా తీరకుండానే దాని అయిదోతనాన్ని హరించాడా మాయదారి భగవంతుడు. దానికి మళ్ళీ పెళ్ళి చేయాలని ఆలోచనట్రా.'
    స్వామికి కోంత అర్ధమయింది. అంతకు మించి చెప్పలేదు సీతమ్మ గారు. తల్లీ కొడుకుల మధ్య తర్వాత పది నిముషాలు సంభాషణ దొర్లింది కాదు.
    'నీ ఉద్దేశం తెలుసుకుందామని వచ్చాన్రా. దాని బ్రతుకు అలా బ్రద్దలై పోయింది. మీ యిద్దరూ చిలకా గోరింకల్లా కాపురం చేసుకోవలసింది అంతా సవ్యంగా జరిగితే భగవంతుడు ఉంకో రకంగా తలపెట్టాడు. ఈ రోజుల్లో వయస్సు ముదిరిన వాళ్ళే రెండో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా. నిజమే అనుకో నాదేముంది నాయనా -- అటూ యిటూ రక్తం - పెళ్ళంటే వెయ్యేళ్ళ పంట - నువ్వు సలక్షణంగా చేసుకుంటే సంతోషించవలసిన దాన్ని. కాపురం చేయవలసిన వాడివి నువ్వు తండ్రి. నీయిష్ట ప్రకారం జరిపించాలనే నా అభిప్రాయం గూడా.'
    మళ్ళీ ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయారు. శ్రీదేవి రూపం గుర్తుకు వచ్చింది స్వామికి. తాను చూసి పది సంవత్సరాలైంది. శైశవ మాధుర్యంతో నగ్నంగాతనముందు తిరిగిన మూర్తి. ఎంత మార్పు? అప్పుడే వివాహం కావడం; భర్త పోవడం , కష్టాలు, కన్నీళ్ళు జీవితమంటే అర్ధం తెలుసుకోలేని చిరు ప్రాయంలో చితికిపోయిన పచ్చి కుండ. వికసించి  వికసించాకుండానే వాడి నేల రాగ వత్తలైపోతున్న మల్లెమొగ్గ దిరదృష్టం తనను వెక్కిరించింది.
    పగిలి చితికిన పచ్చికుండ -
    రాలిపోతున్న మల్లె మొగ్గ - కలవరించాడు- కంట తడి పెట్టాడు నిద్రలో తడిసిన దిండును చెంపలతో రాసుకుంటూ నిద్రపోయాడు.
    మరునాడు ఎవరెంత బలవంత పెట్టినా వినిపించుకోకుండా తిరుగు ప్రయాణానికి సిద్దమయింది సీతమ్మ గారు.
    'ఇక్కడ ఉండి పొమ్మా' అన్నాడు స్వామి.
    'తప్పకుండా . ఆ మూడు ముళ్ళూ పడ్డాక మీ యిద్దర్నీ చూసుకుంటూ మీ దగ్గర ఉంటానురా. ఎక్కడికి పోతా?' అంటూ ప్రయాణమైంది సీతమ్మ గారు.
    బస్సు కోసం నీరిక్షిస్తున్న సమయంలో అన్నాడు స్వామి.
    'మామయ్య కూతుర్ని చేసుకోడం నాకిష్టం లేదమ్మా' అని.
    'నాకూ అలాగే అనిపించిందిరా ఆలోచించగా. ఈ సంబంధం మళ్ళీ కలిస్తే మీ నాన్నగారి ఆత్మ శాంతించదు.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS