మేష్టారూ!"
తలెత్తి చూశాడు స్వామి.
'ఒకమాట చెప్పనా...' ఆగింది పావని.
వీధి వాకిట్లో ఆగింది వెంకన్న ఒంటెద్దు బండి. అందులోంచి దిగి నీరుకావి పంచెతో ఒక ఆరడుగుల మనిషి పొడుం బుర్రతో సుతారంగా బండి చక్రానికి రెండు చురకలంటించి, ముక్కు పొడుం దట్టించి, సంచీ గొడుగు పట్టుకొని, "చెల్లమ్మా' అంటూ యింట్లోకి వస్తున్నాడు.
పమిట కొంగు వళ్ళంతా కప్పుకుంటూ ఆతురతగా ఎదురెళ్ళిన శారదమ్మ గారు 'ఏమయిందన్నయ్యా? కాయా పండా?' అంటూ అడిగి సమాధానం కోసం ఉత్కంటతో ఎదురు చూసింది.
'దీనికి జన్మలో పెళ్ళి కాదు చెల్లమ్మా పాడు జన్మ నక్షత్రం!'
కిటికీ లోంచి ఈ దృశ్యం చూస్తున్న పావని "మావయ్య లెండి. అయన ఈ భూలోకంలో ఎందుకు అవతరించాడో తెలుసా?నాకు నాదుడ్ని వెతికి పెట్టడానికి!అమ్మ దగ్గర పాతికా పరకా గుంజుకు పోవడం పదిరోజుల కోసారి -- పోషించలేక ఎన్నడో వదిలిపెట్టిన భార్యా రత్నం మీద బెంగ ముంచుకొచ్చి ఆ డబ్బుతో అత్తవారింటికి జేరటం- అ తన ప్రయోజకత్వంతో సంపాదించుకిచ్చిన ఈ పాతికతో ఘనంగా నాలుగు రోజులు ఆవిడ గారితో ఊరేగడం - అఅది అయిపోగానే- వాళ్ళు తరిమేయ్యగానే -- మళ్ళీ మరో పెళ్ళి కాక ఎదిగి కూర్చున్న కూతుళ్ళ తల్లినో తండ్రినో పట్టుకోవడం - ఇదీ వరుస . మూడేళ్ళ నుంచి జరుగుతుంది భాగోతం. యింట్లో కాలు పెడితే కాళ్ళు విరగ్గోడతానని బుద్ది చెప్పాడు నాన్న. అప్పటినుంచీ యెలా అరా తీస్తాడో - అయన కోర్టు పనులకు ఊరు వెళ్ళిన సమయంలోనే రావడం మొదలు పెట్టాడు.
'మజ్జిగ తాగాన్నయ్యా! పాపం ఎండలో కాళ్ళకు బలపాలు కట్టుకు తిరుగుతున్నావు.'
'తిరుగుతానమ్మా - వళ్ళు దాచుకునే మనిషినా ? నీ బిడ్డయితే ఒకటీ నా బిడ్డయితే ఒకటీనా? కానిఎంత తిరిగినా ఔనని ఒప్పించుకోలేక పోతున్నాననే బాధ వుందనుకో - అన్నట్లు మరిచానమ్మోయ్ చెల్లమ్మా.'
తేలు కుట్టినట్లు యెగిరి పడ్డాడు ఆ పెళ్ళిళ్ళ పేరయ్య.
"ఏమి టన్నయ్య ? మరొక సంబంధమేమన్నా గుర్తుకు వచ్చిందా ఏమిటి?'
'నా మతిమండ - సుబ్బావదాననీ -- మా షడ్రకుడు మొన్ననే చెప్పారమ్మా. విజయనగరంలో సుసర్లవారబ్బాయి ఒకడున్నాడని. తల్లి దండ్రులకు ఒక్కగానొక్క కొడుకట. తాతముత్తాల నాటిది -- ఏమిటి? నలభై ఎకరాల అగ్రహారం వుందట. తల్లి కున్న ఏడువారాల నగలూ కోడల కివ్వాలనే నిర్ణయంట/'
'మరి అంత గొప్ప సంబంధ మంటున్నారన్నయ్యా? మా కుటుంబ పరిస్థితులకు నీకు తెలియనివి ఏమున్నాయి గనుక. వాళ్ళకి కట్నం మీద ఆశ వుంటే మనం తూగగలమా అని?'
"అదేనమ్మా అదృష్టమంటే. తండ్రిది అదోరకం తత్వంట. కందుకూరి వీరేశలింగం గారనీ--'
'మరొక సంబంధం సంగతా నువ్వు చెబుతూంటన్నయయా.'
'కాదమ్మా ! మహానుభావుడులే. కట్నాలు తప్పంటూ డంకా బజాయించి చెప్పాడమ్మా. (కన్యాశుల్కం తారుమారైన సంగతి గుర్తు రాక ఆ మహానుభావుడి శిష్యుడమ్మా మన వియ్యండుకుడూ'
అయనగారు కోయ్యపడక కుర్చీలో ఆపసోపాలు పడుతూ చెబుతున్నాడు. క్రింద కూర్చుని తాటాకు విసన కర్రతో విసురుతూ ఆ మాట విని ఆపేక్షగా మరి కాస్త ముందుకు జరిగిన శారదమ్మగారు ' అలాగైతే వెళ్ళి ఆ సంబంధం కుదుర్చుకురా అన్నయ్యా! చచ్చి నీకడుపున పుడతాను. చెవులో యిల్లు కట్టుకు పోరుతున్నా ఆయనకు ఆపాడు కోర్టు గొడవలే గానీ యింటి గొడవలు పట్టవయ్యే. తక్షణం విజయనగరం వెళ్ళి ఆ సంబంధం కుదుర్చుకురా అన్నయ్యా' అంది ప్రాధేయపూర్వకంగా.
'వెళ్ళాలనే వుంది నాకూను. కానీ డబ్బుతో పనాయె. కాస్తా కూస్తా దూరం కాదె మళ్ళీ.'
'ఎంతవుతుందన్నయ్య రైలు ఖర్చులు.'
'ఇందులో ఒక చిక్కుంది చెల్లమ్మా. మా షడ్రకుడి దగ్గర ఏకలవ్య ప్రాయంగా శిష్యరికం చేసి, ఆ సువర్లాయన జ్యోతిష్యం నేర్చుకున్నాడట. అప్పటినుంచి మా షడ్రకుడంటే అయన గారికి తగని గురి. ఈయన్ని తీసుకెళ్ళి ఆయనకు చెప్పిస్తే తప్పకుండా పని జరుగుతుందని నాకు నమ్మకముందమ్మా.'
"ఏ వూరన్నయ్యా మీ షడ్రకుడి గారిది.'
'నెల్లూరు దగ్గర పెద్దారెడ్డి పాలెమనీ -- జిల్లా బోర్డు స్కూల్లో తెలుగు పండితుడుగా వుంటున్నాడు. ఆయన్ని వెంటబెట్టుకుని వెళ్ళాలంటే ఒక పచ్చ నోటన్నా ఉండందే కధ నడవదే'
శారదమ్మగారి ముఖంలోకి చూశాడు ఆశతో మెరుస్తున్న కళ్ళతో. 'పచ్చ నోటే- ఎక్కడ నుంచి తేనన్నయ్యా. అయన దగ్గరా ఈ మధ్య పైసా ఆడటంలా. ఇంట్లో ఈగలమోత- బయట పల్లకీల మోత - అనీ- కోర్టు పనులంటే ఆయనకు ఎక్కడన్నా అప్పు పుడుతుంది గాని- అయన ఖర్చులకు డబ్బడిగితే అగ్నిహోత్రుడై పోతారు.'
'నిక్షేపం లాంటి సంబంధమమ్మా. అవసరపడక పొతే అనక చేయి జారిపోగలదు- నీ యిష్టం. యిన్నాళ్ళూ యింతగా శ్రమపడి తీరా చేతికందిన బంగారాన్ని వదిలేసుకుంటూన్నానునే బాధగా వుంది.'
'ఉండన్నయ్యా! ఇప్పుడే వస్తా -' అంటూ లేచి 'పావనమ్మా అంటూ కేక పెట్టింది శారదమ్మ గారు . ఆ పెళ్ళిళ్ళ పేరయ్య గారి మాటలు మూడు సంవత్సరాల నుంచీ వింటున్నా శారదమ్మ గారు ఆయనే మీదనే యింకా కొండంత ఆశ పెట్టుకున్నారు. తల్లి అమాయకత్వానికి పావని వళ్ళు మండింది. తన పెళ్ళిని గురించి తల్లి అంతగా గిలగిలలాడి పోవడం లో పావనికి అర్ధం కనిపించదు. పేరయ్య గారి మాటలన్నీ విన్నాక, అతడు కొంగ్రొత్తగా వేస్తున్న పధకం అర్ధమైయింది. తల్లి పిలుపుకు విసురుగానే లేచి వంటింట్లోకి నడిచింది.
లోపల తల్లి బిడ్డల మధ్య వాగ్యుద్ధం జరిగింది. చెమ్మగిల్లిన కళ్ళతో, వాచిన చెంపలతో పది నిమిషాల తర్వాత బుసలు కొడుతున్నట్లు ఊపిరి నిడుస్తూ బయట కొచ్చింది పావనీ. వస్తూనే స్వామి గదిలో కొచ్చి 'ఒక సహాయం చేస్తారా మాష్టారూ?' అంది.
పావని డబ్బు అప్పుడుగుతుందేమోనని భయం వేసింది. అంతకంటే ఆమె అడగదగిన సహాయం అతనికి కనిపించలేదు.
'నా దగ్గర ఎక్కువ డబ్బు లేదండి. యింకా ఏడు రూపాయలు మిగిలింది. నెలాఖరు దాకా గడవాలి యింకా '
'డబ్బు కాదు మేష్టారు!'
'???'
'కాస్త విషముంటే పెట్టండి.'
'ఎందుకండి?'
'చావడానికి. ఎందుకండి ఈ పాపిష్టి బ్రతుకు. ఇంట్లోనో, ఊళ్ళోనూ అందరికి బరువై పోయాను. ఈ పాడు పెళ్ళి కాకపొతే లోకం మునిగి పోతుందంటారా? అడవిలో రాతి బండలై పుట్టటం మన్చిదన్దిఏ దిక్కుమాలిన దేశంలో ఆడపిల్లై - పుట్టటం కంటే' అంటూ రుసరుసమంటూ బయటకు వెళ్ళిపోయింది పావని. తల్లితో పోట్లాడినప్పుడల్లా పోయి స్నేహితురాలు భారతి దగ్గర ఆ ఆవిరి వదిలించుకు వస్తేగాని పావనికి ఊరట కలగదు.
కళ్ళ ముందు జరుగుతున్న ఈ తంతునంతా చూస్తూ "ఎవరి బాధలు వాళ్ళవి అనుకున్నాడు స్వామి. బడి వదిలి పరాంకుశం గారు వెంట రాగా యింటికి నడుస్తున్నాడు హెడ్ మాష్టారు . కిటికీ గుండా స్వామిని చూసి అదిరిపడి ఎగిరినట్లు లోపలికి చక్కా వచ్చి, నరహత్య చేసిన పాపాత్ముడ్ని అదిలించినట్లు 'ఏమోయ్ ఇంకా వెళ్ళాలా! ఆవిడగారికంత ప్రాణం మీదకొచ్చి చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటూవుంటే ? మొత్తానికి భలే మనిషివే. ముందు బయలుదేరవయ్యా. నిమ్మకు నీరెత్తినట్లు యిలా కూర్చున్నావా అనక బ్రతికినంత కాలం చేసిన పొరపాటుకు బావురుమంటూ అఘోరించడానికి?' అంటూ మందలించడం తో సంచి పుచ్చుకు బయలుదేరక తప్పలేదు స్వామికి.
'అమ్మగారి కంత సుస్తీ చేస్తే మాట మాత్రమన్నా చెప్పవేం కాదు బాబు అంటూ పరామర్శించిన శారదమ్మ గారికికూడా చెప్పటానికి సమాధానం దొరక్క రోడ్డు దగ్గరకు నడిచాడు. 'లాస్టు బస్సు కోసం. అటు నుంచి కాక- యిటు నుంచి వచ్చిన బస్సు ఆగింది. ఒక తాటాకు బుట్టతో బట్టల సంచితో దిగిన ఒక స్త్రీ మూర్తిని చూసి 'అమ్మా' అంటూ తడబడుతున్న అడుగులతో దగ్గరకు పోయి ఆమె చేతిలోని సంచి మూటా అంది పుచ్చుకున్నాడు.
ఆ వచ్చిన స్త్రీ మూర్తి సాక్షాత్తూ స్వామి తల్లి సీతమ్మ గారు!'
