Previous Page Next Page 
మమత పేజి 10

 

                                                           5


    "ఏం శ్రీదేవి తల్లి! బావను చేసుకుంటావుటే?'
    "ఏం చేసుకోవాలి నాయనమ్మా బావను.'
    'పెళ్ళే' - బోసినోరులో నానిన పచ్చి పెసరపప్పుగింజలు నమలటానికి ప్రయత్నిస్తూ నవ్వింది.
    'పెళ్ళంటే ఏమిటే నాయనమ్మా?'
    'పెళ్ళంటే -- అదీ -- ఆడపిల్లకూ పండగే. తల్లీ -- బావను పెళ్ళి చేసుకుంటావా?'
    'ఎందుకు నాయనమ్మా?'
    'ఓసి వెర్రి తల్లీ -- నీకు బోలెడు బట్టలూ,నగలూ అన్నీ కొనిపెడతాడమ్మా బావ.'
    'చేసుకుంటా నాయనమ్మా.'
    'మరి నచ్చాడుటే నీకు.'
    'ఊ'
    'స్వాములు కేమితే అమ్మా!బంగారపు తీగలాంటి కుర్రాడు.'
    
                             *    *    *    *

    'చిన్ననాడు-'
    శలవలకు మీనమామ ఊరు వెళ్లినప్పుడల్లా యిటువంటి మాటలూ ఛలోక్తులూ వినడం స్వామికి అలవాటై పోయింది. 'పెళ్ళి చేసుకుందాం రా బావా మరి' అంటూ తనను చెయ్యి పుచ్చుకొని చెరువుగట్టు దగ్గరకు లాక్కుపొయేది శ్రీదేవి. తడిసి నానిన బంకమన్ను తో బొమ్మలు చేసి, పది మందిని పిలిచి , ఆ బొమ్మలకు పెళ్లి చేసేసేవారు. అందులో ఒక బొమ్మ పేరు శ్రీదేవి. మరొక బొమ్మ పేరు స్వాములు. 'భడవాకానా! ఎక్కడి కెళ్ళావె యిందాకటి నుంచి?' అనేది నాయనమ్మ.- 'పెళ్ళి చేసుకున్నాం నాయనమ్మ' అనేది శ్రీదేవి. విరగబడి -- వోపిక లేకపోయినా - నవ్వేది ఆ ముసలమ్మ గారు.
    'ఈ భడవకానాలిద్దరికీ వచ్చే మాఘమాసానికి కానిచ్చెయ్యరా. బొమ్మల పెళ్ళిలా చూడ ముచ్చటగా వుంటుంది.'
    'నాకూ చేయాలనే ఉంది. చూద్దాం రాజయ్య బావ ఏమంటాడో.'
    'స్వామి మేనమామ పేరు మంగపతి . కోనేటి గూడెంలో కరణీకం చేస్తున్నాడు. దానికి తోడుగా పదెకరాలు బంగారం లాంటి మాగాణముంది. అంగబలం - అర్ధబలం అధికార దర్పం-- అన్నీ వున్న కామందు . స్వామి కుటుంబం అంతకంటే ఘనంగా బ్రతుకుతున్న రోజులవి. తమకంటే గోప్పవారితో స్నేహాలు, సంబందా బాంధవ్యాలు కలుపుకోవాలనే తాపత్రయం మనిషి రక్తానికే వుందేమో . నీరు పల్లానికే పారాలనే గుణం కంటే - ఎదురెక్కి కొండ శిఖరాన్ని చేరాలనే గుణం దానిది. చెల్లెల్ని యిచ్చినా, చాలాకాలం స్వామి తండ్రి రాజయ్యగారంటే మంగపతి కి అంతగా పడింది కాదు. దానికి కారణం వుంది.
    రాజయ్యగారిది మొదటినుంచి స్థితి గల కుటుంబమే. కాని అయన హయాం వచ్చేసరికి చాలాభాగం తరిగిపోయింది. తాత ముత్తాతల నాటి బ్రహ్మాండమైన ప్రాకారాలు గల లంకంత మండువా యిల్లు - మిగిలిన ఆస్తి పాస్తుల కంటే -- ఆ వంశ గౌరవానికి పతాకంగా నిలిచింది. ఇంచుమించు ఊరికి మధ్యగా ఒక పెద్ద మెరక దిబ్బ మీద కట్టబడటంతో , ఆ ఊరు మొత్తానికి అది కిరీటం లా కనిపిస్తుంది అప్పటి కింకా మేడలు లేవు. ఆ కోసూరు అగ్రహారం లో , బయట నుంచి ఊళ్ళోకి వస్తున్నా వారికి తాటివనాల మధ్య నుంచి కనబడే కట్టడాలు రెండే రెండు. ఒకటి గుడి గోపురం. రెండవది రాజయ్యగారి 'దివాణం' రాజయ్యగారి తాతల కాలం నుంచీ ఆ అగ్రహారాన్ని పరిపాలించిన దివాణమే అది. యాభై పుట్ల మాన్యమున్న శివాలయానికి- ఆ వూరి రామాలయానికి అ కుటుంబం వారే చిరకాలంగా ధర్మకర్తలు. శివభక్తులైనప్పటికీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించడం ఒక సంప్రదాయంగా పెట్టుకున్న కుటుంబం రాజయ్యగారిది. ధనుర్మాస పుణ్య కాలంలో ఊరు ఊరంతా కళ్యాణ మంటపంలా వెలిగి పోయేది.

                           


    రాజయ్యగారి చావడి ఎప్పుడూ పది మంది మనుష్యులతో సందడిగా కనిపించేది. గ్రామానికి కరణం, మున్సుబులూ, పంచాయితీ ప్రెసిడెంట్ వున్నా - రాజయ్య గారి కున్న ప్రతిపత్తి వేరు. కాని గ్రామ రాజకీయాల్లో ఎక్కువ ప్రమేయం పెట్టుకోవడం రాజయ్య గారికి ఎన్నడూ అలవాటు లేదు.
    రాజయ్యగారి చావడిలో పిఠాపురం నుంచి తరలి వచ్చిన ఒక అవధాని గారు నిత్యం మహాభారతం చెబుతుండేవారు. పద్యం చదవడం కంటే వాఖ్యానం చెప్పడంతో అయన ప్రజ్ఞ కొట్టొచ్చినట్లు కనబడేది. ఊరి రాజకీయాలనూ, దేశ కాలమాన పరిస్థితులనూ జొప్పించి వ్యాఖ్యానం కొనసాగించేవాడు. రాజయ్య గారిని ఒక్కొక్కసారి ధర్మరాజుగానో, దాన కర్ణుడితోనో మరీ తిక్క రేగినపుడు సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మతోనో పోల్చేవాడు.
    పర్యవసానంగా ఆ సంవత్సరం జరగబోతున్న స్వామివారి కళ్యాణానికి సదరు అవధాని గారిని రామాయణం గానం చేయవలసిందిగా ఆహ్వానించారు రాజయ్యగారు. అవధాని గారు అమందానంద కందళిత హృదయారవిందుడై - 'రాజయ్యగారూ! ఇంత ఘనంగా జరిపిస్తున్నారు కల్యాణం. స్వామివారి భాగానికి తగినట్లుగా ఒక మంచి భోగం మేళం కూడా ఏర్పాటు చేస్తే బావుంటుందండీ' అంటూ సూచించి. అతను పిఠాపురమంతటి 'ప్రిట్రమోక్సు లైటు' మాదిరి వెలిగిపోతున్న రంగజమ్మను పిలిపించవలసిందని ప్రోత్సహించాడు. నషాళానికి అంటేలా నశ్యం పట్టించి, హుషారుగా ఆ రంగాజమ్మ పడుచుతనపు పసలవిసురుల్ని- పురాణానికి వ్యాఖ్యానం చెబుతున్న ధోరణి లోనే- అంతకంటే పదిరెట్లు ఉత్సాహంతో వర్ణించాడు.' 'సరే' అన్నారు రాజయ్యగారు.
    రంగాజమ్మ 'మేళాన్ని కుదుర్చుకు రావడానికి రైలు ఖర్చులకో పాతిక అడ్వాన్సుగా పుచ్చుకుని, నున్నగా క్షురశర్మ చేయించుకుని, చలువ ధోవతి కట్టి, జరీ ఉత్తరీయం వేసుకుని, వెండి పన్ను పొడుం బుర్ర బొడ్లో దోపుకుని, ముస్తాబై వెళ్ళిన అవధాని గారు, అన్నట్లే ఆ రంగాజమ్మ భోగం మేళాన్ని కుదుర్చుకొచ్చారు. స్వామి వారికి ప్రతిసంవత్సరం జరిగిన భోగాలోక ఎత్తు ఆ సంవత్సరం జరిగింది మరియొక ఎత్తు. పెద్దలూ, పిన్నలూ ఇసుక వేస్తె రాలకుండా తరలి వచ్చారు మేళం చూడటానికి.
    అంతకు మించి -
    ఆనాటి రంగాజమ్మ ప్రదర్శనం - రాజయ్య గారి జీవితాన్ని తారుమారు చేసింది. రాజయ్య కడుపున పుట్టిన స్వామి జీవితానికి ఆ సంఘటనకూ గల గాడ సంబంధం తెలుసుకోవాలంటే -- పాఠకులకు రంగాజమ్మ జన్మకద కొంత చెప్పక తప్పదు.
    ఆలయ ప్రాంగణం లో కల్యాణ మంటపం ముందు గజ్జ కట్టిన రంగాజమ్మ -- జావళీ పాడుతూ సరాసరి వచ్చి రాజయ్య గారి ముందు కూర్చుంది!- అడ మహాజనంలో కూర్చున్న రాజయ్య గారి భార్య సీతమ్మ గారిని 'ఏమిటి వదినగారూ ఈ అఘాయిత్యం?' అంటూ భుజం తట్టి అడిగింది కరణం గారి భార్య కనకమ్మ గారు.
    'రవ్వలాంటి గువ్వండి- రసగుల్లా పాకం లాంటి పాట ఇంతకూ రాజయ్య అదృష్టవంతుడూ' అన్నాడు కరణం గున్నేశ్వర్రావు.
    'తొందరపడకు బావా! నీ దగ్గరకొచ్చి నీకు గంధం రాసి పసందైన పదం పాడిస్తా- వో పదిరూపాయల నోటి లా పారెయ్ అన్నాడు కరణం గారి బావగారు గురవేశ్వర్ర్రావు.
    'పిలిచిన బిగువుటారా' - ఒకే చరణాన్ని రకరకాలుగా విరుస్తూ -- విసరుతూ రాజయ్య గారి ముందే నిలిచి పాడుతున్న రంగాజమ్మను చూసి 'అక్కడే తిష్ట వేసిందేమిట్రా బావా ? ఆలయం డబ్బు బోలెడు తగలేసి బోగం మేళం పిలిపించింది స్వామివారి భోగానికా లేక ఈ రాజయ్య వైబోగానికా?' అన్నాడు కరణంగారింక తాళలేక.
    'తాళలేనురా'
    రంగజమ్మ పాడుతుంది రాజయ్య గారి కళ్ళలోకి చూస్తూ. చలనం లేని శిలా ప్రతిమలా కళ్ళు అలాగే అప్పగించి సర్వ ప్రపంచాన్ని విస్మరించి వింటున్నాడు రాజయ్యగారు. కాదు కాదు చూస్తున్నారు.
    రంగాజమ్మ!
    జరీతో మెరుస్తున్న పట్టు చీరను ఒరిపిడి పెడుతున్న యౌవన మాధుర్యం. సౌందర్యం కప్పుకున్న యౌవనం.
    'అబ్బ!ఏం మెరుపండీ ' అన్నాడు పిటపిటలాడిపోతూ జబ్బాలను నిక్కుతున్న పట్టుచోళీ అంచుమీడనే ,చూపును సూది  మొనలా చేసి నాటి ఆయాసంతో రొప్పుతూ చూస్తున్న కరణం గున్నేశ్వర్రావు.
    ఒక చరణం పాడి రంగాజమ్మ నవ్వింది. ఆమె కాటుక రేఖలూ సన్నబడి సాగి నవ్వినై. మరొక్క చరణం విరిచి నిట్టూర్చింది రంగాజమ్మ! నుదుటన కస్తూరి తిలకం కుంచించుకుని చిన్నబోయింది. రెండు చేతులూ వంగిన ఇంద్రధనస్సులా వంచి, వింటి నారులా బిగించి, క్రీగంట చూసి చిరునవ్వుల్ని రువ్వింది. రంగాజమ్మ. పంటి మధ్య చిక్కిన పెదవి - రాక్షస వివాహానికి కావాలని లొంగి - వెచ్చటి కౌగిలి నుంచి బయటపడలేక తన్నుకుంటున్న ధన్యురాలిలా అదిరింది రాజయ్యను చూసి. ఒక సిగ్గు, దొంతర కరిగి కళ్ళ నుంచి కారి- కొండబండల తాకినా సెలయేటిలా ఉక్కిరిబిక్కిరై కదిలి- జారిన సయ్యేదను పైకి లాగింది. కదలిన కడలిలా మెదలిన రంగాజమ్మ కంఠన కరిగిన గంధపు పూత చిరుచెమటల పరిమళం తోడూ రాగ - చిరుగాలి గుర్రమెక్కి స్వారీ చేస్తూ -- రాజయ్యగారిని ముట్టడించింది. ఆనాటి నాట్యంలో కరణం గారి ముచ్చట తీరనే లేదు. గురవేశ్వరరావు గుప్పిట్లోనే తడిసి నానింది కరణం గారి కరెన్సీ నోటు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS