'నిజమే ఏం చేస్తున్నట్టూ?' నాలో నేను అనుకున్నట్టు అన్నాను.
'నన్నడుగు అమ్మాయ్ నే చెబుతాను. నా మాటే తీసుకో. నాకు నలుగురు కొడుకులూ, ముగ్గురూ కూతుళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళు చేసేశాను. ఇద్దరమ్మాయిలు స్కూలు ఫైనలు ప్యాసయ్యాడు. ఆఖరిది బియ్యస్సీ ఫస్టియరు దాకా వెలిగించింది. కోడళ్ళు నలుగురూ మాత్రంఫిప్టు ఫారం అవర్సే. చదవమని చెవిలో ఇల్లు గట్టుకుని పోరాడమేనమ్మా నేను చేసిన నేరం. ముసిల్దానికి చచ్చే నాటికి చదువు పిచ్చి పట్టుకుంది అని కోడల్లె కాదు కూతుళ్ళు కూడా సాధారణంగా నా దగ్గిర కొచ్చి పదిరోజులుండదు. చెప్పి చెప్పి నా ప్రాణం విసుగెత్తి పోయింది. అందుకని ఆదర్శ ప్రాయంగా ఉంటుందని నేనే ఇలా సాహసించాను. ఆ పూర్వపు రోజుల్లోనే మా నాన్నగారు అనేక విధాల ప్రోత్సహించి నన్ను చదివించారమ్మాయ్. పెళ్ళికి ముందే బియ్యే ప్యాసయ్యాను. మళ్ళీ ఇప్పుడవన్నీ తిరగేస్తుంటే తల ప్రాణం తొక్కి వస్తోంది. అయినా నాకు విచారం లేదు. ఉన్న వాటిలో ఇంతకంటే మంచి కాలక్షేపం లేదని నా ఉద్దేశం. ఇంక మా వాళ్ళున్నారు. పొట్ట నింపుకోడం కోసమే పుట్టిన బుద్ది మంతులు. నా మీద నువ్వూ నీ మీద నేనూ పోటీలు చెప్పుకోడం తప్ప రుచి గల వ్యాసంగం వాళ్ళకి దొరికినట్టు లేదు. దాంతో పోటీలు విరోదాలూ ఎక్కువై పోయి చాలా మందికీ ఒకరితో ఒకరికి మాటలు లేవు. నేను మొదలెడితే వీళ్ళకి సిగ్గైనా రాదా అని మొదలెట్టాను.'
అప్పుడే ఆవిడ మాటలకి ఆ చుట్టూ ప్రక్కల వాళ్ళందరూ అక్కడ మూగేరు.
"మీరిలా చదువుతుంటే తాతగారేం అడ్డు పెట్టరా?' అని సందేహం వెలిబుచ్చాడొక పాతికేళ్ళ వామన మూర్తి.
"ఎవరమ్మా చంటేబ్బాయ్ అదీ?' అందావిడ. అందరం గొల్లున నవ్వెం.
'ఎక్సైజు సూపరేండెంటు పని చేసి రిటైరాయాయన. అందరూ ఎక్సైర్ సైజు సూపరేండెంటు అనేవారు. తలెత్తి చూడవలసిన గంబీర మూర్తి అది. నిజానికి ప్రోత్సహమన్నది నాకు ఆయన్నుంచే వచ్చింది. ఉద్యోగం చేసినన్నాళ్ళూ ఆయనకి బియ్యే లో పోయిన పార్టు త్రీ పూర్తీ చెయ్యాలనే ఉద్దేశమే లేక పోయింది. ఇప్పుడు నన్ను చూసి కాబోలు మొన్న మార్చి లో ఎపియరై ఒక్క చాన్సు లో కంప్లీటు చేసేశారు!"

'విన్నారా, వింటున్నారా ఈవిడ చెప్పేది ఏమిటో!"
అనుకుంటూ అయన కోసం పెట్టి అంతా గాలించాను. ఈయనా మరి కొందరు ప్రబుద్దులూ ఓ చోట చేరి గుప్పెడేసి చిల్లర ముందేట్టుకుని 'రమ్మీ' ఆడుకుంటున్నారు! 'ఎవళ్ళ లోకం వాళ్ళది గదా!' అనుకున్నా. ఆ మాట మళ్ళీ నాకే తప్పుగా తోచి నాలిక కరుచుకున్నాను. ఈయన లోకం వేరూ, నా లోకం వేరూనా? ఎంత మాత్రం కాదు. ఏమైతేనేం రుక్మిణమ్మగారి మాటలతో జ్ఞానోదయమై ఒక్కసారి ఉవ్వెత్తుగా లేచిన నా ఉత్సాహం ఒక్కసారి చప్పగా చల్లారిపోయింది.
* * * *
వారాణాసి లో హరిశ్చంద్ర ఘాట్ లో తెలుగు కుటుంబాలున్నాయని తెలిసి అక్కడ దిగెం. ఇరవై రూపాయాలకి కాస్త మంచి రూమే దొరికింది. ఇంటివాళ్ళే భోజనం ఏర్పాటు చేస్తామని అన్నారని అయన కానుక్కుచ్చాక నాకు సగం బరువు తీరినట్లింది. ఇంటతని తండ్రి, మేం తాతగారని పిలిచే వారం. చాలా మాతకారీ మనిషీ కలుపుగోరుమనిషీ.
'ఎంత అదృష్టవంతురాలివి తల్లీ నువ్వు! ఇరవై ముప్పై ఏళ్ళ మధ్య నున్న పెళ్ళి కాని తెలుగు పిల్లలు చదువుకోసమని ఇంత దూరం ఒంటరిగా సాహసించి వచ్చి నానా ఇబ్బందులూ పడుతూ ఉంటారు. నువ్వు మీ ఆయనతో రావడం, ఇద్దరూ ఒకే పరీక్షకి కూచోడం ఎంత సౌభాగ్యం తల్లీ! కష్టపడి చదవండి. రేపోద్దుటే చీకటుండగా లేచి చక్కగా గంగాస్నానం చేసుకుని ఆ విశ్వనాదుడ్నీ సేవించుకుని రండి, మీకు తప్పక జయం కలుగుతుంది.'
రెండు రాత్రుల ప్రయాణపు బడలికేమో ఆ రాత్రి కొట్టినట్టు పడుకున్నాం. మర్నాడు అయిదింటికి లేచి పోయాను. ఆ మహానుభావులు మరో అరగంట కి గాని కళ్ళు తెరవలేదు. కాలకృత్యాలు త్వరత్వరగా తీర్చుకుని గంగాతీరం చేరేసరికి అప్పుడే తెలతెలవారుతుంది. నిర్మలమైన ఆ పుణ్యనదీ జలాన్ని రెండు చేతుల్తోనూ ఎత్తి పోసుకునేటప్పుడు నాకు కలిగిన మధురానుభవమూ , ఎదుటి సుందర సూర్యోదయ దృశ్యమూ నేను మాటలతో వర్ణించలేనివి. అప్పుడే అక్కడికి చాలా మంది వచ్చి స్నానాలు చేస్తున్నారు. 'భాగీరధీ గంగా లోక పావనీ' అని కొందరు గంగా స్నానం చేస్తున్నారు. 'భిక్షాందేహి మదావలంబవకరీ కాశీ పురందీశ్వరీ' అని కొందరు అన్న పూర్ణాష్టకం చదువుతున్నారు. సమయానికి మనసు ఝల్లుమనే లాగ, సర్వ పాపాలూ నశించే లాగ స్వచ్చమైన కంఠంతో చదువు కోడానికి నా కొక్క సంస్కృత శ్లోకమైనా రానందుకు ఎంతో సిగ్గు వేసింది. అయన హుషారుగా పాడుతున్నారు.
'సరి గంగ స్నానాలు సేదామా
ఇవరంగ ఈశుడ్నీ సూదామా'
విశ్వనాద్ గల్లీ దగ్గర రిక్షా దిగి లోపలికి బయలుదేరాం. రకరకాల గాజులూ, ఇత్తడి సామాన్లూ పట్టు బట్టలూ, తీసి పిండి వంటలూ ఏ దుకాణంలో చూసినా పేర్చినట్లు కనబడ్డాయి. అలా ఆ కోట్లని చూసి నడుస్తుంటే ఆ సందు అంత దూరం ఉందనిపించలేదు.
విశ్వనాధుడి గుడిలో విశ్వజనీనమైన భావం ఒకటి నన్ను వివశురాల్ని చేసింది. ఏ ఇతర దేవాలయం లోనూ లేని ప్రత్యేకత ఒకటి ఇక్కడుంది. దేవుణ్ణి వేరే గర్భగుడిలో ఉంది ; ఇదిగో ఈయన్ని చూడ్డానికి టిక్కెట్టి ఇంతా ' అనే నిబంధన ఇక్కడుండదు. ప్రాతః కాలంలో దేవాలయం తలుపులు తెరిచినది మొదలు మళ్ళీ ఓ రాత్రి వేళ మూసేవరకూ ఎవరు పడితే వారు, ఎప్పుడు పడితే అప్పుడు దేవుణ్ణి దర్శించి రావచ్చు. ఎప్పుడూ ధర్మ దర్శనమే. గంగలో ఉదకం చిన్న జారీ చెంబుతో తెచ్చుకుని మన చేత్తో మనం శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. ఆ చల్లని నల్లని లింగం మీద మన తల ఆనించి తరించవచ్చు. 'నా హృదయ ద్వారాలు నీ కోసం ఎప్పుడూ తెరచే ఉంటాయి. నను నీ కెప్పుడు చూడాలంటే అప్పుడు రాబాబూ!' అని పిలిచే విశాల మాతృ తత్వం ఇక్కడ మనల్ని మైమరిపిస్తుంది. విశ్వ కవులందరూ వినుతించే విశ్వరూపం ఇక్కడే మనకు విశద మవుతుంది. దేశ సంపద లో ముఖ్యమైన గో మహాలక్ష్మీని దేవాలయం లోపలికి రానిచ్చి గౌరవించి పూజించడం భారతీయులందరికీ గర్వకారణం. నేను తలలో పెట్టుకున్న పూల మాలను ఆ వొకటి ఫలహారం చేస్తుంటే తెలియక మొదట్లో హడలి పోయాను. మేమిద్దరం కలిసి విశ్వనాధుడి ముందు మోకరిల్లడం మా పూర్వపుణ్య విశేషం.
ఆ పరీక్షల ముందు వారం రోజులూ ఏమనుకున్నారో ఏమో నా కన్న మావారే ఎక్కువ చదవడం నాకు ఆశ్చర్యాన్ని ఆనందాన్నీ కలుగ జేసింది.ఆ ఇంట్లో చేరిన వాళ్ళందరూ ఇంచుమించు మాలా చదువుకోడానికి వచ్చిన వాళ్ళే గనక ఆయనతో మాటలాడ్డానికి గాని ఓ పేకాట వెయ్యడానికి గానీ ఎవరూ లేకపోయారు. పాపం. ఒకట్రెండోజులు చూసి తాతగారితో హస్కు ప్రారంభించారు. అయన అదొక చిత్రమైన తత్వం.
'బాబూ ,నాకూ ఈ నేలకీ అవినాభావ సంబంధముంది. అసలు ఈ స్థలంలోనే ఇంతటి మహత్యం ఉంది. ఈ కాశీలో పరలోక గతుడైన వాడికి పరమే గానీ ఇహ ఇహం లేదట. అందుకనే ఈ గంగని వదిలిపెట్టి నేను అంగ అవతలి కెళ్ళను. ఏమో ఈ ఎండుటాకు ఎప్పుడేగిరి పోతుందో ఎవరి కెరుక!'
ఈ వేదాంతం రుచించక అయన మామ్మగారి దగ్గిర కెళ్ళేవారు. 'ఆయనది ముసలి పట్టేగాని మొసలి పట్టు బాబూ! ఉన్న వూరు వదిలిపెట్టి కుర్రాడు చేస్తున్న నిక్షేపం లాంటి గవర్నమెంటు నౌకరీ మానిపించారు. ఈ దేశం గాని దేశంలో వాడి చేత బలవంతాన ప్రాక్టీసు పెట్టించారు. వచ్చిన తరువాత సంతానం పెరిగింది గాని సంపాదన పెరగలేదు. ఎన్ని బాధలు పడుతున్నామో ఆ విశ్వేస్వరుడికే తెలియాలి. అయన స్వార్ధమే ఆయన్ది.' ఎవరితో చెప్పుకొం బాబూ!'
ఇలాంటి మొరలు ఆయనకు అసలే నచ్చవని నాకు ముందే తెలుసు. అక్కణ్ణుంచి వెంటనే వచ్చేసేవారు. అక్కణ్ణించి నేను చదువుకునే ఆయనకదగ్గిరకి వచ్చేవారు.
'చూడు మంజూ, సాయంకాల మయేసరికి ఆ గంగ మీద పడవలేక్కి అందరూ అటూ ఇటూ ఎలా తిరుగుతున్నారో! మనం కూడా చిన్న ట్రిప్పు'....
'.....తప్పకుండా వెళ్లి వద్దాం అలా ఆ పడవల్ని చూస్తుంటే వాటితో పాటు నా మనసూ ఉయ్యాల లూగుతోందనీ , అవతల ఒడ్డున ఎగిరే గాలి పడగల్ని చూస్తుంటే వాటితో పాటు నా మనసూ ఎగురుతుందనీ మీకు తెలీదా? అన్నీ చూద్దాం. అన్నపూర్ణా విశాలక్ష్మీ దేవాలయాలూ, వ్యాస కాశీ, సారనాద్ విహార స్థలాలూ అన్నీ చూసొద్దాం. కాని ఇప్పుడు కాదు పరీక్షలయి పోయాక.'
ఆయన జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయారు. మరుక్షణం చేత్తో 'మినర్వా గైడు' తో సిద్దమయ్యారు. థాంక్ గాడ్!
రేపు పరీక్ష లనగా సీటింగ్ ఏరెంజి మెంటు చూసుకుందామని కాశీ మహా విద్యాలయానికి వెళ్లేం. ప్రవేశ ద్వారం వద్ద ఎత్తైన వేదిక పై అమర్చబడిన విశ్వ విద్యాలయ స్థాపకుడు శ్రీ మదన మోహన మాలవ్యా శిలావిగ్రహం చూడగానే భక్తీ నమ్రతలతో నా మనసు మోకరించింది. 'ఈ విద్యాపీఠాన్ని స్థాపించిన అయన మొహోన్నతమైన ఆదర్శా లేటువంటివి, నేడు విద్యాలయం లో నడుస్తున్న క్రమశిక్షణ రహితమైన తీరు తెన్ను లేటువంటివి?' అనిపించి కొంచెం బాధ కూడా కలిగింది.
ఆ యూనివర్సిటీ ఏరియా అంతా ఒక టౌన్ లా ఉంది. ఎంత దూరం వెళ్ళినా మేం పరీక్షలకు వెళ్ళేఆర్ట్స్ కాలేజీ భవనం కనిపించనే లేదు. లేత ఇటుక రంగు రాతితో, ఎత్తైన గుండ్రని భురుజు లతో ఆనాటి హైందవ సంప్రాదాయామూ తరువాతి పాశ్చాత్య సంస్కారమూ కలిసి మేళవించి ప్రత్యేకత పుంజుకుంటున్న విద్యాలయ భవనాలు నా కళ్ళని ఇంకా ఇంకా పైపైకి చూడమన్నాయి. శ్రద్ధతో మంచి పద్దతిలో పెంచబడిన రంగు రంగు పూల మొక్కలు నా దృష్టిని క్రిందకు మళ్ళించి లోలోన చూడమన్నాయి. చైత్రమాసం పూర్వార్ధమయినా ఇంకా చిన్న చలీ, కొద్దిగా పొగ మంచూ , రకారకాల ఫల సువాసనలూ నున్నని రోడ్డు మీద నుంచి వేగంతో సాగుతున్న రిక్షాలో అయన పక్క కూచున్న నాలో పులకిత భావాలు కలుగ జేసాయి. కనిపించిన ప్రతి భవనం దగ్గిరా ఆగి విశ్వవిద్యాలయంలోని అది ఏ శాఖకు చెందినదో కనుక్కుని దాన్ని ఆ మూలాగ్రం సందర్శించే తహతహ మనసులో పీకుతున్నా మమ్మల్ని గైడ్ చేసే వారూ లేరు, తగినంత కాల వ్యవదీ లేదు. పరీక్షకు మేం ఏయే హాల్సు లో ఎక్కడెక్కడ కూర్చోవాలో గుర్తు పెట్టుకున్నాక యూనివర్సిటీ కేంపస్ లోనే ఉన్న బిర్లా మందిరం ఒక్కటి మాత్రం చూసి వచ్చేశాము. ప్రత్యేకించి ఆ మందిర సందర్శనానుభవం అవాళే అన్నయ్య కిలా రాశాను.
'విశ్వ విద్యాలయ ఆవరణలో విశేశ్వరాలయం ఒకటి ఉండాలని తోచిన వారి హృదయం ఎంత విశాల మైనదో! దానిని సాధించి ఇంత చక్కగా రూపకల్పన చేసిన వారి మనసు ఎంత అందమైనదో!తిరుగుతున్నారో! మన భారతీయ మత హృదయాన్ని అత్యంత ఆకర్షణీయం గా, కన్నులనే కాక మనస్సులనే అరికట్టే , అమోదాన్నే కాక ఆలోచనల్ని రేకెత్తించే సాంస్కృతిక చిహ్నం బిర్లా మందిరం.
'ఖురాను లోని ప్రతి భావమూ తాజమహలు చలువ గోడల్లో మలచబడి ఉందంటారు. గీతలోని ప్రతి శ్లోకమూ సచిత్రంగా బిర్లా మందిరం లోపలి గోడల పై వ్రాయబడి ఉంది.
'భ్రుగు మహర్షి శాపం ఇక్కడి ఈశ్వరుడికి అంతలేదేమో! ఇక్కడ శివుడు నీలకంఠడై సర్పాభరుడై గంగా శోభితుడై సాక్షార దర్శన మిస్తాడు.
'అ రూపాన్ని దర్శించాలి, ఆ భవన నిర్మాతలు భగవంతుని ఎదురుగా ప్రతినిత్యం ఉండేలాగ ఏర్పరచిన సంగీతం ఆకర్షించాలి. ఎంత ఎత్తు పెంచినా తనివి తీరక ఇంకా ఇంకా అత్యున్నతంగా నిర్మించబడుతున్న ఆ దేవాలయం ఔన్నత్యాన్ని స్వయంగా సగర్వంగా తతెత్తి చూడాలి.
'ఉన్న దున్నట్టు ఉత్కృష్టతనంతా ఉత్తరంలో ఉంచగలనా?'
అన్నయ్య వెంటనే రాసిన జవాబు మా మూడవ పేపరు నాడు కాబోలు అందింది.
