Previous Page Next Page 
సంపెంగలూ - సన్నజాజులూ పేజి 10

 

    'ఎంత బాగా రాశావు చెల్లీ, నాకూ మీ వదినకూ రెక్కలు కట్టుకు అక్కడ వాలాలనిపించింది. భక్తీ తత్పరతలోనూ, సౌందర్యారాదనలోనూ పడి పరీక్షకి తర్పణం విడవ లేదు గదా! నీ ఉత్తరం జగరత్తగా దాచి బాగా జ్ఞాన మొచ్చాక నీ కూతురుకి ఇవ్వాలనుంది.
    'ఎలా ఉన్నాయిట పేపర్లు? ఎలా రాశారుట దంపతులు?'
    అన్నయ్య అంటాడు. 'పరీక్షలు పాసయే సుళువు నీకు బాగా వంట బట్టిందని.' నిజానికి అదేమీ పరమ రహస్యమా , బ్రహ్మ విద్యా? పదేళ్ళ పేపర్లు తెచ్చి ఆన్సరు చేసుకోడం, ఇటీవలి సంవత్సరాలల్లో ఇచ్చిన ప్రశ్నలు వదిలేసి మిగిలినవి కొంచెం జాగర్తగా చదవడం, కొంచెం ధైర్యం మరికాస్త వోపికా, మనకీ వచ్చిందేదో అవతలివాడికి తెలిసేలా స్పష్టంగా, క్లుప్తంగా శుభ్రంగా రాయగలగడమూను. పాసయ్ వాళ్ళు అతీత శక్తులున్న వ్యక్తులు కారని తెలుసుకుని, మనం దాన్నెందుకు సాధించలేం అన్న పట్టుదల కలిగి ఉండడం. అవసరం వచ్చినప్పుడు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా అక్కడక్కడ చిన్న చిన్న రిస్కులు తీసుకోడం. ఇంత కన్న నేను వేరే ఆచరించే చిట్కాలు ఏమున్నాయి? ఇవే ఇదివరకు నేను పరీక్షలు పాసవడానికి తోడ్పడినవి. నాకు కావలసిన నలుగురికీ నేను తెలియజేసేవీ అవే. విన్నామానినా పదేపదే మా వారితో చెప్పేవి అవే.
    ఆఖరి పరీక్షఅయిపోగానే కొండంత బరువు దింపినట్లు ఉండడం సహజమే. మొత్తమ్మీద నాలుగు పేపర్లూ నేను బాగానే ఆన్సరు చేశానని పించింది. ఆయన్ని అడిగి చూశాను.
    'మొత్తానికి ఎలా రాశా ననుకుంటూన్నారు పేపర్లు?'
    'రమ్మన్నావ్. వచ్చాను. రాయమన్నావ్ రాశాను'
    'పాసవమంటున్నాను అవుతారా?' ఇద్దరం నవ్వుకొన్నాం.
    ఆవాళ వ్యాస కాశీకి వెళ్ళాం. వ్యాసుడికి భిక్ష దొరక్కుండా చేసి శివుడు పరీక్షించడం , వ్యాసుడు కాశీని శపించడం - ఇలాంటి కధలు నన్నంతగా ఆకర్షించలేదు గాని విశ్వ వాజ్మయ కారుడైన వేద వ్యాసుడి పేర ఒక దేవాలయం వెలియడం సాహితీ ప్రియులందరికీ చక్కని వార్త అనిపించింది అక్కణ్ణుంచి అలా వెళ్ళి కాలభైరవ స్వామి ఆలయం దర్షించాము. కాశీ వచ్చినందుకు గుర్తుగా ఏదో ఒకటి వదిలేయ్యాలంటారే అది అక్కడేట.
    "ఏం వదులుకుంటావేం నువ్వు?' అన్నారు అయన నవ్వుతూ.
    'దేముడు మనకు ఇవన్నీ ఇచ్చింది వదులు కోడానికా ఏమిటి? ప్రతి వస్తువు మీదా నాకు భ్రాంతి ఉంది- నేనేదీ వదులుకో దల్చుకోలేదు!'
    'పోనీ ఇష్టం లేని దేమైనా వొదిలెయ్యకూడదు?'
    'అలా ఒదిలేస్తే అది త్యాగం ఎలా అవుతుంది? అది భగవంతునికి కానుక ఎలా అవుతుంది? రోజూ రోజుకీ ప్రకృతి మీద వ్యామోహం నాకు ఎక్కువవుతోంది గాని తగ్గడం లేదు. ఏది మాత్రం ఎలా వదులుకోను?'
    'అలాంటి నిన్ను నేనెలా క్షణమైనా వదులు కోగలను?' అయన దగ్గిరగా వచ్చారు. నేను దూరంగా జరిగెను.
    తరవాత సారనాద్ చూశాం. బుద్ద దేవుడి పేరున రమణీయ సుందర మందిర మొకటి ప్రత్యెక పద్దతిలో నిర్మించబడి ఉండడం రసజ్ఞుల కోక నవలోక సందర్శనం. కాలం మార్పులకు చలించని బ్రహ్మాండ బౌద్ద స్థూపం చరిత్రలోనే గాక ధరిత్రిలో నిలిచిన పవిత్ర సత్యం. రాగ ద్వేషాలకు అతీతుడైన గౌతముని మనశ్శక్తికి పరీక్షగా నిలిచినవట ఒకప్పుడు లేళ్ళు. ఆయనకు ఇష్టమని ఆ ప్రాంతాలలో పెంచబడే వందలాది చిరు లేళ్ళు వరద లోని సెలయేళ్ళు.    
    ఆ మర్నాడు అలహాబాదు వెళ్ళాం. గంగా యమునల క్రీడల కూడలి- త్రివేణి సంగమం లో - కల్మషమంతా కడిగి వేయబడిందా అనే భావంతో స్నానం చేశాం. సరస్వతి అంతర్వాహివిట. నిజమే . అసలైన విద్య అంతర్గతమే , పైకి ఎందుకు కనబడాలి? తిరిగి వచ్చిన నాడే విశ్వశ్వేరుడికి రుద్రాభిషేకం అన్నపూర్ణకు సహస్ర కుంకుమ పూజా చేయించి ఆ రాత్రే రైలేక్కేశాం.

                          *    *    *    *
    అన్నయ్య వదినా పిల్లల్ని తీసుకుని స్టేషను కి వచ్చారు. నిజంగా మధురిమను చూసిందాకా నా ప్రాణం ఉండబట్టింది కాదు. శ్రద్దగా చదువు కుంటుంటే అదే అస్తమానూ జ్ఞాపకానికి వచ్చేది. ' ఇలా చిన్న పిల్లను వదిలి రావడం భావ్యమా?' అని ఎన్నోసార్లు మనసు తిరగబడింది. దాన్ని చూడగానే నా కళ్ళ నీళ్ళు ఆగలేదు. గట్టిగా పట్టుకుని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసేశాను. నా చేతుల్లోంచి అయన దాన్ని తీసుకుని ముద్దెట్టుకున్నారు.
    "ఏమే మధూ! ఇలా చిక్కి నల్లబడి పోయావేమే? నన్నొదిలి ఇన్నాళ్ళూ ఎలా ఉండగలిగావే? ఏం వదినా ఇది నా కోసం బెంగెట్టుకుని నిన్ను ఎదిపించుకుని తినలేదు గద?'
    'మరేం ఫరవాలేదు. నీ కూతురు నిన్ను మించిన నెరజాణ. ఒకటి రెండు రోజులు బెదిరించింది గాని తరవాత ఆటల్లో పిల్లలతో కలిసి పోయింది. అక్కడ ఆడుకునే పిల్ల లెవరూ లేరేమో దానికి మొహం వాచినట్టుంది కాబోలు.... అయినా మీరిద్దరూ కూడా బలుక్కుని ఒక్క పిల్లని కని దానికి మరీ అన్యాయం చేశారు. ఇదేం బావులేదేమ్మా!'
    'ఆ, ఆ అలాగే అలాగే అంటూ నేను అన్నయ్య వైపు చూశాను.
    'నువ్వెంరా బొత్తిగా అంత నీర్సంగా ఉన్నావ్? ఆఫీసులో పని చాలదన్నట్టు ఆ ప్రైవేట్లు ఎందుకు చెప్పు?'
    "ఆ ఈ మామూలు కబుర్లు కేమొచ్చ్జే గాని పరీక్ష లేలా రాశారు? ఏమోయ్ బావా మాటాడవేం?'
    "ఏదో రాశాం , అంతే'
    'బాగా రాసిన వాళ్ళు రాశామని ఒప్పుకున్నప్పుడు గనక? వీళ్ళు ఒప్పుకున్నా ఆ మాట పేపర్లు దిద్దేవాళ్ళు వప్పుకున్నదెప్పుడు? నిన్ను వదలి పెడతానా, ఫలితాలు తెలిశాక అప్పుడే నిలదీసి అడుగుతాన్లె. ఎందుకేనా మంచిది టీ పార్టీలకి ఇప్పట్నుంచీ డబ్బు కూడ బెట్టండి."
    ఒక క్షణం ఆగి తనే మళ్ళీ అన్నాడు.
    'చెల్లెల్ని ఇక్కడ వదిలెయ్యి బావా, నాలుగు రోజులుండి వస్తుంది.'
    'నా అభ్యంతరం ఎప్పుడూ లేదు' అన్నారాయన ముక్తసరిగా.
    'పదిహేను ఇరవై రోజులై ఇల్లు వదిలేసి వచ్చాం. దాసీ దానికి, పాలవాడికీ చాకలాడికీ ఇలాంటి వాళ్ళకి కబురంపించి ఇల్లు చక్కదిద్దుకునే సరికి మరి నాలుగు రోజులవుతుంది. మళ్ళీ తీరుబడిగా అందరం వస్తాంగా. ఇప్పటి కొదిలేయ్యండి, అన్నాను నేను.
    రైలు గంటయింది. పెట్లోంచి రసగుల్లా డబ్బాలు, గంగ బుడ్లూ, కాశీ తాళ్ళూ, విశ్వనాధుడి ఫోటోలు తీసి వదిన కిచ్చాను. ఇంకా ఏవేవో మాట్లాడుతూనే ఉన్నాం, మధురిమ పిల్లలకి టాటా చెబుతూనే ఉంది, రైలు కదిలింది. నాకు అన్నయ్య రూపమూ, వాడు ఎత్తుకున్న చిన్నారీ అలా కళ్ళల్లో ఉండిపోయారు. వచ్చిందగ్గిర్నించీ వెళ్ళేదాకా అది వాడ్నిఏదో కొనిపెట్టమని వేధించుకు తింటోంది. వాడు దానికేదో చెప్పి ఊరుకోబెడదామన్నా అది వూరుకోవడం లేదు.
    అందరూ అతిసామాన్యామైన బట్టలు కట్టుకున్నారు. వదిన పమిట చెంగుని ఒకటి రెండు మసిగలు కూడా చూసినట్టు గుర్తు. మెళ్ళో నగలు కనబడకుండా కప్పుకుంది. ఎందుచేత?
    మధురిమ ద్వారా నాకు అక్కడి భోగట్టాలు కొన్ని తెలిశాయి. ఇదీ ముకుందూ, సీత కలిసి ఆడుకునే వారుట. కలిసి భోం చేసేవారుట. చిన్నారిని మాత్రం వాళ్ళమ్మ వీళ్ళతో కలవనిచ్చేది కాదుట.
    'పాపం అదేం పాపం చేసుకుంది?"
    "దానికేమితో జబ్బుటే అమ్మా! ఎన్ని తిన్నా అదింకా అడుగుతూనే ఉంటుంది. కడుపు ఇంత ఎత్తుగా ఉంటుంది. నువ్వు చూళ్ళేదుటే?'
    ఇంటికి వెళ్ళగానే రిప్లై కార్డు రాశాను దాని ఒంట్లో ఏం బాధో చెప్పమని వెంటనే జవాబు వచ్చింది.
    'చిన్న పిల్లలకు వచ్చే పెద్ద రోగాలేముంటాయ్? అజీర్ణం. అంతకన్న ఏం లేదు. ఇప్పుడు నయంగానే ఉంది. అతిశయోక్తులకి లేని పోనీ వూహగానాలకీ నీ కూతురు నిన్ను మించిన చెయ్యిలా ఉందే!'    
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS