Previous Page Next Page 
శరన్మేఘం పేజి 9

   
    ఇక్కడా ఈ రోగుల మధ్య? మూలుగులూ బాధలూ? మందుల కంపూ లోషను వాసనా? వీటి మధ్యా?"
    "ఏవిటి గోపాలం ఇన్నింటి మధ్య ఇన్నాళ్ళ నుంచీ మీ అన్నయ్య ఉండడం లేదూ."
    "అదికాదు వదినా అనారోగ్యంతో యింక తప్పక వుండడం వేరు ఏ అనారోగ్యం లేకుండా....."
    "ఏం ఫరవాలేదు-"
    సునంద మాటలు విని శివరాం నిశ్చేష్టుడయ్యాడు తనతోపాటు ఇక్కడ వుంటుందా ఈ నాలుగైదు రోజూలూ ఇలాంటి వుత్తమ ఇల్లాలి గురించేరా తను ఇప్పటిదాకా అలా ఆలోచించింది? ఛీ .... ఛీ.... తను యెప్పుడూ సునందకి అన్యాయమే చేస్తున్నాడు. ఆఖరికి ఆలోచనల్లో కూడా.
    శివరాం కళ్ళలో నీళ్ళు నిలిచాయి. అప్పుడే వెలిగిన లైట్ల కాంతిలో, ఆ కన్నీటి పొరగుండా చూసిన శివరాంకి. సునంద ఇంద్ర ధనస్సును రంగుల్లో వెలిగిపోతూన్న ఒక ఉత్తమ దేవతలా కనిపించింది.    

 

             
    
                                         7

    "అక్కయ్యా నువ్వు అటు ఆఫీసుకి వెళ్ళి చాకిరీ చేసుకురావడమే కాకుండా అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ ఇటు హాస్పిటల్ కి కూడా వెళుతూ ఉండాలి. ఇలా పగలల్
లా పొట్టు పొట్టు అవుతూ మళ్ళీ ఇంట్లో కూడా చాకిరీ ఎందుకు? ఇంట్లో పనులేం ముట్టుకోకు. అన్నీ నాకు పది లెయ్యి నేను చేస్తాను" అంటూ తననేమీ ఎక్కువ పని చెయ్యనియ్యకుండా వారిస్తూ చేతిలో పని అందుకుంటూ వచ్చిన కొత్తలో తన వెనకాల కూడా కూడా ఉండే రత్నంలో. ఈ మధ్యన ఈ మార్పు ఎందుకు వచ్సిందో అర్ధం కావడంలేదు సునందకి-
    ఈ మధ్య పండగకని పుట్టింటికి వెళ్ళివచ్చాక ఇంట్లో ఏం పనీ ముట్టుకోవడంలేదు రత్నం. కంచంలో కూడా చెయ్యి కడిగేసుకుని వెళ్ళి పడుకోవడం పొద్దెక్కి లేవడం. ఎప్పుడూ బద్ధకంగా కూచోవడం. రెండు పూటల వంటా కూడా తనమీదే నెట్టెయ్యడం. చిన్న పనికికూడా సాయం చెయ్యకపోవడం ఇలా ఉంది వర్ష. 'ఏవిటిది' అని తనే అడుగుతుంది? ఈ ఊరు ట్రాన్సఫర్ చేయించుకుని తననీ సమయంలో ఆదుకున్నదే చాలు గోపాలం రత్నమూను. అది కాక ఇంట్లో చాకిరీ కూడా చెయ్యమని తను రత్నాన్ని ఏం శాసించగలదు? ఈ పని చెయ్యి అని పురమాయిస్తే ఏం బాగుంటుంది. పూర్వం లాగ అయ్యో అక్కయ్య ఒక్కత్తే చేసుకుంటోందే అని తనంతట తాను రావాలిగాని. అసహ్యంగా చెప్పడం మాత్రం ఎలా? పోనీ ఇంట్లో జరుగుతూన్న పద్ధతి చూసి గోపాలమేనా రత్నానికి చెబితే బాగుండును. తనకి ఇంట్లోనూ, బయటా కూడా చాకిరీతో టైము సరిపోవడం లేదు, ఒళ్ళు హూనం అయిపోవడం మాట అలా ఉంచి.
    తెల్లవార కట్టలేచి వేన్నీళ్ళు కాచి, స్టౌ అంటించి కాఫీ పెట్టి హాస్పిటల్ కి ఓవల్టీసు పంపి. నీళ్ళు పోసుకుని వంట మొదలుపెట్టే టప్పటికి. ఏడు అయిపోతోంది వంట పనీ ఇవతల పనీ తనే చేసుకోవలసి రావడంవల్ల ఎంత కాళ్ళూ చేతులూ విరగదొక్కుకున్నా తొమ్మిదిన్నర అయితే కాని వంట పూర్తి చేయలేకపోతోంది సునంద. ఇల్లు తుడిచి పీటలు వేసి కంచాలు పెట్టడం పనికూడా రత్నం మానుకుందేమో. ఆ పని కూడా చేసుకుని గోపాలానికి అన్నం పెట్టి అతను బట్టలేసుకొనేలోపుగా హాస్పిటల్ కి కేరియర్ సర్ది ఇచ్చాక కాని తను అన్నం దగ్గర కూర్చోవడం పడడం లేదు. రెండు మెతుకులు ఎంత ఆదరా బాదరాగా నోట్లో వేసుకొని పరిగెట్టినా. టైముకి ఆఫీసుకి చేరుకోవడం బ్రహ్మాండం అయిపోతోంది సునందకి.
    పొద్దున్న ఇలా అన్ని పనులూ చేసుకుంది కదా అని. సాయంత్రం ఏమీ విశ్రాంతి లభించడం లేడు ఆమేకి ఆఫీసు నుంచి వచ్చాక కాఫీలు పెట్టి. శివరాంకి మళ్ళీ ఓవల్టీస్ గోపాలంచేత పంపించి సాయంత్రం వంటకి సిద్ధం కావలసివచ్చేది. వంట చేసుకుని ఓ పక్కని పెట్టుకున్నా కకాని. హాస్పిటల్ కి వెళ్ళడానికి వీలుండేదికహ్డు. ఏ రోజునైనా వంట వండడం బాగా ఆలస్యం అయిపోతే ఇంకా రోజుకి హాస్పిటల్ కి వెళ్ళడం పడేదేకాదు. అయ్యో ఇవాళ వెళ్ళి ఆయన్ని చూడలేకపోయాను అని రాత్రంతా బాధ. దానికితోడు మర్నాడు వెళ్ళినప్పుడు "ఏం నిన్న హాస్పిటల్ కి రాలేదు? ఏవంత పనులు ముందుకుపోయాయి? నా కంటే ముఖ్యం ఏవిటి పనులు" అని శివరాం నిష్ఠూరంగా అనేవాడు. ఇదీ సంగతి అని ఏం చెబుతుంది తను అతనికి? ఇలా పొద్దస్తమానూ చాకిరీతో బాగా నలిగిపోయి సునంద చిక్కిపోయి కళ్ళు గుంటలు పడుతున్నా, రత్నానికేం పట్టినట్లు లేదు. కాఫీ తాగి, నీళ్ళు పోసుకొని బాబిగాడిదీ తనదీ ముస్తాబు పూర్తి చేసుకొనివెళ్ళి మంచం నడుం ఎక్కి కూచోవడం. ఏ వారపత్రికో ఏ నవలో చదువుతూ పదకొండు గంటలదాకా కాలక్షేపం చెయ్యడం, ఆ తర్వాత తనూ చంటాడూ అన్నంపెట్టుకు తిని మధ్యాహ్నం రెండూ మూడింటిదాకా నిద్ర పోవటం, సునంద వచ్చి సాయంత్రం వంట వండుతూ ఉంటే తను ఇరుగింటికి పొరుగింటికీ పోయి పెత్తనాలు చేసి రావడం, తరుచు బాబిగాడిని కూడా సునంద మీదకే వదిలెయ్యడం, ఇలా ఉంది రత్నం దినచర్య. అదేం అని గోపాలం అనడు.
    పని చెయ్యకపోవడానికి తోడు, రత్నానికి ఈ మధ్య కొంచెం విసుగూ కూడా ఎక్కువయ్యాయి. ఆ కోపంలో ఏ మాట అంటున్నానో అనేది తెలియకుండా అనేస్తోంది. అసలే పౌరుషం అయిన బ్రతుకు తనది ఎవరు ఏ కాస్త మాట అన్నా భరించలేదు అందుకే రత్నం ఎప్పుడేనా తన మీద విసుక్కున్నా మాట జారినా తనలో ఉప్పెనలా అభిమానం కట్టలు తెంచుకునిలేచేది. కాని వెంటనే తనూ, తన పరిస్థితీ, చటుక్కున జ్ఞాపకం తెచ్చుకుని తమాయించుకొని ఊరుకొనేది. తన దురదృష్టాలలో ఇదో దురదృష్టం అని సరిపెట్టుకొనేది రత్నం. తనమీద విసుక్కోవడం ఎప్పుడేనా గోపాలచెవిని పడితే, భార్య మీద తాడి ఎత్తునలేచి "ఏవిటే? వదినతో మాట్లాడే విధానం అదేనా? నీకు రోజు రోజుకీ మూర్ఖత్వం అజ్ఞానం, ఎక్కువవుతున్నాయి, ఈ రోజునుంచి మళ్ళీ ఎప్పుడైనా అలా ప్రవర్తించావో జాగ్రత్త" అనేవాడు.
    అంతే- ఇంకా రోజల్లా రత్నం ధుమ ధుమ లాడిపోతూ ఉండేది. గోపాలం వెళ్ళిపోయాక ఇంట్లో దీర్ఘాలు తీసుకుంటూ శోకన్నాలు మొదలెట్టేది. మాట్లాడితే "దిక్కుమాలిన సంత" అనేది. ఆ మాట తనని ఉద్దేశించి అన్నదే అని సునంద గ్రహించడంతో ఆమెకి కోపం పెల్లుబికి వచ్చేది కాని వెంటనే ఏదో చిన్నపిల్ల పోనిద్దూ అని సర్దుకొనేది. అయినా ఉడుకు మొకుతనం వచ్చి ఏడుపు వచ్చేది- ఉన్న బాధలకితోడు ఈ కొత్త కోత ఏవిటి తనకి? గొడ్డులా దాకిరీ చెయ్యడం, పైగా మాటలు పడడం ఏమీ అనడానికి వీలులేక పోవడం- తన దీనస్థితికి తనమీద తనకే జాలేసి చాటు చాటుకి వెళ్ళి గుడ్లనీళ్ళు కుక్కుకొనేది సునంద.
    రత్నం విసుగులో తనమీద మాట విసిరి నప్పటికంటే బాబిగాడిని కొట్టినప్పుడు ఎక్కువగా బాధపడేది. వాడ జాలిగా ఏడుస్తూంటే సునంద ప్రాణం విలవిల్లాడిపోయేది మనకి ఉన్న విసుగు వాడిమీద చూపిస్తే వాడికేం తెలుసు పసివాడు? అబ్బే? పిల్లల్ని కనగానే సరా? సున్మ్దకి ఎక్కడలేని కోపం వచ్చేది రత్నం మీద-కాని అదంతా లోపలే ఇముడ్చుకొని. వెళ్ళి ఏడుస్తూన్న బాబిగాడిని ఎత్తుకొనేది. బావురుమంటూ ఆ పసికూన దొడ్డమ్మ భుజం మీద వాలిపోయేవాడు. సునంద కళ్ళల్లో నీళ్ళు తిరిగేవి- తను కేకలేసినప్పుడు పిల్లాడిని ఇలా దగ్గిరకి తీసివాడిక భయం లేకుండా పాడు చేస్తోందనీ, అమ్మకంటే దొడ్డమ్మే మంచిదనే భావం వాడికి ఏర్పరుస్తోందనీ రత్నం మరీ "రయ్ రయ్" లాడిపో సాగింది సునందమీద. గోపాలం ఉన్నంత సేపూ ఇల్లు ఏం ప్రశాంతంగా ఉంటుందో ఏమో అతను వెళ్ళిన తర్వాత ప్రతి క్షణం ఇల్లు ఒక నరకంగా తయారవుతోంది సునందకి. ఏం పాలుపోవడం లేదు ఏవిటి చెయ్యడం? రత్నం ఇలా ఎందుకు మారిపోయింది చెప్మా?
    ఆ రోజు ఆదివారం- భోజనాలయ్యాయి. గోపాలం వీధి గదిలో రాసుకుంటున్నాడు. బాబిగాడు నిద్దరపోతున్నాడు. సునంద వంటింట్లో ఏదో సర్దుకుంటోంది. పెరట్లో నూతిదగ్గర ఎవరో వాంతి చేసుకుంటున్నారు. సునంద చెవి ఒగ్గి వింది. సంశయంలేదు ఎవరో పెద్ద శబ్దంతో డోక్కుంటున్నారు. వెంటనే చేతిలోపని అక్కడ వదిలేసి వెళ్ళి చూసింది సునంద-
    "రత్నం!"
    సునందని చూసి రత్నం సిగ్గుపడింది. మెరుపు మెరిసినట్లు ఒక్కక్షణంలో అంతా అర్ధం అయిపోయింది సునందకి. ఈమధ్య బద్ధకంగా. విసుగ్గా, కోపంగా, ఉండటానికి కారణం ఇదా? సునంద ముఖంమీద చిరునవ్వు విరిసింది రత్నం ముఖం సిగ్గుతో మరింత కుంచించుకుపోయింది.
    మర్నాడు సాయంత్రం ఆఫీసునుంచి వచ్చే టప్పుడు దానిమ్మపండూ ద్రాక్షపళ్ళూ తెచ్చి రత్నానికి ఇస్తూ "పుల్లగా నోటికి హితవుగా ఉంటాయని తెచ్చాను తీసుకో?" అంది. "ఏవిటి అక్కయ్య నీచాదస్తం "అంటూ బిడియ పడుతూ అవి తీసుకుంది రత్నం. పెట్టిన రెండు ద్రాక్ష పళ్ళూ చాలక అన్నీ కావాలని మారాం చేస్తూన్న బాబిగాడిని దగ్గరకి తీసి" అమ్మని తిననీ బాబూ, అమ్మని ఇవి తిననిస్తే ఆడుకోడానికి నీకో పాపనిస్తుంది కొన్నాళ్ళలో" అంది సునంద.
    "నువ్వు మరీను - వాడితో ఆ మాటలేవిటి అక్కయ్యా" అంటూ బుగ్గలు గులాబిమొగ్గలు లా ఎరుపెక్కగా అవి అక్కయ్యకి ఎక్కడ కనిపిస్తాయో అని పైటతో ముఖం కప్పుకొని మరీ పారిపోయింది రత్నం.
    సునంద నవ్వుకొని "రత్నం అదృష్టవంతురాలు" అనుకొని వెంటనే తన దురదృష్టం జ్ఞాపకం వచ్చి బరువుగా నిట్టూర్చింది.
    ఓరోజు రాత్రి భోజనాల దగ్గర "రేపటి నుంచి మనకి నెలకి ఎంత ఖర్చు అవుతోందో ఎకౌంటు రాయాలనుకుంటున్నాను"అన్నాడు గోపాలం-అది విని స్తబ్దురాలై ఏం మాట్లాడకుండా ఉండి పోయింది సునంద.
    "మరేం లేదు వదినా నెలవచ్చేటప్పటికి, నాదో రెండు వందల ఏభై వస్తోంది. నువ్వో నూట ఏభై తెస్తున్నావు. నాలుగు వందలూ ఏమైపోతున్నాయొ కనిపించడంలేదు. పదో తారీఖు దాటేటప్పటికి పైసా ఉండడం లేదు చేతిలో"    
    ఎకౌంటు రాస్తే ఉంటుందా నీ చాదస్తం కాని" అంది సునంద నవ్వుతూ.
    "ఆహ ఉంటుందని కాదు. ఏది అవసరమైన ఖర్చో ఏది అనవసరమైన ఖర్చో చూసుకుని అనవసరం అయింది తగ్గించుకోవచ్సుగా"
    "మనం అనవసరం అయింది ఏం చేస్తున్నామయ్యా. ప్రతి పైసా చూస్తే ఖర్చుపెడుతున్నాంగా అందరమూను" అంది సునంద.
    "అందరం అనకు, ఏం రత్నం?" అంటూ సాభిప్రాయంగా రత్నంకేసి చూశాడు.
    "నీకు తెలియదు అక్కయ్యా ఆయన అంటూ న్నది నాగురించి" అంది కోపంగా బుంగమూతి పెడుతూ రత్నం.
    "నువ్వు మాత్రం ఏం అనవసరంగా ఖర్చు పెడుతున్నావు?" మాట వరసకి అన్నదే కాని సునందకికూడా తెలుసు రత్నం చేస్తూన్న దూబరా వాసన నూనెలూ, పౌడరూ, పిన్నులూ, గాజులూ వార పత్రికలూ వీటికింద రత్నం నెల వచ్చేటప్పటికి ఎలా లేదన్నా పదిహేను ఇరవై రూపాయలు ఖర్చుపెడుతోంది. అల్లికలూ, లేసులూ అంటూ అన్నీ కొనడం, వారం పదిరోజులూ అల్లడం, ఆ తర్వాత అవి మూల పడెయ్యడం, దిండు గలేబులూ, టేబిల్ క్లాత్ లూ వీధిలోకి ఏవి వస్తే అవి కొంటూ ఉండడం, చంటాడికి ఎక్కడికేనా తీసికెళ్ళడానికి రెడీగా మంచి జత ఏదైనా లేకపోతే. వెంటనే రెడీ మేడ్ షాప్ లో ఓ కొత్తదికొని తెచ్చేయడం కొనేటప్పుడు బేరం ఆడకపోవడం, వాడేటప్పుడు పొదుపు తెలియకపోవడం, ఇలా ఎన్నేనా ఉన్నాయి రత్నం చేస్తూన్న పనులు. ఇవన్నీ తగ్గిస్తే నెలకి ఏభై రూపాయలు పైన ఆదా అవుతుంది. కాని ఎలా తగ్గించమని చెప్పడం?
    "తగ్గించే ఖర్చులేం లేవంటావా ఇంట్లో?" గోపాలం ఓకంట రత్నంకేసి చూస్తూ అన్నాడు.
    మరిది మరీ మరీ అంటూంటే సునందకి అనుమానం వేసింది. తనేవైనా దూబరా చేస్త్గోందా? అతను తన గురించా అంటున్నది? తను ఏమీ నయాపైసా అనవసరంగా ఖర్చుపెట్టడంలేదే? నెలకి వచ్చే నూటఏభైలోనూ, డెబ్బై ఎనభై రూపాయలు ఆయన మందుల కిందే అవుతోంది. ఇంటద్దె నలభై పాలవాళ్ళకి ముఫ్ఫై తనే ఇస్తోంది- ఇంకేం ఉంది తను వృధాగా ఖర్చుపెట్టడానికి? ఇంతక్రితం అయితే గది అద్దె పదీ, పాలు పదీ అయేవి. మిగలినదాంట్లో బియ్యం పై ఖర్చూ, బట్టలూ వగైరాలు సర్దుకొనేది. ఇప్పుడు అద్దె, పాల ఖర్చూ పెరగడంవల్ల తను బట్టలుకూడా కొనుక్కోవడం మానేసింది. జగపతి కొన్న ఆ చీర తప్ప కొత్తచీర కొనుక్కొని ఏడాది కావస్తోంది. పాత చీరలే కుట్టుకుని కాలక్షేపం చేస్తోంది. ఇంక ఇందులో దూబరా ఏమిటి తన మొహం?.... అయినా గోపాలం ఇలా తనతో డబ్బు ఖర్చు విషయం మాట్లాడితే ఏదో బాధగానూ ఇబ్బందిగానూ ఉంది తన ఖర్చూ ఆయన ఖర్చూ గోపాలానికి బరువుగా అనిపిస్తోందా ఈ బాధ్యత అంతా నెత్తిమీద ఎందుకు పెట్టుకున్నానని పశ్చాత్తాపపడుతున్నాడా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS