సునంద ఆలోచిస్తూ చేసేదేంలేక ఇబ్బందిగా గోడమూలకి ఒదిగి మరో దిక్కుకి చూస్తూ నిలబడి ఉంది. కాస్సేపు అయాక ఏమనుకున్నాడో "సరే" అంటూ బరువుగా నిట్టూర్చి పీటమీంచి లేచాడు గోపాలం వంటిల్లు సర్దుకొని తన గది లోకి సునంద వచ్చేటప్పటికి బాబిగాడిని ఆ గదిలో తన మంచంమీద నిద్ధరోగొట్టి వెళ్ళి పక్కగది గడియవేసుకొంటోంది రత్నం. రోజల్లా అలసి అలసి వచ్చి పక్కజేరేటప్పటికి సునందకి నిద్రవచ్చేసేది పెద్ద ప్రయత్నం చెయ్యక్కర్లేకుండానే కాని ఇవాళ ఏవిటో ఆలోచనలతో నిద్ర పట్టడం లేదు చంటాడిమీద చెయ్యివేసుకొని కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు చదవసాగింది వచ్చిన పద్యాలన్నీ చదవడం అయిపోయింది కాని కంటిమీద కునుకు మాత్రం రాలేదు.
పక్క గదిలోంచి గాజుల చప్పుడు వినిపించింది.
ఇంకా రత్నం గోపాలం నిద్రపోలేనట్టుంది!
సునంద మంచంమీద నుంచి లేచి ఒళ్ళు మత్తుగా విరుచుకుని, మరచెంబులో నీళ్ళు తాగి వచ్చి కుర్చీలో కూచుంది. ఆలోచనలు - శరీరాన్నీ మెదడునీ వేడెక్కించే ఆలోచనలు ఆ ఆలోచనల వెనక్కి వెళ్ళి తనూ శివరాం గంటలూ రోజులూ తెలియకుండా గడిపిన ఆ మధురమైన దినాలు తియ్య తియ్యగా జ్ఞాపకం రాసాగాయి. ఎంత ఆనందంగా గడిచిపోయాయి ఆ రెండు మూడేళ్ళు! సాయంత్రం పడేటప్పటికల్లా ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆఫీసునుంచి తిన్నగా ఇంటికి రెక్కలు కట్టుకొచ్చి వాలేవాడు. స్టేషను డ్యూటీ పడితే ఇంక చెప్పే అక్కర్లేదు. దాదాపు తన చుట్టూనే ఉండేవాడు. గంటకోసారి వస్తూ పొద్దుటినుంచీ సాయంత్రం దాకా గడియారం ఎంత నెమ్మదిగా నడిచేదో సాయంత్రం నుంచి తెల్లవారేదాకా అంత గబగబా పరిగెట్టేది. అప్పుడే తెల్లారి పోయిందా. నేను నమ్మను" అంటూ ప్రతి ఉదయం తమ మంచం దిగుతున్నప్పుడు పెద్ద మారాం చేసేవాడు శివరాం.
ప్రతిరోజూ ఒక వసంత పంచమి!
ప్రతిరాత్రీ ఒక దివ్యానుభూతి!
ఒకర్నొకరు నవ్వించుకుంటూ కవ్వించుకుంటూ తరుముకుమ్తూ ఒకరి హృదయంలో ఒకరు తలదాచుకుంటూ మధురంగా లోకాన్ని మరచి ఒక తియ్యని స్వప్నంగా ఆ రెండు మూడేళ్ళూ గడిపేశారు.
పక్కగదిలోంచి సన్నగా నవ్వులు వినిపించాయి.
గోపాలం ఏదో అని రత్నాన్ని నవ్వింది ఉంటాడు.
శివరాం తనని ఎన్నిమాట్లు అలా నవ్వించే వాడూ జడలో జాజులు తురిమి చడీచప్పుడు లేకుండా వెనకాలేవచ్చి దొంగలా వాసనచూసే వాడు ఎప్పుడేనా తను ఆదమరిచిఉండి ఝాడుసుకుంటే వెంటనే దగ్గరగా హత్తుకొని" మంత్రం వెయ్యనా భయం పోతుంది అంటూ నవ్వించేవాడు.
ఆ నవ్వులూ - ఆ తియ్యని అనుభూతులూ వెచ్చని ఆ రాత్రులూ - అబ్బా - సునందకి ఒళ్ళంతా వేడెక్కి నరనరాల్లోనూ నీరసంగా అనిపించింది ఈ ఆలోచనలు ఇలా వస్తూనే ఉంటాయి కాస్త దృష్టి మరల్చుకోవాలి అనుకోని లైటు వేసి తన షెల్ఫు దగ్గరికి వెళ్ళి నాలుగైదు పుస్తకాలు తెచ్చుకుని కూచుంది.
ఆ పుస్తకాలు ఊరట కల్గించడానికి బదులు ఉద్రేకాన్ని మరింత రెచ్చగొట్టాయి. వరూధి విరహం ఉలూచి ప్రణయం సుందరీ నందుల శృంగారం. సునందలో వెయ్యి జలపాతాల స్పందన సృష్టించాయి.
ఒంట్లోంచి వేడిగా పొగలు.
నరనరాల్లోనూ నీరసం.
శరీరం అంతా విపరీతమైన బరువు
మత్తుగా - బాధగా - తియ్యగా.
పక్కగదిలోంచి గాజుల చప్పుడూ కలకలమని నవ్వులూ వినిపిస్తూనే ఉన్నాయి సునందకి తల అంతా బరువెక్కిపోయింది సమ్మెటతో కొట్టినట్లు పోటు నుదుటి మీద తడిగుడ్డ వేసుకుంది. చేతులు రెండూ గుండెలమీద అన్చుకుని తనని తనకి హత్తుకుంది.
'నా ప్రాణం తీసెయ్యికాని ఈ బాధ భరించలేను దేవుడా' అంటూ మంచానికి చివర పట్టెమీద బోర్లాపడుకుని తలగడాని కౌగలించుకొని ఎక్కెక్కి ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా రాత్రి తెల్లవరలూ యమయాతన అనుభవించింది సునంద. భళ్ళున తెల్లవారింది కాని సునంద గదిలో లైటు ఇంకా వెలుగుతూనే ఉంది-
8
నెలలు నిండినకొద్దీ రత్నం అసలు మంచం దిగడం మానేసింది దాంతో ఇంటో పని అంతా సునంద నెత్తినేపడి క్షణం కూడా తీరిక లేకుండా అయిపోయింది సాయంత్రం సమయంలో హాస్పిటల్ కి వెళ్ళడమే బ్రహ్మాండం అవుతోంది. వెళ్ళినా ఎంతోసేపు కూచోడం పడడంలేదు. అలా అయిదు నిముషాలు మొహం చూపించి వచ్చేస్తూంటే తనకీ బాధగా ఉంటోంది. శివరాంకీ కష్టంగా ఉంటోంది. బాగా కోపం వచ్చి ఒక్కోక్కప్పుడు మొక్కు చెల్లించుకున్నట్లు ఇలా రాకపోతే యేం మానెయ్యి ఒక్కన్నీ ఈ హాస్పిటల్ జైల్లో తోచక అఘోరిస్తూ ఉంటామె. ఈ వెధవ జబ్బు ముంచటంలేదు తేల్చటంలేదు. నాన్చి చంపుతోంది అవున్లే-నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఓర్పుకి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది అంటున్నాడు శివరాం.
దానికి తోడు ఈమధ్య అతనికి మళ్ళీ జ్వరం తగుల్తోంది. బరువుకూడా పెరిగినట్లే పెరిగి మళ్ళీ వారం పదిరోజులనుంచి పౌను అరపౌనూ తగ్గుతోందట. సునందకి గుండెల్లో భీతి బయలు దేరింది మళ్ళీ ఇదేవిటీ దేవుడా! ఏదో ఫరవాలేదు ఆయనకి తగ్గుతోంది తిరిగి ప్రజల్లో పడుతున్నాం అని కొంచెం సంతృప్తిగా సంతోషిస్తూ ఉంటే ఆ కాస్త వెలుగూకూడా లేకుండా చేస్తున్నావా? ఇప్పటిదాకా నా బ్రతుకులో ఆడిన చెలగాటం సరిపోలేదా నీకు భగవంతుడా" ఇలా మౌనంగా తనలో తను ఏడ్చింది సునంద.
తను శివరాం దగ్గర కూర్చుని సావకాశంగా ఒకగంట కష్టం సుఖం చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తేనే కాని తన మనస్సు తేలికపడదు అలా కబుర్లు చెపితే ఆయనకీ సంతృప్తిగా ఉంటుంది. ఆఫీసు వదిలాక వెళితే గంటకాదుకదా అరగంట కూడా కూచోడానికి వీలుండటం లేదు. అందువల్ల ఆఫీసులో ఒక గంట ముందు పెర్మిషన్ తీసుకుని హాస్పిటల్ కి వెళ్దాం అని నిర్ణయించుకుంది సునంద.
పెర్మిషన్ కోసం తీరా మేనేజరు రూమ్ లోకి వెళితే ఆయన తలాపట్టుకుని విచారంగా కూర్చుని ఉన్నారు. సునంద బిత్తరపోయింది అదిచూసి. పెర్మిషన్ అడక్కుండా వెనక్కి వచ్చేద్దాం అనుకుంది. కాని ఇంతలో ఆయనే తలెత్తిచూసి "ఏవమ్మా వచ్చి వెళ్ళిపోతున్నావు?" అన్నారు.
"అది కాదండి మీరేదో..."
మేనేజర్ నీరసంగా నవ్వి "నా బాధ చూశా నువ్వు బాధపడి వెనక్కి వెళ్ళిపోతున్నావు?" అన్నాడు.
సునంద ఏం మాట్లాడలేదు.
ఏం అమ్మా శివరాం గారికి ఎలా ఉంది?" మేనేజర్ కంఠంలోని ఆప్యాయతకి సునంద కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "మళ్ళీ ఈమధ్య జబ్బు తిరగబెట్టినట్టుంది" డగ్గుత్తికతో సమాధానం చెప్పింది "అలాగా పాపం? ఎక్స్ రే తీశారా?"
"నెలకి ఒకటి తీస్తున్నారు. ఓ ఊపిరి తిత్తి శుభ్రంగా ఉంది. తగ్గుతున్నా, ఎక్కువవుతున్నా ఒక లంగ్ కే"
"అలాంటప్పుడు ఆ లంగ్ తీయించేస్తే మంచిదమ్మా. ఏమంటే ఇప్పటికి ఒకటేనా శుభ్రంగా ఉంది. దానిక్కూడా టి.బి ఎటాక్ అయితే..."
విద్యుద్ఘాతం తగిలినదానిలా ఒక్కక్షణం ఉండిపోయి తర్వాత తేరుకుని "డాక్టర్లు కూడా అదే అంటున్నారు. కాని నాకే భయంగా ఉంది లంగ్ తీయించెయ్యడం అంటే"
"భయంలేదమ్మా అల్లా ఒక్క లంగ్ తో జీవిస్తూన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాని బరువు పనులు చెయ్యడానికి ఉండదు.... ఏదో ఈజీ చైర్ లో కూచుని కాలక్షేపం చెయ్యాలి."
"ఆయన ఆరోగ్యంగా నా కళ్ళకి ఎదురుగుండా ఉంటే చాలండి. అదైనా ప్రసాదించ మని వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను"
"ఏం ఫరవాలేదమ్మా ఆయనకి ఆరోగ్యం చిక్కి నీ కష్టాలన్నీ గట్టుఎక్కుతాయి. అవును కాని నువ్వు ఇప్పుడేదో పనిమీద వచ్చినట్లు న్నావ్"
"అవునండి - నాకోగంట ముందు వెల్లడానికి పెర్మిషన్ కావాలి"
"గంటేమిటి రెండుగంటలిస్తాను తీసుకో కాని నాకొక్కపని చేసిపెట్టు" ప్రాధేయపూర్వకంగా అడిగాడు మేనేజర్.
"ఏవిటి చెప్పండి"
"నువ్వో మాటు మా యింటికెళ్ళి మా శాంతకి ఉన్న అనారోగ్యం ఏమిటో తెలుసుకో అమ్మా- మేం ఎవరం అడిగినా చెప్పడంలేదు. డాక్టరుకి కూడా అంతుబట్టడంలేదు నువ్వంటే ప్రాణం ఇస్తుంది కదా నీకైనా చెబుతుందేమో!"
"ఏమిటి? శాంత ఇక్కడే ఉందా? పండగ లయ్యాక జగపతితో బొంబాయి వెళ్ళిపోలేదూ?"
"లేదమ్మా- పండగలనుంచే మొదలు అన్నం తినదు. నిద్దరపోదు. ఎప్పుడూ ఏదో దిగులుగా ఉంటుంది. అస్తమానూ నీరసం. దడా అంటుంది. రోజు రోజుకీ చిక్కపోతోంది. డాక్టర్ ని అడిగితే వంట్లో ఏం అనారోగ్యం లేదు అంటాడు ఏం పాలుపోవడంలేదు. ఇదీ బాధ అని చెప్పదు. నువ్వు వెళ్ళి అడుగు అమ్మా నీకైనా చెబుతుందేమో"
"అలాగే అండీ.... ఇప్పుడే వెళ్తా అయితే" అంటూ సునంద మేనేజరు ఇమ్తిక్ బయలుదేరింది "అయ్యో పాపం శాంతకి అనారోగ్యమా!" అనుకుంటూ.
గుమ్మందాటి హాల్లో ప్రవేశిస్తూన్న సునందకి ఎదురుగుండా సోఫాలో. బాగా చిక్కిపోయి నీరసంగా కూర్చున్న శాంత కనిపించింది. లోపలికి అడుగుపెడుతూనే "ఏవిటి శాంతా వంట్లో బాగోలేదట!" అంటూ పలకరించింది సునంద. సునందకేసి ఒకమారు చూసి సమాధానం ఏం చెప్పకుండానే లేచి వెళ్ళి మంచంమీద గోడకేసి తిరిగి పడుకుంది శాంత.
ఆమె ప్రవర్తనకి ఆశ్చర్యపోయింది సునంద. అదేమిటి? మాటకి సమాధానం చెప్పకుండా అటు తిరిగి పడుకుంటుందేవిటి? తనని చూడలేదా తన మాట వినిపించలేదా? కొంప తీసి శాంతకి మెదడు పాడవలేదు కదా?
"శాంతా! నిన్నె? ఏవిటి అనారోగ్యం?"
ఉహుఁ! ఈ మాటూ మాట్లాడలేదు శాంత.
సునందకి మనస్సు చివుక్కుమంది. ఎందుకొచ్చానా ఈ మాత్రం దానికి అని బాధపడింది. కాని వెంటనే అనారోగ్యంవల్ల మాట్లాడలేక పోతోందేమో అని సమాధానపడబోయింది. మాట్లాడలేకపోతే సంజ్ఞ చెయ్యవచ్చు కదా కూర్చోమని. శాంత ఎందుకిలా ప్రవర్తించింది! చెప్మా? సునంద కేం అర్ధంకాలేదు. పోనీ వెనక్కి వెళ్ళిపోదాం ఏమిటి అనుకుంది. అయినా కాసేపు చూసి ఆ తర్వాత వెళ్ళడం మంచిది అని ఆగింది.
అలా ఆగి చుట్టూ పరికించింది. బ్రహ్మాండ మైన హాలు అది. కింద మొజాయిక్ ఫ్లోరింగ్, పైన అందమైన స్టౌ పెయింటింగ్. కిటికీలకి ఖరీదైన కర్టెన్లూ సోఫాల మీద లతలు అల్లిన కవరింగ్ లూ, నున్నని పాలరాతి స్తంభాలమీద అందమైన సీనరీలు, తెల్లని పాలమీగడ లాంటి గోడకి అక్కడా అక్కడా కేబినేట్ సైజు ఫోటోలు.
ఓ ఫోటో దగ్గర ఆగి చూసింది.
శాంతా, జగపతీ కలిసి పెళ్ళినాడు తీయించుకొన్న కలర్ ఫోటో అది. చిలకా గోరింకల్లాగ ఎంత అందంగా ఉన్నారు ఆ ఫోటోలో వాళ్ళిద్దరూ! ఆ ఫోటో చూస్తే తన పెళ్ళినాటి ఫోటో జ్ఞాపకం వచ్చింది సునందకి. అందులో శివరాం కూడా ఇందులో జగపతిలాగా ఎంతో ఠీవిగా ఉన్నాడు. ఆ మాటకొస్తే శివరాంకి ఉన్న పెర్సనాలిటీ జగపతికేలేదు. ఇవాళిలా టి.బి. వచ్చి హాస్పిటల్ లో ఏడాది నుంచి ఉంటూ, సన్నగా నీరసంగా తయారయ్యాడు కాని ఆ రోజుల్లో ఎలా ఉండేవాడు శివరాం! తన శివరాం?
అలా ఆలోచిస్తూ ఆ ఫోటో కేసే చూస్తూ ఉండిపోవడంవల్ల శాంతావాళ్ళ అమ్మగారు రావడం గమనించలేదు సునంద! తన రాకని తెలుపుతూ ఆవిడ గొంతు సవరించుకోవడంతో ఉలిక్కిపడి సునంద వెనక్కి తిరిగి చూసింది.
రమణమ్మగారు తనకేసి తీక్షణంగా చూసి, ఫోటోవైపు చూసి, మళ్ళీ తనకేసి చూశారు. సునంద తొట్రుపడి నిస్సహాయంగా నవ్వి "అబ్బే శాంతావాళ్ళ పెళ్ళి ఫోటో చూస్తున్నా," అంది.
"ఊ.....ఎంతసేపయింది వచ్చి?" ఆ పలక రింపులో ఆప్యాయత లేదు.
ఇప్పుడేనండీ? శాంతకి వంట్లో బాగాలేదంటేను. చూసి పోదాం అని వచ్చాను"
"శాంతకి అనారోగ్యంగా ఉందని ఎలా తెలిసింది? జగపతి ఉత్తరం రాశాడా?"
"జగపతా?...... నాకా? అబ్బే? మేనేజరు గారు చెప్పేస్తూ..."
"అహ?...." అని ముక్తసరిగా అనేసి సునందని కూర్చోమని అయినా మర్యాద చెయ్యకుండా మంచందగ్గరికి వెళ్ళి "అమ్మా...శాంతా .....పడుకున్నావా తల్లీ" అంటూ పలకరించారు రమణమ్మగారు.
"లేదమ్మా" అంటూ శాంత వెంటనే లేచి కూచుంది.
సునంద తెల్లబోయింది. ఇప్పటిదాకా శాంత కావాలనే తనతో మాట్లాడ లేదన్నమాట. సునందకి అవమానం అయిపోయింది. ఇంక అక్కడ ఒక్క క్షణం ఉండలేక "వెళ్ళివస్తా నండి" అని చెప్పి వెనక్కి తిరిగింది.
"ఉండు నీతో మాట్లాడాలి అలా కూర్చో" ఆ కంఠంలో అధికారస్వరం ఏదో ధ్వనించింది. అక్కడ ఇంకొక్క క్షణం కూర్చోబుద్ధి కాలేదు సునందకి. పైగా అప్పటిదాకా వాళ్ళిద్దరూ కూర్చునే ఉన్నారు తను నుంచునే ఉంది. ఇప్పటిదాకా కూర్చోమనని వాళ్ళు ఇప్పుడు కూర్చోమనడం ఎందుకు? అందుకే అంది కూర్చోనక్కర్లేదు చెప్పండి" అని.
