"బావగారికి ఎలా ఉంది?" అన్నాడు జగపతి.
"నెల్లాళ్ళ నుంచి టెంపరేచరు తగలడంలేదు. అదే సుగుణం" అంది సునంద.
"ఒకసారి చూసివద్దాం కార్లో - బయలు దేరు"
"ఇప్పుడా?"
"బావగార్ని చూద్దాం అనీ. నీకీ చీర పెడదామనీ ఆలోచించుకునే అసలిప్పుడు నేనూ, శాంతా ఈ కారులో వస్త శాంతా! బొట్టు పెట్టి సునందకి ఈ చీర ఇయ్యి" అంటూ జగపతి పేకెట్ అందించాడు.
"నాకు చీర ఎందుకూ? ఇప్పుడేవిటి? మీరు చీర పెట్టడమా?" అంటూ వెనక్కి వెనక్కి వెళ్ళింది సునంద. "కాదూ కూడదు తీసుకోవాలి" అంటూ శాంతా జగపతీ పట్టుబట్టారు. "వద్దు కాక వద్దు" అంది సుంద. "వీల్లేదు తీసుకో వలసిందే" అంది శాంత. జగపతి మొహం చిన్నబుచ్చుకున్నాడు. రత్నం కాఫీలు పట్టుకొని వస్తోంది. తనని అంతటితో వదిలేలాగ లేరు శాంతా జగపతీను వాళ్ళు మరీ హడావిడి చేశాక తీసుకోవడంకంటే, "సరే" అని ఒప్పుకోవదమే ఉత్తమంలా తోచింది సునందకి. జగపతికి అక్క చెల్లెళ్ళు లేరు. తనకి అన్నదమ్ములు లేరు. ఎంతో అబిమనంతో ఇంటికి పట్టుకొచ్చి చీర పెడుతుంటే, తను మరీ మంకు పట్టు పట్టాడం ఏం బాగుంటుంది?
"నీకో తమ్ముడుండి పండక్కి చీర కొని ఇస్తే వద్దంటావా సునందా" అన్నాడు జగపతి బొంగురు పోయిన కంఠంతో. సునంద కళ్ళ నిండా నీళ్ళు నిండాయి. అతని ఆప్యాయతకి హృదయం సంతోషంతో నిండిపోయి "సరే నీ ఇష్టం" అంది.
కాఫీ అయ్యాక హాస్పిటల్ కి వెళధం రమ్మన్నాడు జగపతి భార్య భర్తల మధ్య తను కూడా ఆ కార్లో ఎందుకు వెళ్ళడం అనుకుంది సునంద. కాని చీర విషయంలో తాగే ఇందులో కూడా మెత్తబడక తప్పలేదు. పెట్టిన చీర కట్టుకోమంది" శాంత అవును అక్కయ్యా నువ్వు కట్టికుంటే ఎలా ఉందో చూస్తాను" అంది రత్నం. కొత్త చీరతో ఆయన దగ్గరికి హాస్పిటల్ కా?..... సునంద అంగీకరించలేదు. ఓ పక్కనుంచి శాంతా, మరోపక్క నుంచి రత్నం గొడవపెట్టసాగారు కట్టుకోమని. చివరికి అయిష్టంగా పేకెట్ తీసుకుని-
తీరా గదిలోకి పేకెట్ విప్పితే, సునంద కళ్ళు జిగేలు మన్నాయి ఇంత ఖరీదైన చీర ఎందుకు తనకీ - ఈ జగపతికి అంతా చాదస్తం. విసుక్కుంది. జగపతి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఇప్పుడింత ఖరీదిన్ చీర కట్టుకొని ఆయన దగ్గ్రరికి ఎలా వెళ్ళడం బాబూ అంటూ సిగ్గుపడసాగింది. అవతల జగపతి కారు హారన్ మొగిస్తున్నాడు. "అక్కయ్యా చప్పున బయలుదేరు వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు" అంటూ తొందర చేయసాగింది, రత్నం, దాంతో ఇంక ఆలోచన లతో ఆలస్యం చెయ్యడానికి సునందకి వీలులేక పోయింది.
కార్లో వెళుతున్నప్పుడు జగపతి ఏదో హాస్యంగా అని నవ్వడం, సునందకూడా ఆ నవ్వులో నవ్వు కలపడం, ఎంతసేపయినా జగపతి కాని, సునందకాని శాంత సంగతే పట్టించుకోకపోవడం, దాంతో శాంతకి చాలా ఇబ్బందిగా తయారైంది. అదికాస్సేపటికి అసంతృప్తిగాను, అసహనంగానూ మారి "నాకు తహ్లానేప్పిగా ఉంది. ఇంటికి వెళ్ళిపోతాను" అంది. జగపతి ఒకటి రెండు సార్లు చెప్పిచూశాడు. సునందకూడా ప్రయత్నించింది. శాంత, "కాదు నన్ను ఇంటి దగ్గర దిగబెట్టండి. నేను ఆసుపత్రికి రాను" అని ఖచ్చితంగా చెప్పింది. దాంతో చేసేదేంలేక. శాంతని ఇంటిదగ్గర దింపి, జగపతి సునందా కార్లో హాస్పిటల్ కి వెళ్ళారు.
ఇద్దరూ వెళుతూండగా, మాటల సందర్భంలో సునందకి తన కొత్త సంసారం గురించి ఒకటి రెండు వివరాలు చెప్పాడు జగపతి శాంతకి చదువూ, సంస్కారం తెలివీ అన్నీ ఉన్నాయి. కాని ఎదుటివాళ్ళని అర్ధం చేసుకొనే జ్ఞానం లేదు. మంచో చెడో తనో నిర్ణయానికి వచ్చిం తర్వాత నిజం ఇది అని ఎంత నచ్చచెప్పినా ఇంక వినదు. తన ధోరణే తనది. మానసిక బలంలేని వట్టి పిరికిది. జగపతి కోపం ఎవరేనా లేడీస్ వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంటే ఏదో చెప్పలేని అసంతృప్తితో విలవిల్లాడి పోతుంది. ఆ తర్వాత ఎంత నచ్చచెప్పినా అర్ధం చేసుకోకుండా అలిగి కూర్చుంటుంది. ఇలా చెప్పి చెప్పి చివరికి అన్నాడు జగపతి" ఇరవయ్యో శతాబ్ధపు ఈ కొత్త సాంఘిక పరిస్థితుల్లో, పూర్వంలాగ పరాయి స్త్రీలతో మాట్లాడకుండా ఉండడానికి కుదరదు. ఏదో అవసరం వస్తుంది. ఇంక దాంతో అనుమానం అసూయా పెంచుకుని కూర్చుంటే ఎలాగ చెప్పు అక్కయ్యా? అస్తమానూ భర్తని అనుమానించే స్త్రీ మీద ఆ భర్తకి మాత్రం ఏం ప్రేమ నిలబడుతుంది?"
సునంద ఆ చివరి మాటలు విని ఉలిక్కిపడింది. "ఏమిటి? శాంతా జగపతుల సంసారం. పైకి కన్పిస్తున్నంత ఆనందంగానూ సుఖం గానూ లేదన్నమాట- వీళ్ళిద్దరికీ భగవంతుడు ఏ లోటూ పెట్టలేదు. డబ్బూ, చదువూ హోదా, అన్యోన్యత అన్నీ ఉన్నాయి. ఒకళ్ళ నొకళ్ళు సరిగా అర్ద్జంచేసుకోలేక నందనవనంలా ఉండ వలసిన సంసారంలో పల్లేరుకాయలు పరుచుకుంటున్నారు. అయ్యో - పాపం! శాంతమీద జగపతికి ఏర్పడుతూన్న వైముఖ్యాన్ని తగ్గించడం కోసం. "అలా అనుకోకు జగపతీ - శాంత నిన్ను అనుమానిస్తోంది, ఆమె నిన్ను ఎంతో ప్రేమిస్తోందన్నమాట. ప్రేమించాకపోతే నువ్వు ఎల్లా ఉంటే తనకేం? భర్తని ప్రేమించని భార్యలు నిర్లక్ష్యంగానూ నిర్లిప్తంగానూ ఉంటారు శాంతవలె ఉండరు. సంసారం అంటేనూ నువ్వు అంటేనూ ఎంతో కాంక్షఉంది కనకే ఆమె అలా ఉంటోంది" అంది సునంద.
"అది కాదు సునందా...."డగ్గుత్తికతో ఆ పైన ఇంకా వాక్యం పూర్తి చెయ్యలేక పోయాడు జగపతి. ఎప్పుడూ నవ్వుతూ మనస్సుకి ఏమీ పట్టించుకోకుండా ఉండే జగపతి కంఠంలో. విషాదం వినిపించేసరికి సునంద కళవళ పడింది. ఏదో అనబోయింది. ఇంతలో హాస్పిటల్ వచ్చేసింది.... ఇంకా గంట గంటన్నర పోతేనేగాని విజిటర్స్ ని లోపలికి పోనివ్వరు. సునంద అలా స్మయంకాని సమయంలో డ్యూటీ డాక్టర్ దగ్గరనుంచి స్పెషల్ పెర్మిషన్ తీసుకుని మరీ రావడం. ఆ వచ్చేటప్పుడు కొత్త్హ వ్యక్తిని తీసుకుని రావడం అది చూసి శివరాం ఆశ్చర్యపోయాడు.
"మా ఆఫీసు మేనేజరు కూతురు శాంత అని చెప్పానే- ఆమె భర్త జగపతి. బొంబాయిలో ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నప్పుడు నేను ఎస్. ఎస్. ఎల్ సి. చదివేటప్పుడు, మా ఇంటి పక్కని ఉండేవారు వీళ్ళు- ఎప్పుడో ఓమారు మీతో చెప్పినట్టున్నాను."
"నమస్కారం" అన్నాడు జగపతి చిరునవ్వుతో.
"న.....మ.....స్కా.....రం" నొక్కు నొక్కుల జుట్టూ. అందమైన ముఖం. పచ్చగా పుష్టిగా ఉన్నరూపం, వులెన్సూటూ, కళకళలాడేలా పాలిష్ చేసిన బూటూ - ఇలా ఆకర్షణీయంగా ఉన్న జగపతికి పై నుంచి కిందదాకా పరిశీలనగా చూస్తూ, తాపీగా పలకరించాడు శివరాం.
"మిమ్మల్ని కలుసుకున్నాను. ఇవాళ చాలా సుదినం అంది - ఇంక తరుచు కలుసుకుంటూనే ఉంటాడు. మా అత్తారి ఊరేగా ఇది? మీకు పూర్తిగా ఆరోగ్యం వచ్చాక, సునందా, మీరూ మా బొంబాయి వద్ధురు గాని. చప్పున తగ్గిపోతుందిలెండి మీకిది." అంటూ ఏకంగా మాట్లాడేస్తున్న జగపతికి ముక్తఃసరిగా "ఊ......ఆ"..... అంటూ సమాధానం చెబుతూ. సునందని పరిశీల నగా చూడసాగాడు శివరాం ఆ చూపులు సునందకి చాలా ఇబ్బందిగా వున్నాయి. మందులూ, సంసారం, ఖర్చులూ ఇలా డబ్బుకి నిక్కచ్చిగా వున్న ఈ పరిస్థితిలో తనీ కొత్త చీరను కొనుక్కోవడం ఏమిటి అందులో ఇంత ఖరీదైంది అని ఏవైనా ఆశ్చర్యంగా చూస్తున్నాడా శివరాం? లేదా భర్త మంచంమీద వుండగా ఈ కొత్తబట్టలూ సరదాలూ ఏవిటని బాధపడుతున్నాడా? ఎందుకలా వింతగా చూడడం? పోనీ సంగతి ఇదీ. జగపతి పెట్టాడీ చీర వద్దంటే కాదూ కూడదూ కట్టుకోమని బలవంతపెట్టాడు అంటూ వున్న సంగతి చెప్పేస్తే? కాని తీరా చెప్పాక. ఈ వివరాలన్నీ ఎందుకు నిన్ను నేను అడిగానా" అంటాడేమో? సునంద చాలా తికమక పడసాగింది. వంటినిండుగా పైట చెంగు కప్పుకొని తలవంచుకొని కాలి బొటనవేలితో సున్నాలు చుడుతూ తప్పుచేసిన దానిలా నిలబడి వుంది. శివరాం తనని ఏం అడుగుతాడో అని గుండెల్లో బెదురు? చివరికి అనుకున్నంతా అయింది శివరాం అడగనే అడిగాడు. "ఏమిటి కొత్త చీరా అదీ కట్టుకుని బయలుదేరావు. ఎక్కడికేనా పేరంటానికా" అని.
సునంద సమాధానం చెప్పేలోపుగా జగపతే గబగబా అంతా చెప్పేసి, "ఎలా వుంది బావగారు నా సెలక్షను? ఈ రంగూ, ఈ చీరా సునందకి బాగా సూట్ అయింది కదూ?" అంటూ ఎంతో ఆసక్తితో శివరాం ముఖంలోకి చూశాడు. శివరాం ముఖంలో తను ఆశించిన సంతోషం కనిపించకపోగా బొమ్మముడిపాటుతో కలిసి, ఒక రకమైన ఉదాసీనతభావం తీవ్రంగా కనిపించి చకితుడయ్యాడు. జగపతి.
శివరాం మెదడు ఆలోచనలతో వేగిపోతోంది. తన ఆరోగ్యం పోగొట్టుకున్న నిర్భాగ్యుడు. జగపతా ఆకర్షణీయంగా ఓ పెద్ద హోదాలోవున్న శ్రీమంతుడు. సునందా నిండైన యౌవనంతో అందాల రాశిగా వెలుగుతూన్న యువతి. మనస్సు చలించడానికి ఎంతసేపు కావాలి? సునందకి వీడు చీర కొనడమా? వద్ధనకుండా ఇది తీసుకొనడమా. సిగ్గూ, భయమూ వదిలేసి ఆ చీర తనకి చూపించడానికి రావడమా? అందులో ఈ ఇద్దరే! మళ్ళీ మూడోవాళ్ళు ఎవరూ లేకుండా - ఛీ....ఛీ సునంద ఎంతటి స్థితికి దిగజారిపోయింది? భర్త అనేవాడు అనుక్షణం దగ్గర వుండి రక్షించుకొనపోతే ఆడదాని సౌశీల్యం ఇంక ఇంతేనన్నమాట....తన సునంద తనే కావాలని తల్లిదండ్రులతో విరోధంకూడా పడి పెళ్ళిచేసుకున్న భార్య. ఇవాళ.....యిలాగ? అబ్బ!.....ఆపైన శివరాం ఆలోచించలేకపోయాడు.
* * *
జగపతికి వాతావరణం ఏదో ఆస్వాభావికంగా వున్నట్లూ, స్వేచ్చగా తను మాట్లాడడానికి వీలులేనట్టూ అనిపించి, ఇంక లేచాడు వెళ్ళిపోదాం అని. "లేచారేం అప్పుడే? వుంటారా నాలుగు రోజులు" అంటూ మర్యాద కోసం అన్నాడు శివరాం.
"అత్తింటి కొచ్చిన అల్లుడు పండగ వెళ్ళేదాకా పారిపోడానికి వీల్లేదు కదండీ" నవ్వుతూ అన్నాడు జగపతి.
"పండగకి వచ్చావన్న మాట? ఓహో నువ్వు వస్తావని తెలిసే కాబోలు సునంద, ససేమిరా పుట్టింటికి వెళ్ళనని ఉండిపోయింది. ఇవాళ గోపాలం, రత్నం వెళ్ళిపోతే, ఇంక ఒక్కతే కూడా ఉంటుంది ఇంట్లో - మీరు ఆడింది ఆట పాడిందిపాట?-మనస్సులో వికృతంగా ఆలోచించుకొని గుండెల్ని మండించుకోసాగాడు శివరాం.
"ఏం సునందా? నువ్వువస్తావా ఉంటావా?" అన్నాడు జగపతి అడుగు కదుపుతూ తను తర్వాత వస్తుంది లేండి" అన్నాడు వెంటనే శివరాం. "అయితే సరే వస్తా" అంటూ వెళ్ళబోతూన్న జగపతికి ఎదురయ్యాడు గోపాలం. మాట వరసకి వాళ్ళని ఒకళ్ళకొకళ్ళకి శివరాం పరిచయం చేశాక. జగపతి వెళ్ళిపోయాడు శివరాం. తలవంచుకొని నిలబడి ఉన్న సునంద కేసి నిశితంగా చూసి, దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ తర్వాత గోపాలం కేసి తిరిగి "ఏరా ఇవాళ వెళుతున్నారా" అన్నాడు.
అదే చూస్తున్నాను, మేం వెళితే పాపం వదిన ఒక్కత్తే ఉంటుంది ఇంట్లో" అన్నాడు గోపాలం.
ఒక్కత్తే ఎందుకుంటుంది లే" సునందకి అర్ధం అవాలనే వ్యంగ్యంగా అన్నాడు శివరాం. సునంద వులిక్కిపడి చూసి హాస్పిటల్ సూపరెంటెండెంటుగారి దగ్గర స్పెషల్ పెర్మిషన్ తీసుకుని ఇక్కడే ఉంటాను" అంది.
