Previous Page Next Page 
పిల్లలతో ప్రేమయాత్ర పేజి 9

 

    సుపరిచితమైన ఆ స్పర్శ లోని సంకేతాన్ని అర్ధం చేసుకున్న కళ్యాణి అతని ముఖంలోకి చూచి చిన్నగా నవ్వింది. మనం వెళ్ళేసరికి ఏడు దాటవచ్చు.' అన్నాడు అసంబద్ధంగా.
    'ఔను భోజనాలవీ ఎక్కడ దొరుకుతాయో యేమో మనకీ ప్రదేశం కొత్త' అన్నది కళ్యాణి కూడా తన వాక్యాలలోని కృత్రిమతను తానె గమనిస్తూ.
    మనుసులు నిండి ఉన్నపుడు మాటలు పేలవంగా ఉంటాయ్. మళ్ళీ వాళ్ళిద్దరూ బస్సు దిగేవరకు మాట్లాడుకోలేదు. బయటకు చూస్తూ మౌనంగా కూర్చుండి పోయేరు. కళ్యాణి చెయ్యి మాత్రం కాంతారావు గుప్పిట లో అంతసేపూ ముడుచుకు పోయే ఉంది.
    కొండ మీద బస్సు ఆగగానే కళ్యాణి ని, పిల్లలను అక్కడ దింపి కాటేజ్ ని బుక్ చేసుకోవటానికి ఆఫీసుకు వెళ్ళేడు కాంతారావు. అతను తిరిగివచ్చే పదహారు నిమిషాల లోపల నానా అవతారా లేత్తవలసి వచ్చింది కల్యాణికి పిల్లలతో.
    పాప తల్లి చంకలో ఉండనని మొరాయిస్తూ మాటిమాటికి జారి నేల మీద చతికిల పడటానికి ప్రయత్నిస్తుంటే, బాబిగాడు తండ్రితో పాటు తాను కూడా వెళ్ళకుండా తల్లి అడ్డగించిందన్న కసితో గట్టిగా ఏడవ సాగెడు. ప్రతిసారీ క్రిందకు జారుతున్న పాపను ఎత్తుకోవటానికి ఒంగటంతో ఆమె పమిట తొలగి పోయింది. వెంట్రుకలు ముందుకు పడి కళ్ళను కప్పి వేస్తున్నాయ్. వేసవి కాలం అవటం వల్ల వళ్ళంతా చెమటతో తడిసిపోయి దూర ప్రయాణం లో తమతో పాటు మోసుకు వచ్చిన దుమ్ము ధూళి ని శరీరానికి మరింత బిగువుగా అతుక్కు పోయేటట్లు చేస్తూన్నది. ముఖాన బొట్టు లేదు. కాటుక ఎప్పుడో కరిగి పోయింది.
    ఆ అవతారం తో దూర ప్రదేశం లో ఒంటరిగా నిల్చున్న తనని చూసి తానె సిగ్గుపడుతూ, తన యీ దురవస్థకు తగ్గట్టు, ఎవరైనా తనని చూస్తున్నారేమోనని చుట్టూ కలియ జూసింది కళ్యాణి    
    ఎవరూ ఆమె వంక చూడటమే లేదు. చూసినా అంతగా పట్టించుకునేది లేదు. ఆ ప్రదేశానికి రోజు వేలకొలది ప్రయాణికులు , రకరకాల వేష ధారణాలతో వివిధ రకాల భాషలు మాట్లాడుతూ కనపడతారు. కనుక ఎవ్వరూ అక్కడి వాళ్ళ కంటికి ప్రత్యేకంగా, వింతగా కనపడరు. అక్కడ ఉండే దుకాణాల వాళ్ళు, దేవస్థానం తాలుకూ మనుషులు వచ్చే పోయే ప్రయాణికులందరినీ చూసీ చూడనట్లు చూసి తమ పనులలో తాము మునిగి పోతారు. ఆ సంగతి గమనించి, కళ్యాణి మనసు కుదుటపడేసరికి కాంతారావు తిరిగి వచ్చేడు.
    తమ కాటేజీ లోకి వెళ్ళేసరికి పూర్తిగా అలసిపోయేరు. వెళ్ళగానే కళ్యాణి పిల్లలిద్దరినీ పంపు కింద పడేసి స్నానం చేయించింది. తాము కూడా స్నానం చేసి బట్టలు వేసుకుని కరకరలాడే కడుపులతో భోజనం వేట ప్రారంభిస్తూ బయట పడ్డారు.
    దేవస్థానం కాంటీన్ లో భోజనం మంచిగా ఉంటుందని ఎవరో చెబితే అటువైపుగా నడక ప్రారంభించేరు.
    దేవాలయం మీదుగానే అక్కడకు పోవాలి. దేవాలయం వద్దకు వచ్చేక 'వోసారి లోపలికి వెళ్ళి చూసోద్దామా?' అనడిగింది కళ్యాణి - ఎవరో మిత్రుల యింటికి, పరిచయస్తుల యింటికి వెళ్ళివద్దామా ? అన్నట్లు.
    దాంతో కోపం వచ్చింది కాంతారావు కి. 'చూసోద్దామా ఏమిటి నీ మొహం! దైవదర్శనం చేసుకోద్దామా? అని అడగాలి' అన్నాడు.
    'చిత్తం' అంది కళ్యాణి.
    కాంటీన్ లో భోజనం ముగించేసరికి ప్రళయం ముగిసినంత పనయింది. బయట హోటల్లో భోజనం చెయ్యటం అదే మొదటి సారి అవటం వల్ల పిల్లలు నానా హంగామా చేసేరు. పాప తల్లి ఒడిలో నిలబడి విస్తట్లో ని పదార్ధాలన్నీ కెలికి వేస్తింది. బాబిగాడు తనకి కూడా అమ్మా నాన్నలకు మల్లె వేరే విస్తరి కావాలని వేయించుకుని అన్నమంతా చిందర వందర చేసి పారేసేడు.
    వోసారి ఎందుకో తండ్రి కోప్పడేసరికి అన్నం విసిరి అవతలకు కొట్టేడు. ఆ మెతుకులన్నీ వడ్డిస్తున్న వంటవాళ్ళ మీద పూల జల్లులా కురిసినాయ్. వాళ్ళ ముఖాలు వొక్కసారిగా మాడిపోయినాయ్ ఆ సంఘటనకు.
    కాని వెంటనే తమకి మర్యాద చేసిన వ్యక్తీ మరీ పసివాడన్నా విషయాన్ని  గ్రహించి వెంటనే మెత్త పడ్డారు. ముఖాల నిండా నవ్వు పులుముకుని 'ఏమిటి బాబూ అల్లరి?' అంటూ వెళ్ళి పోయేరు.
    కాంతారావు, కళ్యాణి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.
    'ఇంకా నయం, పోట్లాటకు రాలేదు. లేచిన వేళ మంచిది' అనుకున్నారు.
    భోజనాలు చేసి తిరిగి కాటేజ్ కి వస్తుండగా దారిలో పనస తొనలు కనిపించినయ్. వాటిని చూస్తూనే కళ్యాణి ముఖం చాటంత అయింది. 'అబ్బ , పనస తొనలు తిని ఎన్నాళ్ళయిందో ! మన - హైదరాబాద్ లో పనస పళ్ళు దొరకనే దొరకవు. చిన్నతనంలో ఎప్పుడు తిన్నానో!' అంది నోరూరించుకుంటూ.
    వో రూపాయి తొనలు కొని ఆమె చేతిలో పోసి 'చాలా యివి? లేక వో బస్తాడు కొనమంటావా- హైదరాబాద్ తీసుకు పోవటానికి.' అన్నాడు కాంతారావు.
    'అబ్బో! కొనే షావుకారు బయల్దేరాడు . కావాలంటే అ బస్తాడు కొని తీసుకుపోయి మీ వాళ్ళందరికీ పంచి పెట్టుకోండి. హు!' అంది మూతి ముడుచుకుంటూ కళ్యాణి.
    ఆమెకు కోపం వచ్చిందని గ్రహించి మాట మార్చేయటం కోసం వో తోన చప్పరించి 'చాలా తియ్యగా ఉన్నాయ్ కదూ?' అన్నాడు.
    'పనస తొనలు తియ్యగా ఉండక యింకేలా ఉంటాయ్? అందుకే అన్నారు పనసతోనల్లాంటి పిల్లల్ని కనాలి అని' అంటూ తోనలతో మూతి, బుగ్గలు జిడ్డు జిడ్డు చేసుకున్న పాప బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది కళ్యాణి'.
    'మన పిల్లలు మాత్రం పనసతోనల్లా యేమీ లేర్లె.' భయపడద్దు.' వెక్కిరింపు గా అన్నాడు కాంతారావు.
    'ఏమిటి మీరనేది?' చర్రుమంటూ అరచింది కళ్యాణి.
    'నా పెల్లలకేం ? లక్షణంగా ఉన్నారు. మీకంటే లక్ష రెట్లు అందంగా ఉన్నారు. ఈ పనస తొనల కంటే వెయ్యి రెట్లు మధురంగా ఉన్నారు. తెలిసిందా? ఇకనుండి 'నా' పిల్ల లని గురించి అలా మాట్లాడకండి. నాకు వళ్ళు మండుతుంది.' అన్నది. 'నా పిల్లలు' అన్న పదాన్ని వత్తి పలుకుతూ-- అక్కడికి వాళ్ళు అతనికేమీ కానట్లు. కళ్యాణి ఏకాంతంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు తన పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు తమ కోరుకున్నంత అందంగా లేరే అని వాపోతూనే ఉంటుంది. ఐనప్పటి కి ఎవరైనా తన పిల్లలు అందంగా లేరని అంటే మాత్రం ఆమెకు ప్రాణం విలవిల లాడిపోతుంది. ఆ అన్న మనిషిని నిలువునా చంపి పారేయ్యాలన్నంత కోపం వస్తుందామెకు.
    ఎంతైనా కాకిపిల్ల కాకికి ముద్దు కదా!
    'పిచ్చిదన్లా ఎందుకలా అరుస్తావు? నేనేదో సర్దాగా అన్నమాటను నువ్వెందుకలా సీరియస్ గా తీసుకుంటావు? వాళ్ళు మాత్రం నా పిల్లలు కారూ? నాకంటికి వాళ్ళు రాజకుమారుల్లానే కనిపిస్తారు.' అంటూ తనేత్తుకున్న బాబును ముద్దు పెట్టుకున్నాడు కాంతారావు.
    కళ్యాణి అప్పటికి శాంతించింది.
    కాటేజీ లోకి వెళ్ళగానే ప్రయాణపు బడలిక తో అలసిపోయిన వారు చాలా త్వరలోనే గాడ నిద్రలోకి ఒరిగి పోయేరు.
    తెల్లవారి నిద్రలేచేసరికి ఆరుగంటలయింది.
    అప్పటికే ఆలస్యం అయిందంటూ కాంతారావు కళ్యాణిని తొందర పెట్టసాగెడు.
    'పిల్లలిద్దరికీ తల నీలా లిప్పించాలి స్నానాలు అవీ అక్కడనే. టిఫిను మాట యిప్పుడేత్తటానికి వీల్లేదు.' అని కాంతారావు చెప్తుంటే ఆమె నీరస పడిపోయింది. 'ఏమిటో ఈయన పిచ్చి.... ఎంత చెప్పినా అర్ధంకాదు ఈ మనిషికి.' అనుకుంది. పైకి మాత్రం 'అ నీలా లో, పగడా లో పిల్లలకు మాత్రమే యిప్పించండి. మీరు గుండు చేయించుకున్నారంటే మీ ముఖం నేను చూడలేను. నాకు భయం వేస్తుంది.' అన్నది.
    ఆమె మాటలకు ఒక్కసారి గతుక్కుమన్నా వెంటనే పకపక నవ్వేసేడు కాంతారావు. 'సరేలే అలాగే నా బదులు కూడా పిల్లలకే తీయించేస్తా స్వామిని క్షమించమని వేడుకుంటాను. పద బట్టలవీ సర్దు ' అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS