5
అక్కడ పిల్లలకి జుట్టు తీయించడం వో పెద్ద ప్రయత్నమయింది. ఆ వాతావరణాన్ని , మంగలి కత్తిని చూసి పిల్లలు గోడు గోడున ఏడుస్తుంటే కళ్యాణి కి కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. 'ఎందుకొచ్చిన అవస్థలివి చెప్పండి? ఆ పిల్లలను అంత ఏడిపించి , జుట్టు తీయిస్తే గాని మీ దేవుడికి మన మీద దయ కలగదా యేమిటి ?" అన్నది భర్తతో నిష్టూరంగా.
'అలాంటి మాటలనకు కళ్యాణి! ఏం చేసినా మన శుభం కోసమేగా!' అన్నాడు ఆముదం తాగిన వాడిలా ముఖం పెట్టి కాంతారావు. అప్పటికే ఆ తంతులో సగం నీరసం వచ్చేసింది అతనికి కూడా.
కల్యాణి నిట్టూర్చి వోసారి చుట్టూ కలియ జూసింది. ఎక్కడా చూసినా జనం. నున్నని గుండ్లతో ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు క్రిక్కిరిసి పోతున్నారు. అదంతా వో వింత ప్రపంచం లా ఉంది కళ్యాణికి.
ప్రతిరోజూ జనం తండోప తండాలుగా వచ్చి జుట్టు తీయించుకుని, ముడుపులు చెల్లించుకుని పోతూనే వున్నారు. కాని దేశంలోని పాపాలకేం కొరత లేదు . నేరాలకు పరిమితి లేదు . దుఃఖానికి అంతం లేదు. ఐతే వీళ్ళంతా దేనికోసం ఎగబడి వస్తున్నట్లు?
దూర తీరాల నుండి దేశం నలుమూలల నుండి ఎన్నో రకాల భాషల వాళ్ళు, రకరకాల వేషాల్లో యిక్కడికి వచ్చి పోతూనే ఉన్నారు. కేవలం చిత్తశుద్ది కోసం, మానసిక శాంతి కోసమే వీరు వస్తున్నట్లయితే అలాంటి వేవీ వీళ్ళు పొందుతున్న లక్షణాలే కనపట్టం లేదు వీళ్ళలో.
ప్రతి మనిషిలోనూ ఏదో ఆత్రం ఏమిటో ఆలజడి ఎలాగోలా పని జరుపుకుపోదామన్న తాపత్రయమే తప్ప సిన్సియర్ గా ఏదో తాదాత్మ్యం పొందుదామని కాని, అలౌకికాను భూతిని అనుభవం లోకి తెచ్చుకుందామని గాని వీరిలో ఒక్కరికి కూడా లేదు. ఏనూటికో కోటికో ఒకరికి అలాటి ఆలోచన ఉన్నా, ఈ రకమైన వాతావరణం అందుకు ఏమాత్రం అనువుగా లేదు.
ఐనా వీళ్ళ పిచ్చి గాని, మనసులో లేని దేవుడు గుడిలో ఉంటాడా?
అక్కడ ఉన్న బాత్ రూము లలో పిల్లలకు స్నానం చేయించి తాము కూడా చేసే సరికి సర్కస్ చేసినంత పనయింది ఆ దంపతులకు.
స్నానం చేసిన శరీరాలాతో మట్టిలో పొర్లుతున్న పిల్లలను , వాళ్ళను అదుపులో పెట్టలేక అవస్థ పడుతున్న భర్తను చూసేసరికి అప్పుడే తలారా స్నానం చేసి వచ్చిన కళ్యాణి కి నవ్వూ, ఏడుపూ రెండూ, వచ్చినాయ్. మళ్ళీ పిల్లలకి స్నానం చేయించి బట్టలు తొడిగి , దేవాలయ ప్రాంగణం లోకి వెళ్ళేసరికి దాదాపు తొమ్మిది కావస్తోంది. ఎంత త్వరగా తయారవుదామనుకున్నా, అంతకన్న ముందుగా చేరుకోలేక పోయేరు.
మొదలు, తుది తెలియకుండా ఉన్న ఆ జన ప్రవాహపు 'క్యూ' ని చూస్తూనే ఎటు పోవాలో తెలియక దూరంగా నిలబడ్డారా దంపతులు పిల్లలను దగ్గరకు తీసుకుంటూ.
జన కోలాహలం తో చెవులు హోరు మంటుండగా ఎన్నడూ ఒకచోట అంత మంది జనాన్ని ఒక్కసారి చూడని పిల్లలు నోళ్ళు తెరచుకుని వాళ్ళ వంక చూస్తూ అమ్మ నాన్నల నానుకుని నిల్చున్నారు.
వాళ్ళలా ఐదు నిమిషాల పాటు దిక్కు, తోచక నిల్చునేసరికి యింతలో ఒకతను హడావుడి గా వారి దగ్గరకు వచ్చేడు. "ఏమండీ! ఇక్కడ నిల్చున్నాను? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోతోంది. అబ్బబ్బ! ఏం జనమండి, ఏం జనం! చూస్తూన్నారు కదా! ఉదయం ఆరు గంటల నుండి ఎడతెగని జనం! పాపం పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. ఆ క్యూలో వెళ్ళాలంటే మధ్యాహ్నం పన్నెండు దాటుతుంది.' అన్నాడు సానుభూతిగా.
అతనన్న చివరి వాక్యం వినగానే కాంతారావు, కళ్యాణి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
'మరేం ఫరవాలేదు. మీరు భయపడకండి. నేనీ దేవస్థానం లో పని చేసేవాడ్నే! ఆ పోలీసుల కళ్ళు గప్పి ఎలాగోలా మిమ్మల్ని క్యూ మధ్యలోకి కొంచెం త్వరగా వెళ్ళేట్టు చేస్తాను.' అన్నాడతను.
అతని వంక వో క్షణం పరిశీలనగా చూసేడు కాంతారావు. అతని దుస్తులు వాలకం అదీ చూస్తుంటే దేవస్థానం లో కూలి పని చేసే వాళ్లానే ఉన్నాడు.
'ఐతే ఇప్పుడెం చెయ్యాలి?' ఆశగా అడిగేడు కాంతారావు. అప్పుడే అటుగా వస్తున్న పోలీసును చూసి ఏదో చెప్పబోతున్నవాడల్లా చటుక్కున ఆపి వేసేడు. ఆ పోలీసు అతని వంక . కాంతారావు కుటుంబం వంక వోసారి చూసి చిన్నగా నవ్వుకుంటూ వెళ్లిపోయేడు. పోలీసు పోయిన తరువాత అతను కొంచెం స్వరం తగ్గించి 'మీరేం భయపడకండి సార్! మిమ్మల్ని గుడిలోకి పంపే భారం నాది. సరేనా? పది నిమిషాలాగండి. వాడు కానరాకుండా మిమ్మల్ని క్యూ లోకి పంపిస్తాను. పాపం అసలే చిన్న పిల్లల్తో ఉన్నారు' అన్నాడు పాప బుగ్గ మీద చితికి వేస్తూ.
'అన్నట్టు మీరిక్కడే ఉండండి. నేను పది నిమిషాల్లో తిరిగోస్తాను....' అని కొంచెం మెలికలు తిరుగుతూ 'హిహిహి..... నా ఖర్చులకు ఏమైనా యిప్పించరా సార్.....హిహిహి....' అన్నాడు.
కాంతారావు కళ్యాణి వంక చూసేడు. 'ఛ! లంచం యివ్వటమా?" అన్నట్టు చురుక్కున చూసింది కళ్యాణి భర్త వంక.
'నీకు తెలియదు లే ఉండు' అన్నట్టు కళ్ళతోనే భార్యకి నచ్చ చెప్పి జేబులో నుండి రెండు రూపాయలు తీసి అతని కిచ్చేడు కాంతారావు.
అతడు ఆ డబ్బు తీసుకుని 'ఇక్కడే ఉండండి సార్ మీరు. మళ్ళీ అటూ ఇటూ పోయేరంటే మిమ్మల్ని వెతుక్కోటం కష్టమవుతుంది నాకు. టెన్ మినిట్స్ లో వచ్చేస్తాను.' అని తనకు ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం కూడా ఉందని వాళ్ళకి తెలియబరిచి హడావుడి గా అక్కడ నుండి పరుగు పెద్తున్నట్టు వెళ్ళిపోయాడా మనిషి.
కళ్యాణి ఏదో అనబోతుంటే కాంతారావు అందుకుని అన్నాడు. 'ఆ క్యూ వంక వోసారి చూడు కళ్యాణి! అందులో చివరన నిల్చున్నా మంటే మనం గుళ్ళోకి వెళ్ళేసరికి ఎంత టై మవుతుందో తెలుసా? పోనీ పాపం బీదవాడు.... రెండు రూపాయలిస్తే తెప్పేముంది చెప్పు. అతను చేసే సహయానికి కృతజ్ఞతగా రెండు రూపాయీలిచ్చే మనకుందాం. లేదా ఒక పేదవాడికి దానం చేసే మానుకో!' అన్నాడు.
.jpg)
కళ్యాణి కి తమ నిస్సహాయస్థితి అర్ధమైనందున చేసేది లేక మాట్లాడకుండా ముఖం పక్కకు తిప్పుకుంది. అప్పటికి కాని కళ్యాణి కి తెలిసి రాలేదు. తమలానే ఆలస్యంగా వచ్చిన పిల్లలు గల తల్లిదండ్రులు వో పది పన్నెండు గుంపులు దాకా ఉన్నారని తమ దగ్గరికి వచ్చినటనే మరొక కుటుంబం దగ్గరకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అతను కాక అత్నిలాటి వాళ్ళే మరో యిద్దరు, ముగ్గురు మిగతా కుటుంబాల వారితో మాట్లాడుతున్నారు. అప్పటికి పరిస్థితి కొంత అర్ధమయింది కళ్యాణికి. తమలాగా పిల్లా పీచుతో వచ్చినవాళ్ళు ఆ క్యూని చూసి భయపడి, అందులోకి వెళ్ళే సాహసం లేక యీ పనివాళ్ళకు కొంత ముడుపు చెప్పించుకుని ఎలాగోలా గుళ్ళోకి ప్రవెశించాలని చూస్తున్నారని ఆమె గ్రహించింది.
పది, ఇరవై , ముప్పై...... అరవై నిమిషాలు గడిచినయ్. అంతవరకు ఆ కుటుంబాలతో మాట్లాడిన వాళ్ళలో ఒక్కడు కూడా ఐపు లేడు. మధ్యలో పొరపాటున అతను వోసారి అటు వచ్చేసరికి వీళ్ళను చూస్తూనే 'వచ్చేస్తున్నాను సార్! ఇప్పుడే మీకు ఎరెంజు చేయిస్తాను' అంటు పరుగెత్తుకు పోయేడు.
ఈ గంటసేపూ ఆ మనిషి అన్న ప్రకారం రాకపోగా , పిల్లలతో నానా అవస్థా లయింది వాళ్ళిద్దరికీ. పాప 'జీ' పోవాలంటే దానిని రెండు పర్లాంగు ల దూరంలో ఉన్న పంపు దగ్గరకు తీసుకు పోయి కడుక్కు రావలసి వచ్చింది. బాబిగాడు మంచినీళ్ళు కావాలని కాసేపు, అవిస్తే బిస్కెట్లు కావాలని మరి కాసేపు. అవి కూడా యిచ్చేక అన్నం కావాలనీ యిలా మారాం చేస్తూ' ఆ దంపతులకు ఊపిరాడనీయకుండా చేసేడు. పిల్లలకు ఎక్కువ సేపు నిల్చుండే శక్తి లేక తల్లీ దండులను ఎత్తుకోమన్నారు. వాళ్ళను ఎత్తుకున్నా ఎక్కువసేపు వాళ్ళు అలాగే కదలకుండా నిల్చోవటం సహించలేక క్రిందకు దిగ జారటం ప్రారంభించేరు. ఇలాటి అవస్థ తో మరో గంట గడచింది.
ఈ రెండు గంటలలోనూ క్యూ లో నిల్చున్న నున్నటి గుండ్ల న్నీవరుసగా కదలి పోతున్నాయ్ -- 'గోవిందా! గోవిందా!' అని అరుచుకుంటూ.
ఎంత పెద్దగా కనపడుతున్నప్పటికీ ఆ క్యూ అంత త్వరగా కదిలి పోతుంటే , తమకంటే ముందే ఎంతో మంది మనుషులు కదిలి పోతున్నారు. ఆలస్యంగా నైనా అసలు విషయం అర్ధమవటంతో , ఆ అపరిచిత వ్యక్తీ చేసిన మోసాన్ని కూడా అర్ధం చేసుకుని చివరకు క్యూ లోనే వెళ్ళటానికి నిశ్చయించుకుని అక్కడ నుండి కదిలేరు కళ్యాణి కాంతారావు లు.
