
ఆ సందడి అంతా చూచి, కారు పక్కగా ఆపించి కార్లోంచి దిగారు రాజశేఖరంగారు, శ్రీనివాస్. హడావిడిగా కారు దిగి వాళ్ళ వెనకే పరిగెత్తింది అనూరాధ నీరసం, జ్వరం అన్నీ మరిచిపోయి.
చాలాభాగం భస్మీపటలం అయిపోయింది. చాలా ఇళ్ళు తగలబడిపోయాయి. మిగిలినవి ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. పగలంతా ఎండలో చెమట ఓడ్చి, కష్టపడి కట్టుకున్న నీడలు ఆశలతోకూడా కూలిపోయాయి.
ఒళ్ళు కాలినవాళ్ళను కొందరిని స్ట్రెచెర్లమీద తీసుకువెడుతున్నారు. కొందరిని పక్కకు లాగుతున్నారు. హృదయ విదారకంగా ఉన్న దృశ్యాలను చూస్తూ పక్కగా నడిచారు ముగ్గురు. బాధగా, జాలిగా చుట్టు పరికించిచూస్తున్న ముగ్గురికీ కొద్ది దూరంలో మరో దృశ్యం కంటబడింది. హఠాత్తుగా పరిగెత్తాడు శ్రీనివాస్ ముందుగా, పది, పన్నెండేళ్ళ పిల్ల నేలమీద పడుకుని ఉంది. మట్టిలో, మురికిలో మునిగి తేలుతున్న బట్టలతో, నల్లగా మాడి వాడిన ముఖంతో నీరసంగా, చుట్టూ జరిగేదేమిటో గమనించలేనంత మగతగా పడి ఉంది. ఉచ్చ్వాస నిశ్వాసాలు బరువుగా వస్తూ ఏ క్షణాన అయినా ఆగిపోయేలా ఉన్నాయి. శ్రీనివాస్ గభాలున వంగి నాడి పట్టుకు చూచాడు. గుండెలమీదకు వంగి చెవి ఉంచి చూచాడు. కఫంతో, మంటలవల్ల రేగిన పొగతో ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు అన్ని నిండి పోయాయి. ఆ అమ్మాయివంక తీక్షణంగా కొద్ది క్షణాలు చూచి గభాలున లేచి నిలబడ్డాడు. తొందరతొందరగా జేబులు తడుముకుని, తాళంచెవుల గుత్తి తీసి అందులోంచి చాకు తెరిచాడు. ఆ అమ్మాయికి దగ్గిరగా వంగి మెడకింది భాగంలో ఏదో చెయ్యబోతూంటే "శ్రీనివాస్!" అంటూ కంగారుగా అతని చెయ్యి పట్టుకున్నారు రాజశేఖరంగారు. చేతిపట్టు విడిపించుకుంటూ, "ఏమీ ఫరవాలేదు. మీరు అంబులెన్సు దగ్గిరికి వెళ్ళి ఓ స్ట్రెచర్ ని, నర్సుని పిలుచుకురండి" అంటూ తన పనిలో నిమగ్నుడయిపోయాడు. అనూరాధ శ్రీనివాస్ ను చూస్తూ విస్పారిత నేత్రాలతో నిలబడిపోయింది. నల్లని ఆ పిల్ల మెడమీద అతని తెల్లని చేతులు పడగానే ఎర్రని రక్తం చిమ్మింది. కంగారుగా పరిగెత్తారు రాజశేఖరంగారు.
ఆ పిల్లకు ప్రథమ చికిత్స చేసి స్ట్రెచర్ మీద తీసుకువెడుతూ "యు డిడ్ ఎ గుడ్ జాబ్, డాక్టర్. మీరు చూచి ఉండకపోతే ఆ అమ్మాయి బతికి ఉండేది కాదు" అంటూ వెళ్ళిపోయాడు అనుభవమున్న మేల్ నర్సు.
ఆశ్చర్యం అవధులు దాటుతూంటే శిలాప్రతిమల్లా నిలబడిపోయారు అనూరాధ, రాజశేఖరం గారు.
పరిసరాల వేడిమూలంగా ఎర్రబడిన ముఖంమీద చెమట నిలిచింది. రుమాలుతో చేతులు తుడుచుకుంటూ ముందుకు కదిలాడు. మౌనంగా అనుసరించారు తక్కిన ఇద్దరు.
అప్పటికే డ్రైవరు ద్వారా చాలాభాగం విన్న శ్రీలక్ష్మి ఏదో ఆత్రంగా అడగబోతూ ఉంటే మౌనంగా వారిస్తూ కారెక్కి పక్కగా కూర్చున్నారు రాజశేఖరంగారు.
హృదయంలో రేగుతున్న భావాలు ముఖంలో రంగులుగా మారుతూంటే నెమ్మదిగా వెలువడుతున్న నిట్టూర్పు కారుచప్పుడులో కలిసిపోయింది.
13
"నాట్" అన్న కృష్ణమూర్తిగారు కొద్దిక్షణాలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. తేరుకుని, "ఏమిటీ? శ్రీనివాస్ ట్రికియాటమీ చేశాడా?" అన్నారు తమ చెవులను తామే నమ్మలేనట్లు.
"ఏమిటీ?" అంది అనూరాధ, ఆయన చెప్పినది సరిగా అర్ధంకానట్లు.
ఆమె ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా "నువ్వేమీ అడగలేదా?" అని ప్రశ్నించారు రాజశేఖరంగారిని.
"అతను చాలా చిరాగ్గా కనిపించాడు. అందుకని ఎక్కువ అడగటానికి వీలు లేకపోయింది. కాని ఎక్కడో కొన్నాళ్ళు ఓ డాక్టర్ దగ్గిర పనిచేశానన్నాడు."
'ఆఁ, అలాగా!'
"ఏమిటి?" అన్నట్లు అందరి చూపులు ఆయనపై ప్రసరించాయి.
"ట్రికియాటమి అనేది చాలా సామాన్యమయిన సర్జరీ. అయినప్పటికీ అది చాలా ప్రొఫెషనల్ గా చెయ్యవలిసిన పని. అది మామూలుగా ఎక్కడో చూడటం వల్ల, ట్రెయినింగ్ వల్ల వచ్చేది కాదు."
"అసలు దేనికది?" అడిగారు రాజశేఖరంగారు.
"నిజానికి అది చాలా సులువయిన పని. కాని విధానం ముందుగా తెలిసి ఉండాలి. విధానమేకాకుండా, దాని అవసరం ఆ క్షణాన తెలుసుకుని రోగ నిర్ధారణ చెయ్యగలగటం డాక్టర్లదగ్గిర పనిచెయ్యడంవల్ల వచ్చేదికాదు. దానికి వైద్యజ్ఞానం ఉండాలి. శ్వాసనాళాల్లో ఏదైనా అడ్డుపడి గాలి లోపలికి పోవడానికి, రావడానికి ఇబ్బంది కలుగుతుంది. అటువంటి సమయంలో మెడ కింది భాగంలో చిన్నగా తెరిచి ఆ నాళంనుండి లోపలికి గాలి సరాసరి పోయేందుకు వీలుచేయాలి. ఇది శ్రీనివాస్ చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను" అన్నారు సాలోచనగా. 'శ్రీనివాస్.....ట్రికియాటమి' అని తమలో తాము అనుకుంటున్న మాటలు పైకే అనేసి తల ఊపుతూ ఉండిపోయారు.
"నిన్న కృష్ణుడు కూడా అలాగే ఆశ్చర్యపోయాడు. వాడుకూడా చాలాసేపు ఏదో కథ వింటున్నట్లు ఉండిపోయాడు" అంది శ్రీలక్ష్మి.
మొత్తానికి ఆ సాయంత్రం అంతా దానిమీద చర్చ జరుగుతూనే ఉంది. మామూలుగానే ఏదో ప్రత్యేకమయిన అభిమానం పొడచూపిన కృష్ణమూర్తి గారిలో మరింత ఉత్సుకత రేకెత్తింది. ఆయనకు తెలియకుండానే ఈ విషయాన్ని సమూలకంగా తెలుసుకోవాలని, శ్రీనివాస్ పూర్వ చరిత్ర తెలుసుకోవాలని జిజ్ఞాస తానేర్పరచుకుంది.
ఆ ఇంట్లో అందరికి, ముఖ్యంగా అనూరాధకు ఆశ్చర్యంతోపాటు అభిమానం, ఉత్సుకత ఎక్కువయి పోయాయి. మొదటినించి ఎమ్. ఎ చదివి లైబ్రరీలో పనిచెయ్యడమే ఆశ్చర్యమనిపించిన కారణాన్ని వెదకచూస్తూన్న అనూరాధకు ఇది మరింత అనుమానాన్ని చేకూర్చింది. 'శ్రీనివాస్ ఏదో దాస్తున్నాడు. అతను ఎమ్. ఎ. చదవడం, సరదాగా ఉద్యోగం చేయడం-ఇవన్ని నిజాలు కావు?' అనుకుంది మనసులో.
14
సముద్రపు ఒడ్డు సందడిగా లేదు. శ్రీనివాస్ హృదయంలో లాగానే నిశ్శబ్దం నివాసమేర్పరచుకుంది. అసహనం తెరల్లా సముద్రుడి అలలు లేచి పడుతున్నాయి.
"శ్రీనివాస్! మిమ్మల్ని ఒక విషయం అడగాలని ఉంది" అంది అనూరాధ, గాలికి ఎగురుతున్న ముంగురలను వెనక్కి తోసుకోవాలని ప్రయత్నిస్తూ.
ఆమె మాటలు విననట్లుగా, విసురుగా లేచి పడుతున్న అలలవైపు చూస్తూ కొంతసేపు మౌనంగా గడిపాడు. అతని మౌనాన్ని భంగంచెయ్యడం ఇష్టంలేనట్లు నిశ్శబ్దంగా ఊరుకుంది.
"మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అడిగాడు మాట మార్చాలన్నట్లు, అసలు ఆమె మాటలే వినలేదన్నట్లు.
