"ఏదో పెద్దచదువే. ఏం చదివితే ఏమిటి, సంస్కారం లేకపోయాక. స్వార్ధంలేని మనష్యులుంటారని నేననను. కాని మితం ఉండాలి కదా! చదువు, అందం ఏమీ లేకుంటే, ఏదో త్యాగం చేసి పెళ్ళిచేసుకోవడం అనేది అసహజం కావచ్చు. కాని చదువు, సంస్కారం, అందం న్నీ ఉన్న లలితలాంటి అమ్మాయిని, డబ్బుకోసం కాదంటే....ప్చ్....ఏం మనుష్యులో!" అంది నిరుత్సాహంగా.
ఆమెలో కనిపించిన నిరుత్సాహం, కళ్ళలో కదలాడే కోపం చూచి కొంచెం ఆశ్చర్యపోయాడు. ఒక స్నేహితురాలికి జరిగిన అనుభవాన్ని తనకు జరిగిన పరాభవంగా భావించుకుంటున్న అనూరాధను చూస్తూఉంటే వారి స్నేహ బాంధవ్యానికి విలవ చూడగలుగుతున్నాడు.
"వాళ్ళ అమ్మకు ఇప్పుడెలాగైనా దానికి పెళ్ళి చెయ్యాలని .... లలితకు అది ఇష్టంలేదు. ఉన్నది కాస్త ఖర్చుచేసి పెళ్ళిచేసుకుంటే ఆ వచ్చే పురుష పుంగవుడికి మా అమ్మ బాధ్యత తీసుకోవడం ఇష్టం ఉంటుందో లేదో అంటుంది. అన్నిటికంటే డాక్టర్లేమో 'ఆవిడ ఆరోగ్యం జాగ్రత్తగా చూడాలి; మానసికంగా ఏమీ ఆందోళన ఉండకూడదు' అంటారు. వీటన్నిటితో ఆవిడ ఆరోగ్యం ఏమవుతుందో అని బాధ" అంది బాధగా. "ఈ కట్నాలు, ఖర్చులు ఎప్పటికి తగ్గుతాయో" అంది తిరిగి.
"ఆచరణలో ఉన్న అలవాట్లలో మార్పులు రావాలంటే అంత సులువయిన పని కాదుకదా! ఒకటి అవలంబించాలన్నా, ఒకటి మానివేయాలన్నా తరాలు జరగాలి"
"తరతరాలు మారిపోతున్నా వీటికి మార్పు రాలేదు. ఎన్ని విషయాలలో మార్పు వచ్చినా వీటికి లేదు. చదువూ సంధ్యాలేని ఓ అనాగారికుడు ఏం చేశాడన్నా అర్ధం ఉంది. తండ్రి చేసిన పనే తనూ ప్ర్రారంభించాడనేందుకు అవకాశం ఉంది. కాని తండ్రి చదవని చదువు కొడుకు చదువుకున్నాడు. తండ్రి సాధించలేని పని కొడుకు సాధిస్తున్నాడు. అన్నింటిలోనూ తండ్రిని మించుతున్న కొడుకు ఇలాంటి విషయాలలోకూడా అదే మార్గంలో పోవాలంటే ఎలా? తండ్రి పదివందలు కట్నం తీసుకుంటే కొడుకు పదివేలకు వెళ్ళాడంటే అది తరాలలో వచ్చిన అభివృద్ది అంటారా?"
కొద్ది నిమిషాలు మాట్లాడలేదు. వాతవరణంలో కొంచెం మార్పు తేవాలనిపించింది. "ఇవాళ మీరు మగవాళ్ళంటే మండిపోతున్నట్లుంది. నన్ను కొంచెం దూరంగా కూర్చోనివ్వండి" అన్నాడు శ్రీనివాస్.
"కోపంకాదు, శ్రీనివాస్, బాధ. ఎన్నాళ్ళు అయినా మన పెళ్ళిళ్ళలో డబ్బుకు ప్రాధాన్యంమాత్రం తగ్గడంలేదు కదా. ఇప్పుడు కట్నం ఇవ్వవలసి వస్తూంటే, పూర్వం ఎదురు అమ్మాయికి ఇచ్చేవారు. ఇప్పుడు కట్నం ఎక్కువ ఇవ్వలేక ఎవరికో ఒకడికిచ్చి పెళ్ళి చేయవలసివస్తూంది. ఆ రోజుల్లో ఎవడు ఎక్కువ ఇస్తే -వాడెటువంటివాడైనా, ముసలైనా, ముతకయినా - ఇచ్చి చేసేవారు. ఈ డబ్బుకు ఇంత ప్రాధాన్యమే లేకుంటే ఈ కాలం అమ్మాయిల పని ఇంతకంటే ఎన్నోరెట్లు బాగుండి ఉండేది."
"మీరు చెప్పేది నిజమే. ఏ విషయమయినా ఆదర్శమయినా నెమ్మదిగా జరగాలి. ఒక్క రాత్రిలో జరగవు కదా. రోజులు మారుతున్న కొద్ది, వివిధ విషయాలు వింటున్న కొద్ది మనలో ఆలోచనా విధానం మారుతుంది. మనలో ఉన్న అభిప్రాయాలు మన తరవాత తరంలో అమలు పెట్టగలిగినంత తేలిగ్గా మన తరంలో పెట్టలేం. కారణం స్వార్ధం కావచ్చు; అభిమానం కావచ్చు; మరే దయినా కావచ్చు. మీ తాతగారి కాలానికి, మీ నాన్నగారి కాలానికి మార్పు ఉంటుంది. అలాగే మీకు, మీ నాన్నగారికికూడా రాజ్యాలు మారుతున్నాయి. అవసరాలు మారుతున్నాయి. వాటితోబాటు పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి. మీలో ఇలాంటి విశాలభావాలు కలగటానికి కారకులు మీ నాన్నగారే అయి ఉండచ్చు. కాని ఆయనలో ఉన్న ఈ భావాలు ఆయన రోజులలో అమలులో పెట్టుకోలేకపోయి ఉండచ్చు. కారణం, ఆయన తండ్రిగారిమీద గౌరవమో, లేక అప్పట్లో ఇన్ని భావాలు లేకపోవడమో, దేనికయినా అవకాశం ఉంది. అప్పటిదాకా ఎందుకు? ఆయనకు ఉన్న భావాలు ఇప్పుడైనా అమలులోకి తేలేకపోయినా ఆశ్చర్య పడక్కరలేదు. ఉదాహరణగా చెబుతున్నాను; వ్యక్తిగతంగా తీసుకోకండి. మీకున్న భావాలన్ని మీ నాన్నగారిలో ఉండిఉంటాయి. కాని అవన్ని ఆచరించాలంటే ఆయనకు పరిస్థితులు తోడ్పడాలి, మన పద్ధతులన్ని అంతే. మీ అన్నయ్య వివాహంలో చూపగలిగే ఆదర్శాలు మీ విషయంలో వీలుకాకపోవచ్చు. కారణం, కేవలం అభిమానమో, స్వార్ధమో కావాలి. కట్నం ఇవ్వడం ఇష్టంలేదని స్వంత కూతురిని ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్ళి చేయలేరుకదా! అన్నివిధాలా తగిన వ్యక్తి దొరికినప్పుడు, ఒక్క కట్నంకోసం-ఇవ్వగలిగే శక్తి ఉన్నప్పుడు-వెనక్కి పోలేరుకదా? కూతురి సౌఖ్యంకోసం, ఉన్నతి కోసం స్వంత ఆదర్శాలు అణగదొక్కుకుంటారు. మనలో ఉన్న భావాలు మనకు అవసరమయిన వ్యక్తులలో ఉండకపోవడం సహజం. మీతో సమానంగా మీ పరిసరాలు పెరగవు. పద్ధతులు, ఆచారాలు ఒక వ్యక్తికి సంబంధించినవి కావు. అందుకే వాటి మార్పులు ఒక్కసారిగా జరిగేవి కావు."
"మీరు నన్ను ఉద్దేశించి అనకపోయినా, నేనుమాత్రం చెబుతున్నాను. నా విషయంలోనే కనక ఇలాటిది జరిగితే పెళ్ళయినా మానతాను గాని, కట్నం తీసుకునే వ్యక్తినిమాత్రం చేసుకోను."
"నన్ను వెతకమన్నారా అలాంటి వ్యక్తికోసం?" అన్నాడు అనూరాధ కళ్ళలోకి చూస్తూ.
"థాంక్స్ వద్దులెండి నా అంతట నేను వెదుక్కుంటాను" అంది కళ్ళు కిందికి వాల్చుకుంటూ.
ఇంటికి తిరిగివెళ్ళే దోవలో అన్నాడు: "ఇవాళ నాకుమాత్రం ఎంతో సంతోషంగా ఉంది, మీ భావాలు విన్నాక. కాని మనం ఆశించినంతగా మార్పులు ఎప్పుడూ రావు. అంతదాకా ఎందుకు? పెద్దల ప్రమేయం లేకుండా ప్రేమవివాహాలు చేసుకో నిశ్చయించుకుని, పెళ్ళిసమయంలో కట్నం ఏమిస్తావని అడిగే పెద్ద మనుష్యులుంటారు."
12
"ఏమయ్యా, ఈమధ్య బొత్తిగా నల్లపూసవయిపోయావు!" పలకరించారు రాజశేఖరంగారు లోపలికి వస్తున్న శ్రీనివాస్ ను చూచి.
"ఈమధ్య ఊళ్ళో లేనండి." జవాబిచ్చాడు. "మీరెక్కడికైనా వెడుతున్నారా?" అడిగాడు తిరిగి బయట సిద్ధంగా ఉన్న కారును చూచి.
"ప్రత్యేకంగా ఎక్కడికి లేదు. అలా కాసేపు ఊరికే వెళ్ళివద్దామని. మా అనూరాధకు ఒంట్లో బాగాలేదు. ఏమీ తోచటంలేదట." ఆత్రంగా చూచాడు శ్రీనివాస్. అతని చూపులో భావాలు గ్రహించనట్లు "పైన వరండాలో ఉంది" అన్నారు.
చేతిలో ఉన్న పుస్తకాలతోసహా పైకి వెళ్ళాడు శ్రీనివాస్. పైన వరండాలో ఆకుపచ్చని పేముకుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంది అనూరాధ. మెత్తటి సాదా వాయిలు చీరలో వడిలిన గులాబిలా అనిపించింది శ్రీనివాస్ కు. మూసుకున్న కనురెప్పలు నీరసంగా, బరువుగా కనుపిస్తున్నాయి.
తలుపు చప్పుడవగానే కళ్ళు తెరిచి, శ్రీనివాస్ ను చూడగానే సర్దుకు కూర్చుంటూ, "రండి" అని ఆహ్వానించింది చిరునవ్వుతో.
"మీకు ఒంట్లో బాగాలేదుట!" అడిగాడు.
"ఉఁ ... జ్వరం వస్తూంది వారంనుంచి."
"వారంనుంచా!" ముఖకవళికలలో మార్పు వచ్చింది. అనూరాధ మణికట్టు పట్టుకుని నాడి చూచి, ఆమె నుదుటిమీద చెయ్యి వేశాడు అప్రయత్నంగా, ఒళ్ళు ఎంత వేడిగా ఉందో చూడటానికి. అనుకోకుండా అతను చేసిన పనికి ఆశ్చర్యపోతూ విచిత్రంగా అతనివైపు చూచింది, విశాలమైన కళ్ళతో. ఆమె చూపుల్లో తను చేసిన పనేమిటో తెలిసింది. చెయ్యి వెంటనే వెనక్కి లాక్కున్నాడు.
"డాక్టర్ని పిలిచారా?"
"ఆఁ! కృష్ణమూర్తిగారే వస్తున్నారు రోజు."
కొంతసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది. తను చేసిన పనికి కలిగిన ఆశ్చర్యం ఆమెను పూర్తిగా విడిచిపోలేదన్న విషయాన్ని గమనించి మాట మార్చాలన్నట్లు, తను తెచ్చిన పుస్తకాలు అనూరాధకు అందిస్తూ, "మీ కొత్త లైబ్రరీకి" అన్నాడు.
థాంక్స్ చెబుతూ పుస్తకాలు అందుకుని వివిధ ప్రఖ్యాత రచయితల నవలలను చూస్తూ, "ఏకంగా ఇన్ని ఎందుకండీ!" అంది.
"మీరు చదవని పుస్తకాలు ఏవో తెలియలేదు. కనీసం ఇందులో ఒక్కటైనా ఉండకుండా ఉంటుందా అని."
"థాంక్యూ" అంది మళ్ళీ. "ఈ మధ్య మీరు కనిపించి చాలా రోజులైంది. పది రోజుల క్రితం ఒకసారి లైబ్రరీకి వెళ్లాను. మీరు ఊళ్ళోలేరని తెలిసింది."
"మా ఊరు వెళ్లాను. మా అమ్మను చూచి చాలా రోజులైంది."
"మీ వాళ్ళందరూ కులాసాయే?" అది యథాలాపంగా.
"ఆఁ, మా వాళ్ళందరికి - ఎవరూ లేరు. మా అమ్మ ఒక్కర్తే" అన్నాడు.
కొంతసేపు మౌనంగా ఉండి, "మీరెప్పుడూ మీ ఇంటి కబుర్లు చెప్పరు" అంది.
"ఏముంటాయి చెప్పేందుకు? నాకు అన్నయ్యలు, చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. అంతగా సంగతులు ఏమీ ఉండవు."
మెట్లమీద సవ్వడి వినిపించగానే అటు తిరిగి చూచారు ఇద్దరూ. నౌకరు పైకి వచ్చి, "అయ్యగారు మిమ్మల్ని కిందికి రమ్మంటున్నారు" అన్నాడు. "పద..." అంటూ లేచి నిలబడింది అనూరాధ. "రండి, కిందికి వెడదాం" అంది శ్రీనివాస్ తో.
"పదవోయ్, కాసేపు అలా తిరిగివద్దాం. మా పుత్రికా మణికి ఇంట్లో ఏమీ తోచడం లేదుట" అన్నారు నవ్వుతూ రాజశేఖరంగారు.
"ఎటువైపు వెడుతున్నారు?"
"ఎటు అని ఏమీ లేదు. ఏదో అలా కాసేపు. బీచ్ వైపుకు వెళ్ళి, అలా జరిగి ఓ గంటా, గంటన్నరలో వచ్చేద్దాం" అన్నారు.
అనూరాధ జోళ్ళు తొడుక్కుని మెల్లిగా బయటికి వచ్చింది.
"స్వెట్టర్ గాని, శాలువాగాని తెచ్చుకోండి. బయట కొంచెం గాలిగా ఉంది" అన్నాడు శ్రీనివాస్.
ఇబ్బందిగా మొహం పెట్టింది అనూరాధ. శ్రీలక్ష్మి వెంటనే లోపలికి వెళ్ళి ఓ శాలువా తెచ్చి అనూరాధకు కప్పింది.
"అబ్బ..." అంది విసుగ్గా మొహం పెట్టి. శ్రీనివాస్ వంక చూచింది అదంతా మీమూలంగానే అన్నట్లు.
"అబ్బ లేదు, ఏమీ లేదు. కార్లోనేగా. కాసేపు కప్పుకుని కూర్చో."
"టెంపరేచర్ తగ్గిపోయిందమ్మా."
"శాలువా కప్పుకున్నంతమాత్రాన మళ్ళీ రాదుగాని, ఇంక మాట్లాడక చెప్పినట్లు విను."
అందరు ఎక్కారు కార్లో, రిక్షాలతో, మనుష్యులతో, సైకిళ్ళతో రద్దీగా ఉన్న రోడ్లు దాటాక కొద్దిగా వేగంగా పోతూంది కారు. సముద్రం దగ్గిర కారు ఆపి కబుర్లు చెప్పుకుంటూ అందులోనే కూర్చున్నారు. బాగా ఈదురుగాలిగా ఉండేసరికి బయలుదేరదామన్నాడు శ్రీనివాస్. 'చాలా ఈదురుగాలిగా ఉంది. రాత్రికి వర్షం వస్తుందేమో' అనుకుంది శ్రీలక్ష్మి పైన నిర్మలంగా, నీలంగా ఉన్న ఆకసంవంక చూస్తూ. కాని ఒక్క మబ్బుతునక ఉన్న జాడకూడా లేదు.
మరికొంత దూరం వెళ్ళేసరికి సందడి తగ్గిపోయింది. నిశ్శబ్దంగా ఉన్నాయి రోడ్లు. రోడ్డుకూడా ఎక్కువ బాగాలేదు. దూరంగా పాకలు, గుడిసెలు ఉన్నట్లు తెలుస్తూంది. నీలాకాశంలో నల్లటి పొగమబ్బులు నీలమేఘశ్యామలుడి మెడమీద జారిపడుతున్న నల్లని గిరజాలులా ఉన్నాయి. ఎక్కడో ఏదో కాలిపోతున్న వాసన రాసాగింది. ఇంకా కొంచెం ముందుకు పోయేసరికి దూరంగా మనుష్యుల మాటలు గోలగోలగా వినవస్తున్నాయి, ఏదో కంగారుగా, హడావిడిగా పరిగెడుతున్నట్లుగా ఎవరో ఏడుస్తున్నట్లు రకరకాల ధ్వనులు మిళితమయి వినసాగాయి.
నిర్మలమయిన ఆకాశం నల్లని పోగతో నిండిపోయింది. ఎర్రని మంటలు పాము నాలుకలా ఎగసిపోతున్నాయి. ఎవరికివారు వారివారి వస్తువుల జాగ్రత్తలో పడిపోతున్నారు! పసిపిల్లల్ని, ముసలివాళ్ళను లాక్కుని వచ్చి బయట పడేస్తున్నారు. ఒక్కచోట గుట్టలా పోసి, దగ్గర దగ్గరగా ఉన్న తాటాకుల గుడిసెలు అగ్నిదేవుడి ఆకలికి ఆహుతి అయిపోతున్నాయి.
దరిద్ర దేవత కృపావీక్షణాలతో మలమలమాడిపోతున్న పేదల కడుపుల లాగా మాడిపోతున్నాయి పాతకొంపలు. అగ్నిహోత్రుడి కబంధహస్తాలలో అంతమయి పోతున్న ఇళ్ళకు గాలి తోడై మరింత మండుతున్నాయి. ఆకాశం ఎత్తున ఎగిసిపోతున్న ఎర్రని మంటలకు చిన్నచిన్న లక్కపిడతలలాంటివాటిలోని నీటితో దాహం తీర్చాలని ప్రయత్నిస్తున్నారు.
దూరంగా ఫైర్ ఇంజన్ ల గణగణలు, అంబులెన్సుల సైరన్లు మిళిత మయి వినవచ్చాయి. ఆశగా అందరూ అటు చూడసాగారు. ఆశ లేని మానవుడికి తావులేదు. సగానికి పైగా కాలిపోయిన ఇళ్ళను చూస్తూ వెలువడుతున్న నిట్టూర్పు సెగలతో పొగలు గక్కుతూంటే ఇంకా మిగిలినవి రక్షింపబడతాయన్న ఆశ! ఫైర్ ఇంజన్లు, పెద్దపెద్ద పైపులతో మంటల్ని అణగదొక్కాలని చూస్తున్నారు!
* * *

