అతనివంక అసహనంగా చూచింది. నిశ్శబ్దంగా నిట్టూరుస్తూ "బాగానే ఉంది" అంది.
"కాని ఇంకా బలహీనంగా కనిపిస్తున్నారు. ఏవైనా టానిక్స్ తీసుకుంటున్నారా?"
"ఆఁ. ఎందుకిలా మాట తప్పించాలని చూస్తారు, శ్రీనివాస్?" అంది నిష్ఠూరంగా.
భారంగా కళ్ళు మూసుకున్నాడు. విసిరేసిన రాయి వెనక్కి తిరిగివచ్చి నట్లయింది. "ఇప్పుడు కాదు, అనూరాధా! ప్లీజ్. నేను మాట్లాడే ధోరణిలో లేను" అన్నాడు బతిమాలే ధోరణిలో. అతని కంఠంలో మార్ధవాన్ని విని చలించి పోయింది అనూరాధ. అతనివంక జాలిగా చూచింది. తిరిగి ఆ విషయం ప్రస్తావించాలని ప్రయత్నించలేదు.
"ఇవాళ ఎందుకో అలలు మరీ విపరీతంగా ఎగిరిపడుతున్నాయి, పౌర్ణమి రోజుల మూలంగానేమో!"
"ఊఁ, గాలిగా కూడా ఉంది."
ఎప్పుడూ గాలిలో పోగుల్లా ఎగిరిపోయే కబుర్లు వారిద్దరి మధ్య రాలేదు. మాట్లాడుకునేందుకు మాటలే కరువయ్యాయి. శ్రీనివాస్ హృదయంలో ఏదో తపనగా ఉంది, ఏదో ఎవరికో చెప్పుకోవాలని. ఇన్నేళ్ళుగా ఎవరికి చెప్పుకోలేకపోయిన విషయాలు చెప్పుకోవాలని, ఇతరుల అభిప్రాయమో, సానుభూతో, మరేదో పొందాలని హృదయం తహతహలాడిపోతూంది. మనసు బరువెక్కిపోతూంది. తీరా మాట్లాడేందుకు సమయం వచ్చేసరికి మాట్లాడ బుద్ది వెయ్యడంలేదు. అనూరాధ ఎన్నో విషయాలు చెప్పాలని, ఎన్నో సంగతులు తెలుసుకోవాలని వచ్చింది. తీరా వచ్చాక, శ్రీనివాస్ ముఖం చూచాక అడగటానికి, చెప్పడానికి మనస్కరించకుండా పోయింది. శ్రీనివాస్ లో ఏదో సంచలనం బయటికి తెలుస్తూంది. నిద్ర లేమితో విశ్రాంతికి తపిస్తున్నట్లున్న అతని కళ్ళల్లో ఎర్రజీర మెరుస్తూంది. అతనివంక చూస్తూ "ఈమధ్య మళ్ళీ ఎక్కడికయినా వెళ్ళరా?" అని అడిగింది.
"ఊఁ" అంటూ లేచి నిలబడ్డాడు. "పదండి. ఇంక వెడదాం. మిమ్మల్ని ఇంటిదగ్గిర దిగబెడతాను" అన్నాడు. ఇసకలో కూరుకుపోతూన్న పాదాలతో నెమ్మదిగా అడుగులువేస్తూ గృహోన్ముఖులయ్యారు.
ఇంటి మలుపుదగ్గిరకి రాగానే అలవాటుగా కాళ్ళు ఆగిపోయాయి. "మళ్ళీ ఎప్పుడు కనబడతారు?" అడిగాడు.
"మీ ఇష్టం. మీకు వీలయితే మా ఇంటికి రండి. ఏ సాయంత్రమయినా ఇంట్లోనే ఉంటాను."
మౌనంగా తల ఊపాడు. ఏదో చెప్పాలని ప్రయత్నించి ఆగిపోయాడు. ఒక్కసారిగా అనూరాధ రెండుచేతులు తన దోసిలితో పట్టుకుని ఆమె ముఖం లోకి చూచాడు. ఒకదానికి రిస్ట్ వాచీ, ఇంకొకదానికి నిండుగా గాజులు చుట్టుకుని లేత కొమ్మల్లా ఉన్న తెల్లని చేతులవంక ఒక్కక్షణం చూచి వదిలేశాడు. ఆమె చేతికి ఉన్న ఎర్రరాయి తళుక్కుమంది. అతని మదిలో ఏదో భావం ఉలిక్కిపడింది. మసకచీకట్లో అతని ముఖంలోని భావాలు చదవలేక కొద్దిగా ఆశ్చర్యపోతూ ఇంటికి చేరింది.
అప్పటికే ఇంటికి వచ్చినట్లున్నారు రాజశేఖరంగారు. కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటున్నారు. అనూరాధ ఇంట్లో అడుగు పెట్టగానే ఆమెవంక నిశితంగా చూచారు ఒక్కక్షణం, ఆమె ఏమయినా చెబుతుందేమోనని.
శ్రీనివాస్ అంటే ఆ ఇంట్లో అందరికీ ఒక ప్రత్యేకమయిన అభిమానం ఏర్పడిపోయింది. ఒక ఆప్తమిత్రుడులా, ఇంట్లో ఒక వ్యక్తిలా కలిసిపోయాడు. రెండువారాల క్రితం జరిగిన సంఘటన అందరిలోనూ అంతో ఇంతో కుతూహలం కలిగించకమానలేదు.
తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని పరధ్యానంగా నిలబడిపోయింది. చీకట్లు బాగా అలుముకున్నాయి. నక్షత్రాలు మిణుకుమిణుకుమంటూ కబుర్లాడుతున్నాయి. పొడవైన కొబ్బరిచెట్లు వెనక దూరంగా శృంగార రసవాహినిలో మునుగుతూ చల్లదనాన్ని ప్రసాదిస్తున్నాడు సుధాకరుడు. కిటికీచువ్వలు పట్టుకుని బయటికి చంద్రుడివంక తదేకంగా చూస్తూ నిలబడింది. నిర్మల మయిన నీలాకాశంలో తెల్లని గుండ్రని చందమామ బాలకృష్ణుడి మెడలో ముత్యాలపతకంలా ఉంది.
ప్రశాంతంగా, మనోరంజకంగా ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్లుండి అరిచేతులు చూచుకుంది. చల్లని ఇనపచువ్వల నానుకోవడంతో చలబడ్డ అరిచేతుల్లో ఉన్నట్లుండి వెచ్చదనం అలుముకుంది. శ్రీనివాస్ మలివెచ్చని దోసిలిని కొద్ది క్షణాలు చవిచూచి బయటికి వచ్చి ఏదో తెలియని వెచ్చదనంతో బాటు మధురానుభూతిని కూడా కలగజేశాయి ఆ చేతులు!
15
చంద్రుడు మెల్లిగా చల్లగా పైకి వస్తున్నాడు. పగలంతా అలిసిపోయి ఇంటికి చేరి చల్లని నీటితో స్నానంచేసి ఇంటివెనక పెరడులో తిరుగుతున్నారు కృష్ణమూర్తిగారు, చేతిలో ఆ రోజు న్యూస్ పేపరుతో.
వెనకఉన్న చిన్న పూలతోట చిందరవందరగా సంరక్షణ లేని పసిపిల్లవాడి జుట్టులా ఉంది. ఒక కాలంలో విరగబూచిన మల్లె, జాజి తీగలు సరిఅయిన ఆలంబన లేక నేలమీద పాకుతున్నాయి. 'పార్వతి ఉన్న రోజుల్లో ఎలా ఉండేది ఈ ప్రదేశం!' అని నిట్టూర్చారు. పూలతీగలవలెనే తమ జీవితంలోకూడా పార్వతితోబాటు ఆలంబనకూడా జారిపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి తమకోసం ఎదురుచూచేవారొక రున్నారన్న ఊహే సగం అలసట మరిపించేది. ఇప్పుడేముంది? ఇంటికి చేరేటప్పటికి, పొద్దున ఇల్లు వదిలే సమయానికి ఎలా ఉంటూందో అదే విధం. ఇవాళ్టికి, రేపటికి తేడాలేని జీవితం. హాస్పిటల్లో రోగులు, ఆపరేషన్లు, కన్సల్టింగులు ... మార్పులేని పద్ధతులు.
సుదీర్ఘమయిన నిట్టూర్పు విడుస్తూ పేముకుర్చీలో జారగిలబడ్డారు. కాళ్ళు ముందున్న బల్లపై పెడుతూ పైకి వస్తూన్న చందమామను చూస్తూ ఉండిపోయారు.
ఆ రోజు జరిగిన సంఘటనలు నిజమయిన విషయం అని నిక్కచ్చిగా తెలిసినా, కల అయిఉండవచ్చన్న భ్రమ కలుగుతూంది.
'ఏనాటి సావిత్రి ... తిరిగి ఇన్నేళ్ళకు ... జీవితంలో చేసిన తప్పు వెన్నంటి హింసిస్తుందంటారు.. తప్పుకు ఒక రూపం ఉందని ఇన్నేళ్ళకు తెలియడం! అదే ఆనందం కలగజేస్తున్నప్పుడు తప్పెలా అవుతుంది? అదొక వరం.'
అ మధ్యాహ్నం ఆపరేషన్లతో అలిసిపోయి తమ ఆఫీసురూమ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు కృష్ణమూర్తిగారు. అంతలో ఫ్యూన్ వచ్చి తనకోసం ఎవరో వచ్చారని చెప్పాడు.
"ఇప్పుడు ఎవర్ని చూడదలుచుకోలేదని చెప్పు."
"వైద్యంకోసం రాలేదు, బాబూ ఎవరో మీ బంధువులట. మిమ్మల్ని చూడాలిట!" సమాచారం అందచేశాడు.
"రమ్మను" అంటూ లేచి, చన్నీళ్ళతో మొహం కడుక్కొని కుర్చీలో కూర్చున్నారు.
మరో పది నిమిషాలలో నలభై ఏళ్ళు పైబడ్డ స్త్రీ లోపలికి అడుగు పెట్టింది, చీర నిండుగా భుజాలమీద కప్పుకుని. ఆమెను చూస్తూనే క్షణకాలం నిర్ఘాంతపోయారు. అప్పుడే తుడుచుకున్న ముఖం తడిసిపోయింది చెమటతో. కొద్దిక్షణాలలో రేగుతున్న భావాలు అదుపులో పెట్టుకుని "కూర్చోండి" అన్నారు తడి ఆరిన గొంతుకతో. ఆమె తనవైపు చూడటం లేదన్న విషయాన్ని గమనించి ఒక్కసారి పరికించి చూచారు. ఆమెను చూడగానే ఎవరో గుర్తుపట్ట గలిగినా, ఇన్నేళ్ళకు దాదాపు పాతికేళ్ళ తరవాత తిరిగి కలుసుకోవలిసిన అవసరాన్ని అవగాహనం చేసుకోడానికి ప్రయత్నించారు.
"సావిత్రీ ..."
"గుర్తుపట్టావన్నమాట." విశాలమైన కళ్ళల్లో లోతుగా విషాదం పొడ చూపింది. ఆమె కళ్ళల్లోకి చూడగానే తను ఏనాడో ఆఖరిసారిగా చూచిన పది వాసిక, తలనిండా పూలు. ఒక్కసారి ఆ రూపాన్ని ఇప్పటి సావిత్రితో పోల్చుకోకుండా ఉండలేకపోయారు. అమాయికత్వాన్ని కప్పేసిన గాంభీర్యం, బోసిమెడ మూస్తున్న చీర. కళావిహీనంగా, చంద్రుడు లేని ఆకాశంలా, ప్రియుడు లేని ప్రేయసిలా, కుంకుమాలంకారహీనమయిన విశాల ఫాలభాగంతో దీపంముందు దివిటీలా కనిపించేసరికి హృదయం కలుక్కుమంది.
ఎంత వద్దనుకున్నా మనసు గతాన్ని తవ్వుతూంది. శ్రావణమాసంలో ఊరంతా సందడిగా ఉంది. విరగబూచాయి చామంతులు. ఏవో పనులకోసం రమ్మని కబురుచేశారు. అమ్మ పేరంటానికి వెళ్ళింది. నాన్న ఎవరో కబురంపారని వెళ్ళారు.
ఇంట్లో ఏమీ తోచకుండా ఉంది. వాతావరణం చీదరగా ఉంది. జోరుగా పడుతున్న వాన, దట్టంగా ముసురుకున్న మబ్బులమూలంగా ఊరంతా చీకట్లు అలుముకున్నాయి. ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే తోచక నాన్నగారి పుస్తకాల బీరువా తెరిచి చూస్తున్నాడు తను. అల్లసాని పెద్దనగారి శృంగార రసమయమయిన ప్రబంధం చదువుతూ ఉంటే, మనసు దాట్లగుర్రంలా పరుగులు పెడుతూంది. ఒళ్ళు గగుర్పొడుస్తూంది. మధురమయిన ఊహలు రకరకాలుగా ముప్పిరి గొంటూంటే ఆలోచనలు వివిధ మార్గాలలో విహరిస్తూఉన్నాయి. మెల్లిగా ఆ పుస్తకాన్ని యథాస్థానంలో సర్దేశాడు.
ప్రబంధాలలో హత్తుకుపోయిన విషయాలు మనసులో మెదులుతూఉంటే, కిటికీలోంచి చూస్తూ నిలబడ్డాడు. సందు మొదలులో పట్టుపరికిణీ ఒకచేత్తో సెనగలమూట మరొకచేత్తో పట్టుకుని గబగబా అడుగులు వేస్తూన్న అమ్మాయి సుపరిచితంగా కనిపించింది. పేరంటంనుంచి వస్తూ కాబోలు వర్షంలో చిక్కుకుంది.
కొద్దిక్షణాలు వాన చూస్తూ నిలబడిపోయాడు. ఏదో చప్పుడైనట్లు అనిపించగానే వెనక్కి తిరిగి చూచి మెట్లు దిగి కిందికి వచ్చాడు.
వసారాలో నిలుచున్న సావిత్రిని చూడగానే - "అక్కడ నుంచున్నావేం తడిసిపోతూ, సావిత్రీ? లోపలికి రా!" అన్నాడు.
ఉలిక్కిపడింది సావిత్రి. గబుక్కున వెనక్కి తిరిగి చూస్తూ, "ఏం లేదు. వర్షం వస్తూంటే ఆగాను. అత్తయ్య లేదు కదా అని లోపలి రాలేదు" అంది.
"అత్తయ్య లేకపోతే లోపలికి రాకూడదా? రా!"
లోపలికి వెళ్ళింది సావిత్రి. కిటికీలోంచి, చూరునుండి పడే ధారను చూస్తూ నుంచుంది. వెనకగా నుంచున్న తనను దృష్టి మరల్చకుండా చేసింది సావిత్రి రూపం. పొడుగాటి నల్లని జడ, అడుగున బరువైన కుచ్చులతో వదులుగా ఊగుతూంది. అరుణవర్ణపు పట్టుపరికిణీ, పైన వానజల్లుకు తడిసిన పల్లెవాటు. సన్నని నడుముకు మెరిసే వడ్డాణం. యౌవనంలోకి అడుగుపెడుతున్న అవయవాలు. అసలైన పల్లెపడుచు. ఒక్కసారిగా ఉరుముతోపాటు వచ్చిన మెరుపు సావిత్రిమీద పడి, ఆమె పచ్చని శరీరానికి మరో వన్నె తెచ్చింది. మధురమయిన ఊహలమయ మయిన తన హృదయం అదుపు కోల్పోయింది. విచక్షణ వశించింది. మెల్లిగా వెనకగా వెళ్ళి అధాటుగా రెండుచేతులతో సావిత్రి భుజాన్ని పట్టుకుని తనవైపు తిప్పుకున్నాడు బలంగా.
"బావా! ఏమిటిది?" అడిగింది తడబడుతూ.
ఏమిటో తెలుసుకునేసరికి ఇద్దరూ కిటికీ దగ్గిర లేరు. గబగబా బట్టలు సర్దుకుని ఇంటికి పరుగుతీసింది సావిత్రి.
తను తిరిగి సెలవులకు వెళ్ళేసరికి సావిత్రికి పెళ్ళయిందని, అత్తవారింటికి వెళ్ళిందని విన్నాడు. తిరిగి దే చూడటం!
సావిత్రి చెప్పిన మాటలు వినగానే ఆమె ముందు వంచిన తల ఎత్తలేకపోయాడు. ఆ రోజు జలజలా పడుతున్న వాన, ధనధనా మోగుతున్న ఉరుములు ప్రతి ఒక్కటి హృదయంలో సమ్మెట పోటుల్లా తగిలాయి. ఆనాటి సావిత్రి... అభం శుభం ఎరగని సావిత్రి .... ఈ రోజు తన సహాయం అడగటానికి వచ్చింది!
'నిజమా ఇది? .... ఇది సంభవమా? ఇంతకాలం ఎలా దాచుకోగలిగింది? సావిత్రి చేసిన పొరపాటు అంత సహృదయతతో స్వీకరించగలిగిన మహానుభావులు నిజంగా భువిలో ఉంటారా? నేనే ఆయన స్థానంలో ఉంటే ఈ ఔదార్యాన్ని చూపగలిగేవాడినేనా?'
సావిత్రి తన స్వంత మేనమామ కూతురు. ఈనాడు ... ఇన్నేళ్ళ తరవాత "బావా, ఏమిటిది? అన్న సావిత్రి మాటలు చెవుల్లో మారుమోగాయి. "సావిత్రీ! తెలిసి చేయని నేరాన్ని క్షమించు. ఎంత అదృష్టవంతురాలినైనా దురదృష్టవంతురాలివి! అటువంటి ఆదర్శవంతుడి భార్య అనిపించుకున్న తృప్తి, అదృష్టం నీ కొక్కర్తెకే తగింది."
