"ఏఁ బిజినెసు?
"వజ్రాలు, రత్నాలు, వెండి, బంగారం ఊరినుండి ఊరికి తీసుకుని వెళ్ళి అమ్ముతాను."
ఆయన మాటలమీద అక్కడున్నవాళ్ళ కెవ్వరికీ నమ్మకం కలుగలేదు. అతడు వేసుకున్న గుడ్డలు ఇతడేం బంగారు వర్తకుడూ?' అనిపించేలా ఉన్నాయి.
తోటి ప్రయాణికుల మనసులోని సందేహం అట్టే కనిపెట్టేశాడు:
"నేను చెపుతున్నది నిజమేనండోయ్. బిజినెస్ లో ఇలా తిరుగుతూనే ఉంటాను. ఇప్పుడు నా ఒంటిమీద ఐదువేల రూపాయల బంగారానికి తక్కువ ఉండదు. చూపిస్తా నుండండి ...." అంటూ, తను చొక్కాలోపలి జేబు కుట్టు విప్ప సాగారు.
"వద్దులెండి" అన్నారెవరో.
"మా అమ్మాయి నవరసులు ఇలా సంచిలో పెట్టి లోపలి జేబులో పెట్టి గట్టిగా కుట్టేస్తుంది. ఆ పిల్లే చిన్నమ్మాయి నాకు. ఆ ఒక్క పిల్లకు పెళ్ళిచేసేస్తే, నా బాధ్యత తీరిపోతుంది. నేనంటే ఎంతో ప్రేమ అమ్మాయికి. ఇహ మిగిలినవాళ్ళంతా ...... ప్చ్ ...... లాభంలేదు. ఈ ముసిలాడు ఎప్పుడు చస్తాడా ..... ఎప్పుడు ఆస్తి కాజేద్దామా అనే కాచుక్కూర్చున్నారు....." మాట్లాడుతూనే కుట్టు విప్పి సంచిలోని నవరసులు దోసిట్లోకి పోసుకున్నారు.
కొత్త నవరసులు సూర్యుడి వెలుగులో తళ తళా మెరిశాయి. వాటిని ఒక చేతిలో నుండి మరో చేతిలోకి పోసుకుంటూ ఆనందించా డాయన.
"నేను తిరిగి వచ్చేదాకా క్షేమంగానే ఉన్నానన్న నమ్మకం ఎవరికీ ఉండదు. బంగారం ఉందని తెలిసి ఎవరన్నా నన్ను ఖూనీచేసి బంగారం కాజేస్తారని వాళ్ళ భయం."
"మీరు ఇలా అందరిలోనూ మీ దగ్గర బంగారం ఉందని చెప్పటం మంచిది కాదేమో!" ఎవరో అన్నారు.
"అందుకేగా, నే నెప్పుడూ ఫస్టు క్లాసులో ప్రయాణం చెయ్యను. ఎక్కువగా మనుష్యులున్న పెట్టెలోనే ఎక్కుతాను. అయినా మనలో ధర్మం, న్యాయం ఉన్నంతవరకూ ఏం భయం చెప్పండి."
"మైసూరులో బంగారం బాగా అమ్ముడు పోయిందా?"
'ఫరవాలేదు-సుమారుగా ఖర్చయింది. మహా రాష్ట్రంలో ముత్యాలు ఎక్కువగా అమ్ముడుబోతాయి. అక్కడ వజ్రాలను కన్నెత్తి కూడా చూడరు ...." అంటూ ఆయన మళ్ళీ నవరసు లను సంచిలో పోసి, పెట్టెలో పెట్టి తాళం వేశాఉర్.
ధారవాడ దగ్గర-పడుతూండటం గమనించి ఆయన నిరాశతో:
"ఇక కాఫీ దొరకదు" అన్నారు. అక్కడున్న ప్రయాణికు లందరిలోనూ తన నవరసులను గురించి కొంచెం కూడా ఆసక్తి చూపని రమేశు డిని చూసి:
"ఎక్కడిదాకా వెడుతున్నారు" అని అడిగాడు.
"బొంబాయి."
"ఎవరింటికి వెడుతున్నారు? ఇల్లెక్కడ?"
ఆయనతో మాటలు కలపాలని ఆసక్తి లేని రమేశ్:
"నాకు తెలియదు. వాళ్ళే వస్తారు స్టేషనుకు."
"అలాగా; చదువుతున్నారా? ఉద్యోగమా?"
"చదువుతున్నాను."
"ఏం చదువుతున్నారు?"
"ఎం.బి.బి.ఎస్., ఫైనల్ ఇయర్."
సరి; ఇక ఆయన తన "డయాబిటీస్" జబ్బు గురించి వివరించటానికి మొదలుపెట్టారు.
"నాకు తీపి అంటే ప్రాణం. జబ్బు కేమో తీసి అసలు పడదు. ఏం చెయ్యటమో చెప్పండి....."
ఆయన మాట ముగించటానికి ముందే రమేష్ ఆందుకున్నాడు: "ప్రతీ స్టేషనులోనూ పంచదార వేసిన కాఫీ త్రాగితే మరింకేముంది? తీసివస్తువులు, పళ్ళు తినకండి. కొంచెం కూరగాయలు ఎక్కువగా వాడండి......"
"ఆ పాడు గోధుమ అన్నానికి ఏం కూరలు కలుపుకున్నా బావుండదు. గడ్డిలా ఉంటుంది."
"మీ కెన్నేళ్ళండి?"
"అరవై నాలుగు."
"సామాన్యంగా నలభై ఏళ్ళు దాటాక ఈ జబ్బు వస్తుంది. మీరు ఆ తరువాత ఇరవైనాలుగేళ్ళు బాగానే ఉన్నారుకదా. ఆ మాత్రం చాలదూ? ఇన్నిరోజులు బాగా బ్రతికారు గాని, ఇహచాల్లెండి." -
ఆయన మనస్ఫూర్తిగా నవ్వారు.
"నిజమే కాని, బ్రతికినంతకాలం తినాలిగా మరి. జిహ్వచాపల్యం అంత సుళువుగా పోతుందా మరి?"
"బ్రతకటానికోసం తినండి గాని, తినడానికోసం బ్రతక్కండి."
"మీరు చాలా రసవత్తరంగా మాట్లాడతారు! బొంబాయిలో మా ఇంటికి తప్పకుండా రండి" అని తన అడ్రసున్న కార్డు రమేశుడికిచ్చాడు.
బొంబాయి చేరేవరకు ఆయన రమేశుడిని వదల్లేదు. ఏకాంతాన్నే కోరుకుంటున్న రమేశుడిని ఆయన మాటలు చాలా చికాకు పరచాయి. అతడినుండి తప్పించుకుంధామని రమేష్ ఎంత మోటుగా మాట్లాడినా: "చాలా రసవత్తరంగా మాట్లాడుతారు మీరు" అవే నారాయణ.
భోజనం, టిఫిన్ విషయంలో రమేశుడి ఉదాసీన భావాన్ని గమనించి తమతోబాటే భోజనమూ అదీ తెప్పించేవారాయన.
"ఈ వయసులోనయినా బాగా తినాలండి. ఇప్పుడు నన్నే చూడండి; మీ ఈడులో దీనికి మూడింతలు తినేవాడిని. ఇప్పుడైనా నేను మీకంటే నయమే."
రమేశ్ ఆయన్నుండి తప్పించుకోలేకపోయాడు. మాటకారితనం, గొప్పలుగ చెప్పుకోడం ఎక్కువయినా, ఆయన మనసు మంచిదని గ్రహించాడు రమేశ్.
దాదర్ స్టేషన్ లోనే దిగవలసిందిగా రాశాడు శేషగిరి.
స్టేషన్ రాగానే, ఆ బంగారు వర్తకుడు రమేశుడి కరస్పర్శచేసి:
"ఇక వస్తానండోయ్. మళ్ళీ మా ఇంటికి రావటం మరిచిపోయేరు" అన్నాడు.
రమేశ్ కిటికీలో మొహంపెట్టి శేషగిరికోసం వెతికాడు. కాని, శేషగిరి-మొహం ఎక్కడా కనిపించలేదు.
రైలు ఆగగానే, రమేశ్ తన సూటుకేసు చేతిలో పట్టుకుని క్రిందికి దిగి చుట్టూ చూశాడు. శేషగిరి కనిపించలేదు.
రమేశుడి హృదయం బరువెక్కింది. బహుశా తన రాక వాళ్ళకిష్టంలేదేమోనన్న ఆలోచన అతడి మనస్సును కించబరచింది.
అన్నయ్యమాట విని, తను ఇలా రవటం పొరపాటేమో అనుకున్నాడతడు. అయినా కళ్ళు చుట్టూ వెదుకుతూనే ఉన్నాయి. మరాఠీ, హిందీ, గుజరాతీ, తమిళ భాషలు కలగాపులగంగా వినిపిస్తున్నాయి. ఆ జనసాగారంలో ఎక్కడికి వెళ్ళాలో తోచలేదు రమేశుడికి.
"నమస్కారం" అన్న మాతృభాషలో కంఠం విని, టక్కున వెనుదిరిగి చూశాడు రమేశ్.
అపరిచితులతో నిండిన ఆ జనసమ్మర్దంలో పరిచయమున్న మనిషిని చూసి హాయిగా నిట్టూర్చాడు రమేశ్.
"నమస్కారం."
"ఆయన రావటానికి వీలుపడలేదు. ఫార్మసీ కి ఉదయమే వెళ్ళారు. నన్నే స్టేషనుకు వెళ్ళమని చెప్పి వెళ్ళారు. రండి వెడదాం."
రమేశ్ పెట్టే, పరువుకోసం దెబ్బలాడుకుంటున్న "హమాల్" లతో మరాఠీలో మాట్లాడి, ఒకడిని సామాను తీసుకోనిచ్చి ముందుకు నడచింది రత్న.
రమేశ్ ఆమెవెంటనే నడిచాడు.
ఆ గుంపులో చోటుచేసుకుంటూ, రమేశుడిని, ఇంట్లోనివారి క్షేమ సమాచారాలు అడుగుతూ నడుస్తోంది రత్న. రమేష్ ముక్తసరిగా జవాబు చెబుతున్నాడు. అతడి దృష్టి అంతా రత్నమీదనే ఉంది. తను వెనకబడి, రత్న కనిపించకపోతే, తను మళ్ళీ సమూహంలో ఒంటరి-వాడి నయిపోతానన్న భయంతో ఆమెను అనుసరించాడు రమేశ్. రమేశ్ మైసూరులో దసరా ఉత్సవాలప్పుడు మాత్రమే ఇంతటి జనసమూహాన్ని చూసి ఎరిగిన వాడు. దసరాలో మేల్కొన్న మైసూరు మళ్ళీ దసరా వరకు ప్రశాంతంగా నిద్రపోయేది.
రత్న మెట్లు ఎక్కి, దిగింది. రమేశ్ ఆమెను అనుసరించాడు. స్టేషన్ దాటి బయటికి వచ్చి ట్యాక్సీలో కూర్చున్నాక మొదటిమారు రమేశ్ వైపుకు చూసింది రత్న.
"నయాన్.....బస్ స్టాప్" అని డైవరుతో చెప్పి, మళ్ళీ రమేశ్ వైపు తిరిగింది.
ఉల్లాసమే మూర్తీభవించినట్టుండే రమేశ్ కృంగి, కృశించిపోయాడు. నిండుగా ఉండే బుగ్గలు వాడిన పువ్వులా అయిపోయాయి. కొంటెగా మెరిసే కళ్ళలో గాంభీర్యం చోటు-చేసుకుంది.
తన దుస్తుల గురించి కూడా అతడికి శ్రద్ధ ఉన్నట్టు కనపడలేదు. తాము మైసూరు వెళ్ళి నప్పుడు తనకేమీ తోచటంలేదేమోనని పలకరించిన రమేశేనా ఇతడు అనుకుంది రత్న.
"కులాసాగా ఉన్నారా మీరు?"
కిటికీలోనుండి బయటకు చూస్తున్న రమేశ్ ఇటు తిరగకుండానే సమాధానం చెప్పాడు.
"ఊఁ."
"చిక్కిపోయినట్టున్నారు?"
"లేదు."
అతడికి మాట్లాడటానికి ఇష్టంలేదని తెలుసుకుంన్ రత్న ఇహ అతడిని పలకరించే ప్రయత్నం మానుకుని వెనక్కు వాలింది.
నయాన్ లోని ఓ మేడ రెండవ అంతస్థులోని ఓ ఫ్లాటులోనే ఉంటున్నారు వారు. రత్న ముందుగా వెళ్ళి, తలుపులు బార్లా తెరచి:
"లోపలికి రండి" అంది.
రమేశ్ తడబడుతూ లోపలికి అడుగుపెట్టాడు.
రత్న అమ్న్దులూ, అవీ ఉంచిన ఓ గదికి రమేశుడిని తీసుకుని వెళ్ళి:
"ప్రస్తుతానికి ఇదే మీ గది. ఇల్లు చాలా చిన్నది. మీరు దేనికీ సంకోచపడకండి. నాకు ఉపచారం చేయటం రాదు. ఇది మీ ఇల్లే అని అనుకోండి" అంది.
రమేశ్ మాట్లాడలేదు.
"నీళ్ళు కాగాయి. స్నానం చేయవచ్చు" అంటూ రత్న ఇవతలికి వచ్చేసింది.
రమేశ్ స్నానం చేశాడు.
