"మీరు భోజనానికి లేవండి" అంది రత్న.
"శేషగిరిని కూడా రానివ్వండి."
"ఆయనకోసం కాచుకుంటే లాభంలేదు. తీరిక చిక్కినపుడే వస్తారు. ఒక్కరోజు రానే రా రసలు. మీరూ రాత్రి రైల్లో సరిగ్గా నిద్రపోయి ఉండరు. భోంచేసి పడుకోండి."
రమేశుడికి ఏం చెప్పాలో తోచలేదు.
"మీరు భోంచేయకపోతే, నేను చెయ్యటానికీ వీల్లేదు."
రమేశ్ ఇహ మాట్లాడకుండా భోజనానికి కూర్చున్నాడు.
ఆమె అన్ని మాటలు మాట్లాడినా, తనేమీ మాట్లాడలేకపోతున్నందుకు బిడియపడ్డాడు రమేశ్.
ఏమని పలకరించటం?
ఆమెకో కూతురుండాలి కదూ! కూతురో, కొడుకో?
అనుమానంతో చుట్టూ చూశాడు రమేశ్. బట్టల స్టాండ్ మీద పువ్వుల ఫ్రాక్ కనిపించింది.
"మీ అమ్మాయేది?"
"బడికి వెళ్ళింది."
అంతే! ఇహ ఏంమాట్లాడాలో అతనికి తోచలా. సంకోచంతో సరిగ్గా భోంచెయ్యలేకపోయాడు. ఆమె మాత్రం:
"నాకు సరిగ్గా మర్యాదలు చెయ్యటం రాదు" అంటూనే వడ్డించింది.
అతడు భోంచేస్తుండగానే హాల్లోని ఫోన్ మోగింది. రత్న వెళ్ళి రిసీవర్ తీసుకుంది. మాట్లాడి వచ్చి:
"ఆయనే ఫోన్ చేశారు. మిమ్మల్ని గురించే అడిగారు. ఇంకో అరగంటలో వస్తున్నారట" అంది.
రమేష్ మాట్లాడలేదు. భోజనానికి ఇంకో రాగంట ఆగితే బావుండేదికదా అనిపించకపోలేదు. భోజనమయ్యాక తన గదిలోకి వెళ్ళాడు.
"ఈ గదినిండా మందుల వాసన బాగా నిండిపోయింది. మీరు కాబోయే డాక్టరేగా! ఏం ఫర్వాలేదనుకుంటాను" అంటూ పక్క సరిచేసి బైటికి వెళ్ళిపోయింది రత్న.
రమేశ్ పక్కమీద పడుకుని అక్కడే పడిఉన్న మెడికల్ జర్న లొకటి చేతిలోకి తీసుకున్నాడు.
రత్న, రమేష్ క్షేమంగా వచ్చి చేరినట్టు సుశీలమ్మగారికి ఉత్తరం రాసి పనికుర్రాడి చేతికిచ్చి పోస్టు చేయించింది.
అరగంట భర్తకోసం కాచుక్కూర్చుంది. అతడు రాకపోయేసరికి తను భోజనం చేసేసి మళ్ళీ మధ్యాహ్నపు టిఫిన్ ప్రయత్నంలో ఉండగా కారు హారన్ వినపడింది.
శేషగిరి లోపలి కొచ్చాడు.
"రమేశ్ ఏడీ? భోంచేశాడా?"
"ఆఁ. మీరు కాళ్ళు కడుక్కోండి."
"అతఃడిని పలుకరించి వస్తాను" అంటూ గది తలుపులు తెరిచాడు శేషగిరి.
రమేష్ నిద్రపోతున్నాడు.
"హలో ...." అన్నాడు శేషగిరి.
"నిద్రపోతున్నారు. మీరు భోంచేద్దురుగాని రండి. అతడిని చూస్తే ఎన్నో రోజులుగా నిద్రే లేనట్టుగా ఉంది" అంది రత్న.
శేషగిరి తలుపు ముందుకు వేసుకుని వచ్చేశాడు.
రమేశ్-నిద్ర లేచేసరికి సుమారు ఐదుగంట అయింది. అతడు పడుకున్న గది వీదికి పక్కగా ఉండటంవల్ల కార్లూ, ట్రాములూ, బస్సుల సందడి విపరీతంగా వినిపిస్తోంది. శేషగిరి-ఇల్లు మెయిన్ రోడ్డుతో ఉండటంవల్ల బస్సులు ఆగటం, వెళ్ళటం అన్నీ తెలుస్తున్నాయి రమేశుడికి.
వెంటనే మైసూరులోని తన గది గుర్తుకొచ్చిందతనికి. ఆ ప్రశాంత వాతావరణాన్ని తల్చుకుంటున్నాడు.
బాల్కనీలో యిద్దరు పిల్లలు మరాఠీలో మాట్లాడుతున్నారు. తన కర్ధంకాని భాషను వింటూ అలాగే పడుకున్నాడు రమేష్. క్రమంగా ఆ పిల్ల సంభాషణ తారస్థాయి నందుకుంది.
అంతలోగా లోపలనుండి మధురకంఠ మొకటి వినబడింది.
"ఆశా ......"
"ఏమిటమ్మా?"
"గట్టిగా కేకలు పెట్టకు. మామయ్య పడుకున్నారు."
"ఏ మామయ్య?"
"పడుకున్నారుగా, లేచాక చూద్దువుగానిలే."
"ఉహు. ఇపుడే చూడాలి."
"వద్దమ్మా, అరవకుండా ఆడుకోండి."
వాళ్ళ మాటలు మళ్ళీ వినిపించలేదు. కాస్సేపు అలాగే పడుకుని, తఃరువాత లేచి బయటికి వచ్చాడు రమేశ్.
చాలాసేపు నిద్రపోయినందువల్ల అతడి కళ్ళు ఎర్రగా, బరువుగా ఉన్నాయి.
రత్న కూతురికి జడవేస్తూ, ఆ చిన్నపిల్లతో మరాఠీలో మాట్లాడుతోంది. రమేశ్ బయటికి రావటం చూసి:
"నిద్ర పట్టిందా? ఇక్కడంతా ఒకటే గోల" అంది.
"బాగానే నిద్రపోయాను. డాక్టర్ వచ్చారా?"
"ఆఁ. వచ్చారు. మళ్ళీ ఇపుడే పది నిముషాలవుతోంది బయటకు వెళ్ళారు. మళ్ళీ ఏడు గంటలకు వస్తారట. రండి! మీరు టిఫిన్ తీసుకుందురు గాని."
ఆశా కళ్ళు పెద్దగా చేసుకుని రమేశ్ వైపే చూస్తోంది.
"అమ్మా! మామయ్యేనా?"
"అవునమ్మా."
ఆశా మళ్ళీ కుతూహలంతో మామయ్యవైపు చూస్తోంది. రమేశుడికి పాపతో ఏమైనా మాట్లాడాలనిపించింది. కాని చిన్నపిల్లలతో మాట్లాడే అలవాటే లేదతడికి. ఇంట్లో తనే చిన్న పిల్లాడు కనుక అందరూ తన్నే కుర్రవాడిని చేసి మాట్లాడించేవారు. ఆఖరికి ఎంతో ప్రయత్నంమీద:
"బడి వదిలిపెట్టారా?" అన్నాడు.
"ఓ!"
మళ్ళీ ఇంకేం మాట్లాడాలో తోచక రమేశ్ ఊరుకున్నాడు.
రత్న టిఫిన్, టీ తెచ్చి రమేశుడి ముందుంచింది.
"ఎందుకండి, ఇవన్నీ."
"అలా అనకండి. ముందు తీసుకోండి."
రమేష్ టీ తాగి లేచేసరికి శేషగిరి వచ్చాడు. రాగానే కరస్పర్శ చేసి:
"కృష్ణ ఎలా ఉన్నాడు? నువ్వెందు కిలా చిక్కిపోయావ్? టిఫిన్ తీసుకున్నావా? బయటి కెక్కడికైనా వెడదామా?" అంటూ, ప్రశ్నల వర్షాన్నే గుప్పించేశాడు రమేష్ మీదకు. కాని, వాటికి జవాబులు ఆశించే స్వభావం కాదతనిది.
"వెడదాం. కాని, నావల్ల మీ పనులకు ఆటంకం కలగకుండా ఉండాలి" - రమేశ్ సంకోచంతో అన్నాడు.
"నా పని కెప్పుడూ కష్టం కలిగించుకోను నేను. నా క్లినిక్ కే పోదాం పద."
"నాన్నా, నేనూ?" ఆశా రాగం తీసింది.
రమేశ్, శేషగిరి, ఆశా-ముగ్గురూ గిరగాఁవ్ లో ఉన్న శేషగిరి ఫార్మసీకి బయలుదేరారు.
రమేశ్ కారులో కిటికీ దగ్గర కూర్చుని సంధ్య వెలుగు ఆవహించిన బొంబాయి-వీధులను చూస్తున్నాను.
మూడు, నాలుగు అంతస్థులు గల ఇళ్ళు మొదట కనిపించాయి. ఒకే మూసలో పోసినట్టున్న ఆ భవనాలలో అందం కాని, వైవిధ్యం కాని, విస్పష్టత కాని కనిపించలేదు. చిక్కటి నలుపు నుండి తయారు చేసినట్టున్న పూరిపాకలు, వాళ్ళ వంటింట్లోని రేకు డబ్బాలు, జానెడు చోట్లో గాలికోసం బాల్కనీలో కూర్చున్న ఆడవాళ్ళు; చెట్టు చేమ-ఆఖరికి గడ్డి కూడా మొలవని, పార్కు అనిపించుకుంటున్న చోట్లలో ఆడుకుంటున్న పిల్లలు-అంతా చూశాడు రమేశ్.
ఎన్ని భాషలు-ఎన్ని వేషాలు? అక్కడ లేని దేమిటి? ఓ చిన్న ప్రపంచాన్నే ఇముడ్చుకున్న ట్టుంది-బొంబాయి రమేశుడి కళ్ళకు.
శేషగిరి-ఫార్మసి ముందు కారు ఆగినపుడు రమేశ్ ఈ లోకంలోకి పడ్డాడు. డాక్టరు రాక కోసం ఎదురుచూస్తున్న రోగులు శేషగిరిని చూడగానే లేచి నమస్కారం చేశారు.
శేషగిరి రమేష్ ని ఓ కుర్చీలో కూర్చోమని తన పనిలో పడ్డాడు. అన్నీ మరిచి తన్మయత్వంతో తన పని చూసుకుంటున్న శేషగిరిని చూడగానే రమేశ్ అనుకున్నాడు: "ఇతను మంచి డాక్టరు."
శేషగిరికి రాని భాష లేదు..... రోగులతో ఎవరి భాషలో వాళ్ళతో తడుముకోకుండా మాట్లాడేవాడు. అరగంట కాకమునుపే ఆశకు విసుగెత్తింది. తండ్రిదగ్గరకు వెళ్ళి:
"నాన్న, నేను ఇంటికి వెడతాను" అంది.
"ఎవరితో వెడతావ్?"
"మామయ్యతో."
ఇంకా అపుడే బొంబాయిలోకి అడుగుపెట్టిన రమేశుడితో ఆశను పంపేంత దైర్యం కలగలేదు శేషగిరికి. అదీగాక, రమేశుడి నిరాసక్తి, పరధ్యానాన్ని శేషగిరి కూడా గమనించాడు.
7

శేషగిరి కాంపౌండర్ ని తోడిచ్చి వాళ్ళిద్దరినీ ఇంటికి పంపాడు. రమేశ్, ఆశా ఇంత తొందరగా ఇంటికి వస్తారని రత్న అనుకోలేదు. రాత్రి వంట పూర్తి చేసుకుని రేడియో వింటూ కూర్చుంది.
"అమ్మా......"
ఆశ గొంతు విని, రత్న: "ఏమిటి ఇంత తొందరగా వచ్చేశారు?" అంది.
"ఆశకు అక్కడేమీ తోచలేదు. ఇంటికి వెళ్ళి పోదామంటే, వచ్చేశాం" అంటూ రమేష్ అక్కడే ఉన్న ఓ కుర్చీలో కూర్చున్నాడు. ఆశ తన మరాఠీ స్నేహితురాలికోసమని పరిగెత్తింది.
రమేశ్ మౌనంగా కూర్చున్నాడు. ఆ నిశ్శబ్దతను భరించలేక రత్న:
"మీరు చాలా చిక్కిపోయారు" అంది.
"లేదు."
"నే నామత్రం తెలుసుకోలేనా ఏం? మీరు ఇక్కడినుండి వెళ్ళేలోపల మామూలుగా కావాలి."
"వీల్లేదు! అసంభవం....." రమేశ్ గట్టిగా అరిచాడు.
రత్న చిరునవ్వు నవ్వింది.
"మనసుకు మించింది లేదు. మనం అవుతుందనుకుంటే అవుతుంది. కాదనుకుంటే కాదు అంతే."
"నేను నమ్మను."
"మీరు కాబోయే డాక్టరు. ఇలా అన్నిటికీ వీల్లేదు; అబద్ధం అంటే ఎలా? చనిపోతున్న రోగిలో కూడా ఆశాభావాన్ని రేకెత్తించడం మీ కర్తవ్యం. అలాంటప్పుడు మీ స్వవిషయం లోనే ఇలా నిరాశ చెందడం న్యాయంకాదు."
"నేను డాక్టర్ని కాను."
"నిజం? నేను మైసూరు వచ్చినప్పుడు మీరు ఫైనల్ ఇయర్, ఎం.బి. లో ఉన్నారనే విన్నానే."
"నిజమే కాని, నేను ఇపుడు చదవటంలా. చదువు పూర్తి చేస్తానన్న నమ్మకం కూడా లేదు."
"ఏం?"
"ఈ డాక్టరీ కేవలం నటన. బ్రహ్మ మనకు ఇవ్వని ఆయుష్షు మాత్రం ఏ డాక్టరూ పోయలేడు. ఈ వృత్తి, మందులూ, సర్జరీ - అంతా వట్టి బూటకం."
తన మాటలకు తనే ఆశ్చర్యపోయాడు రమేశ్. తను ఇన్ని మాటలు మాట్లాడింది తన స్నేహితుల ముందు కాదు. ఇంచుమించు అపరిచితురాలయిన స్త్రీ ముందు అతడికే ఆశ్చర్యంవేసింది. తనేనా ఇన్ని మాటలు మాట్లాడింది?
"నిజంగా?" అంటూ రత్న కళ్ళు పెద్దగా చేసుకుని నవ్వింది.
"నా మాటల్లో నమ్మకం లేదా మీకు? ఉన్నదున్నట్టే చెప్పాను."
"నిజంగా? కాని, ఇంత తొందరగా ఏ నిర్ణయానికి రాకండి."
"నే నలా తొందరపడి నిర్ణయానికి వచ్చే మనిషిని కాను. ఇది స్వానుభవంతో చెప్తున్న విషయం."
రత్న పరీక్షగా రమేశుడి వైపుకు చూసింది.
పొడుగ్గా పెరిగాడు రమేశ్ నిజమే; కాని మొహంలో మునుపటి అందమూ, ఠీవీ లేవు. మునుపటిలా తన డ్రస్సు విషయంలో శ్రద్దకూడా లేదు. సరిగ్గా దువ్వుకోని ఉంగరాల జుట్టు నుదుటి మీదకు పడుతోంది. వయసుకు మించిన గాంభీర్యం అతడికి వింతకాంతి వచ్చింది.
"అనుభవమా! ఇంత చిన్న-వయస్సులో మీ కెలాంటి అనుభవం?"
"అనుభవానికి వయస్సే కావాలా?" రమేష్ ఎదురుప్రశ్న వేశాడు.
"ఎలాంటి అనుభవం అన్నది వయస్సునుబట్టే ఉంటుంది. ఇపుడు మీకు కాలేజి-అనుభవాలు తప్ప మరేమీ అయ్యే అవకాశంలేదు. కాని మీ నాన్నగారికి విషాదకరమైన అనుభవాలు అయి ఉండవచ్చు......"
"పొరపడుతున్నారు మీరు. చిన్న-వయస్సయినంత మాత్రాన విషాదకరమైన అనుభవాలు అయి ఉండరాదా? ఎందుక్కాకూడదు?...." ఉద్వేగంతో నోట మాటపెగల్లేదు రమేశుడికి.
"కాని......."
"దయచేసి ఈ విషయం ఇహ మాట్లాడకండి ప్లీజ్ ...." రమేష్ బ్రతిమాలుకుంటున్నట్టు అన్నాడు.
రత్న మాట ఆపేసి అతనివంక చూసింది.
ఉద్వేగంతో అతడి మొహం ఎర్రబడింది. పెదిమలు అదురుతున్నాయి. అతడు ఇంత ఉద్వేగ పడతాడని రత్న ఊహించలేదు.
"మిమ్మల్ని నొప్పించావా? క్షమించండి" అంది రత్న పశ్చాత్తాపంతో.
"క్షమించాల్సినంత పెద్ద తప్పేమీ చెయ్యలేదు మీరు" అంటూనే రమేశ్ లేచినిల్చుని:
"అలా తిరిగివస్తాను" అంటూ బయటికి వెళ్ళిపోయాడు. రత్న అతని వెనుకనే గబగబా మెట్లు దిగి వచ్చి:
