సాయంత్రం ఇంటికి వొచ్చి స్నానంచేసేక అప్రయత్నంగా బీచ్ వైపు అతనికాళ్ళు దారితీశాయి.
ఇన్నాళ్ళూ- ఆ సాయంత్రం తరవాత ఎంతో మనో నిగ్రహంతో బీచ్ కి వెళ్ళకుండా గడిపాడు. కాని, ఇవేళ ఎంత ప్రయత్నించినా, మనస్సు శరీరానికి లొంగిపోతూంది. ఆమెకోసం కాదు నేను బీచ్ కి పోడం-నా విశ్రాంతికోసం - ఆమె అసలక్కడికి రాకనేపోవొచ్చు.... అని సరిపెట్టుకుని, రామకృష్ణా మఠం దాకా నడిచి, అవతల ఇసకలో కూర్చున్నాడు.
గంట గడిచిపోయినా వసంత జాడలేదు.
ఆమెవొస్తే బాగుండును..... ఒక్కసారి కనపడి, "హల్లో" అంటే బాగుండును అనిపించింది అతనికి. ఆ నున్నటి, బంగారు రంగు చేతులు, నల్లటికళ్ళూ ఒక్కసారి చూస్తే బాగుండును అనిపించింది అతనికి.
ఇంకో గంట ఆమె రాకుండానే గడిచి పోయింది.
ఆమె జ్ఞాపకాలు తుఫానులో తరంగాల్లాగ రావడం ప్రారంభించాయి అతనికి. క్రమంగా తీవ్రమైన నిరాశ అతన్ని తినెయ్యడం ప్రారంభించింది. చిన్నకోరిక ఈ రెండు గంటల్లోనూ అనలేని, ఓపలేని ప్రగాఢమైన ఆకాంక్షగా ఐపోయింది. ఆమె రాకపోవడం అతనికి పిచ్చెక్కించే అంత అఘాతం ఐపోయింది.
క్రమంగా సూర్యాస్తమయం ఐపోయింది. సముద్రంరంగు మారిపోయింది. కనుచీకటి పడిపోయింది.
కాని ఆమె రాలేదు!
నీరసంగా లేచి, రోడ్డుమీదికి నడిచాడు- ఆమె ఇంటికి వెళ్ళాలనిపించింది. కాని. ఆత్మ గౌరవం అడ్డువొచ్చింది. వెంకటరామ్ రమ్మని చెప్పేడు కదా అని వాదించింది మనసు. కాని ఇంకా ఆతనిలో ఉండిపోయిన కొంచెం పౌరుషం అతనిచేత ఇంటిదారి పట్టించింది.
ఇల్లుచేరేసరికి లలిత బాబుతో ఏదో మాట్లాడుతూంది. అతనికి తలుపుతీసి అతన్ని త్వరగా ఆతృతగా, పరీక్షించింది. అతను తలవొంచుకుని ఆమెను తప్పించుకుని లోపలికి నడిచాడు.
"ముఖం కడుక్కునిరా"
అతను యాంత్రికంగా వెళ్ళేడు. ఇంకా మనస్సు అతని పూర్తిస్వాధీనంలోకి రాలేదు.
అతను ముఖం కడుక్కుని వొచ్చేసరికి లలిత కప్పులో కాఫీ తెచ్చి ఇచ్చింది.
"ఇప్పుడెందుకు వొదినా!"
"తాగు"
ఆజ్ఞలాగ అంది లలిత. అతను కాఫీ తీసుకుని కొంచెం తాగాక....." ఏ మయింది? అని అడిగింది లలిత, పరీక్షిస్తున్నట్టు.
"ఏమీలేదు?"
లలిత కుర్చీలో కూర్చుని, "నిజం చెప్పు గోపాలం- నేను కళ్ళులేని మనిషిని కాదు. బీచ్ కి వెళ్ళేవు. అవునా?" అంది,
"అవును"
"వసంత కనిపించిందా?"
"లేదు!" అతను తలవొంచుకునే అన్నాడు. కొంచెంసేపు ఊరుకుని, "అందుకే అంత నిరాశ. అంత బాధ, అవునా?" అంది లలిత ఆమె కంఠంలో లాలిత్యం లేదు.
"బాధగా "అవును," అన్నాడు గోపాలం.
ఆమెలేచి కప్పులోపల పెట్టి వొచ్చింది. కూర్చుని "నువ్వు బుద్దిమంతుడివి గోపాలం....కాని, నీకన్న చాలా బలమైన పరిస్థితులు నిన్ను లొంగదీస్తున్నాయని తెల్సును. వసంతకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ..... నామాట విను- వెళ్ళి శశిరేఖ ని చూసిరాలేదా, కనీసం ఉత్తరం రాయి. వీలైనంత వేగం పెళ్ళిచేసుకుంటానని రాయి..... మీ కథ అసంబద్ధంగా ఉంచకు"
అతను మాట్లాడలేదు. రెండుచేతుల్లోనూ తల పెట్టుకుని నేలని పరిశీలిస్తూ ఉండిపోయాడు.
"నీలో ఏమైనా ఇంకా జ్ఞాపకం ఉంటే నామాట విను. నిన్ను సుఖపెట్టేమనిషి శశిరేఖ. వసంతకి నువ్వు అక్కర్లేదు, ఆమెకి జీవితంలో ఇంకా చాలా కావాలి. ఎప్పుడో ఎవరో నీకు క్రూరంగా ఈమాట చెప్పాలి. ఇప్పుడే నేనే చెప్తున్నాను"
ఆమె తీవ్రత చూసి చలించిపోయాడు గోపాలం. ఆ వాడి మాటలని, వాటిలోని నిజం ఇంకా నిశితంగా చేస్తున్నది, కాని, ఏమీ అనలేక పోయాడు గోపాలం.
నిలబడి- అతని తలమీద చెయ్యివేసి లాలనగా, "నామాట వినుగోపాలం....ఇది నా కోరికే అనుకో కాదనకు" అంది లలిత.
కష్టంగా, "నిజమే వొదినా.....నువ్వు చెప్పినదంతా నిజమే. కాని, ఈ పరిస్థితిలో శశిరేఖని పెళ్ళి ఎలాగ చేసుకోను? కనీసం ఎక్కడో స్థిరపడితే, నువ్వు చెప్పినట్టే చేస్తాను" అన్నాడు.
కొంచెం ఆగి,"అవును నువ్వు చెప్పినదీ నిజమే గోపాలం! వంతకి మాత్రం ఎంత ప్రయత్నించినాసరే. దూరంగా ఉండు...... ఒద్దు- వాగ్ధానం చెయ్యకు, ప్రయత్నించు దానికి చాలా మనస్త్గైర్యం కావాలని తెలుసును..... కాని ఆమెని తలుచుకున్నప్పుడల్లా ఆమె కథకూడా జ్ఞాపకం తెచ్చుకో..... శశిరేఖవొస్తే బాగుండును"అంది లలిత.
ఆమె వెళ్ళి బాబుదగ్గర కూర్చుంది.
"ఏం చేశాడమ్మా బాబయ్య?" అని అడిగాడు బాబు.
"ఏమీ చెయ్యలేదు"
"మరెందుకూ దెబ్బలాడేవు?"
"అందుకే- ఏమీ చెయ్యలేదని"
వాడికి బోధపడలేదు.
"అర్ధాలు అడుగు- రేపు మాస్టారు అడుగుతారు"
ఆమె అడుగుతోంది- వాడి తప్పులు దిద్దుతూంది.
అయాక, పుస్తకాలు దాస్తూ, "నేను బాబయ్య లాగ పెద్దవాన్నిఅవుతే. అపుడూనాతో దెబ్బలాడతావా?" అన్నాడు బాబు.
"ఆఁ.... బాబయ్యలాగేఐతే"
గోపాలం వాణ్ణి ఎత్తుకుని, "ఒరేయ్? నువ్వు అదృష్టవంతుడిని-నాలాగే" అన్నాడు.
'నీలాగ వొద్దు" అన్నాడు బాబు.
లలిత నవ్వింది. ఆ నవ్వుకి అతనిలో చీకట్లు విడి, అతనికీ నవ్వువొచ్చింది.
* * *
11
పది రోజుల్నుంచి విచిత్రంగా సాగిపోతుంది జీవితం గోపాలానికి, అనుకోకుండా లలిత తనకి ఎంతో మానసిక సహాయం చేస్తోంది. ఆమెని చూసినప్పుడల్లా, వసంత ఛాయలకి పోకూడదనే నిర్ణయం బలవత్తరం అవుతోంది. కాలేజీ. లైబ్రరీ ఇల్లు- వీటితో, ఆశలతో, జీవితం గడిచిపోతుంది. అతనిలో రేగిన తుఫాను శాంతించింది వెంకటరామ్ గారు చెప్పినా, అక్కడికి వెళ్ళదలుచుకోలేదు.
ఈ వారంనుంచీ శశిరేఖ ఉత్తరం కోసం ఎదురుచూశాడు. కాని ఆశాభంగ మౌతూంది రోజు. ఆమె జవాబు ఎందుకు రాయలేదో అర్ధంకాలేదు గోపాలానికి.
ఒకరోజు కాలేజీ వొదిలి లైబ్రరీకి వెడుతుంటే రామానంద్ కనిపించేడు. ఈసారీ అతనే పలకరించి. 'హల్లో మాస్టారూ! చాలాకాలానికి కనిపించేరు" అని, కరచాలనం చేశాడు. మిమ్మల్ని కలుసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కాని పడలేదు ఇవేళ మాయింటికి రండి!" అని ఆహ్వానించేడు.
"మరో రోజు వొస్తాను రామానంద్ గారూ....ఇవేళ పని ఉంది" అని తప్పించుకున్నాడు. ప్రత్యేకమైన కారణం లేకపోయినా. అంత రాంతరాలలో అతనంటే విముఖత తనచేత ఈ అబద్ధం ఆడించిన విషయం కొంచెం బాధ కలిగించింది అతనికి. కాని, క్షణికంగానే,
"ప్రామిస్ చెయ్యండి"
"ఆల్ రైట్"
బలవంతం చేసి ఆతన్ని హోటల్లోకి తీసికెళ్ళాడు గోపాలం. కూర్చుని, "ఏమిటి విశేషాలు?" అన్నాడు.
"ఏమీ లేవండీ. అన్నట్టు మొన్న హైదరాబాద్ మా సిస్టర్ని చూడ్డానికి వెడుతూ బెజవాడలో దిగేను" అన్నాడు రామానంద్ హఠాత్తుగా, ఏదో జ్ఞాపకం వొచ్చినట్టు.
కొరడాదెబ్బ తగిలినట్టైంది గోపాలానికి. అతను చెప్పకపోయినా అతను బెజవాడలో ఎందుకు దిగేడో తనకి తెలుసును. తన కోపాన్ని దిగమింగి. "శశిరేఖ క్షేమంగా ఉందా?" అన్నాడు.
"అఁ... వాళ్ళ నాన్నగారికీ బాగుంది. ఇంకా వొచ్చేసే ప్లాన్ లేదుగాని. ఆ ప్రయత్నం జరుగుతోందనుకుంటాను"
'శశిరేఖ- పరీక్షలనించి కోలుకుందా?"
"ఓ యస్. అప్పటికన్నా చాలా లైవ్లీగా ఉంది. నేను వెళ్ళిపోతానన్నా ఆరోజు అక్కడే ఆపేసి, నాకు బెజవాడ అంతా చూపెట్టేరు ఆవిడ. ఏదో తెలుగు సినీమా కూడా చూశాం. చాలా మారి పోయింది అప్పటికన్నా - థాంక్ గాడ్"
తాగుతోన్న కాఫీ ఆముదంలాగ ఉంది.
"హైదరాబాదు నించి ఎప్పుడు వొచ్చేరు?"
"మూడు రోజులైంది. మా సిస్టర్ కొంచెం మోసం చేసి ఒక పెళ్ళికూతురిని చూపెట్టింది. ఆ పని ముగించుకుని వెంటనే వొచ్చేశాను. స్టేషన్లో మళ్ళా శశిరేఖ కనిపించేరు. ఎవర్నో దిగబెట్టడానికి వొచ్చి..."

కొంచెం ఆగి చీకట్లోకి రాయి విసిరేడు గోపాలం- "మీరు పెళ్ళి చేసుకోబోతున్నారన్న మాట....కంగ్రాట్యులేషన్స్" అన్నాడు.
"లేదండీ - ఏమీ లేదు. ఆ అమ్మాయి చాలా చాలా అందంగా ఉంది అని సిస్టర్ ముచ్చటపడింది. కాని నా ఉద్దేశం వేరు- బాహ్యసౌందర్యంలో ఏముందండీ?.... కల్చర్ కావాలి. స్త్రీలో నెమ్మదీ, కేరక్టరూ ఉండాలి. ఏం?"
"అవును. కాని, అలాటివాళ్ళు అరుదు"
"నిజంగానే- ఎక్కడో శశిరేఖలాటి మనుష్యులు ఉంటారు."
తాను విసిరిన రాయి తనకే తగిలిన బాధలో ఇంకేమీ అనలేదు గోపాలం, బిల్లుచెల్లించి బయటికి వొచ్చేడు. రామానంద్ మళ్ళీ కరచాలనం చేసి సెలవు తీసుకుని, వెళ్ళిపోయాడు.
ఐదు నిమిషాలు పేవ్ మెంటు మీద నిలబడ్డాడు గోపాలం. బుర్రలో ఆలోచనలు గందరగోళంగా సాగుతున్నాయి. శశిరేఖ ఇలాగ చెయ్యగలదని అతనెన్నడూ ఊహించలేదు. ఆమె తనది- ఈ జీవితాంతం తన సహచారిణి..... వాగ్ధత్త...
ఇంటివేపుకు నడిచాడు. ఇంకేమీ చేసేది లేక, వెళ్ళేసరికి ఉత్తరం. ఏ. జీ. ఆఫీసునించి. ఆతృతగా విప్పి చదివేడు. గుమాస్తా పనికి తాను సెలక్టు కాలేదు. ఆ సంగతి విచారపూర్వకంగా తెలియజేశారు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలూ జరగనేరవు.
భగవాన్! ఏమి రోజు! అనుకున్నాడు ఒక్కసారి అన్ని కష్టాలూ ముంచుకుని వొచ్చేయి. తన గతం భవిష్యత్తూ రెండూ ఒకేసారి తనని బాధిస్తున్నాయి.
లలిత ఆ ఉత్తరం చూసి, 'సారీ గోపాలం," అనిమాత్రం అంది. చీకటిపడేదాకా అతనలాగే కూర్చున్నాడు ఆలోచిస్తూ.
రాత్రి అన్నయ్య రాగానే ఉత్తరం చూపెట్టేడు. "పోనీ లేరా బెంగపడకు. నీకిక్కడ కాలేజీలో దొరికేలా ప్రయత్నిద్దాం అన్నాడు.
"దానికి ఏం ఆశ లేదన్నయ్యా నీకు తెలుసును" అన్నాడు నిస్పృహగా గోపాలం.
