Previous Page Next Page 
వసంతం పేజి 10


    "ఆ మాట నాకు వొదిలీ. పద భోజనం చేద్దాం" అన్నాడు రామం.
    చాలా రాత్రిదాకా అతనికి నిద్దరరాలేదు. పక్కమీద ఇటూ అటూ దొర్లుతున్నాడు-
    పన్నెండుగంటలు దాటేక లలిత అతని గదిలోకి వొచ్చింది. అతనికి ఎదురుగా కూర్చుని, "నీ ఆశాభంగం ఎంత బలమైనదో నాకు తెలుసును గోపాలం.... నీ రోజులు బాగాలేవు. కాని, అంతగా బాధపడకూడదు- మగవాడివి. చిన్న వాడివి. ధైర్యంగా ఉండు. ఆయనా, నేనూ నీతోనే ఉన్నాంగా, నిద్రపో" అంది!
    'నీకు తెలీదు వొదినా!" అన్నాడు శశిరేఖ విషయం అప్పుడు చెప్పాలని అతనికి అనిపించలేదు.
    "తెలుసునయ్యా - లేక ఇంకేదైనా దాస్తున్నావా?
    "రేపు చెప్తాను వొదినా వెళ్ళిపడుకో"
    ఆమె దీపం ఆర్పివేసి లాలనగా అతన్ని ఒకసారి జోకొట్టి నిద్రపో గోపాలం! ఇవేళ లాగ రోజూ ఉండదు అంది. ఆమె నిశ్శబ్దంగా వెళ్ళిపోయాక అతనికీ నిద్రవొచ్చింది.
    తరవాత రెండు రోజులు నిద్రలో నడుస్తూ న్నట్టు గడిచిపోయాయి. లలిత అతన్ని ఏమీ అడగలేదు. అతనూ చెప్పలేదు.
    శనివారం సాయంత్రం మరీ అశాంతిగా అనిపించి, ఆలయంవేపు వెళ్ళేడు. అక్కడ చాలా మంది ఆంజనేయస్వామికి పూజ చేయడానికి వొచ్చారు. దర్శనం చేసుకుని ఆవరణలో చెట్టు క్రింద కూర్చున్నాడు. ఎలాగో ఈ పరిస్థితుల్ని ఎదిరించి పోరాడాలి. ఈ చీకటిలో నించి తప్పించుకుని వెలుగులోకి పోవాలి...భగవంతుణ్ణి సహాయం అడగాలి- అనుకున్నాడు.
    ఆ ప్రశాంత పరిసరాల్లో చాలాసేపు కూర్చున్నాడు. వెయ్యి ఆలోచనల్లో జారిపోయి ప్రమత్తుడిగా ఉన్న అతనికి. "గోపాలం!" అని పిలుపు వినిపించి తెలివి వొచ్చింది.
    ఎదురుగా వెంకటరామ్ గారు నిలబడ్డారు. లేచి, "నమస్కారమండీ?" అన్నాడు.
    ఆయన పరీక్షగా చూసి, "అలాగ ఉన్నావేం? నిన్ను నువ్వే మరిచిపోయి ఆలోచిస్తూంటే నువ్వు మహాభక్తుడివో, లేక నీ మనస్సింకెక్కడికో పోయిందో అని ఆలోచించేను. కులాసాగా ఉన్నావా?"
    "బాగానే ఉన్నానండీ!"
    "అలాగ కనిపించడం లేదు- మీ బ్రదర్ తో కాదూ. ఉంటున్నావు? అతను రైల్వేలోనా ఉన్నారు?"
    "ఆఁ."
    "నిన్ను రమ్మంటే రాలేదు నువ్వు. చిన్నప్పుడు నువ్వూ శేఖరం ఆడుకున్న చదువుకున్న రోజులు జ్ఞాపకం వొస్తే నాకు వయస్సు తగ్గినట్టుంటుంది. ఒకసారిరా! ఇంట్లో మరీ తోచకుండా ఉంది."
    "అలాగేనండీ..."
    "అన్నట్టు- ఎక్కడో లెక్చరర్ గా చేరేవుట. వసంత చెప్పింది. ఆ మాటా ఆలోచించేను. చాలా మాట్లాడాలి. చూడూ, రేపు మధ్యాహ్నం నాలుగ్గంటలకి రా. నీతో చాలా విషయాలు చెప్పాలి" అన్నారు వెంకట రామ్.
    "అలాగేనండీ" అన్నాడు. మరుక్షణం ఆ ఇంటినించి దూరంగా ఉండాలనే నిర్ణయం జ్ఞాపకం వొచ్చింది. కాని, వెంకట రామ్ తో కాదనడం చాలామంది చెయ్యలేని పని....ఆ మంత్రంతోనే అతను ఇవేళ అంతపెద్ద కంపెనీకి చెయిర్ మన్ అయాడు.
    ఆయన వెళ్ళిపోగానే, అతనూ ఇంటికి బయలుదేరేడు. ఇల్లు చేరేసరికి అతనిలో రేపటి దినం క్రమంగా ఇష్టం కలుగజేయసాగింది.
    అతని ముఖం మీద కుంకం చూసి. "గుడికి    వెళ్ళేవా?" అంది లలిత.
    "ఆఁ..."
    ఏమీ అనలేదు లలిత. వెంకటరామ్ విషయం ఆమెతో ఎలాగ చెప్పడమో తెలియక తికమక చెడుతోన్న అతన్ని చూసి నవ్వి, "సంగతేమిటో పప్పు" అంది మళ్ళీ.
    "అక్కడ వెంకటరామ్ కనిపించేడు"
    "మాట్లాడేవా?"
    "ఆయనే పలకరించాడు.... రేపు రమ్మన్నారు."
    "వొస్తానన్నావా?"
    "ఆఁ.... కాదని చెప్పలేకపోయాను వొదినా...."
    "నాకు తెల్సును........"
    మరో నిమిషం ఊరుకుని, "మొన్నరాత్రి... జ్ఞాపకం ఉందా?" అన్నాడు గోపాలం.
    "ఆఁ... నువ్వే ఇష్టంఉంటే చెప్తావని ఊరు కున్నాను. చెప్పు" అంది లలిత.
    నెమ్మదిగా అన్ని విషయాలూ చెప్పేడు. విని కొంచెం ఆలోచించి. "అందుకని ఏంబాధ పడాల్సిన అవసరం లేదు......శశిరేఖ ప్రతీగాలికీ ఎగిరే రకంకాదు" అంది లలిత.
    "అవును వొదినా..... నాకూ తెలుసును కాని...."
    "అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు- మళ్ళీ ఉత్తరం రాయి - బెజవాడ వెళ్ళు- ఏదైనా చెయ్యి. కానీ తొందరపడి ఏమీ నిర్ణయించుకోకు" అంది లలిత.
    అతనికి రుచించలేదు..... తనే నేరస్థుడైనట్టు శశిరేఖని బ్రతిమాలడం అతనికి ఇష్టం లేదు.
    అతని నిశ్శబ్దం చూసి, "ఈ మాట నువ్వే నిర్ణయించుకోవాలి గోపాలం....కాని.... బాగా ఆలోచించు. ఇందులో తప్పు ఎవరదని కాదు. ప్రశ్న సరియైన మార్గం ఏమిటని"
    లలిత ఏమీ అనలేదింక, అతనూ మళ్ళా ఆలోచనలోకి జారిపోయాడు. క్రమంగా శశిరేఖ మీద అతనికి కోపం రాసాగింది. రామానంద్ మలయమారుతంలాటి వాడు కాదు అతను పెనుగాలి లాటి వ్యక్తి అనిపించింది గోపాలానికి.
    
                                     12

    గోపాలం గేటు తీసుకొని వెళ్ళేసరికి శమ్మీ అరవడం ప్రారంభించింది. తీవ్రంగా చెట్టుకు కట్టి ఉండడాన్న అతన్ని చేరే ప్రయత్నం ఎంత చేసినా కుదరలేదు- అది గమనించి ధైర్యంగా ముందడుగు వేసి వరండాలోకి వెళ్ళేసరికి, గదికి తోరణాలు క్రొత్తగా కట్టినవి కనిపించాయి.
    ఇంతలో వసంత గుమ్మం దగ్గరికి వొచ్చింది.
    ఇవేళ ఆమె జీన్స్ వేసుకుని ఉంది. గళ్ళ చొక్కా.... చిన్నపిల్లలాగ కనిపిస్తోంది. జుత్తు వొదులుగా కట్టుకుంది.            
    "హలో గోపాలం! వెల్ కమ్!"        
    ఆమె వెనకాల డ్రాయింగ్ రూంలోకి నడిచాడు గోపాలం. అతన్ని కూర్చోబెట్టి, "ఇంత కాలం కనిపించకుండా ఎందుకు ఉండిపోయావు. అంది.
    "అలాగే ఐ పోయింది వసంతా...... నాన్న గారు ఉన్నారా?" అన్నాడు.    
    "ఆ! నిద్రపోతున్నారు. లేపేదా?"
    "వద్దు- తొందరలేదు.
    ఒకసారి ఆమెని తేరిపారచూసి కళ్ళు బలవంతగా తిప్పుకున్నాడు గోపాలం, ఆమె హఠాత్తుగా లేచి, 'కొత్తలైఫ్ వొచ్చింది ఇవాళే. చూస్తూ ఉండు. ఐదు నిమిషాల్లో వొస్తాను. అని, లోపలికి వెళ్ళిపోయింది.
    మేగజైన్ లో బొమ్మలు చూస్తూ పది నిమిషాలు గడిపాడు గోపాలం. ఆమె రావడం ఆలస్యం అయిన విషయం అతను గమనించే సరికి ఆమె మళ్ళీ తిరిగి వొచ్చింది- ఈసారి ఆమె చీర కట్టుకుంది. బొట్టుపెట్టుకుంది. చేతిలో రెండుగ్లాసుల్లో కూల్ డ్రింక్స్ ఒక గ్లాసతనికి ఇచ్చి కూర్చుని. "ఏమిటి విశేషాలు? నీ ఉద్యోగం ఎలాగ ఉంది అని అడిగింది.
    "ఇక్కడే ఏదో విశేషం ఉంది. తోరణాలు కట్టేరేం? అని అడిగేడు.
    "మా నాన్నగారికి వాళ్ళ అమ్మాయి జన్మదినం అనే సరదా ఉదయం పూజ చేయించేరు. ఇరవై నిండినా, చిన్నపిల్ల అని ఆయన ఉద్దేశం..."
    "ఓ! హేపే బర్త్ డే!"
    "థాంక్స్ ఆమాట జ్ఞాపకం చెయ్యకు."
    ఏమని అడగబోయి ఊరుకున్నాడు గోపాలం. మెల్లిగా చేతిలో ఉన్న లెమన్ చప్పరిస్తూ ఆమెని మధ్యమధ్య గమనిస్తున్నాడు. ఆమె వొంటిని ఏ ఆభరణమూ లేదు. కాని, హిమంలాగ తెల్లగా ఉన్న ఆ బట్టల్లో వసంతే ఒక ఆభరణంలాగ కనిపించింది. ప్రశాంతంగా, ఎంతో అందంగా ఉన్న ఆమె ముఖం మాటిమాటికీ అతనికి ఆమె చెప్పిన కథ అంతా అసత్యమనీ, తనతో ఆడుకోడానికి ఆమె కట్టుకథ తనకి చెప్పిందనీ అని సింపజేస్తోంది.
    "నాన్నగారు నిన్ను చాలాసార్లు తలుచు కున్నారు."
    "అవును ఎలాగో రాలేకపోయాను-"
    "నాకు తెలుసును...."
    హఠాత్తుగా తల ఎత్తి చూసి, "ఏమిటి, నీకు తెలుసును వసంతా?" అన్నాడు గోపాలం.
    "నీ భయం-"
    "ఎందుకని?"
    "నేనంటే- నిన్ను పాడుచేస్తానని"
    "ఛా! ఏం మాటలని?"
    "నిజం - నాకు అబద్దాలాడే అలవాటులేదు గోపాలం. ఇన్నాళ్ళతరవాత నిన్ను చూసినా, నీ స్వరూపం నాకు పూర్తిగా జ్ఞాపకం ఉంది. పుస్తకాల్లోరాసిన నీతులన్నీ ఆచరించే మనిషిని నువ్వు..."
    "అందులో తప్పేంలేదు-"
    "లేదు నేను తప్పూ రైటూ గురించి మాట్లాడ్డంలేదు నిజంగురించి చెప్తున్నాను. నీకేం ప్రమాదంలేదు- నా మనస్సులో ఏం ఉన్నా, ఎవరికీ చెప్పను"
    "ఏం ఉంది నీ మనసులో?"
    "అదెవరికీ చెప్పను అన్నానుగా?"
    ఏం అనాలో అతనికి తెలియలేదు-వెంకటరామ్ గారు వొస్తే బాగుండును. ఈమెతో నిశ్శబ్ధమూ బాధాకరంగా నే ఉంది. సంభాషణా బాధాకరంగా ఉంది:
    "ఒక మాట అడిగేదా గోపాలం?"
    "అడుగు."
    "కాలేజీలో ఎవరో అమ్మాయిని ప్రేమించే వుట- నిజమేనా?'
    "అది ప్రేమించడమో, స్నేహమో నాకూ సరీగా తెలీదు.... ఆమె మంచి స్నేహితురాలు నాకు.."
    "పెళ్ళి చేసుకుంటావా?"
    "అది నా ఒక్కడి చేతిలో లేదు"
    "ఆమె అంగీకరిస్తే?..."    
    "కలలు కనడం నాకు చేత కాదు"
    "ఓహ్ రియలిస్టు.... ఎందుకే దాగుడు మూతలు. నిజం చెప్పు, ఆమెని ఎప్పుడూ అడగలేదా నువ్వు?"
    "లేదు"
    "ఏం? భయమా?..."
    "ఎందుకని?:"
    "అలాగే నంటుందని"
    కొంచెం కోపంగా, "వసంతా! ప్రస్తుతం నా పరిస్థితి పెళ్ళి మాటలాడే లాగలేదు. శ్రీమంతుల ముద్దు పిల్లని నువ్వు- ఇంకా జీవనాధారం చూసుకోలేకపోయిన మనిషిని నేను. అయినా, ఇవన్నీ ఎందుకని అడుగుతున్నావు?" అన్నాడు గోపాలం.
    "కోపం వచ్చిందా? సారీ..."
    గోపాలం ఏమీ అనలేకపోయాడు. చిత్ర మైన అమ్మాయి వసంత అనిపించింది.
    ఇంతలో వెంకటరామ్ వొచ్చి," ఎంత వేపైంది గోపాలం, నువ్వు వొచ్చి?" అని అడుగుతూ లేచి నిలబడ్డ అతన్ని భుజంమీద చెయ్యివేసి కూర్చోబెట్టేరు.           


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS