
గొంతుక ఎండిపోయినట్లైపోయింది గోపాలానికి. తనకి ఉత్తరం రాసేందుకు తీరిక లేని శశిరేఖ!...
"శశిరేఖలాటి మనుషులు ఉండడం కష్టం గోపాలంగారూ?- ఆరోజు స్టేషన్ కి వెళ్ళేను. పాపం? ఆమె మనస్సు ఇక్కడలేదు. అన్నట్టు ముఖ్యమైన శుభవార్త తెలుసునా?.....ఆవిడకి ఫస్ట్ క్లాస్ వొచ్చేలాగ ఉంది. నిన్ననే యూనివర్శిటీలో ఎంక్వైరీ చేశాను"
"చాలా సంతోషం. అన్నాడు పొడిగా, గోపాలం"
"అది ఆమెకి రాయలేదుగాని. YOU are goying to come out with flying colors అని రాశాను. మీరేం చేస్తున్నారు.
"కాలేజీలో లెక్చరర్...."
"సంతోషమండీ."
టిఫిన్ వొచ్చింది. కాగితాలు తింటున్నట్టు ఉంది తనకి, అతనేదో చెప్తున్నా వినిపించడం లేదు తనకి కనీసం ఆమె అడ్రసు కూడా తెలీదు.
ఎలాగో కాఫీతాగి బయటికి వచ్చి. "చూడండి రామానంద్ గారూ! శశిరేఖ అడ్రసు ఎక్కడో పారేశాను. మీదగ్గర ఉంటే చెప్పండి" అన్నాడు కష్టంతో.
చకచక కాగితం మీద రాసియిచ్చి. గోపాలం అడ్రస్ నోట్ చేసుకుని, టౌన్ హాల్ కి వెళ్ళి పోయాడు రామానంద్. సిటీబస్సుఎక్కి ఇల్లు చేరుకున్నాడు గోపాలం.
అతను తెచ్చినవి చూసి కొంచెం కోపంగా, "ఇవన్నీ ఎందుకు తెచ్చావయ్యా?...." అంది లలిత.
"అలాగ బుద్ధిపుట్టింది వొదినా. దయచేసి ఏమీ అనకు" అన్నాడు.
అతని కంఠస్వరం గమనించి ఏం జరిగింది?" అని అడిగింది లలిత.
అతను తలవూపి స్నానానికని వెళ్ళిపోయాడు. తిరిగివొచ్చే సరికి కాఫీఇచ్చి, ఇంత కోపంగా నిన్నెప్పుడూ చూడలేదు గోపాలం.....రహస్యం కాకపోతే చెప్పు" అన్నది.
సానునయంగా అన్నమాటలు అతనికి కొంత ఉపశమనం చేకూర్చినా, ఆమె సాన్నిహిత్యం తన బాధనీ. ఈర్ష్యనీ తనే హేళన చేసుకునేలాగ చేశాయి. కొంచెం సిగ్గుగానే,మ్ "సిల్లీగా ఉంటుంది వొదినా.... నిజం చెప్తే" అన్నాడు.
"మరీమంచిది- నవ్వుకుందాం"
"రామానంద్ గురించి చెప్పేనుగా?....అతను సాయంత్రం బట్టలషాపులో కనిపించేడు"
"శశిరేఖ - పాత క్లాస్ మేటా?"
"ఆఁ....శశిరేఖ అతనికి ఉత్తరం రాసింది.... అందులోనే నాకు సందేశం పంపింది..... బోధపడిందా?"
చిందర వందరగా ఉన్న టేబిల్ సర్దుతూ ఏమీ అనలేదు లలిత. గోపాలం మళ్ళా, 'సిల్లీగా లేదూ?" అన్నాడు.
నిటారుగా నిలబడి, "లేదు గోపాలం.....నాకు బాధగానూ ఉంది. సంతోషంగానూ ఉంది, కాని నవ్వు రావడంలేదు" అంది లలిత.
"ఏం?"
"ఈ చిన్న చిన్న విషయాలు శశిరేఖకి ఎంత ముఖ్యమో నీకు అర్ధంకాలేదని బాధ.... ఆమె అడ్రసు తీసుకోలేదు నువ్వు. రిజల్టు గురించి తెలుసుకోలేదు.... ఏ అమ్మాయీ, ఎంతప్రేమించినా, సంతోషించే విషయాలు కావు ఇవి..."
"నీ సంతోషం ఎందుకు?"
"నువ్వు బాధపడుతోన్నందుకు....వసంత మెరుపుతో నీ కళ్ళు పూర్తిగా మిరుమిట్లు గొలపడంలేదని."
ఈ మాటలు తనకే తెలిసి ఉండాల్సింది అని అనుకున్నాడు గోపాలం, "శశిరేఖ మనస్తత్వం అంతలాగ నీకెలాగ తెలుసును?" అన్నాడు.
నవ్వి, "మనుషులంతా అంతే.... అమ్మాయిలు మరీను" అంది లలిత.
"మరి నేను బట్టలు తెచ్చేనని కోపం వొచ్చిందేం నీకు?"
"చెప్పినా నీకు బోధపడదు!" అని నవ్వుతూ అంది లలిత." చూడూ - ఇవేళ నేను డాబా గార్డెన్స్ కి వెళ్ళాలి. మీ అన్నయ్య రాత్రి పన్నెండుకి వొస్తారు. సినీమాచూసి, తరవాత అక్కడికిరా. వొచ్చేద్దాం" అంది.
"అలాగే" అన్నాడు.
బాబు వొచ్చేక ముగ్గురూ బయలుదేరారు. లలితనీ వాడినీ లలిత స్నేహితురాలింటిలో వొదిలి. దగ్గరే ఉన్న సినీమా హాలుకి వెళ్ళేడు గోపాలం. జేబులో డబ్బు ఇచ్చిన గర్వంతో ఫస్ట్ క్లాసుకి వెళ్ళాడు. అప్పుడే దీపాలు ఆర్పుతున్నారు- ఆ క్లాసు మొత్తంమీద పదిమంది కన్న లేరు- నోరు కుర్చీలున్నా, బహుశా ఇంగ్లీషు కామెడీ కావడాన, అనుకున్నాడు గోపాలం.
లలితతో మాట్లాడేక చాలావరకు శాంతించింది మనస్సు. సైడ్ రీల్స్ చూస్తూ అందులో తనని తానే మరిచిపోయాడు గోపాలం.
పది నిముషాల తరవాత సున్నితమైన పరిమళం అతన్ని చుట్టూ చూసేలాగ చేసింది. తన వెనక రోబో వసంత!
"హల్లో!" అంది నెమ్మదిగా.
"హల్లో!" అన్నాడు యాంత్రికంగా గోపాలం.
హాల్లో ఉన్న చిరుచీకటిలో మిసమిసలాడుతూంది వసంత. నిమిషం తల తిప్పలేక పోయాడు. ఒక్కసారి తన సర్వానయనాలనీ ఆక్రమించుకున్నది వసంత.
ఏం చెయ్యాలో బోధపడలేదతనికి. రెండు నిముషాల తరువాత, "అక్కడికి వొచ్చేకా!" అన్నాడు వెనక్కి తిరిగి.
"నీ ఇష్టం" అంది వసంత.
వెళ్ళి ఆమెపక్కన కూర్చుని, "ఒంటరిగానే ఒచ్చావా!" అన్నాడు.
"ఆఁ. నాకిక్కడ ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరని నీకు తెలుసును" అంది ఫిర్యాదు చేస్తోన్నట్టు.
కదలకుండా అలాగే కూర్చున్నాడు ఇంటర్వెల్ దాకా. "దాహంవేస్తోందా?" అన్నాడు కూల్ డ్రింక్స్ వాణ్ణి చూసి.
"లేదు-నాదగ్గర కనిపించడం భయంఐతే వెళ్ళు" అంది అతని ముఖంలోకి చూస్తూ.
కోపం ఒచ్చింది అన్యాయమైన ఈ ఆరోపణకి. ఇరవై నిమిషాల దాకా మాట్లాడకుండా కూర్చున్నాడు.
"అటు రావడమే మానేశావు. భయంవేశా!" అంది నెమ్మదిగా. కాని హేళన చేస్తోన్నట్టు వసంత.
"అదేం కాదని నీకు తెలుసు..."
"మరి?"
"తీరిక లేక-"
"నీకు అబద్దాలాడ్డం కూడా బాగా రాదు గోపాల్!" అని తేలిగ్గా నవ్వింది వసంత.
"నీకు వొచ్చునా?"
"ఆఁ.....నీతో తప్ప. ఈసారి అదీ నేర్చుకుంటాను" అంది వసంత.
సినీమా ఐపోయింది, బయటికి నడుస్తూ, "నాన్నగారు ఎన్నిసార్లో అనుకున్నారు నిన్ను గురించి..... ఓ సారి రా" అంది వసంత,
"అలాగే"
"ఎప్పుడు? - ఆదివారం, ఏం?"
"అలాగే"
"డ్రాప్ చేసి పోతాను- పద"
"థాంక్స్, మా వొదినని తీసికెళ్ళాలి, నువ్వెళ్ళు"
"పద. అక్కడికే వొస్తాను నేను"
అతను కాదనలేకపోయాడు. కారులోనే కూర్చుని వెయిట్ చేసింది వసంత. లలితకి పరిచయం చేసి, "వొద్ధన్నా బలవంతాన వొచ్చింది" అన్నాడు.
"అతనికి నేనంటే భయం లలితగారు? రండి" అంది ఆమెని కారులో కూర్చోబెడుతూ.
లలితా, వసంతా ఏవో మాట్లాడుకుంటున్నారు వెనకసీటులో కూర్చుని అతనికి స్పష్టంగా వినపడలేదు.
వాళ్ళని ఇంటిదగ్గర దింపి, ఎంత చెప్పినా లోపలికి రాకుండా మరోరోజున వస్తానని చెప్పి వెళ్ళిపోయింది.
తలుపులు వేసి, లోపల దీపాలు పెట్టి, "అన్నం తింటావా?- లేక ఆకలిలేదా?" అంది లలిత.
"ఎందుకు ఉండదు?- ఆకలి వేస్తోంది" అన్నాడు గోపాలం.
"ఏం మనిషివి గోపాలం?- ఆ అమ్మాయిని చూశావా నీకు ఇంతవేగం ఆకలి? ..... చిదిమి దీపం పెట్టేలాగ ఉందని వినడమే గాని ఎవ్వరూ కనిపించలేదు..... ఇవాళ దాకా! అంది, ఆమె కళ్ళలో నిజమైన ఆశ్చర్యం కనిపించింది.
అతను తెల్లబోయి చూశాడు.
"ఆ పిల్ల నిజంగానే దీపం...." అంది లలిత అతని ఆకలి ఒక్కసారి చచ్చిపోయింది.
10
రెండురోజులు విశ్రాంతిగా గడిపాక గోపాలానికి, శశిరేఖకి ఉత్తరం రాసేమాట జ్ఞాపకం వచ్చింది. అతనికి సిగ్గువేసింది. ఈ రెండు రోజులూ ఆమె ధర్మమా అని వొదిన వసంత మాట తెలీదు, ఉండీ ఉండీ వసంత తనని జ్ఞాపకాల్లో బాధ పెడుతూనే ఉంది.
సినీమా హాల్లో ఆ నూట ఏభై నిమిషాల ఆమె సాన్నిహిత్యం అతన్ని చాలా అచేతనుడిగా చేసింది. మాటల్లోగాని, స్పర్శచేతగాని, వసంత తనని ఉద్రేకింపజెయ్యడానికి ఏమీ చేసిందనిగాదు.....ఆ రోజుకి దూరంగా ఎండ లోకి చూస్తూ ఆలోచిస్తే ఏ మాత్రమూ అలాటి ప్రయత్నం ఆ వసంత చెయ్యలేదని గోపాలం తెలుసుకున్నాడు.
కాని, స్త్రీగా ఆమె సాన్నిహిత్యమే చాలు. లలిత చెప్పినట్టు ఆమెలో ఏదో ప్రచండమైన అగ్ని. ఉద్దేశం లేకుండానే తనని దహింపచేసే అగ్ని. ఆ దీపం చుట్టూ తాను, తనలో ఆ దీపం....
ఆలోచనలు మళ్ళించుకుని కాగితం తీసుకుని మనస్సంతా శశిరేఖ మీదకి తెచ్చుకున్నాడు. ఆమె తనది.....తన కోపం ఆలోచించి, మలయమారుతంలాగ తనని లాలించే యువతి- ఎన్నడూ ఆమె సుడిగాలి లాగ తనని చుట్టు ముట్టని మనిషి. ఆమెలో వెచ్చదనం వుంది అది నిప్పుకానే కాదు.
ఉత్తరం త్వరగానే రాసి మళ్ళీ చదివాడు.
శశిరేఖకి-
మొన్న రామానంద్ కనిపించి నువ్వు ఉత్తరము రాశాననీ నీ రిజల్టు చాలా ఆశాజనకంగా ఉందనీ చెప్పాడు. మిగిలిన విశేషాలు కూడా దయతో తెలియచేశాడు.
నువ్వు వెళ్ళేటప్పుడు మనస్సు సరీగా లేక నీతో స్టేషన్ దాకా రావడం కానీ, నీ అడ్రసు తీసుకోవడంగాని చెయ్యలేక పోయాను. ఇవేళ ఆ మాట తలుచుకుంటే సిగ్గుగానే ఉంది.
నాన్నగారికి ఎలాగ ఉంది?..... నీ కథ అంతా తెలిశాక, నువ్వేపరిస్థితిలో ఉన్నావో ఆలోచించ గలను. ఈ సమయంలోనైనా, నీ కలలు నిజమవాలనీ, నీ ప్రేమని సమానంగా పంచుకున్న రెండు హృదయాలు మళ్ళీ ఏకం అవాలనీ భగవంతుణ్ణి ప్రార్ధిస్తాను. ఆ కోరిక నెరవేరడంలో నవ్వు నాకు దూరంకాకూడదని ఆశిస్తాను,
-ట్యుటోరియల్ కాలేజీలో చేరేను, పాఠాలు చెప్పడం చిత్రమైన అనుభూతిగా ఉంది, శ్రమ క్రమంగా, విధిలాగ కాకుండా, సంతోషంగా ఉంది ఈ పని.
ఎప్పుడు వొస్తావు నువ్వు?
-నువ్విక్కడ లేకుండా, ఏదో వెలితిగా ఉంది. వొదిన నిన్ను స్మరిస్తూనే ఉంది. అక్కడ వేడి ఎక్కువగా ఉందా?
సమాచారాలతో, విశేషాలతో వీలైతే ఉత్తరం రాయి, ఈసరికే నువ్వు రాసి ఉండవలిసింది.
భవదీయుడు,
గోపాలం.
చదివాక ఉత్తరంలో ఏదో వెలితి కనిపించింది అతనికి. కాని, రెండుసార్లు చదివినా అదేమిటో అతనికి తెలియలేదు. చివరికి కవర్లో పెట్టి అడ్రసురాసి పోస్టుచేశాడు.
ఉత్తరం పోస్టు చెయ్యగానే అతనికి విచిత్ర మైన ఆలోచనవొచ్చింది- ఈ ఉత్తరం తనని పెనవేసుకుంటూన్న బంధాలనించి రక్షణకోసం ఏదో తావీదులాంటిది, అని.
కాలేజీకి నడిచాడు.
సాయంత్రం మూడుగంటలదాకా లెక్చర్లతో మధ్య కామన్ రూములో బాతాఖానీతో గడిచిపోయింది.
