"ఓ ... అదా మీ భయం! అలాటి భయం మీ కేమీ అక్కర్లేదు లెండి. ఎవరి ప్రేమను వారికి వేరే వేరే కేటాయిస్తాను. సరేనా?" ఇద్దరూ నవ్వు కొన్నారు.
ఇంతలో ఒక పెద్ద పుస్తకం చేతిలో పట్టుకు వచ్చాడు మధు. లత ఆ పుస్తకం అందుకొని ఆసక్తిగా పేజీలు తిప్పుతూంది.
"ఏమిటి, మధుబాబూ, చిత్రాలతో పాటు కథలు వ్రాయటం కూడా మొదలు పెట్టావా ఏం?"
"ఏం, కథలు వ్రాయటం మీ ఒక్కరి సొత్తేనా?" లతవెక్కిరిస్తూ అడిగింది.
"అలా అంటే నీవు ఊరుకొంటావా?"
"ప్రస్తుతం సునీత నవల ఒకటి పత్రికలో సీరియస్ గా వేస్తున్నారే - దాని వ్రాత ప్రతి ఇది. చదువుదామని తెచ్చాను. సరే, ముందు అక్కకే ఇచ్చాను. ఇదుగో, అక్కా! నవల పూర్తి అయిన తర్వాత నీ అభిప్రాయం చెప్పాలి."
"ఎవరికి? నీకా .... సునీతకా?"
"నాకే కావాలి నీ అభిప్రాయం" అన్నాడు మధు.
"అయితే, మధూ, సునీతతో నీ పరిచయం చాలా దూరం వెళ్ళినట్లుందే" అన్నాడు రమాకాంత్.
"పరిచయం స్నేహంగా, స్నేహం సన్నిహితున్నిగా చేసింది. అంతే" అన్నాడు మధు. కొంచెం ఆగి, "సునీత బాగా పైకి వచ్చింది. ప్రతి వారూ ఆమె రచన లడుగుతున్నారు. వ్రాతతో ఆమెకు బొత్తిగా తీరటం లేదు" అన్నాడు.
"నీవు ఆమెతో కలిసి తిరగటానికి కుదరటం లేదు. అంతేనా?" నవ్వాడు రమాకాంత్.
"అలాటిదేమీ లేదు. ఆమె నాతో ఒంటరిగా ఎక్కడికీ రాదు. వాళ్ళ ఇంట్లో తప్ప బయట ఎక్కడా కలుసుకోము. వాళ్ళ నాన్న, అన్న, వదిన అంతా నాతో బాగా చనువుగా ఉంటారు."
"వాళ్ళ నాన్న ఏం చేస్తారు?"
"ఆయన రిటైరయ్యారు. అన్న కేదో ఉద్యోగం మూడు వందలు సంపాదిస్తాడు. తల్లి లేదు. సునీతంటే అందరికీ ఇష్టం."
"ఆమె అభిమానులంతా వస్తుంటారా?"
"అలాటి దేమీ లేదు. అభిమానులు వ్రాసిన ఉత్తరాలకు కూడా జవాబు లివ్వదు."
"మరి నీ కింత స్నేహం ఎలా అయిందబ్బా!" ఆశ్చర్యంగా గడ్డం క్రింద వేలు పెట్టుకుని అడిగింది లత.
"అది స్నేహం కాదులే, లతా!" నవ్వాడు రమాకాంత్.
"బావగారూ! మీరు సభ్యత మరిచిపోతున్నారు" హెచ్చరించాడు మధు.
అంతా నవ్వుకొన్నారు.
కొంచెం ఆగి, "అక్కా" అన్నాడు ఆప్యాయంగా.
"ఏం, తమ్ముడూ?"
"ఒక్కసారి సునీత దగ్గరకు వెళదాం, రాకూడదూ?"
"ఆమెనే రమ్మన కూడదూ?"
"నీవు ఒక్కసారి వస్తే వస్తుంది."
"సరే, అయితే ఎప్పుడు వెళదా మంటావ్."
"నీ ఇష్టం." మధు వెళ్ళిపోయాడు. ఆటలకు వెళ్ళిన సుధా, రవి వచ్చి వాళ్ళ నాన్న ఒళ్ళో చేరారు. మధు ఇంట్లో ఉన్నంతవరకూ సుధ, రవి అక్కడే ఉంటారు. చిలిపి మాటలతో విసిగిస్తూ, చిరునవ్వులు చిందిస్తూ, అమాయకంగా కనిపించే ఆ పిల్లలతో ఆడుకోవటం మధుకు ఎంతో ఆనందం. గంటల కొద్దీ విసుగులేకుండా వాళ్ళతో గడిపేయగలడు. అతడిప్పుడు లతా వాళ్ళకు ఆత్మీయుడు. వారి కుటుంబంలో ఒకడుగా మెలుగుతున్నాడు. ఎన్నడో పోగొట్టుకొన్న మనశ్శాంతి అతడి కిప్పుడు లభించింది. జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నట్లు అనిపిస్తూంది. చిత్ర మైన జీవితంలో అతి విచిత్రమైన సంఘటనలెన్నో జరుగుతాయి. అలాటిదే లత, మధుల కలయిక. చెరొక చోటా పుట్టారు. చెరొక చోటా పెరిగారు. కాని, నేడు ఒకే ఇంట్లో సోదర సోదరీ బంధంతో బంధింప బడ్డారంటే అది భగవంతుడి లీల కాక మరేమిటి?
"అమ్మా, లతాదేవీ! మా క్షుద్భాద తీర్చేదేమైనా ఉందా?" అంటూ పక్కన చేరాడు రమాకాంత్. చదువుతున్న పుస్తకం మూసి చిలిపిగా నవ్వింది లత.
"రోజు రోజుకు చిన్నపిల్లలై పోయే వారిని మిమ్ములనే చూశాను."
"అవును,మహా నువ్వు పే....ద్ద దానివైనట్లు" అంటూ లతను బలవంతంగా నిలబెట్టాడు రవి.
రమాకాంత్ ను ఆఫీసుకు పంపిన లత గబగబా పని తెముల్చుకొని సునీత వ్రాసిన నవల తీసుకొని చదవటం మొదలు పెట్టింది.
"సలీమ్, రమ చిన్నతనంలో నుండీ ఇరుగుపొరుగు వారు. బాల్యంలో వారిద్దరూ అంతగా కలిసి తిరగక పోయినా సలీమ్ పెద్ద చదువులకు వెళ్ళినప్పటినుండి, చదువుతోపాటు వారి స్నేహం కూడా పెరిగింది, క్రమేణా వారిరువురి స్నేహం ప్రేమగా రూపొంది ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా బలపడింది. వివాహం చేసుకోవాలని ఒకరినొకరు వాగ్దానాలు చేసుకొన్నారు. కాని, రమ హిందువు. సలీమ్ మహమ్మదీయుడు. ఈ వివాహం ఎలా జరుగుతుంది? పెద్దలు ఎలా ఒప్పుకుంటారు? ఫలితం రాత్రికి రాత్రి వారిద్దరూ పరారీ అయ్యారు. నూతన సంసారం ఆనందం గానే ఉంది. కొన్నాళ్ళ తర్వాత రమ ఇష్టానుసారం తన వారినందర్నీ దూరం చేసుకున్నాడు సలీమ్. అయినా ఆమె తృప్తి పడలేదు. మాటిమాటికీ సలీమ్ అలవాట్లను ఆమె ఎగతాళి చేయటం, అతని ఘతాన్ని కించపరచడం. నమాజు చేస్తుంటే హేళన చేయటం మొదలు పెట్టింది. కానీ, సలీమ్ ఎన్నడూ ఆమె మతాన్ని కాని, ఆచారాన్ని కాని దూషించలేదు. మత భావంతో తల ఎత్తిన ఆమె లోని గర్వం పెరిగి పెద్దదైపోయింది. వ్యక్తిగతంగా అతడిని నిందిస్తూ, సంసారాన్ని నరకం చేయటం మొదలు పెట్టింది. సలీమ్ తన సహనాన్ని పరీక్షకు పెట్టాడు. ఎంత సర్దుకు పోవాలని అతడు ప్రయత్నించే వాడో ఆమె అంత గొడవలు చేసేది. చివరకు సలీం తన సహనాన్ని కోల్పోయాడు. ఫలితంగా సంసారం రెండు ముక్కలయింది. ఆమె అతడిని వదిలి వెళ్ళిపోయింది. మనశ్శాంతిని కోల్పోయి, రమమీద ప్రేమను చంపుకోలేక అతడూ కృశించి తనువు చాలించాడు."
నవల పూర్తిచేసేటప్పటికి లత కళ్ళ నిండుకు నిల్చున్న నీరు టప్ టప్ మంటూ క్రిందపడింది. నవల ఎంతో సహజంగా ఉంది. అందులో ప్రతి సంఘటన మనిషిని కదిల్చివేస్తుంది. ఒక్కొక్క సంఘటన చదువు తూంటే, లత సుత్తులతో హృదయంపై బాదినట్లు బాధపడింది.
"అక్కా! నీకు కూడా ఈ నవల కన్నీరు తెప్పించిందంటే అది అమోఘంగా ఉందన్న మాట" అంటూ పక్కన కూర్చుని మధు ఆమె కన్నీరు తుడిచాడు. లత ఏమీ మాట్లాడలేదు. ఆమె కంటి నుండి కారు నీటిని తుడుచుకోటానికి ప్రయత్నించనూ లేదు. ముఖ మంతా నీలి మబ్బులతో నిండిన ఆకాశంలా ఉంది. ఆమె కళ్ళలో కనిపించే బాధను మధు చూడలేక పోయాడు.
"ఇదేం బాగుండలేదు, అక్కా! ఒక నవలను చదివి ఇంతగా కదిలిపోయా వేమిటి? ఒకటి రెండు కన్నీటిచుక్కలు రాలటం సహజం. కాని, ఇంత బాధపడతారా?" అంటూ అనునయించబోయాడు.
ముఖమంతా పమిటతో గట్టిగా తుడుచుకొంది లత. "ఇది నవలకాదు, తమ్ముడూ!" అంది నిట్టూరుస్తూ.
"ఏమి టక్కా నువ్వనేది?"
"అవును, మధుబాబూ! నేను నీకు నిజం చెబుతున్నాను. ఇది ఒక అభాగిని జీవిత చరిత్ర, నమ్మినవాడు మోసంచేస్తే అతనితో జీవించలేక జీవితంతో రాజీపడలేక అలమటించే అభాగిని కథ,"
"అయితే, ఇది జరిగిన కథా?"
"అవును, మధూ, జరిగిందే. కాని, ఈ రచయిత్రి జరిగింది జరిగినట్లు వ్రాయక తారుమారుచేసి వ్రాసి, హీరోపై పాఠకులు సానుభూతి చూసేటట్లు వ్రాసింది. కాని, జరిగింది అదికాదు. నిజజీవితంలో మనం నజ్ మాను చూసి జాలి పడతాం."
"నజ్ మా? ఆమె ఎవరు?"
"నజ్ మా, నేను స్కూలు ఫైనలు వరకు కలిసి చదువుకొన్నాం. ఆ తర్వాత నజ్ మా చదివే స్తోమతులేక టైపు నేర్చుకొని ఒక ఆఫీసులో టైపిస్టుగా చేరింది. నజ్ మా వాళ్ళింట్లో అంతా చదువుకొన్న వారే. మహమ్మదీయులైనా అంతా స్వచ్చమైన తెలుగు మాట్లాడేవారు.ఎన్నడూ ఘోషాగా ఉండటం నేను చూడలేదు. నేను బి. ఎ. లో ఉండగా ననుకొంటా ఒక రోజు నజ్ మా వచ్చి,
"నీ కో శుభవార్త చెప్పడానికి వచ్చాను" అంది.
'నీ పెళ్ళా?' అన్నాను నవ్వుతూ.
'కరెక్ట్ గా గెస్ చేశావు' అంది. నే నాశ్చర్యపోయాను.
'సరే ఎప్పుడు పెళ్ళి? వివరాలు త్వరగా చెప్పు సస్పెన్సులో పెట్టక' అన్నాను. అంతలోనే నవ్వుతున్న నజ్ మా గంభీరంగా మారిపోయింది.
'నేను మీ హిందువును చేసుకొంటున్నాను.'
'అంటే మతాంతర వివాహ మన్నమాట. ఏం, నజ్ మా, ఏమైనా ప్రేమ గొడవలో పడ్డావా?' అన్నాను.
"అలాంటిదే, లతా! ఆరు నెలల క్రిందట మాకు కొత్త ఆఫీసర్ వచ్చాడు. ఆయన నాతో చాలా చనువుగా ఉండటం ప్రారంభించాడు. మొదట అపార్ధం చేసుకొన్నాను. కానీ, కాలక్రమేణా ఆయన నన్ను ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్నాను. నాకు తెలియకుండానే నే నాయన్ను ప్రేమించటం మొదలుపెట్టాను. ఎంత వద్దనుకున్నా ఆయన రూపం, ఆయన తలపులు నన్ను వదలటం లేదు. అందుకే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాం' అని ఊరుకొంది. నేను కొంచెం ఆలోచనలో పడ్డాను.
'మాట్లాడవేం, లతా?'
'ఏం మాట్లాడను?'
'నీ కీ పెళ్ళి ఇష్టం లేదా?'
'ఇష్టం లేదని ఎలా అనగలను? నీ ధైర్యానికి, సాహసానికి ప్రశంసిస్తున్నాను. మీ ప్రేమకు లోకం జోహారు లర్పించాలని కోరుకొంటాను. కాని నజ్ మా...' సందేహిస్తూ ఆగాను.
'ఫర్వాలేదు. అడుగు' అంది.
'మరి ఇది నిజమైన ప్రేమా? లేక అతడు నీ అందాన్ని, నీవు అతని హోదాను ప్రేమిస్తున్నారా అని నా సందేహం. అలా అయితే, మీ వివాహానంతరం వచ్చే వడిదుడుకులు తట్టుకొనే శక్తి నీలో ఉందా అని' అంటూ నసిగాను. నజ్ మా అందగత్తె. అందులో ఇప్పుడు వయస్సు వచ్చిన తర్వాత మరింత అందంగా తయారయింది.
'నీ కా సందేహం ఎందుకు కలిగింది? ఆయన కోసం నేనేమైనా చెయ్యగలను, లతా! ఆయనా అంతే' అంది తొణకకుండా. ఆ తర్వాత నజ్ మా, ప్రభాకర్ ల వివాహం అయింది. అతడిని వివాహమాడటానికి ఆమె తనవారి నందరినీ వదిలి వచ్చేసింది. వివాహమైన మరుసటి రోజే ప్రభాకర్ నజ్ మా ఉద్యోగానికి రాజీ నామా ఇప్పించాడు. ఆ తర్వాత ఆరు నెలలకు ఫ్రెండ్సంతా కలిసి నజ్ మాను చూడటానికి వెళ్ళాం. ప్రభాకర్ ఇంట్లోనే ఉన్నాడు. మమ్ముల నెంతో ఆదరంగా ఆహ్వానించాడు. ఏ పొరపొచ్చాలు లేకుండా సంసారం సాఫీగా గడిచిపోతూందని చెప్పింది నజ్ మా. మరి మతాలు వేరుగదా అంటే, 'అయితే నేం? ఆయన మీ దేవుడికి పూజ చేస్తారు. నేను రోజు నమాజు చేస్తాను. దాంట్లో వింత ఏముంది? భోజనం విషయంలో కూడా మా కెలాంటి భేదాలూ లేవు. అంది నిండుగా, మేమెంతో సంతోషించాం. బంగళా, కారూ, కుక్కా అన్నీ వాళ్ళ హోదాను తెలియజేస్తున్నాయి ఆఫీసరని. అంతకంటే ఇంకేం కావాలి? అనిపించింది మాకు.
సంవత్సరం దాటిన తర్వాత ననుకొంటా-నజ్ మా ఇంటి దగ్గర ఇంటికి పేరంటానికి వెళ్లాను. వస్తూ నజ్ మాను చూసి వద్దామని వెళ్లాను. ప్రభాకర్ నన్ను చూసి పలకరించకుండా విరుసుగా వెళ్ళి కార్లో కూర్చొన్నాడు. నేను ఆశ్చర్యపోతూ లోపలకు వెళ్లాను. నజ్ మా క్రింద చిందరవందరగా పగిలి పడిపోయిన కప్పు, సాసరు ముక్కలు ఏరుతూంది. వాటిలో నుండి పలికిన కాఫీ గాబోలు నేలంతా పాకింది.
"ఎలా పగిలింది?' అన్నాను దగ్గరగా వెళ్ళి, ఉలిక్కి పడి తల ఎత్తింది నజ్ మా గడ్డం కిందగా గీసుకు పోయిన గాటు. దాని నుండి కారుతున్న రక్తం. కళ్ళ వెంట నీరు. నా మనస్సంతా ఎలాగో అయిపోయింది.
'అదేమిటి, నజ్ మా? అలా రక్తం వస్తుంటే తుడుచుకోకుండా ఈ ముక్కలు ఏరుతూ కూర్చున్నానేమిటి?' అన్నాను నేను పక్కగా కూర్చుంటూ. ఇంకా అలాగే కూర్చుంది, మనిషిలో చలనం లేనట్లు నేనే బాత్ రూంలో నుండి నీళ్ళు తెచ్చి గాయం కడిగి, పౌడరు వేశాను. లేసి సోఫాలో కూర్చోపెట్టాను. పని మనిషిని అక్కడ శుభ్రం చేయమనీ చెప్పాను. పనిమనిషి అంతా శుభ్రంచేసి వెళ్ళిపోయింది. నజ్ మా చేతిని నా చేతిలోకి తీసుకొంటూ, 'ఇప్పుడు చెప్పు. ఏం జరిగింది?' అన్నాను అనునయంగా.
'అవును. నీకు కాక ఎవరికి చెపుతాను? బాల్యం నుండీ ఇద్దరం కలిసి తిరిగాం. కలిసి చదువుకొన్నాం. బాల్యం స్నేహం చాలా గొప్పది. ఆత్మీయమైంది. ఇప్పుడు నీవే నాకు సర్వస్వం' అంటూ ఏడ్చింది. ఆమె నలాగే ఏడవ నిచ్చాను. ఉధృతం తగ్గిన తర్వాత ఆమె చెప్పింది ప్రభాకర్ కు విసుగూ, కోపం రెండూ ఎక్కువేనట. ఆయనకు కోపం వస్తే ఏది ఉంటే అది విసిరి కొడతా రట. నజ్ మా ఎంతో శాంతంగా అన్నీ సమకూరుస్తుందట. అయినా, చివాట్లు తప్పవు.
