"మొన్న నేను తీసుకెళ్ళిన మీ కథలు తెచ్చాను. ఇవి తీసుకుని కొత్తవి వ్రాస్తే ఇవ్వండి."
"ఇప్పుడు నేనేమీ వ్రాయటం లేదండీ."
"మరేం చేస్తున్నారు?"
"చాలా బిజీగా ఉన్నాను. రేడియో వారు పది రోజుల్లో స్త్రీ సమస్యతో ఒక నాటకం వ్రాసి ఇమ్మన్నారు. కొత్త పత్రిక 'అరుణ'కు ఒక కథ ఇమ్మని అడిగారు. ఇక్కడ లేడీస్ క్లబ్ కూడా వాళ్ళ వార్షికోత్సవానికి ఏమైనా వ్రాసి ఇమ్మన్నారు. కాని నే నింకా ఏమీ మొదలుపెట్టలేదు."
"అదేం?" ఆశ్చర్యంగా చూశాడు మధు.
"మధుబాబూ, ఈమధ్య నాకు చక్కటి నవల వ్రాయాలనిపించింది. అది మొదలుపెట్టాను. ఆ నవల పూర్తి చేయకుండా ఏమీ వ్రాయకూడ దనుకొన్నాను."
"మీ రనేది నాకేం నచ్చలేదు. ఇంతమంది మిమ్ములను అభిమానంతో అడిగినప్పుడు ఇవ్వక పోవడ మేమిటి? తప్పకుండా వ్రాసి ఇవ్వండి. ప్రస్తుతం వ్రాస్తున్న నవలను ఆపి, అవి వ్రాయండి. తర్వాత నవల పూర్తి చేయవచ్చు."
"అలాగే మీ మాట ఎందుకు కాదనాలి?"
"థాంక్స్, ఆ మాత్రం విలువ ఇచ్చినందుకు!"
"అంతే నన్న మాట ఇన్నాళ్ళ స్నేహంలో నన్ను అర్ధంచేసుకొన్నది!" అంది గోముగా. చిరునవ్వు నవ్వి ఊరుకొన్నాడు మధు. కొంచెం ఆగి,
"నవల ఇతివృత్తం ఏది ఎన్నుకొన్నారు? ఒక వేళ ఏ ఇంగ్లీషు నవలనో అనుకరించటం లేదుగదా?" అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ.
"మీకు రచయిత లంటేనే ఎగతాళిగా ఉంది. వాళ్ళూ వీళ్ళూ వ్రాసినవి ఎవరూ వ్రాయరు. ఎవరి భావాలు వారికి ఉన్నప్పుడు, వ్రాయగలిగిన శక్తి ఉన్నప్పుడు ఇతరుల కథలను ఎందుకు అనుకరిస్తారు?"
"అలా అనకండి. అలాంటి రచన లెన్నో ఉన్నాయి. మీ రచయిత లందర్నీ వెనక వేసుకొని వచ్చి పోట్లాడినా లాభం లేదు" కోపంగా అతడి వంక చూస్తూంది. ఆ కోపంలో ఆప్యాయత కూడా మిళితమై ఉంది. మధు నవ్వుతూ, "సామర్ సెట్ మామ్ పేరు తెలియ నీయకుండా ఆయన కథల లాటివి ఎందరు వ్రాయలేదు? ఒక్క మామ్ కథలేమిటి? అలాటివి ఎన్నో ఉన్నాయి" అన్నాడు.
"ఎవరు వ్రాశారో చెప్పరాదూ?" అంది రోషంగా.
"చెప్పాలంటే చెప్పగలను. కాని పేర్లు చెప్పటం నా కిష్టం లేదు. ఒక్క సంగతి వినండి, సునీతా. నేను ఇంగ్లీషు నవలలు బాగానే చదువుతాను. తెలుగూ అంతే. అలా చదువుతున్నప్పుడు తెలుగు నవల చదువుతున్న ప్పుడు అది నీ ఇంగ్లీషు నవలను అనుసరించి వ్రాసిందో అయితే వెంటనే గుర్తు వస్తుంది."
"అందరూ అలా ఏం వ్రాయరు."
"అందరూ వ్రాస్తారని నేనూ అనలేదు." ఆమె కోపాన్ని రెట్టిస్తూ నవ్వాడు.
"ఎక్కడా చదవకుండానే అదే ఇతివృత్తం కల కథ వ్రాయవచ్చు. రచయిత లిరువురికీ ఒకే అభిప్రాయం కలిగి ఉండవచ్చు."
"సరే. అలాగే అనుకొందాం, లేకపోతే రచయితల నంటుంటే మీ రూరు కుంటారా ఏం?" ఇంకా నవ్వుతూనే ఉన్నాడు మధు. నవ్వుతున్న మధును చూడటం సునీత కెంతో ఇష్టం, కొంచెం సేపటికి నవ్వటం ఆఫీసు మధు వంక చూస్తూ.
"ఆపేశారేం? ఇంకొంచెం నవ్వండి" అంది,
"ఎందుకు?"
"నవ్వుతున్నప్పుడు మీ దానిమ్మ గింజల్లాంటి పళ్ళను, అందులోని తళుకును చూడటానికి," ఈ మాట లంటూ తానూ నవ్వింది.
"అవును, మరి. మీలా తామర పువ్వుల్లాంటి కళ్ళు, అందమైన కనురెప్పలు, ఆ కళ్ళలోని కాంతి నాకు లేవుగా?" అలిగినట్లు అన్నాడు.
"మీరు అలిగితే ముద్దుగా ఉంటారు."
"కొంపదీసి..."
"చాల్లే ఊరుకోండి. ఎవరైనా వింటే నవ్వగలరు."
బోల్డు సిగ్గుపడింది సునీత.
"సునీతా!"
"ఊఁ."
"ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు."
"పోనీ, ఉండిపొండి ఇక్కడే. మీ అంత మహా రాజులం కాకపోయినా అతిథిని ఆదరించగలంలెండి."
"అదికాదు, సునీతా. ఈ మధ్య మా ఇంట్లో ఒక అన్యోన్యమైన జంట దిగింది. అది అందమైన జంట కూడా." అతని ముఖంలో అలుముకొన్న విషాదచ్చాయ లకు విస్తుపోయింది.
"అయితే .... వారి వల్ల మీకు ఏమైనా కష్టం కలుగుతూందా?" అనుమానంగా అడిగింది.
"అదేం లేదు. భార్య, భర్త, పిల్లలిద్దరూ అంతా రత్నాల్లా ఉంటారు. ఆనందం అంతా ఆ ఇంట్లోనే ఉన్నాయా అనిపిస్తుంది. వాళ్ళెంతో సహృదయులు."
"మరి, మీ బాధ దేనికి?"
"ఓహ్! నా బాధంతా ఆ లతను చూసినప్పుడు కలిగేది. ఆమెను చూడనూలేను, చూడకుండా ఉండనూ లేను. ఆమెను చూస్తుంటే వెన్నెల్లో పవ్వళించినట్లు ఉంటుంది. ఆమె మాట లాడుతుంటే తేనె లొలక బోసినట్లు ఉంటుంది. ఆమె ఆదరణలో ఎంతటివారూ పసిబిడ్డలై పోవలసిందే..." ఈ సారి సునీత ముఖం నల్లబడింది.
"అయితే మీరు..."
"నే నిప్పు డేమీ చెప్పలేను, సునీతా, నన్నేమీ అడక్కు" అంటూ లేచి వెళ్ళిపోయాడు. చాలాసేపటి వరకు సునీత అలాగే పీక్కుపోయిన ముఖంతో కూర్చుంది. ఇన్ని దినాల పరిచయంలోనూ సునీత అతని నిలా ఎప్పుడూ చూడలేదు. ఆనందంగా కనిపించే అతని ముఖంలో విషాదచ్చాయలు ఎన్నడూ కనిపించలేదు. ఈ రోజు ... ఇలా మాట్లాడా డేమిటి? అతడికి దగ్గరగా వెళుతున్న తనను ఎవరో దూరంగా త్రోసి వేసినట్లు బాధపడింది.
"మధుబాబు వెళ్ళిపోయాడా? ఒక్కతెవీ కూర్చున్నావే? అన్నయ్య ఇంకా రాలేదు. మనం భోజనం చేద్దామా?"
"నాన్నగారి భోజనం అయిందా?"
"ఆఁ."
"అయితే అన్నయ్య వచ్చే వరకూ ఉందాం."
రమ కూడా మరొక కుర్చీలో కూర్చుని పత్రిక చేతిలోకి తీసుకొంది.
* * *
మధు స్కూటరు దిగగానే గోవిందు ఎదురువచ్చి, "రవికి సాయంత్రం నుండి ఒకటే జ్వరం, బాబూ! చాలా ఎక్కువగా ఉంది. లతమ్మగారు గాభరా పడుతున్నారు" అన్నాడు.
"మరి నువ్వేం చేశావు?"
"అయ్యగార్ని పిలుచు కొద్ధామని బయల్దేరాను. ఆయన ఊర్లో లేరట."
"మరి మన డాక్టరును పిలవ కూడదూ? వాళ్ళకు కొత్త కదా!"
"ఆ యమ్మగారు పిలవ మనలేదు. మీ రేమంటారో నని..."
"ఏడ్చావులే. నేను ఫోను చేస్తానుండు." గబగబా పైకి వెళ్ళాడు.
గదిలో పక్కమీద, రవి పక్కనే అతనికి అంటుకు పోయి పడుకొంది లత. సుధ కుర్చీలో కునికిపాట్లు పడుతూంది.
"టెంపరేచర్ తీశారా?"
"నూట నాలుగు ఉంది" అంది మంచంపై నుండి లేచి నిలబడిన లత. తలవంచుకొని రవి కాళ్ళ దగ్గర నిలబడి ఉంది. మధు వెళ్ళి రవి నుదుటి మీద చేయి వేశాడు. "బాబూ" అంటూ బుగ్గ నిమురుతూ పిలిచాడు.
"మన తెలివిలో లేడు. ఎంత పిలిచినా పలకడం లేదు." ఆమె గొంతు వణికింది.
"మీరేం గాభరా పడకండి. డాక్టరుకు ఫోను చేశాను. వస్తాడు" అంటూ రవి పక్కనే కూర్చున్నాడు.
"ఇదివర కెప్పుడూ ఇలా రాలేదు. పైగా వారు ఊర్లో లేరు. ఆయన ఉంటే నాకే భయమూ ఉండేది కాదు."
"ఇప్పుడు కూడా నీ భయమూ పెట్టుకోకండి. కావాలంటే డాక్టర్ రాత్రంతా ఇక్కడే ఉంటాడు. అన్నట్లు మీరు భోజనం చేసినట్టు లేరు. వెళ్ళి చేయండి. నే నిక్కడ ఉంటాను" అన్నాడు. గోవిందు కూడా వచ్చి గది గుమ్మంలో కూర్చున్నాడు. వాళ్ళిద్దర్నీ చూసి లతకు ధైర్యం వచ్చింది. కృతజ్ఞతగా మధును చూసి, "మీరు భోజనం చేయరా?" అంది. "నా భోజనం అయింది. ఇది మీరు వెళ్ళండి" అన్నా లత అలాగే నిల్చుంది. కొంచెంసేపు చూసి మధు, "వెళ్ళి భోజనం చేయండి, లతాదేవీ! నేను, గోవిందు ఇక్కడే ఉంటాం. ప్లీజ్ .... వెళ్ళండి" అని తొందరపెట్టాడు. లత భోజనం చేసి వచ్చేటప్పటికి సుధను భుజంమీద వేసుకొని తిప్పుతూ నిద్ర పుచ్చుతున్నాడు. లత నొచ్చుకుంటూ,
"ఇలా పడుకో పెట్టండి. సుధ చిన్నదేమీ కాదు. ఎత్తుకు తిప్పడానికి" అంది.
"చిన్నది కాక పిల్లల తల్లా ఏమిటి?" అన్నాడు నవ్వుతూ. లత కూడా నవ్వింది. ఆ నవ్వు ఒక్కక్షణం చూసి తల వంచుకొన్నాడు మధు.
రాత్రి పదివరకూ డాక్టరూ, మధూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆ తర్వాత బాబుకు మరుసటి రోజుకు జ్వరం తగ్గిపోతుందని చెప్పి, అవసరమైతే ఫోను చేయమని చెప్పి వెళ్ళాడు. మధు గోవిందును ముందు వరండాలో పడుకోమని, అవసరమైతే తనను లేపమని చెప్పి వెళ్ళాడు.
ఆ రాత్రి లతకు కలత నిద్దురతోనే తెల్లవారింది. లేస్తూనే క్రిందికి వచ్చాడు మధు. రవి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. లత వాడికి మందు పోస్తూంది.
"రాత్రి నిద్రపోయాడా?"
"వాడు బాగానే నిద్రపోయాడు. నాకే నిద్ర పట్టలేదు" అంది లత.
"మీరు పట్టి భయస్థులు. పిల్లలైన తర్వాత జ్వరం రాకుండా ఉంటుందా? అంత భయం దేనికి?"
ఒక సారి మధువంక చూసి, "ఇప్పుడెలా తెలుస్తుంది మీకు? మీరూ ఒక తండ్రి అయినప్పుడు తెలుస్తుంది. అని లోపలకు వెళ్ళింది.
మధు చిన్నగా నవ్వుకొన్నాడు. కాఫీ అందిస్తున్న లత చేతి వ్రేలికి ఉన్న పెద్ద నీలం రాయి ఉంగరం మీద అతని దృష్టి పడింది. ఒకసారి ఆమె ఉంగరం, మరొకసారి తన చేతికి ఉన్న ఉంగరం మార్చిమార్చి చూశాడు.
"ఏమిటి నా ఉంగరమా చూస్తున్నారు? ఇది మా వారునా కిచ్చిన మొదటి బహుమతి" అంది.
"ఇటు చూడండి. ఇదీ నాకు బహుమతే!" అంటూ తన చేయి జాపాడు.
"అరే! ఆశ్చర్యంగా ఉందే? రెండూ ఒక్కలాగే ఉన్నాయి."
"అప్పుడప్పుడు ఇరువురు మనుష్యులు, వారి స్వభావాలు కూడా ఒకటిగానే ఉంటాయి."
"అంటే?" అర్ధంకానట్టు చూస్తూ కూర్చొంది లత.
"లతాదేవీ ... కాదు, ఇలా పిలవటం నాకేమీ బాగుండలేదు. మిమ్మల్ని అక్కగారూ అని పిలిస్తే మీకేమీ అభ్యంతరం ఉండదుగదా!"
అతని వంకే చూస్తున్న లతకళ్ళలో ఆనందం వెల్లివిసిరింది. "మీకు అలా పిలవాలని ఉంటే అక్కా అని పిలవండి చాలు. అక్కగారూ అని మన్నించవలసిన అవసరం లేదు."
"ఓహ్ అయితే నేను అదృష్టవంతుడివి. నాకు మళ్ళీ అక్క దొరికింది."
* * *
"మనష్యులను చూడగానే వారిపై అభిప్రాయాలు నేర్పరచుకోవటం చాలా తప్పు."
"కాదని ఎవరన్నారు?"
"అది కాదండీ. మధుబాబు విషయంలో నే నెంత పొరపడ్డాను! తలుచుకొంటే అలా ఆలోచించినందుకు ఇప్పుడు సిగ్గు వేస్తూంది"
"అసలు సంగతేమిటి, లతా?"
"మధు బాబు నాలో వాళ్ళక్క లలితను చూసుకొంటున్నా డండీ."
"ఏమిటీ!" ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ అన్నాడు రమాకాంత్.
"అవునండీ. నా నడక, నేను కూర్చునే తీరు, నా మాట అంతా వాళ్ళక్క లాగే ఉంటుందట. ఆ రోజు మన ఇంట్లో భోజనం చేసినప్పుడు, వాళ్ళక్క కూడా అలాగే వద్దన్న కొద్దీ పప్పు వేసేదట. ఆమె కూడా నాలాగ కొసరి వడ్డించి తినిపించేదట. నే నలా చేస్తున్నప్పుడు అతడు సర్వం మరిచి లలితే వచ్చిందా అని ఆశ్చర్యపోతూ చూశాడట" అని కొంచెమాగింది.
"ఆ చూపులనే నీవు తిట్టావట!" నవ్వుతూ అన్నాడు రమాకాంత్.
"సర్లెద్దురూ. నన్ను చెప్పనీయండి. లలితకు కూడా నా లాగ నీలం రంగు ఇష్టమట. తెల్లచీరెలు అరుదుగా కట్టేదుట. అలాంటప్పుడు సన్నజాజులు తలనిండా పెట్టుకొనేదట. నేను నవ్వినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నాలో చాలా లలిత పోలికలే కనిపిస్తున్నవట. చిత్రమేమిటంటే అచ్చు ఇలాటి ఉంగరమే లలితకు కూడా ఉంది. ఆ ఉంగరం తను చనిపోతూ మధు వేలికి పెట్టింది. నా కీ ఉంగరం మీద ఎంత మమతో, మధుకు కూడా ఆ ఉంగరం అంటే అంత ప్రాణం."
"ఇంకా?" ఆసక్తిగా వింటున్నాడు రమాకాంత్.
"మధు బాబుకు అయిదేండ్లప్పుడు తల్లీ, తండ్రీ మరణిస్తే వాళ్ళ బాబాయిగారు లలితను, మధును తీసుకొచ్చి పెంచారట. వాళ్ళకు పిల్లలు లేరు. వీరిద్దరినీ గారాబంగా పెంచారు. ఇప్పుడు బాబాయి, పిన్నీ వాళ్ళ ఊళ్లోనే ఉంటారట. ఆస్తి వ్యవహారలన్నీ మధు చూస్తాడు. ఇద్దరి ఆస్తికి వారసుడతనే."
"లాగే వింటున్నాడు రమాకాంత్.
"మధుకు లలితంటే ప్రాణం. లలితకూ అంతే. లలితను చూస్తుంటే అతడికి అమ్మను చూసినట్లే ఉండేదట. తల్లిగా, స్నేహితురాలుగా, శ్రేయోభిలాషిగా-అన్ని విధాలా అతన్ని ఆదరించి ఒక మనిషిగా చేసింది వాళ్ళక్కే నంటాడు మధు. కాని, పాపం! వారిని భగవంతుడు చూడలేక విడదీశాడు అనిపిస్తూంది. అలాటి అక్కను పోగొట్టుకొన్న నేను దురదృష్ట వంతుడిని అంటూ వాపోయాడు."
"మరి ఇంతకూ నీ వెలా సముదాయించావ్?"
"నే నన్నాను గదా-ఇదుగో అబ్బాయ్, నేనే నీ అక్కను. ఈ రోజు నుండి నీవు నా తమ్ముడివి అని".
రమాకాంత్ లత రెండు భుజాలమీద చేతులు వేసి దగ్గరకు లాక్కుని, "ఇదుగో అమ్మాయ్, ఈ షరతుకు నే నొప్పుకోను!" అన్నాడు చిరుకోపంతో.
"ఏం? ఎందుకు ఒప్పుకోరు? మీ స్నేహితుడు నాకు తమ్ముడు కాకూడదా ఏం?"
"ఇప్పటికే ఇద్దరు పిల్లలు పుట్టి నా ప్రేమలో సగం హరించారు. ఇంకా ఈ కొత్త తమ్ముడికి కూడా ప్రేమ పంచితే ఇంక నాకు మిగిలే దేమిటి?"
.jpg)
