Previous Page Next Page 
జీవన వలయం పేజి 10


    'తన పని ఏదీ స్వంతంగా చేసుకోరు. అన్నీ నేనే అమర్చాలి. ఆయన రోజూ అయిదారు సార్లు కాఫీ తాగుతారు. ఎప్పుడడిగితే అప్పుడు నిమిషాల మీద పెట్టి ఇవ్వాలి. పెట్టినది వెచ్చబెట్టకూడదు. పెట్టి ప్లాస్కులో నిలవ ఉంచకూడదు. కాఫీ అడిగిన దగ్గర నుండి అయిందా అయిందా అని కేకలు. కాని వడపోసే వరకు ఆగడు. అందులో ఏదీ కొంచెం ఎక్కువ తక్కువ కాకూడదు. అయిందా-ఆ కప్పు, సాసరు విసిరి కొట్టారన్నమాటే. పైగా ఆ అనే మాటలను భరించలేం. ఈ రోజు అలాగే ఆఫీసునుండి రాగానే కాఫీ పెట్టాను. అది తేవటం ఆలస్యమయిందని నా ముఖాన విసిరి కొట్టాడు. అదే ఈ గాయం' అంది గడ్డం చూపుతూ. మొదటిసారిగా మానవుల్లో కూడా పశువులు ఉంటారనే సంగతి తెలుసుకున్నాను. పశువులే నయం. తమను ఆదరించే వారిని ఏమీ చేయవు. చాలాసేపు ఇద్దరం అలాగే మౌనంగా కూర్చున్నాము. తర్వాత నేను లేచాను వెళ్ళటానికి.
    'వెళుతున్నావా, లతా?' అంది దీనంగా.
    'అవు' నన్నట్లు తల ఊపాను. నాకు మాటకూడా రావటం లేదు. దగ్గరగా వచ్చి నా భుజం మీద చేయి వేసింది. నా కళ్ళలోకి చూస్తూ, 'ఈ విషయాలు ఎక్కడా అనవుకదూ?' అంది ప్రాధేయపడుతున్నట్లు.
    'నా సంగతి తెలియదా, నజ్ మా?'
    'తెలుససుకో. అయినా నా భయం నాది. నా ద్వారా బయటకు ఆయన విషయం తెలిస్తే ఈ ఇంట్లో నా పాట్లు చెప్పాలా' అని కొంచె మాగి నాతో అరుగు వరకూ వచ్చింది.
    'లతా, నే నేం చేయను?' అంది మళ్ళీ.
    'నీకు నే నేం చెప్పను, నజ్ మా! నీ బుద్ధి, నీ సంగతి లన్నీ నాకు చిన్నప్పటినుండీ తెలుసు. నీ గుణాలతో నీకున్న ఆత్మాభిమానమ ఉత్ర్కుష్టమైంది. అలాటి నీవు ఈ అవమానాన్ని ఎలా సహిస్తున్నావా అని ఆశ్చర్యపోతున్నాను.'
    'కాలము, పరిస్థితులే మనుష్యులను మారుస్తాయి. సరే, ఇక్కడ ఆగు' అంది నడుస్తున్న నాతో నేను ఆగి ఆమె ముఖంలోకి చూశాను.
    'ఈ ఇంట్లో ఈ మెట్లు దాటి ఒంటరిగా ఇవతలకు రావటానికి నా పతి దేవుల అనుజ్ఞలేదు. క్షమించు. ఇక వెళ్ళు.' పేలవంగా నవ్వుతూ అంది.
    "నజ్ మా!' స్థాణువులా బిగిసిపోయాను నేను.
    ఇంటికి వచ్చిన తరవాత కూడా నా కా మాటలే మాటి మాటికి జ్ఞాపకం వచ్చినాయి. తన ఇంట్లో, తన తోటలో నడిచే అర్హత, దొడ్లో తిరిగే స్వతంత్రం ఆమెకు లేవని తెలిసినప్పుడు ఏ స్త్రీమాత్రం ఎలా ఓర్చుకోగలుగుతుంది? స్నేహితురారాల్ని గేటువరకు సాగనంపే స్వతంత్రం లేని నజ్ మా మీద జాలి కలిగినా, ఆ మరుక్షణమే ఆ పతి దేవుని ఆనతి అక్షరాల పాటిస్తున్న ఆమె నిజాయితీ పై కోపమే వచ్చింది. ఆ తర్వాత తరుచూ నజ్ మా దగ్గరకు వెళ్ళేదాన్ని. ఒకసారి -
    'నా వాళ్ళందర్నీ వదిలి వచ్చావా, లతా! ఎవరూ ఎప్పుడూ ఇక్కడకు రాలేదు. మొన్న బాబ్యి చాల రోజులకు మా ఇంటికి వచ్చాడట. నన్ను చూడాలని అన్నయ్యను వెంట పెట్టుకు వచ్చాడు. అన్ని రోజుల తర్వాత అన్నయ్యను, బాబాయిని చూసి ఎంత ఆనందించావని. కాని, వారికి ఒక కప్పు టీ కూడా ఇవ్వలేక పోయాను' అంది. 'ఎందువల్ల?'
    'ఏం చెప్పను? బాబాయి నా తల నిమురుతూ నేను చేసిన పనికి పశ్చాత్తాప పడకుండా ధైర్యంగా ఉండమని అనునయిస్తున్నారు. అంతలోనే ఆయన వచ్చారు. బాబాయిని పరిచయం చేయబోయాను.    
    "ఈ తురక మేళం నా కెందుకు?" అంటూ విదిలించి లోపలకు వెళ్ళిపోయాడు. అవమానంతో బాబాయి వెళ్ళారు. అన్నయ్య "చెల్లీ! ఈ ఇంట్లో నీ స్థానమెంతో ఆయన అన్న ఈ ఒక్క మాటలోనే తెలిసిందమ్మా?" అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకొన్నాడు. వారు వెళ్ళిపోయిన తరవాత ఇక ఈయన చిందులు మొదలు పెట్టారు.' 'దేనికి?'
    'నేను లేనప్పుడు ఇలా మగవాళ్ళందరితో మాట్లాడతావా? అందర్నీ ఇలా రాసుకు పూసుకు' తిరుగుతావా?' అని ఒకటే కేకలు. అందులో పరాయివా రెవరండీ-బాబాయి, అన్న కదా వచ్చింది అంటే; వాళ్ళు మగవాళ్ళా కాదా అని హుంకరింపు. ఇక నేనేం చెప్పను? ఇంతనీచంగా ఆలోచించే మనుష్యులుంటారని నీ కెలా చెప్పను? నే నెవరికీ-మగవారికి కనిపించకూడదు. మాట్లాడకూడదు. అసలు నేను మాట్లాడే మగవారెవరున్నారు గనక. బట్టలు కుట్టే దర్జీ, ఇంట్లో జవాన్లు-వారితో కూడా మాట్లాడటం మానివేశాను.'    
    'అవును. అతని మాటలకు వంత పలుకుతూ ఉండు. నీ మెత్తతనమే అతడి నిలా చేస్తూంది. నీ వెక్కడి కక్కడ ఎదురు తిరిగి జవాబు చెప్పు. అప్పుడు తానే లొంగుతాడు.'
    'నీకు తెలియదు, లతా; ఎదురు చెప్ప నక్కరలేదు. కనీసం నెమ్మదిగా జవాబు చెప్పినా ఫలితం ఘోరంగానే ఉంటుంది. ఇటు చూడు.' మోకాలిమీద పెచ్చు లేచి పోయి పుండు పడిన దెబ్బ చూపింది. నే నలాగే చూస్తున్నాను.
    'ఆఫీసు వాళ్ళతో పిక్ నిక్ కు వెళతానని అయిదు గంటలకు లేపమని చెప్పారు. నేను లేవగానే తయారయ్యారు. అంతలో  వారి బాబాయి వస్తే వారితో బయటకు వెళ్ళబోతున్నారు. పిక్ నిక్ సంగతి గుర్తు చేశాను. అంతే, టేబుల్ మీది పేపరు వెయిట్ బలంగా నా కాలికి తగిలింది. నేను బయటకు వెళుతుంటే నన్ను శాసిస్తావా అని నానా మాటలు అని వెళ్ళారు' అని చెప్పింది. మరొక సారి - 'లతా, ప్రతి సాయంత్రం రాగానే ఆయన పని వాళ్ళను ఇంటికి ఎవరు వచ్చారని అడుగుతున్నారు. నా స్థితి ఎంత హీనమయిందో చూశావా? ఇంత అనుమానించే మనిషితో ఎలా కాపురం చేయాలి? అందుకే నే నొక మార్గం ఆలోచించాను, లతా' అంది. 'ఏమిటది?'
    'ప్రపంచం నుండి శాశ్వతంగా తప్పుకోవటం.'
    'నజ్ మా!'
    'అవును, లతా! ఈ విధంగా నన్ను అనుమానిస్తూ నాకు శాంతి లేకుండా చేసి, వారు మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నారు. ఇన్ని రోజులనుండి ఎన్నో అవమానాలను, అవహేళనలను సహించాను. కాని....దీని నెలా సహించను? నీ శీలాన్ని ప్రాణంకంటే ఎక్కువగా చూసుకుంటామో ఆ శీలాన్ని కట్టుకొన్న భర్తే అనుమానించినప్పుడు ఇక ఆ ఆడది బ్రతకటం అనవసరం.' లత ఆవేశంగా చెపుతూంది.
    'నా మతాన్ని తూలనాడితే సహించాను. నా సహనాన్ని పరీక్షించినా ఓర్చాను. నమాజు చేస్తున్నప్పుడు కుక్కను తెచ్చి నా ఒళ్ళో వేసినా మారు మాట్లాడలేదు. ఆ రోజునుండి నమాజు మానివేశాను. దేవుడిముందు దీపం వెలిగించమంటే భగవంతుడు ఒక్కడే అన్న దృష్టితో వెలిగించాను. నా మతం, నా కులం అన్న అభిమానం వదిలి నేనే ఆయనకు అర్పిత మయ్యాను. నా అలవాట్లన్నీ మార్చుకొన్నాను. ఇంకేం చెయ్యను నేను? పెళ్ళికి ముందు చెప్పిన కబుర్లు, చేసిన వాగ్ధానాలు అన్నీ గాలిలో తేలిపోయాయి. ఇప్పుడు ఆయనకు నా మీద మిగిలింది ద్వేషం, అనుమానం మాత్రమే. ఏ స్త్రీ వీటిని తన భర్త నుండి కోరదు.' ఆ రోజు నే నామెకు ఎంతో నచ్చచెప్పి ఏ పరిస్థితిలోను ఆత్మహత్య చేసుకోకుండా వాగ్ధానం తీసుకొన్నాను. ఆ తరవాత చాలాసార్లు నజ్ మాతో అతనికి విడాకులిమ్మని, మళ్ళీ వివాహం చేసుకోమని చెప్పాను. మహమ్మదీయ స్త్రీ లకు కొన్ని చక్కటి సదుపాయాలు ఉన్నాయి. భార్యాభర్త లకు మనస్పర్ధలు కలిగినప్పుడు వారు తెగతెంపులు చేసుకుని మళ్ళీ వివాహం చేసుకునే పద్ధతి మన కంటి ముందు ఎప్పటినుండి అమలులో ఉంది. కాని, నజ్ మా అలా ఒప్పుకోలేదు.
    'నా తనువు, మనస్సు ఏ నాడో ఆయనకు అర్పించాను. తిరిగి వానిని తీసుకోవటం నా తరం కాదు.' అంది. మరొకసారి వెళ్ళినప్పుడు - ప్రభాకర్ పినతండ్రి, మేనమామ తరుచు వచ్చి ప్రభాకర్ ను నజ్ మాతో సంబంధం తెంచుకు వచ్చేయమని చెపుతున్నారని, అతడుకూడా నీ వల్ల నా వాళ్ళందరికీ దూరమయ్యానని ఒకటే సాధిస్తున్నాడని చెప్పింది.చివరకు ప్రభాకర్ బంధువులు కోరినంత డబ్బు ఇస్తామని, అది తీసుకొని నజ్ మాను వెళ్ళి ఎక్కడైనా ఉండమని కోరారట. ఇవన్నీ వింటూంటే లోకంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో, వారి మనస్తత్వాలు ఎంత చిత్రంగా ఉంటాయోనని ఆశ్చర్యపోయాను. ప్రభాకర్ ఎంత సేపూ తన సంగతే ఆలోచిస్తాడు కాని, నజ్ మా త్యాగం ఆలోచించడు. పైగా ఆమె కోపం ఎన్నో బాధలు పడుతున్నట్లు నటించి ఆమెనే హింసిస్తున్నాడు. నజ్ మా మానసికంగానే కాకుండా శారీరకంగాకూడా చాలా చిక్కిపోయింది. పై జామా, ఫ్రాకూ వేసుకుని, సన్నని ఓణీ ముందు భాగాన కప్పుకొని, రెండు పొడుగాటి జడలతో ఒకప్పుడు మెరుపుతీగలా మెరిసిపోయిన నజ్ మా మొఘలు రాణీలను గుర్తుచేసే నజ్ మా-నేడు చిక్కి శల్యమై లోతుకు పోయిన కళ్ళతో, గూడు కట్టుకొన్న విషాద ముఖంతో చూసేవాళ్ళకే కళ్ళలో నీరు తిరిగేటట్లు చేస్తూంది.

                               *    *    *

                  

    ఒక రోజు నే వెళ్ళేటప్పటికి నజ్ మా మామిడి కాయముక్కలు ఉప్పుకారంలో నంజుకు తింటూంది. నన్ను చూసి సిగ్గుపడి నవ్వి దాచేసింది. నేను అనుమానిస్తూ సంగతేమిటని అడిగాను. ఆ విషాదచ్చాయ లలుముకొన్న ముఖంలో వెలుగురేఖలా ఒక నవ్వు నవ్వింది.
    'నేను తల్లిని కాబోతున్నాను.' ఆనందంగానే చెప్పింది.
    నే నాశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేశాను. 'ఆయనకు తెలుసా?' అన్నాను కొంచె మాగి.
    'చెపుతాను. కూర్చో మొదటిసారిగా మాతృత్వం పొందుతున్న స్త్రీ ఆనందం ఎలా ఉంటుందో, అది ఎంత మధురమైన అనుభూతో అనుభవించి కాని తెలుసుకోలేం. రాత్రి ఆయన నన్ను దగ్గరకు తీసుకొన్నప్పుడు ఈ ఆనందం ఆయనతో పంచుకోవాలని చెప్పాను. ఫలితం ఏమిటో తెలుసా? ఒక్క తోపు తోశారు నన్ను. "ఇదేం మహా సంతోషించదగ్గ వార్త అనే చెపుతున్నావా? ఇప్పటికే నీ ఏడుపుతో చస్తున్నాను. ఇంకా పిల్లలు, మేళం, ఏడ్పు, గోల....ఛీ.... ఛీ!" అంటూ విసుక్కొని గదిలోనుండి వెళ్ళిపోయారు. ఏం చెప్పను? నా స్థితి, నా బాధ...' ఎన్నోకథలు చదువుతున్నాం. మరెందరినో చూస్తున్నాం. కాని తొలిసారిగా తండ్రి కాబోయేవారు ఇలా ప్రవర్తించటం నే నెక్కడా చూడలేదు. వినలేదు. అసలు ఆ మనిషి తత్త్వం ఏమిటి? అతని ఉద్దేశ్యం ఏమిటి? నజ్ మా పై ఏమాత్రం కనీసం జాలి, కనికరం ఉన్నా ఇలా ప్రవర్తించడనిపించింది. పాపం, నజ్ మా! తన వారిని ఎదిరించి, అందరినీ వదులుకొని అతడి కోసం వచ్చింది. అలాటి త్యాగమూర్తిని, ప్రేమమూర్తిని ఆదరించే విధాన మిదేనా?
    ఇంకొకసారి నేను వెళ్ళేటప్పటికి ప్రభాకర్ ముందు వరండాలో కూర్చుని ఉన్నాడు నన్ను చూసి "రండి, రండి. మీ స్నేహితురాలికి ఒంట్లో బాగుండలేదు" అని ఆహ్వానిస్తూ మాట్లాడి లోపలకు తీసుకెళ్ళాడు. నజ్ మా నీరసంగా పడుకొంది. తరవాత చెప్పింది నజ్ మా-రాత్రి అన్నం వడ్డించి పక్కన కూర్చుందట. అన్నంలో రాయి వచ్చిందని ఇష్టం వచ్చినట్లు ఆమెను కొట్టి తోశాడట. ఆ తోయటంలో మెట్లమీద జారి పడిందట. మళ్ళీ లేకలేకపోయింది. అతడే పడుకో బెట్టి డాక్టరుకు ఫోను చేశాడట. ఆమె ఈ గర్భం నిలవదని చెప్పింది.
    'లతా, కారుమబ్బులు కమ్మిన నా జీవితం ఈ ఒక్క వెలుగురేఖతోనైనా నన్ను మనిషిగా చేస్తుందని ఆశించాను. కాని భగవంతుడు నా కా ఆనందంకూడా దక్కించలేదు.'
    'అసలు నేను చెపుతూనే ఉన్నానండి, నువ్వు పని చేయవద్దు అని. వింటేనా? తన కేం తక్కువ? చక్కగా మనుష్యులతో చేయించుకోవచ్చు. అబ్బే, వినదే! అన్నీ తనే చేయాలంటుంది. ఇప్పుడు చూడండి. పడటం వలన ఎంత బాధపడుతూందో! ఆమె నిలా వదిలి నే నాఫీసుకు ఎలా వెళ్ళను చెప్పండి' అంటూ ఆప్యాయం ఒలకబోస్తూ వచ్చాడు ప్రభాకర్. 'ఎంత చక్కటి నటన!' అనుకొన్నాను.
    వారం రోజుల తరవాత నజ్ మా అన్న మా ఇంటికి వచ్చాడు. అదీ ఇదీ మాట్లాడిన తరవాత వాళ్ళ బాబాయి ఎంతో నచ్చచెప్పిన తరవాత వాళ్ళ నాన్న నజ్ మాను తీసుకురావటానికి ఒప్పుకొన్నారని సంతోషంగా చెప్పాడు. మేముకూడా ఎంతో ఆనందించాం. నా మట్టుకు నాకు ఏదో కొద్ది రోజులైనా నజ్ మా ఆ సంసార కూపం నుండి తప్పుకొని పుట్టింట్లో ప్రశాంతంగా గుండెలనిండా గాలి పీల్చుకొంటుంది గదా అని సంభ్రమపడ్డాను. రంజాన్ పండుగ దగ్గరకు రాగానే నజ్ మాను పుట్టింటికి తీసుకువస్తున్నారని విన్నాను. పండుగ రెండు రోజులు ఉందనగా నజ్ మా వాళ్ళమ్మ సినిమాలో కనిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS