Previous Page Next Page 
అపస్వరం పేజి 9


    మీర ఎస్సెల్సీ పరీక్షలో రాష్ట్రానికి ప్రధమరాలుగా ఉత్తీర్ణురాలయింది. కృష్ణయ్యగారు గోపాలం పాసయిన రోజుకన్నా ఎక్కువ సంతోషపడ్డారు, కానీ, పరీక్షా ఫలితాలు తెలిసినప్పటినుండి, కమలమ్మగారి పోరు అధికమయింది.
    "ఇక మీర చదువు ఇంతటితో కట్టి పెట్టాల్సిందే. ఏదో ఓ సంబందం చూడండి" అంటూ వేధించుకు తినసాగారు.
    "నువ్వన్నట్టే కాని. పెళ్ళి సంబంధాలు చూస్తాను. కాని మంచి సంబంధం దొరికే దాకా మీర చదువు మాత్రం ఆపాను" అన్నారు కృష్ణయ్య గారు.
    "వద్దండీ, నా మాట వినండి. మీర చదివి ఉద్యోగం చేయాలా, వూళ్ళేలా? ఈ కాలంలో ఆడ పిల్లలు చదివి చదివీ నీరస పడిపోతున్నారు. మీర నింక చదివించకండి."
    కాని, కృష్ణయ్యగారు, కమలమ్మగారి మాటలు ఏ మాత్రం ఖాతరు చెయ్యలేదు.
    మీర మహారాణీ కాలేజీలో చేరింది. మీర స్నేహితురాలు రాజేశ్వరీ, నర్మదా, చంపా కూడా కాలేజీలో చేరారు. ప్రాక్టికల్ క్లాసుల కోసరం, ఆడ పిల్లలు అబ్బాయిల కాలేజీకి వెళ్ళవలసి వచ్చేది. అప్పుడంతా అబ్బాయిల కాలేజీకి వెళ్ళవలసి వచ్చేది. అప్పుడంతా అబ్బాయిల ప్రవర్తన, ఆడ పిల్లల గురించిన వాళ్ళ విసుర్లు, మీరకు అసహ్యాన్ని కలిగించేవి. నర్మదతో కల్సి, ఇంటి నుండి బయట దేరితే, దారి పొడుగునా 'కర్లీ లాక్స్', 'రాజహంసి' అన్న మారు పేర్లు విని విని అలవాటయి పోయింది, మీరకు.
    ఉంగరాల జుత్తు మీరది. చిన్న చిన్న ముంగురులు దువ్వినా నిలువక నుదిటిని ఆక్రమించుకొనేవి. జడ పొట్టిగా ఉన్నా నల్లగా లావుగా ఉండేది. ఉంగరాల జుత్తు ఆమె మొహానికి అపూర్వమయిన లావణ్యాన్ని తెచ్చిపెట్టింది.
    నర్మద మీరకన్నా తెల్లగా ఉన్నా కాంతిలేని మొహం, కళ్ళు అబ్బాయిలను ఆకర్షించేవి కావు. ఎప్పుడూ ఉత్సాహం తొణికిసలాడే మీర మొహమూ కళ్ళూ అబ్బాయిలని ఎక్కువగా ఆకర్షించేవి. మీరనే ఏడిపిస్తూ ఉండేవారు. కాని, మీర దేనినీ పట్టించుకునేది కాదు.
    అన్నిటిలోను ముందంజ వేయటం, ధైర్యము, చలాకీతనం, ఇవన్నీ మీరకు పుట్టుకతో వచ్చిన విద్యలు. ఒక్క నిమిషమయినా సరే ఏ పనీ లేకుండా ఉండటమంటే విలవిల లాడి పోయేది మీర మనసు. ఆమె ఉత్సాహాన్ని చూసి కాలేజి ఉపాధ్యాయినులంతా ఎంతగానో మెచ్చుకొనేవారు.
    క్రీడారంగంలో తనే ముందు. ప్రతి నాటకం లోనూ ప్రధాన పాత్ర మీరదే. కాలేజీ యూనియన్ సెక్రటరీ, మీర. మీరలేనిదే ఏ పనీ కూడ సక్రమంగా జరిగేది కాదు, తన చుట్టూ స్నేహితులతో కలసి, నిమిషం తీరిక లేక కబుర్లు చెప్పుతూ అందరినీ నవ్విస్తూ, నవ్వుతూ గడిపే మీర స్నేహస్వభావం అందరినీ ఆకర్షించేది.
    పదిహేను రోజుల సెలవులో గోపాల్ ఇంటికి వస్తున్నాడన్న సంగతి, ఇంట్లో అందరినీ సంతోష పరిచింది. గోపాల్ వచ్చే రోజున శ్రీపాదు, శ్రీహరులతో కలసి మీర స్టేషన్ కు వెళ్ళింది.
    రైలు ఆగగానే మీర కళ్ళు గోపాల్ కోసం వెతకసాగాయి. గోపాల్ నవ్వుతూ కిందికి దూకాడు. రాధ నెమ్మదిగా రైలు దిగింది.
    "కులాసాగా ఉన్నారా వదినా?"
    "ఊఁ"
    "రాధా, మీరను చూశావ్ ఎంత పొడుగెడిగిందో! మనం వెళ్ళినపుడు పరికిణీల పిల్ల చీర కట్టుకుని తయారయింది." అంటూ మీర పొట్టి జడ లాగాడు గోపాలం.
    "ఆహా. చాలా పొడుగయి పోయానులే."
    "లేదు, లేదు, ఇలాగే పెరిగితే, తాడి చెట్టులా తయారవుతావ్"
    "ఇంట్లో దెబ్బలాడుకోవచ్చు కాని, బయలుదేరండి" అంటూ హెచ్చరించాడు, శ్రీహరి.
    కృష్ణయ్య గారు, వీరి కోసం ఎదురు చూస్తూ, తలుపు దగ్గరే నుంచున్నారు. మామగారిని చూసి రాధ పక్కగా ఒదిగి నుంచుంది.
    "కులాసాగా ఉన్నావా, అమ్మా?"
    "ఊఁ" అంటూ రాధ సంకోచంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది.
    "చిక్కిపొయ్యావురా గోపీ" అంటూ కమలమ్మ గారు ప్రేమతో కొడుకు తల నిమిరారు. ఆమెకు అందరిలో గోపాలం అంటే, అభిమానం ఎక్కువ. ఇదే మొదటిసారిగా దూరంగా ఉండి వచ్చిన కొడుకును చూసి, ఎన్నో ఏళ్ళయినట్టనిపించిందామెకు.
    అన్నయ్య వచ్చిన సంతోషంలో మీర కాలేజీకి వెళ్ళాలన్న మాటే మరచి, కబుర్లు చెబుతూ కూర్చుండిపోయింది. మాటల మధ్యలో గోపాల్.
    "నీ కేమిటమ్మా కాలేజి కుమారివి" అంటూ ఏడిపించాడు.
    "నువు నేర్పిందేకదన్నయ్యా?"
    "ఇంటరయ్యాక ఏం చేస్తావు మీరా?"
    "మెడికల్ కాలేజీలో చేరుతాను." ఉత్సాహంతో అంది మీర.
    "ఓసి, నీ కెంత జ్ఞాపకమే. చిన్నప్పుడెప్పుడో అనుకున్నదీ ఇంకా మరచి పోలేదన్న మాట."
    "అది మరువలేని ఆశన్నయ్యా" ఆ కోర్కె నా మనసులో నిలచి పోయింది. నువ్వు నా మనసులో నాటిన కోరిక, నెవేళ్ళు పాతుకొని పోయింది."
    "నీ కోర్కె సఫలం కాని" అంటూ ఆశీర్వదించాడు, గోపాలం.
    త్వరలోనే తల్లి కాబోతున్న రాధ రెండు రోజుల అత్త వారింట్లో ఉందిడి, పుట్టింటికి వెళ్ళి పోయింది. గోపాల్ అత్తవారింట్లో కాస్సేపు, తనింట్లో కాస్సేపు గడుపుతూ కాలక్షేపం చేశాడు.
    బొంబాయి నుండి మీర కోసం ఎర్రటి కొంగున్న తెల్ల జార్జెట్ చీర తెచ్చాడు. మీర చీర చూసి,
    "ఎంత బావుందన్నయ్యా! నీ సెలక్షన్ అంటే ఇక చప్పక్కర్లా" అని మెచ్చుకునే దాకా అతనికి తృప్తి లేదు.
    మీర ఆ చీరకట్టుకొని హంసలా నడచివచ్చి
    "ఎలా ఉందన్నయ్యా?" అని అడిగి "నువ్వు కట్టుకుంటే ఇక చెప్పాలా?" అనిపించుకొన్నప్పుడే ఆమెకు తృప్తి.
    పదిహేను రోజులు నవ్వుతూ తృళ్ళుతూ వెళ్ళి పోయాయి. శలవులయిపోగానే, బొంబాయి వెళ్ళిపోయాడు గోపాలం. తరువాత రెండు నెలలకు రాధ మగపిల్లవాడిని కన్నది. సుబ్బారావుగారు మనవడి బారసాలకు, రావలసిందిగా అల్లుడికి ఆహ్వానం పంపారు. కాని సెలవు దొరక నందువల్ల గోపాలం రాలేక పోయాడు. రాధ కోరిక ప్రకారం బిడ్డకు కిశోర్ అని పేరు పెట్టారు.
    ఒక శనివారం మీరకు కాలేజీకి సెలవు. మీర "హూదిన ఆసె" (పుష్ప కాంక్ష) అన్న కన్నడ నాటకంలోని నాయిక మాటలను బట్టి పడుతోంది.
    "మీరా...."
    పెదనాన్న గొంతు విని లేచి కూర్చుంది మీర.
    "ఏమిటి పెదనాన్నా?"
    కృష్ణయ్యగారు చెప్పులు తొడుక్కుంటూ.
    "బజారుకు వెళ్ళొస్తాను. ఓ సంచీ తెచ్చి పెట్టమ్మా" అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS