"సుబ్బారావుగారున్నారా?"
"లేదు ఇపుడే వస్తారు కూర్చోండి" అంటూ సోఫావేపు చూసింది. గోపాలం కూర్చున్నాడు.
"అందాకా చదువుతూండండి"
రాధ 'ఫిల్మ్ ఇండియా' ఇబ్బంది. గోపాలం ధైర్యం తెచ్చుకొని, తలెత్తి సూటిగా ఆమె మొహంలోకి చూశాడు. ఫిల్మిండియాలోని అందగత్తెల కన్నా, సజీవంగా నుంచున్న లావణ్యవతి అందం అతడిని ముగ్ధపరిచింది.
"కాలేజీలో చదువుతున్నారా?"
"ఊ...."
"ఏ క్లాసు?"
"సీనియర్ ఇంటర్"
"ఆప్షనల్స్ ఏం తీసుకున్నారు?"
"పి.సి.యం"
"నిల్చొనే ఉండి పోయారు. కూర్చోండి."
రాధ సిగ్గుపడుతూనే, తలుపువేపోసారి చూసి, కూర్చీ మీద కూర్చుంది.
"పరీక్షకు బాగా చదువుతున్నారా?"
"ఎక్కువగా లేదు.... ఏదో మామూలుగా.. .. అంతే"
"సుబ్బారావుగారు, మీకే మవుతారు?"
రాధ సన్నగా నవ్వి, "మా బావ" అంది. గోపాలం మొహం నిరాశతో నల్లబడింది.
"అలాగా...... నేను...... వారమ్మా యనుకున్నా"
"అమ్మాయా? బయటికి వెళ్ళింది ఇపుడే వస్తుంది."
"క్షమించండి.. గోపాల్.." అంటూ లోపలికి అడుగు పెట్టారు, సుబ్బారావుగారు రాధ మెరపులా మాయ మయింది. గోపాలం కంగారుగా చూశాడు.
"నేను రావటం ఆలస్యమయింది. ఏమీ అనుకోకండి. మా అమ్మాయి మాట్లాడిందా మీతో? కాని తగని సిగ్గు రాధకు....."
నల్లబడిన గోపాలం మొహంలో మళ్ళీ కాంతి వచ్చింది. అనుకోకుండానే అడిగాడు "ఆ అమ్మాయేనా, రాధ?"
"అవును మా పెద్దమ్మాయి. రాధా, కాఫీ తీసుకు రామ్మా"
రాధ ట్రేలో రెండు కప్పుల కాఫీ పట్టుకొచ్చింది. తండ్రి ముందో కప్పుంచి, గోపాలం ముందు కాఫీ కప్పుంచేటపుడు తండ్రి చూసిపోతాడేమోనని, తల పైకెత్తకుండా కళ్ళు మాత్రం పైకెత్తి, గోపాలం వేపు చూసింది. గోపాల్ సుబ్బారావుగారు చూస్తారేమో నన్న సంకోచమే లేకుండా, తదేకంగా రాధ ముగ్ధలావణ్యాన్ని తిలకిస్తున్నాడు. రాధ తన వేపు చూడగానే, చిరునవ్వు నవ్వాడు.
"మీకు నచ్చానా నేను?" అని ఆమె కళ్ళు మవునంగా ప్రశ్నించాయి.
"ఆ మాట చెప్పాల్సింది నువ్వే" అని గోపాలం కళ్ళు ప్రత్యుత్తర మిచ్చాయి.
తన ప్రశ్నకు జవాబు దొరకగానే, రాధ తల వంచుకుని, గంభీరంగా అక్కడి నుండి వెళ్ళి పోయింది. రాధను వెంబడిస్తున్న గోపాలం మనసుకు, తమ ప్రశ్న పరంపరలతో ఇటు వేపులాగారు. సుబ్బారావుగారు. ఆయన ప్రశ్నల కన్నిటికీ పరధ్యానంగానే జవాబు చెబుతూ, చుట్టూ చూస్తున్నాడు గోపాలం. గాలికి తెర కదిలిన చప్పుడైనా గబుక్కున తిరిగి చూస్తున్నాడు.
"ఇక నేను వెళ్ళొస్తానండి" అంటూ ఇంటికి బయల్దేరుతున్న గోపాలం కళ్ళు, చుట్టూ ఎవరి కోసమో వెతుకుతున్నాయి.
గోపాలం ఇంటికి వచ్చేసరికి, ఏడయింది.
కృష్ణయ్యగారు కొడుకు రాకకు ఎదురు చూస్తు వరండాలోనే కూర్చున్నారు.
"ఏమన్నారు గోపీ, డాక్టరుగారు?"
"ఉత్తరం రాసి రికమెండ్ చేస్తానన్నారు. నాన్నా" అంటూ తన గదిలోకి వెళ్ళాడు. కోటు తీసి మంచం మీద పడవేశాడు. కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకొని,
"అందమైన..... చిన్నది.
నన్ను చూసి రమ్మన్నది.
మెరసి మాయమైనది
ఎక్కడున్నదో..... గాని"
అంటూ పాడుకుంటున్నాడు.
"సుబ్బారావుగారింట్లో ఉన్నది" అంటూ బదులు చెప్పింది మీర గోపాల్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా నవ్వుతూ నుంచుంది మీర.
"ఎలా ఉందన్నయ్యా రాధ? పూతన....."
"మీరా నిన్నేం చెయ్యాలో తెలుసా?"
'ఏం చెయ్యాలేం?"
"పట్టుకు తన్నాలి"
"మధ్య నేనేం చేసే నేమిటి?"
"ఏం చేశావా? రాధ ఆ పేరే మధురం. పేరు కన్న రాధ మరింత సుందరి. ఆమె మాటలు, అతి మధురం....."
"వూరుకో అన్నయ్యా. నువ్వెవర్ని చూసి ఎవరనుకున్నావో రాధను మాత్రం కాదు."
"చూడు, మీరా ఈ మగవాళ్ళ మనసు అతి మెత్తనిది. పెళ్ళి వద్దని ఎగిరానా, నేను వెళ్ళేసరికి డాక్టరుగారు ఇంట్లో లేరు. రాధే వచ్చి తలుపు తీసింది...."
"ఓ అర్ధమయింది. నీ హృదయం కరగి ఆమె పాదాల వద్ద ప్రవహించింది. అంతేనా?"
"ఇంచు మించు అంతే అనుకో కాని నాకు టోపీ వేసింది మరి. డాక్టరుగారు తనకు బావగా రవుతారని చెప్పింది."
"ఓ, అపుడే ప్రణయ సంభాషణ కూడా అయి పోయిందన్న మాట."
"ఇంకా చెప్పేది వినవేం. డాక్టరుగారు చాలా తెలివైనవారు. నేను వెళ్ళేసరికి, ఆయన కావాలనే ఇంట్లో, లేరు. కావాలనే, రాధను పంపించారు తలుపు తియ్యటానికి. అంతా తెలిసి కూడా నేను వల్లో పడ్డాను."
"అయ్యో పాపం! నిన్ను చూస్తే జాలేస్తుందన్నయ్యా. ఎంత కష్ట మొచ్చింది, నీకు...."
"కాని..... మీరా..... రాధ! ఏం బ్యూటీ అంటావు"
"అమ్మ బాబోయ్! రాధ బ్యూటీ వర్ణించటం మొదలెడితే నువ్వు ఆ పేటట్టు లేవు. నేను వెళ్ళి పోతున్నా" అంటూ బయటికి పరిగెత్తింది, మీర.
కాసేపటికి రాధ నిర్ణయం తెలుసుకొని వస్తామని కబురు చేశారు సుబ్బారావుగారు. మీర ఎంతో ఉత్శాహంతో ఇల్లంతా సర్దింది. శ్రీపాదు మీర వెంట తిరుగుతూ, సాయపడ్డారు. కమలమ్మగారు, తమ కాబోయే వియ్యంకుల కోసం, బజ్జీలు, కేసరీభాత్ చేశారు.
సాయంకాలం నాలుగింటికి సుబ్బారావుగారు, కావేరమ్మ గారు, రాధ, నర్మదా వచ్చారు. గోపాల్ ను ఆకర్షించి మెప్పించిన రాధ పెద్దల మెప్పుదలను కూడా పొందటానికి అనువుగా, నీలం రంగు పట్టు చీర కట్టుకొని, తెల్లటి జాకెట్టు వేసుకుంది. ఒక్క జడ వేసుకుని, తల్లో పూలు పెట్టుకొని, నిండుగా ముస్తాబయింది.
మీర అందరికి కాఫీ టిఫిన్లు అందించింది. గోపాల్ నెమ్మదిగా మీరను పిలిచి,
"మీరా, రాధకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని కనుక్కోవాలి. ఎలాగా?"
మీర కొంటెగా, "దానికేం నేను కనుక్కొని చెబుతాలే." అంది.
"ఆహా.... అది కాదు, నేనే అడుగుదామని...."
మీర నవ్వి, "అల్లాగేలే, మల్లె పందిరి దగ్గరుండు. తీసుకొస్తాను" అంది.
"రాధ ఒక్కత్తెనే తీసుకురావాలి"
"నన్నూ రావద్దంటావా?"
"నువ్వు రావచ్చులే ఇంకెవరూ లేకుండా చూడు."
మీర రాధ దగ్గర కూర్చొని, "ఇంకాస్త కేసరీ భాత్ తీసుకు రానా?" అంది.
"వద్దు మీరా, ఇదే ఎక్కువయింది."
మీర కావేరమ్మ, నర్మదల వేపు చూసింది. వాళ్ళింకా నెమ్మదిగా తింటూ ఉండటం గమనించి రాధ చెయ్యి కడుక్కుందువుగానీ" అంటూ లేచింది. మల్లె పందిరి పక్కనే ఉన్న పంపు దగ్గరకు దారి తీసింది. రాధ చెయ్యి కడుక్కుని జేబు రుమాలుతో చెయ్యి తుడుచుకుంటూ "మీరా ఎన్ని మొక్కలు వేశావ్?...." అంటూ వెనక్కు తిరిగింది. మీర పక్క నవ్వుతూ నిల్చున్నాడు. గోపాల్. రాధ సిగ్గుతో తల వంచుకుంది.
ఇద్దరూ మవునంగా నుంచోవటం గమనించి, మీర.
"అన్నయ్యా, అడగాల్సిందేదో త్వరగా అడుగు" అంటూ తొందర పెట్టింది.
"నేను మీకు నచ్చానా?" అన్నాడు గోపాల్ రాధ బదులు చెప్పలేదు.
"త్వరగా చెప్పండి. ఎవరన్నా వస్తారిక...." మీర అంది.
"ఊఁ..మరి.....నేను....మీకు..." గోపాల్ బదులు చెప్పనవసరం లేకుండానే మీదే ధ్యాస" అంది,
రాధ గోపాలం పెళ్ళి నిశ్చయించాడు, పెద్దలు. ఓ శుభ ముహూర్తంలో వాళ్ళిద్దరూ భార్యా భర్తలయ్యారు.
పెళ్ళయి, నెల తిరగక మునుపే గోపాలానికి బొంబాయిలో ఉద్యోగం దొరికింది. తమ రెకమండేషన్ పని చేసినందుకు, బ్రహ్మానంద పడ్డారు, సుబ్బారావుగారు. గోపాలం భార్యా సమేతంగా బొంబాయికి ప్రయాణ మయ్యాడు.
గోపాలం దూరంగా వెళ్ళిపోవటం మీర ఎంత బాధ పడుతుందో, అతనికి కూడా బాగా తెలుసు. లోలోపల తన బాధ నణచుకొని, నవ్వుతూ తిరుగుతున్న మీర పొట్టి జడలాగి, నవ్వుతూ.
మీరా ఎక్కడున్నా మనిద్దరం స్నేహితులమే దూర మున్నంత మాత్రాన, మన స్నేహలత వాడిపోదుగా. అప్పడప్పుడూ ఉత్తరాలు రాస్తూ ఉండు." అని ధైర్యం చెప్పాడు. అందరిని వదలివెళ్ళటం అతనికి కష్టంగా ఉన్నా, నవ వధు సామీప్యం అతనిలో క్రొంగొత్త ఉల్లాసాన్ని, రేకెత్తించింది.
