మీర లేచి వెళ్ళి ఒక సంచి తెచ్చి ఇచ్చింది.
"తలుపేసుకో" అంటూ బయటికి వెళ్ళారు కృష్ణయ్యగారు. బజారులో కూరగాయలు కొని, మనవడి కోసం దోమతెర కొనుక్కొని ఇంటి దారి పట్టారు.
ఎండ మండిపోతోంది. మొహంలోని చెమటను తుడుచుకొంటూ, సందుమలుపు తిరిగారు, కృష్ణయ్యగారు ఎదురుగా వస్తూన్న వ్యక్తిని చూసి, ఒక్క నిమిషం ఆగారు. అతనూ కృష్ణయ్య గారి వైపే చూస్తూ, ముందుకు వెళ్ళాడు. కృష్ణయ్యగారు సందేహిస్తూనే పిలిచారు.
"మీరు..... మీరు..... శామన్న కదూ?"
అతనాగిపోయాడు.
"అవును......కాని.... మీరెవరో తెలియలేదు." అన్నాడు.
"ఇదేమిటయ్యా, శామూ, అప్పుడే మరచిపోయావా? నేను చూసినప్పుడు నువ్వింకా, చిన్న కుర్రాడివి....."
తనను ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తున్న వారెవరో గుర్తురాక సిగ్గుతో శాము మొహం ఎర్రబడింది.
"మీ రెవరో....."
"నేను కృష్ణయ్యనురా అబ్బాయ్ మీ నాన్నా నేనూ ప్రాణ స్నేహితులం. అప్పటికి నువ్వింకా చిన్న వాడివి.
వెంటనే గుర్తు వచ్చింది శాముకు.
"మీరేనా మావయ్యా! వెంటనే పోల్చుకో లేక పోయాను"
"సరే దానికే గాని, ఇప్పుడెక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు, కృష్ణయ్యగారు.
"పొలాలు, తోట చూసుకొంటూ, పల్లెలోనే ఉన్నాను, మావయ్యా"
"చాలా సంతోషం, నీ కేమిటి, పిత్రార్జితం కావలసినంత ఉందాయె. ఇపుడు మైసూరు ఎందుకొచ్చావ్?"
"కొబ్బరి కాయలు మార్కెట్ లో వేయించాలని వచ్చాను."
"మీ నాన్న పోయాక నేను అటువేపు రావటమే పడలేదు ఇప్పుడెక్కడ దిగావ్?"
"హోటల్లో దిగాను. పనయిపోయింది. రేపు వూరికి వెళ్ళిపోతాను."
"ఇది మరీ బాగుంది. ఇంటికి రాకుండానే వెళ్ళిపోతావా? అదేం కుదరదు. పదపద హోటలుకు వెళ్ళి, సామాను తీయించుకుని ఇంటికి వెడుదాం."
శాము మొహమాటంతో, "వద్దు మావయ్యా ఈసారికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇంకోసారి వచ్చినప్పుడు, తప్పకుండా వస్తాను" అన్నాడు.
"అలాంటి సాకులు చెప్పి, పెద్దవాడిని నొప్పించకు మరి. మీ నాన్న నేనూ ఎంతటి స్నేహితులమో నీకు తెలుసుకదా? నువ్వూ నా కొడుకువంటి వాడివి. లేకలేక కనబడ్డావు." నిన్నొదిలి పెడతానా?
4
ఇక బదులు చెప్పలేక శాము కృష్ణయ్యగారి వెంట నడిచాడు. దారి పొడుగునా కృష్ణయ్య గారు తమ బాల్య స్నేహితునితో గడిపిన దినాలను వర్ణిస్తూనే ఉన్నారు. శాము ఎక్కువ మాట్లాడకుండా అన్నిటికి ఊ గొడుతున్నాడు.
"అదిగో వచ్చేశాం. కొబ్బరిచెట్లు కనబడుతున్నాయే అదే ఇల్లు" అంటూ ఇంటివేపు చూపించారు కృష్ణయ్యగారు.
గేటు శబ్ద మవగానే మీర తలుపు తీసింది. కృష్ణయ్య గారితో ఎవరో అపరిచితు లుండటం గమనించి లోపలికి పోబోయింది. కృష్ణయ్యగారు,
"మీరా ఈ సంచి లోపలపెట్టమ్మా అలాగే నా పాత స్నేహితుడి కొడుకు శాము వచ్చాడని అమ్మతో చెప్పు" అన్నారు.
మీర లోపలికి వెళ్ళిపోయింది.
"శామూ, నువ్వేం మొహమాట పడకయ్యా, మీ ఇల్లే అనుకో వేడి నీళ్ళున్నాయ్ స్నానం చేస్తావా?" అన్నారు, శామూకు నీళ్ళగది చూపించి వంటగదిలోకి వెళ్ళారు.
"కమలా ఏం వండా వీ పూట?"
"వంకాయ సాంబారు, అన్నం వండాను."
"అయితే కాస్త కొబ్బెర పచ్చడి చేసి, అప్పడాలు, వడియాలు వేయించేయి. రాకరాక వచ్చాడు" అన్నాడు.
కాసేపయ్యాక భోజనానికి పిలుపు వచ్చింది. శామూ కృష్ణయ్యగారు పీటలమీద కూర్చున్నారు. కమలమ్మగారు, మీర వడ్డిస్తున్నారు. శాము సంకోచంతో తలవంచుకొని భోంచేస్తున్నాడు. కృష్ణయ్యగారు.
"మొహమాట పడకయ్యా. ఈసారి నువ్వు వచ్చింది వచ్చినట్టేలేదు, ఇంకోసారి వచ్చేటప్పుడు తప్పకుండా అమ్మాయిని, పిల్లలను తీసుకురావాలి" అన్నారు.
అసలే ఎర్రగాఉన్న శాము మొహం సిగ్గుతో మరింత ఎర్రబడింది. వంచిన తల ఎత్తకుండానే,
"ఇంకా పెళ్ళి చేసుకోలేదు" అన్నాడు.
"అలాగా! ఇకా పెళ్ళి కాలేదన్నమాట! మీకేమి టయ్యా లక్ష్మీపుత్రులు. ఇంకా ఎందుకు పెళ్ళి చేసుకోలేదు?"
శాము సంకోచంతోనే "ఎక్కడా మంచి సంబంధం కుదరలేదు" అన్నాడు.
"నీకే మంచి సంబంధం దొరకటం కష్టమయిందా? చిత్రంగా ఉందే! కనులూ, కాస్త వడియాలువేయి శాముకు."
"వద్దండి చాలు."
"భోజనంముందు సంకోచం పనికిరాదయ్యా"
భోజనాలయ్యాయి. శాము చేయి కడుక్కుని హాలులో కూర్చున్నాడు.
"తాంబూలం వేసుకొనే అలవాటుందా."
"లేకేం మావయ్యా, ఎంతయినా మేము పల్లెటూరివాళ్ళంకదా! తాంబూలంలేనిదే మాకు రోజు గడవదు మరి."
"మీరా తమలపాకులు తీసుకురామ్మా."
మీర వెండి పళ్ళెంలో లేత తమలపాకులు, వక్కపొడి, సున్నం సర్దితెచ్చిపెట్టింది.
"ఇదిగో పెదనాన్నా."
"ముందు ఆయన కివ్వమ్మా నేను తరువాత వేసుకొంటాను."
మీర తమలపాకులపళ్ళెం శాము ముందుంచి లోపలికివెళ్ళిపోయింది. శాము లేత తమలపాకు లకు సున్నంరాసి వేసుకోసాగాడు. కాస్సేపటిలో పళ్ళెం కాళీ అయింది.
"మీరా ఇంకాసిన్ని తమలపాకులు పట్రా" ఇద్దరూ తాంబూల సేవన పూర్తి చేశారు.
"నిద్దరొస్తుంటే కాస్సేపు పడుకోవయ్యా" శాము వెళ్ళిపడుకున్నాడు.
"సుబ్బూ, నేనెందుకు పూలు పెట్టుకోరాదూ?" అన్నమాటలు పక్క గదినుండి వినిపించాయి. శాము గబుక్కునలేచి కూర్చున్నాడు. తరువాత ఆ మాటలు వింటూ వింటూ అలాగే పడుకొని నిద్రపోయాడు. నిద్రలో కలగన్నాడు. అందులో తానేదో పూల తోటలో నున్నట్టు, అందమైన పిల్లొకతె పూలులేని తన జడ చూపిస్తూ, "నే నేందుకు పూలు పెట్టుకోరాదూ?" అని అడుగుతున్నట్టు కల.
"ఇదిగో ఈ పూలన్నీ నీకే" అంటూ పూల గుత్తితీసి ఆమె జడలో తురిమాడు శాము.
వెంటనే మెలుకువ వచ్చేసింది శాముకు. అప్పుడే గంట మూడయింది. లేచి కూర్చొన్నాడు. తలుపు దగ్గర గాజుల గలగలలు వినిపించాయి. అందమైన ఓ మొహం తొంగిచూసింది. నల్లటి పెద్ద కళ్ళు శాము వేపు చూస్తూ "లోపలికి రావచ్చునా?" అని అడుగుతున్నాయి.
"రండి" శాము గాబరాతోనూ, సిగ్గుతోనూ గబగబా లేచి, పక్క చుట్టాడు.
మీర లోపలికి అడుగు పెట్టింది.
శాము మీరను మొదటిసారిగా పరిశీలించి చూశాడు.
ఎర్రటి మొహానికి నల్లటి ఫ్రేము వేసి నట్టున్న ఉంగరాల జుత్తు అతనిని ఆకర్షించింది. కాంతివంతమయిన పెద్ద కళ్ళు, చిన్ని నోరు చెక్కిన శిల్పంలా ఉన్న శరీరపు తీరునూ, నెమ్మదిగా చూడసాగాడు శాము. సహజంగా సంకోచ ప్రకృతిగల శాము అన్నీ మరచి, ముచ్చట గొలిపే ఆమె అందాన్ని తదేకంగా చూడసాగాడు.
అనిరీక్షితమై ఈ చర్యవల్ల లజ్జారహిత మయిన అతని చూపులను ఎదుర్కొనలేక తల వంచుకొంది మీర. స్వభావం నదురూ బెదురూ లేని మీర అతని తీక్షణ దృక్కులముందు అధీరురాలయింది. మీరకు తొలిసారిగా తను "స్త్రీ" అన్న స్ఫురణ కలిగింది. కొంగు సద్దుకొని మరింత తలవంచుకొని.
"మీరు ఈరోజు ఇక్కడే ఉంటారుకదూ?" అని అడిగింది.
"ఊఁ"
"మా కాలేజీలో బీద విద్యార్ధినుల కోసం వివిధ వినోదావళి ప్రదర్శనల నిస్తున్నారు. మీరో టికెట్టు తీసుకుంటారా?"
"కార్యక్రమంలో ఏమేమి అయిటమ్సు ఉంటాయి."
"నృత్యం, టాబ్లో, నాటకం, ఆర్కెస్ట్రా అన్ని ఉంటాయి"
"ఓ టికెట్టివ్వండి."
మీర ఉత్సాహంతో సంచిలోంచి టికెట్టు బుక్కు తీస్తూ, "ఎన్ని రూపాయల టిక్కెట్టిమ్మన్నారు?" అంది. అప్పటికి ఆమె తడబాటు దూరమయింది. ఆమె కంఠంలో వ్యాపారితనం బెరగ్దితో "ఏం కావాలీ" అన్న భావం ధ్వనించింది.
"ఎన్నెన్ని రూపాయల టికెట్టున్నాయి?"
"ఒక రూపాయినుండి ఇరవై రూపాయల దాకా ఉన్నాయి."
"నా కయిదు రూపాయల టిక్కెట్టివ్వండి." మీర తలెత్తి ఒత్తిడి చేస్తున్నట్టుగా,
"ఇరవై రూపాయల టిక్కెట్టిస్తాను" అంది. ఆమె కళ్ళు అతని చేతికి పెట్టుకున్న బంగారు గడియారం మీద దృష్టి, నిలిపాయ్ అందమయిన ఆ అమ్మాయి మాటలను తిరస్కరించేటంత కఠిన మనస్కుడు కాలేకపోయాడు శాము.
"అలాగే ఇవ్వండి" అన్నాడు.
మీర ఉత్సాహంతో ఇరవై రూపాయల టికెట్టు చింపి ఇచ్చింది. శాము పర్సులో నుండి పది రూపాయల కాగితాలను రెండు తీసి మీర కిచ్చాడు.
