.jpg)
అపర్ణ బుంగమూతి పెట్టి, "మీరూ ఆమె పార్టీయే!" అన్నది.
"ఇందులో పార్టీ ప్రశ్న ఏముంది, చెప్పండి? ఒక ఇంట్లో ఉండే వ్యక్తులు ఒకరి విషయంలో ఒకరు అలా బయటపడితే చూసినవారు ఏమనుకుంటారు?"
"మీరు అనుకున్నారా?"
"నా విషయం వదిలేయండి! అన్నయ్య రాగానే వెళ్ళి పిన్ని గార్ని కూడా తీసుకు రండి!"
"ఆమె రాదు."
"ఎందుకు రారు? ఎలా పిలిస్తే వస్తారో మీకు తెలుసు!"
"మీరు నాకు మంత్రం వేశారు. ఇంక కాదనలేను" ఆమె నవ్వుతూ గిన్నె దింపింది. "కాస్త ఇటు చూస్తూ ఉండండి! ఇప్పుడే వెళ్ళి వస్తాను" అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయిందామె.
* * * *
వాతావరణం చూస్తుండగా చల్లగా, ఆహ్లాదకరంగా మారిపోయింది.
అపర్ణ గిరిధారి వాగ్దానాన్ని బహిరంగం చేసింది.
కృష్ణ, కాంతమ్మ గారు చాలా సంతోషించారు.
"ఆ అబ్బాయి యోగ్యత ముఖంలోనే కనిపిస్తోంది." అంది కాంతమ్మగారు.
"మీరు తమాషాగా మా మధ్యకు వచ్చారు. అపర్ణా....నీ సంగీత సాధన పరోపకారియే!" అంటూ కృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
అపర్ణ సిగ్గుపడింది. కస్తూరి కళ్ళలో కూడా అవ్యక్తానందం పొంగి పొర్లింది.
మధ్యాహ్నం మంగాలూ, కస్తూరీ అష్టా -- చమ్మా ఆడారు.
గిరిధారి, కృష్ణ, అపర్ణ చీట్ల పేక ఆడారు. ఆ దృశ్యం చూసిన కాంతమ్మ గారు కొత్త ఆలోచనల్లో సరికొత్త ఊహలు మెరిశాయి.
15
గిరిధారి కరణం గారిని కలుసుకుని రామదాసు గారి ఆస్తిపాస్తుల వివరాలు తెలుసుకున్నాడు. రైతుల అభిప్రాయాలు కూడా చూచాయగా తెలిశాయి.
కరణం గారు ఒకటే మాట చెప్పారు. "ఏది ఏమైనా వాళ్ళు భూములు మాత్రం వదలరు. పరిష్కారమైనా మార్కెటు రేటు పెట్టరు."
"మరేమంటారు?"
"తాము కౌలు దార్లమంటారు. అసలా భూమిని అంత అభివృద్ధికి తెచ్చింది మేమే అంటారు. చెట్టు కొట్టాం, రాయి తీశాం అంటూ వాళ్ళ గొడవ వాళ్ళేదో చెబుతారు."
"మరి భూమి వాళ్ళది కాదు గద? హక్కు పుట్టించుకోవాలి గద! ఎంత కాలమైనా పేచీ పేచీయే గద!' అన్నాడు గిరిధారి.
"కాదని ఎవరంటారు? కాని ఇప్పటి పార్టీలూ, చట్టమూ సన్నకారు రైతులనూ, వెనకబడ్డ జాతులను ప్రోత్సహిస్తున్నాయి. కాల మొక ప్రవాహం. దాని కేదురీదాలనుకోవటం పిచ్చితనం. ఆ అబ్బాయి కేప్పుడో చెప్పాను. కాని ఇక్కడ పట్టుమని పది రోజులు ఉండడు. ఏళ్ళ తరబడి పేరుకుని ఉన్న వ్యవహారాలు ఎలా పరిష్కారమౌతాయి?"
"నేను కూడా చెబుతాను" అంటూ వచ్చేశాడు. ముగ్గురితోనూ ఆలోచించాడు.
అతని కేలా మంచిదనిపిస్తే అలా చేయమన్నారు వారు ముగ్గురూ.
గిరిధారి ఒక లాయరు గారిని కలుసుకున్నారు. ఉన్న లిటిగేషను అంతా చెప్పి ఎంతవరకూ అవాకాశాలున్నాయని అడిగాడు.
'అవకాశాలకేం? అక్షయంగా ఉన్నాయి కానీ, సంవత్సరాలు ఈడుస్తాయి. ఆ భూములు వాళ్ళ హక్కులో ఉన్నాయి. తేలేసరికి ఇంకా ఎన్నో చేతులు మారతాయి. ఒక్కడూ రిజిస్ట్రేషన్ ను చేయించుకోడు. సరియిన కాగితాలూ, పత్రాలతో వాళ్లకు పని లేదు. రోజులు గడవటమే కావాల్సింది."
"మరేం చేయమని మీ సలహా?"
"వీలైనంత వరకూ ఎంత వస్తే అంత వడుపుకోమని! వ్యవహారం బాగా బిగిసిపోయింది. మరో లాయరు మీకు నాలా చెప్పడు. నిజాని కలా చెప్పటం నా వృత్తి ధర్మం కూడా కాదు."
అయన కొక్క నమస్కారం చేసి వచ్చేశాడు గిరిధారి.
* * * *
"చూడండి, కాల మెలా ఉన్నా ప్రతి వారికీ న్యాయమూ, ధర్మమూ ఉండాలి. నీతీ, నిజాయితీ ఉండాలి. అదే జయం. మీరు అనుభవిస్తున్నది రామదాసు గారి భూములు. ఆ విషయం మీరూ కాదనలేరు. మీరూ, మీ పిల్లలూ చల్లగా రోజులు గడుపుతున్నారు. నిజమే! కాని హక్కు వారిది. అనుభవం మీది. రేపు ఏ చట్టమో మారిందంటే ఆ భూములు అటు వారికీ, ఇటు మీకూ కూడా కాకుండా పోతాయి. మిమ్మల్ని ఎగతోసినవారు ఆ భూములు మీవి అయేలా ఈ ఎనిమిదేళ్ళు బట్టీ చేయగలరా? మీరూ ఆలోచించుకోండి! తుమ్మితే ఊడే ముక్కుల్లాంటి ఆస్తిని మీరూ మీ పిల్లల కోసం సంపాదించారన్న మాట. అవతలి వారు కోర్టు కేక్కితే మీరు స్వంత ఆస్తిని అమ్మి కోర్టులకూ , లాయర్ల కూ పెట్టాలి."
రైతుల దగ్గరకు వెళ్ళి వారి నందరినీ ఒక మోతుబరి ఆసామి ఇంటి దగ్గరకి పిలిపించి విషయమంతా నయానా భయానా వారి కర్ధంయ్యేలా వివరించాడు గిరిధారి.
"నిజమే బాబూ! తమరు చెప్పింది అక్షరాలా నిజమే! ఎవరు కాదంటారు? కాని మా మంద కలిసి రారు. ఒకడు ఏటి కంటే మరొకడు కాటి కంటాడు" అన్నాడొక పెద్ద మనిషి.
"మీరే చెప్పండి! మేము పెద్దయ్యగారు , అంటే రామదాసు గారి తండ్రి కాలం నుంచీ ఆ భూములు చేస్తున్నాం. మేము చెయ్యబట్టే ఆవినాడు అంత కళగా ఉన్నాయి. మాకు అవే ఆధారం! ఈనాడు మీరు వదలమంటారు. లేదా మేము మొయ్యలేని ధర ఇమ్మంటారు. మేమెలా చావం!"
"భూమి మాత్రం వదలమండీ! అది తప్ప ఏదైనా చెప్పండి!" ఒక తలబిరుసు సమాధానం.
'అదేం మాటరా! అసలు నీలాంటి వాళ్ళ వల్లనే ఇది ఇంత దాకా వచ్చింది. ఇప్పటి వరకూ వారు రకం కడుతోండిరి. పట్టా వారిదేనాయె. ఎన్నాళ్ళు నీ ముడ్డి కింది ఉంటేనేం-- నువ్వు కూచున్న చాప నీది కాదన్నప్పుడు?' అని మరొకడు.
ఇలా వాళ్ళలో వాళ్ళు రకరకాలుగా వాదులాడుకున్నారు. కొంతసేపయ్యాక -- "మేము ఆలోచించుకుని చెబుతాం! మీరు పది రోజు లాగి రాండి" అన్నారు.
గిరిధారి వచ్చేశాడు.
* * * *
ఇప్పుడతని కోక వ్యాపకం తోడైంది. కృష్ణ ఇంటికి నిస్సంకోచంగా వెళ్ళి రాగాలుగుతున్నాడు. గదిలో పుస్తకాలు, పత్రికలూ చదవటం కాక కస్తూరికి చదువు చెప్పటం మరో అదనపు కాలక్షేపం. సాయంత్రం కృష్ణతో కలిసి గాని, ఒంటరిగా గానీ తోటకు వెళ్ళి వస్తాడు. బావి కరెంటు మోటారు దగ్గరే రోజూ స్నానం చేస్తున్నాడు. చాలా తాజాగా ఉంటుంది.
అపర్ణ, కాంతమ్మ గారు కూడా అతనితో ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్నారు. అడపాదడపా అక్కడే భోజనాలు కూడా జరుగుతున్నాయి.
కస్తూరికి మరొక రెండు వారాలలో గుణింతాలు పూర్తీ అవుతాయి. వత్తులూ, దీర్ఘాలూ లేని పదాలు చదవ గలుగుతుంది. ఆమె అభివృద్ధి అతనికి తృప్తిగా ఉన్నది.
తోటలో మంగాలు, పోతరాజు కూడా బాగా పరిచయమయ్యారు. సంగీతం మాస్టారికి కూడా గిరిధారి పట్ల గురీ, గౌరవమూ ఏర్పడ్డాయి.
కరణంగారూ, రైతులూ-- అదో ప్రపంచం. ఇన్ని వ్యాపకాలలో ఉన్నా ఒంటరి తనంలో అతనిలో ఒక వేదన లేకపోలేదు. అది గతానికి సంబంధించింది. 'దాన్ని మరిచి పోవాలి, మరిచి పోవాలి.' అని తనలో గొణుక్కుంటాడు.
పది రోజులు గడిచాయి. రైతుల దగ్గరకు వెళ్ళాడు. అందరూ కలవలేదు. ఎదుటపడిన వారు -- "వాళ్ళు లేరుగా? మేమేమి మాట్లాడడం-- మళ్ళీ మా మీద ఏడుస్తారు!' అన్నారు.
"మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు?"
"నిజమే! మిమ్మల్ని ఇలా మాటిమాటికీ తిప్పటం మాకూ బాగాలేదు. నేను అందర్నీ కూడగట్టి కబురు చేస్తాను. మీరు కరణం గారి ఇంట్లో రెండు మూడు రోజలు ఉండేటట్లుగా రండి. రాయో, రాకాసో తేలుద్దాం" అన్నాడు మోతుబరి ఆసామీ.
"ఇలా తిప్పటం బాగాలేదు.
'అదే నేనూ చెబుతూంట! ఒక గాడిన పడింది. గద? నలుగురిలో పడ్డ పాము చావక ఏం చేస్తుంది?"
మళ్ళీ తిరిగి వచ్చాడు.
"నేను చెప్పలే? వాళ్ళు ఒక పట్టాన లొంగుతారా!"అన్నాడు కృష్ణ.
"అలా తొందర పడితే లాభం లేదు" అని చెప్పాడు గిరిధారి.
16
రోజులు గడుస్తున్నాయి. వారాలూ, నెలలు, తిరిగి సంవత్సరం పూర్తీ కావస్తుంది. పైకి ఎన్ని కార్యకలాపాల్లో పాల్గొంటున్నా గిరిధారి లోని అంతర్యుద్దం నానాటికీ తీవ్రరూపం దాలుస్తుంది.
ఆనాడతను తోటబావి దగ్గర స్నానం చేసి ఆ దావునే ఉన్న ఒక మట్టి గట్టు మీద కూర్చున్నాడు. గానుగ చెట్ల మధ్య కాలువలో ప్రావహించే నీరు ఎండకు వెండి రేకుల్లా మెరుస్తుంది. అయిదారుగురు మనుషులు ఆ కాలువ లోని నీరు చెట్లకు మళ్ళవేస్తున్నారు. పోతరాజు నలుగురు భాగస్తులను కలుపుకున్నాడు. పగలంతా అతనితో కలిసి పని చేస్తారు వాళ్ళు. రాత్రిళ్ళు మాత్రం పోతరాజు, మంగాలు, సంగీతం మాష్టారు తోట ఇంట్లోని గదిలో మకాం పెట్టి కూడా చాలా రోజులైంది.
గిరిధారి అక్కడుండగానే సంగీతం మాష్టారు స్నానికి వచ్చాడు. అయన గిరిధారిని "అన్నగారూ' అని పిలవటం అలవాటు చేసుకున్నాడు. అతను ఆయన్ని 'మాస్టారూ!' అంటాడు.
"మాస్టారూ! రోజూ ఊరికి వెళ్ళి వచ్చినట్లు ఏమిటీ అవస్థ! స్వయం పాకం కూడా కాదు. హోటలు తిండి! కాఫీ కావాలన్నా మైలు వెళ్ళి రావాలి. ఊళ్ళో గది చూసుకోకూడదు? పోనీ, ఏదీ దొరక్కపోతే నా గదిలో నాతొ పాటు ఉండండి! నాకేమీ అభ్యంతరం లేదు" అన్నాడు గిరిధారి.
