Previous Page Next Page 
అన్వేషి పేజి 8

 

    "అలాగే ఉండమను" అంది అపర్ణ ఏమీ అడక్కుండా , వినకుండానే.
    ఆ సంగీతం మాష్టారు తన ముందుకు రావటాని కిష్టపడని అపర్ణ , అతనికి ఆశ్రయ మివ్వటానికి క్షణం వెనుకడలేదు. గిరిధారికి అంతా విచిత్రంగా ఉంది. ఉన్నట్టుండి కాంతమ్మగారు ఒక చోట ఆగిపోయి , "మీరు పదండి . నేను వస్తాను" అన్నది.
    "నేను పెద్దమ్మ గారితో వస్తాను" అంటూ తనూ ఆగిపోయింది కస్తూరి.
    "అవి మా అమ్మ నాన్నగార్ల సమాధులు" అంటూ చూపించాడు కృష్ణ.
    ఒక పక్కగా ఒకే అరుగు మీద జంట సమాధులు కనిపించాయి. వాటి మీద చిన్న మండపం కూడా ఉంది.
    అపర్ణ ఉన్న చోటు నుంచే చేతులు జోడించింది. కృష్ణ కూడా అదే పని చేశాడు. కాంతమ్మ గారు, కస్తూరి తప్ప మిగిలిన వారంతా ముందుకు నడిచారు తోట అంతా తిప్పి చూపించిందాకా గిరిధారిని వదల్లేదు కృష్ణ.
    మళ్ళీ తిరిగి ఆ దారినే వెనక్కు తిరిగి రావలసి వచ్చింది. ఆ వచ్చేటప్పుడు కాంతమ్మ గారూ, కస్తూరీ వారితో కలిశారు. సమాధుల్లో ఒక దాని గూటిలో వెలిగే ప్రమిద దీపం కనిపించింది గిరిధారికి. అంతేకాదు కాంతమ్మ గారి కళ్ళు బాగా ఏడిచినట్లు ఉబ్బి ఉన్నాయి. తిరిగి రాగానే గిరిధారి, కృష్ణ నూతి దగ్గరకు వెళ్ళి స్నానాలు చేసి వచ్చారు. అపర్ణా, కస్తూరీ వారు వచ్చాక వెళ్ళారు.
    "ఉదయమే తలంటుకున్నావు. ఎక్కువగా నానకు, అపర్ణా. జలుబు చేస్తుంది." అన్నది కాంతమ్మ గారు. ఆమె స్వరంలో ఏదో నిర్లిప్తత ; అనునయంలో ఏదో ఆప్యాయత.
    "అలాగే పిన్నీ." నెమ్మదిగా సమాధానం చెప్పి వెళ్ళింది అపర్ణ.
    "కృష్ణా! నాకు ఆయాసంగా ఉంది. కాసేపు పడుకుంటాను, నాయనా!" అంటూ చాప పరిచింది కాంతమ్మ గారు.
    "పడుకో పిన్నీ! చేసేదేముంది గనక! అపర్ణ వచ్చాక భోజనాలు చేద్దాం."
    "ఇలా రా, బాబూ!"
    "ఇప్పుడే వస్తాను" అంటూ లోనికి వెళ్ళాడు కృష్ణ.
    ఆమె ఎందుకో ఏడుస్తుంది. "ఊరుకో పిన్నీ" అంటూ ఆమె నోదార్చాలని ప్రయత్నిస్తున్నాడు కృష్ణ.
    గిరిధారి ఒంటరిగా బయటి వరండా లో నిలబడ్డాడు. ఇంతలో గాడిదను తోలుకుంటూ అటుగా వచ్చిందోక ప్రౌడ! ఆమె మంగాలు అని అతను చూడగానే పోల్చుకున్నాడు. పొట్టిగా, నల్లగా దిట్టంగా ఉందామె. ఇంటి ముందు కొచ్చి "కస్తూరేమ్మా" అని పిలిచింది.
    "లేదు!"
    "అమ్మాయి గారూ?"
    "ఇద్దరూ నూతి దగ్గరకు వెళ్ళారు-- స్నానానికి! పెద్దమ్మ గారు పడుకున్నారు."
    ఆమె ఇంకేమీ మాట్లాడకుండా గాడిదను తోలుకుని వెళ్ళిపోయింది.
    పక్కగా మెట్లు కనిపిస్తే మేడ మీది కెక్కాడు. దూరంగా టకటక మని బావి దగ్గర కరెంటు మోటారు చప్పుడు వినిపిస్తుంది. పోతరాజు ఇల్లు ముందు భాగం కనిపిస్తుంది. పోతరాజు మంగాలుతో ఏదో చెబుతుంటే ఆమె నవ్వుతుంది. మొత్తం మీద అన్యోన్య దాంపత్యమే ననిపించింది.
    అపర్ణ, కస్తూరి తిరిగి వచ్చారు.
    గిరిధారి క్రిందికి వచ్చాడు.
    "మిద్దె ఎందు కెక్కారయ్యగారూ! మీరు మాకు కనిపించారు. మీరూ మమ్మల్ని చూశారా?" అంది కస్తూరి.
    అతను తడబడ్డాడు. "ఎబ్బే! లేదు, కస్తూరీ! యధాలాపంగా ఎక్కేశా నంతే!" అన్నాడు.
    "మమ్మల్ని చూడ్డానికే ఎక్కారని మేము మాత్రం అన్నామా?" అని నవ్వుతూ లోనికి వెళ్ళింది అపర్ణ.
    "పిన్నీ! ఉసిరి చెట్టు క్రింద వండుకు తినాలట కదూ? ఏమిటి నువ్వలా పడుకున్నావు? ఎమైందన్నయ్యా పిన్నికి?" అన్నది.
    'ఆయాసంగా ఉందిట."
    అపర్ణ నిట్టూర్చింది . "కస్తూరీ!" అని పిలుస్తూ బయటి కొచ్చింది.
    "మీకు కూర్చోవటానికి కేమీ లేదా? అన్నట్టు ఏమిటలా బయట నిలబడ్డారు? రండి, లోనికి" అన్నది గిరిధారిని చూసి.
    "ఎక్కడైతేనెం లెద్దురూ!"
    "అయితే ఉసిరి చెట్టు క్రిందికి పదండి. అక్కడ నేను వంట చేస్తాను."
    కృష్ణ బయటకు వచ్చాడు. 'అప్పుడే పన్నెండయినట్లుంది. ఇంకెప్పుడు చేస్తావు వంట? నా మాట విని బుట్టలో పిన్ని చేసిన పులిహోర ఉంది. ఆ చెట్టు క్రింద కూర్చుని తిందాం పద." అన్నాడు.
    "చెట్టు దాకా ఎందుకు? ఇక్కడే నువ్వూ పిన్నీ తినేయ్యండి! రండి , గిరిధారి గారూ! మనం వెడదాం. కస్తూరీ, ఆ పెద్ద జాజికాయ పెట్టె తీసుకురావే! అందులో స్టౌ , బియ్యం, పప్పూ అన్నీ ఉన్నాయి. కాస్త పులగం ఎంతలో తయారవుతుంది?' అంటూ ముందు నడిచింది అపర్ణ.
    "అపర్ణా! పిన్నికి ఒంట్లో బాగా లేదు" అన్నాడు కృష్ణ.
    "అయితే నువ్వుండు. వంట కాగానే కస్తూరి నిక్కడికి పంపిస్తాను. పిన్నికి తోడుంటుంది. అప్పుడు నువ్వు వద్దువు గాని. ఈలోపల వెంట ఉన్న గిరిధారి గారి వల్ల నాకేమీ జరగదని అయన తరపున నేనే హామీ ఇస్తున్నాను." అపర్ణ అన్న వంక తీక్షణంగా చూస్తూ అన్నది.
    "ఛ! ఛ! అలా మాట్లాడతావేం?"
    "మరెలా మాట్లాడాలో తరవాత చేబుదువు గాని , రండి, గిరిధారి గారూ!" అంటూ అపర్ణ వెనక్కు తిరిగి చూడకుండా నడవసాగింది. కాని అతను అక్కడే ఉన్నాడు.
    "వెళ్ళండి!' అన్నాడు కృష్ణ.
    తప్పనిసరి అయినట్టు కదిలాడతను. చెట్ల చాటు నుంచి కనిపించే కస్తూరి, అపర్ణల చీరెలను బట్టి తన ముందున్న దారి ఆ దిక్కుకు కలుపుకుంటూ అతను ముందుకు సాగాడు.

 

                                       14


    అపర్ణ వంట ప్రారంభించింది. కాస్త ఎడంగా గిరిధారి చేతిలోని న్యూన్ పేపరు పరిచి కూర్చున్నాడు. కస్తూరి అంతకన్నా దూరంగా కూర్చుని ముందున్న ఇసుకను తిన్నేలా సర్ది అ ఆ లు వ్రాస్తుంది.
    "మనం తిరిగి వచ్చేటప్పుడు సమాధుల దగ్గర మార్పును గమనించారా మీరు?" అపర్ణ హటాత్తుగా ప్రశ్నించింది.
    "దీపమేనా?"
    "అవును. అది మా నాన్నగారి సమాధి. మా పిన్ని గారి ఆరాధన."
    అతను మాట్లాడలేదు.
    ఆమె మళ్ళీ అన్నది. "ఆ పక్కనే ఉన్నది అమ్మ సమాధి. పిన్ని దృష్టిలో అమ్మ అందుకు అనర్హురాలనుకోవాలా?"
    "నేను కొత్త వాడిని! నాకీ విషయాలకు సమాధానాలెలా తెలుస్తాయి?"
    "అంతేకాదు నాన్న చనిపియిన రోజున అయన ఫొటోకు బారెడు పూల మాల! అమ్మ ఏం పాపం చేసింది? నా విషయంలో ఆమె అంతర్యం మీరు గ్రహించారా? అన్నయ్యంటే ప్రత్యేకమైన అభిమానం! ఎందుకీ తేడాలు? ఇద్దరం ఒక తల్లి పిల్లలమే! ఇద్దరం అమ్మా, నాన్నా లేని వాళ్ళమే!' అంటూ అపర్ణ కళ్ళు తుడుచుకుంది.
    గిరిధారి ఒక్క నిట్టుర్పు వదిలాడు.
    'అవును. మీరేం చెబుతారు దీనికి? అన్నయ్యను తన విషయంలో మరీ సెంటి మెంటల్ గా తయారు చేసింది. ఆమె కన్నీరు చూడలేడు. అలా జరిగిన నాడు నేను వాడికి పడని దాన్ని అవుతాను. నన్ను కాస్తా మూడు ముళ్ళూ వేయించి పంపేస్తే తనకు నచ్చిన కోడలిని తెచ్చుకుని ఏకచ్చత్రాదిపత్యం కొనసాగిస్తుంది."
    "ఇదంతా నాకెందుకు చెబుతున్నారు?"
    ఆమె నవ్వి కన్నీరు తుడుచుకుంది. "ఎందుకంటె -- ఏం చెప్పను? కొందరిని చూడగానే మనసు విప్పాలనిపిస్తుంది. కారణం తెలియదు."
    "నా విషయంలో మీ అభిప్రాయానికి కృతజ్ఞుడిని ఆ ఆత్మీయతతోనే నాకు తోచింది చెబుతున్నాను. అతి కొద్ది కాలంలో మీ ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళిపోతారు మీరు! పిన్ని గారు అన్నయ్యను అభిమానించే వారే గదా? ఆమె వల్ల అతనికేమీ హాని లేదు. అయినప్పుడు మీ చింతను దూరం చేసుకోవటం ఉత్తమం."
    "లేదు! ఆమె మెచ్చిన పిల్ల ఈ ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదు. మీరేమనుకున్నా సరే -- ఈ విషయంలో ఆమెను శాయశక్తులా ప్రతిఘటిస్తాను నేను. నేను మెచ్చిన కన్య నా వదినేగా రావాలి!"
    "ఎందుకని? మీ అన్నను అమెద్వారా మీ పిన్ని గారికి దూరం చేయడానికా? మీకు తెలీదేమో! ఏ ప్రేమ విషయంలో నైనా మగవాడు అసూయను భరిస్తాడు గాని, తనకు మాతృత్వపు మమతను దూరం చేయాలనే స్త్రీ ఆలోచనను సమర్ధించి భరించలేడు."
    అపర్ణ తలఎత్తి అతని కేసి సూటిగా చూస్తూ, "ఏ అనుభవంతో మీరీ విషయన్నింత నిక్కచ్చిగా చెబుతున్నారు? స్వానుభవంతో కాదు గదా!" అన్నది.
    అతను క్షణం సేపు ఊరుకుని అన్నాడు; 'అయినా కావచ్చు! కాకపోయినా అందరికీ అన్నీ స్వానుభవం లోనే ఎదురవాలని ఏముంది? చూస్తున్న ప్రపంచాన్ని బట్టి నడుస్తున్న కాలాన్ని బట్టి వ్యక్తీ మనో వికాసం పెరిగే అవకాశం ఎప్పుడూ ఉంది."
    "మీరేమైనా అనండి! నా అన్న ఒక్కడూ నా వాడు కాదు అనే భావాన్నే నేను భరించలేను. అలా జీవించలేను."
    "పిన్నిగారు వచ్చేసరికి మీరు చాలా చిన్న పిల్ల అని విన్నాను. ఆనాటి నుంచీ ఈనాటి వరకూ మీరు సాధించలేని విజయం ఈ కొద్ది కాలంలో సాధించగలనన్న విశ్వాసం మీకుంటే నేను చెప్పేదేమీ లేదు."

 

              
    అపర్ణ గిన్నె మూత తీసి ఒకమారు కలియబెట్టి "కస్తూరీ? నీవు వెళ్ళి అక్కడుండి అన్నయ్యను పంపించు'" అంది.
    ఆమె వెళ్ళిపోయింది.
    "చూడండి! ఈరోజు అందరం ఇక్కడ సరదాగా గడపాలని వచ్చాం. ఉపాయంగా అన్నయ్య నా దగ్గరుండలేని వాతావరణం సృష్టించింది పిన్ని. ఇప్పుడు మీరు లేకపోతె నా స్థితి ఎలా ఉండేదో చెప్పలేను! ఆమె అర్ధం లేని వెర్రి ఆప్యాయతతో అసలు అన్నయ్య ఎలా పెరగాలో అలా పెరగలేదు. చాలా బద్దకస్తుడయ్యాడు.  అవసరమైన ఎన్నో విషయాలు వాయిదా వేస్తున్నాడు."  
    "అవేమిటని అడగవచ్చా?"
    "భూములు తాలుకూ తగాదాలు. ఆ గొడవలు మాకంతగా తెలియక నాన్న పోవటం తోనే అంతా అయోమయముంది. స్వార్ధపరులు అంతటా ఉంటారు గదా? చెప్పేదేముంది! చివరకు కళ్ళు తెరిచే సరికి ఎన్నో పేచీలు. "వాడు బతకలేక పోడు' అంటుంది పిన్ని. కల్పించుకుని ముందడుగు వేస్తె వాళ్ళేదో దుండగం చేస్తారని వడిలో పిరికితనం బాగా రంగరించింది."
    "మీకు మాట ఇస్తున్నాను-- అవి నాకు చేతనైనంతలో ఒక దారికి తేవటానికి ప్రయత్నిస్తాను."
    ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. కళ్ళు పెద్దవి చేసి, "నిజంగానా? మిమ్మల్ని దేవుడే పంపించాడు" అన్నది.
    'అప్పుడే అంతెత్తు కెత్తకండి!"
    "ఇంకేమనను? నా నిశ్చింతను ఇంకెలా వ్యక్తం చేయను చెప్పండి?"
    "చెప్పమంటారా? మీ పిన్ని గారితో మంచిగా ఉండండి! పెద్దది . ఆమె ఏమన్నా పట్టించుకోకండి!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS