"మీరు చెప్పింది దివ్యంగా ఉంది, అన్నగారూ! నాకు కన్నుల విందు చేసే ప్రకృతి అంటే చాలా ఇష్టం. నాకా ఎవరూ లేరు. నేను పాఠాలు చెప్పుకునే అమ్మాయిల సంగీతాలు మూడు ముళ్ళూ పడే దాకానేగా! ఆతరవాత వాళ్ళ దారి వాళ్ళది, నా దారి నాది. మళ్ళీ పొట్ట చేత పట్టుకు దేశం మీద పడాలి. ఈలోపల మనసుకు నచ్చిన చోట ఎలాగో ఒకలా రోజులు వెళ్ళదీస్తే అదో తృప్తి."
"మీ కెవరూ లేరా?" అని అడగాలనుకున్నాడు. కానీ అదే ప్రశ్న మళ్ళీ తన వైపు తిరుగుతుందనే సంకోచంతో ఆగిపోయాడు.
అతను అడక్కుండానే మాష్టారు ప్రారంభించాడు.
"నాకైన అనుభవాలు మరొకడికైతే ఏనాడో చచ్చేవాడు. లేదా పిచ్చెత్తి పోయేవాడు. నాలుగు పదులు నిండని ఈ జీవితానికి నూరేళ్ళ అనుభవాలు నిండాయి. అన్నగారూ! అవేమిటని అడగద్దు. 'నరకం' అంటూ వేరే లోకం లేదని నా జీవితం నాకు చెప్పింది. నాకిక్కడ శాంతి ఉంది. ఓదార్పు ఉంది. అందుకే ఇక్కడ నివాసాన్ని ఎన్నుకున్నాను."
అయన గొట్టం నుంచి దూకే జలధార క్రింద తల పెట్టాడు.
"బాబుగార్లు గొట్టాం ప్రాణాలు రుసి మరిగారే!" ఆ మాట అన్నది మంగాలు. అసలే లావు. ఈ మధ్య ఇంకా ఒళ్ళు చేసింది. గుమ్మటం లా ఉంది. 'అయ్యగారూ! ఇప్పుడు సంగీతం పాడు . యమ రంజుగా వొచ్చుద్ది రాగం" అన్నది.
"అన్నగారూ , దాని పొగరు చూశారా! పోతరాజు మరీ అలుసిచ్చి అలివి కాని దాన్ని చేసుకుంటున్నాడు."
'అట్టాగా, రాగాలయ్య! పోనీ నీ కాడికి రానా-- మా కులంలో మారు మనువు తప్పు లేదులే!" అన్నది మంగాలు.
"విన్నారా ఆ మాటలు! పైగా రాగాలయ్యట సంగీతం మాస్టరు 'రాగాలయ్య' అయితే డాక్టరు 'రోగాలయ్య' . దాని నోటికి వచ్చిన పేరు పెట్టేస్తుంది. ఇంతకీ నువ్వు పోతరాజు ను ఏమని పిలుస్తావే!"
"ఏమనో పిలుస్తాను. మొగుడూ, పెళ్ళాల మధ్య ఊసులు నీకెందుకు? 'తరాజూ' అని పిలుస్తాను! సరా?"
మాస్టారు ఫక్కున నవ్వాడు. గిరిధారి కి నవ్వొచ్చింది.
స్నానం అయిపోయి ఒళ్ళు తుడుచుకుంటూ , "ఎప్పుడో అభ్యంగనానికి ముహూర్తం పెట్టాలి. చిరాగ్గా ఉంది" అన్నాడు మాష్టారు.
"ఏంటది? ఏ మంజనం?"
"అభ్యంగనం."
"అంటే?"
"తలంటు."
"దాని కొచ్చిన తిప్పలా ఇది? మరా మాటే అనరాదూ? ఎవురికీ అర్ధం గాని బాస దేనికయ్య పంతులూ! ఎనకటికి అనగాడికి తేలు కుడితే తల కేక్కిందాకా అదంతా అసికమే ననుకున్నారంటలే! రేవుకు రారాదూ? బానలో ఉడకేసి కమ్మని పిండి గంజేడతాను."
"అసినీ! నీ నోటికి హద్దు లేకుండా పోయిందే!"
"అడదాన్నోటికీ తాళం బెమ్మ దగ్గర కూడా లేదు, పంతులూ! సరేలే, అయ్యాడ పడేసెల్లు! జాడిచ్చి తెస్తాను" అని అయన చేతిలోని తడి పంచ అందుకుంది.
"నీ మాటలకూ చేతలకూ చాలా తేడా ఉందే మంగాలూ!"
"మెప్పుకోలు సాల్లే గాని ఇగ దయసెయ్యి."
"వస్తానన్నగారూ! ఊళ్లోకి వెళ్ళి రావాలి! మీరు కూడా వస్తారా? కలిసి వెడదాం."
"మరో పావుగంట మీరుంటే కలిసి రావటానికి నాకే అభ్యంతరమూ లేదు" అన్నాడు గిరిధారి.
"సరే. అలాగే కానివ్వండి!" కట్టుకున్న ధోవతిని సవరించుకుంటూ వచ్చి అతని చేరువనే కూర్చున్నాడు మాష్టారు.
మంగాలు బట్టలు ఉతికి పిండి గడ్డి మీద ఆరేసి వెళ్ళిపోయింది.
ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు.
పోతరాజు వచ్చి మోటారు ఆపేశాడు. "రేపు పెందలాడి రావాల! ఇయాల్టలా వస్తే కుదర్దు. మిమ్మల్ని నమ్ముకొని ఇదంతా నెత్తి నేసుకున్నాను." వెళ్ళి పోతున్న మనుషులకు కేకవేసి చెప్పాడు. "అట్టాగాలే, అట్టాగాలే!" అరుస్తూ సమాధానం వచ్చింది.
"దండాలయ్యగారూ!" గిరిధారి నుద్దేశించి నమస్కరించాడు.
"ఏం పోతరాజు -- ఎట్టా నడుస్తుంది?" అంటూ పలకరించాడు.
"ఏదో -- తమ దయ. ఇట్టా గడుస్తుండాయి రోజులు" అంటూ చేతులు , కాళ్ళూ కడుక్కుని "వత్తాను, బాబూ!" అని వెళ్ళిపోయాడు.
"ఇహ పోయి గొంతు దాకా పట్టించి వస్తాడు." అన్నాడు మాష్టారు.
మంగాలు మళ్ళీ వచ్చింది. ఒక అరిటి ఆకు ముక్కలో నాలుగు పక్షాలుగా కోసి ఉప్పూ కారం చల్లిన పందిరి దోసకాయ ముక్కలు తెచ్చింది. గిరిధారి ముందు పెట్టి "తీసుకోండయ్యా" అన్నది.
"నాకేదే?" అన్నాడు మాష్టారు.
"సెట్టు మీది కోతి గూడాకాయ సేతికందియ్యాలా, పంతులూ!"
"చూసారా దాని బుద్ది?"
"ఇవన్నీ నేను తినగలనా? మీరూ తీసుకోండి. ఇద్దరికనే తెచ్చిందామె."
"అదీ సంగతి . పంతులూ , కాస్తలో బయట పడిపోతివి" అంటూ వెళ్ళిపోయింది.
ఆమె దూరంగా పోయాక -- "మాట కరుకు గాని మనిషి మంచిది. అది అడుగు పెట్టిన వేళ మంచిదనే నమ్మకం ఉంది పోతరాజుకు" అన్నాడు మాష్టారు.
గిరిధారి మాట్లాడలేదు. ఒక్క ముక్క మాత్రం తిన్నాడు. ఎండ తగ్గుతున్న కొద్దీ గడ్డి దోమలు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి. ఆకాశంలో ఒక కొంగల గుంపు గట్టిగా అరుస్తూ ఇటు చివరి నుంచి అటు చివరి కెళ్ళింది. అది కనిపించకుండా పోయిందాకా చూశాడు గిరిధారి. ఆ తరవాత "పదండి , వెళదాం" అంటూ లేచాడు. ఇద్దరూ ఊరు వైపు నడక సాగించారు.
17
కృష్ణ ఇంటికి బంధువులు వచ్చారు. ఇల్లు కాస్త సందడిగానే ఉంది. మధ్య హాలు లో కాఫీ, ఫలహారాలు అప్పుడే ముగిసిన సూచనలు కనిపిస్తున్నాయి. గిరిధారి వచ్చాడని తెలియగానే అతనికి కూడా కాఫీ ఫలహారం వచ్చాయి. అతను లోగడ చూడని ఇద్దరు పెద్ద మనుష్యులున్నారు. లావుపాటి బుర్ర మీసాలాయన ఒకరు. సన్నగా బక్కపలచని మనిషి రెండో అయన.
"వీరు గిరిధారి అని మా వ్యవహారాలు చూస్తున్నారు. ఈ ఇద్దరూ మాకు వేలు విడిచిన మేనమామలు." అని ఒకరి నొకరికి పరిచయం చేశాడు కృష్ణ.
నమస్కార ప్రతి నమస్కారాలు అయ్యాయి.
"అ విడిచిన వేలు పట్టించాలనే వచ్చాం'రా , నవనీతం." అన్నాడు సన్నటాయన. "చెల్లాయి పోయాక మా బంధుజనం రాకపోకలే తగ్గిపోయాయి. అది మహా ఇల్లాలు. ఏ లోకాన ఉందొ" అంటూ నిట్టూర్చాడు.
అయన చాలా లౌక్యుడనిపించింది గిరిధారికి.
"పోనీ, అన్నయ్యా! ఎంత అనుకున్నా పోయినా వాళ్ళు లేచి రారు. ఉన్నవాళ్ళను దగ్గర చేసుకుందుకు ప్రయత్నించడం ఉత్తమం."
'అంతేరా, సుదర్శనం."
లావుపాటి అయన పేరు సుదర్శనమన్న మాట.
"వెనకటి చుట్టరికాలూ , ఆత్మీయతలూ ఇప్పుడు లేవు. కాలం మారిపోయింది. ఎవరి పనులు వారికి సరిపోతున్నాయి. లంబాడి చుట్టరికాలయ్యాయి. చిన్నప్పుడు నామీది కెక్కి తొక్కి ఆడుకున్న అపర్ణ మనల్ని గుర్తించనే లేకపోయింది."
"సూర్యం మామయ్యా! అది చిన్నదని నువ్వే చేబుతుంటివి. రాకపోకలు లేవంటుంటిరి. గుర్తించక పోవటం మా తప్పా?"
కృష్ణ మాటలకు ఇద్దరు మామయ్యలూ నవ్వారు.
"వీడి దంతా తండ్రి పోలిక. మాటా అదీ చూశావా? అంతా రామదాసు బావ గుర్తు కోస్తున్నాడు." అన్నారు సూర్యం గారు.
"బావ ఎంత యోగ్యుడు! వస్తే కనీసం వారమన్నా ఉండందే వెళ్ళనిచ్చేవాడు కాదు."
"ఇప్పుడు మాత్రం నేను పొమ్మంటానా, మామయ్యా! మీరు ఉండాలే గాని ఎన్నాళ్ళు అయినా అభ్యంతరం లేదు."
లోపలి నుంచి ఒక బక్క పలచని వయసు మళ్ళినామే వచ్చింది.
"ఏమంటున్నాడు అల్లుడు?" అన్నది.
ఆమెగారు తాంబూలం క్షణం విడవలేని దానల్లె ఉంది.
"నువ్వే తేల్చాలి, మరదలా! అల్లుడంటే ఏం బజారులో దొరికే సరుకనుకున్నావా ఏం?" అంటూ సూర్యంగారు తన ఛలోక్తి కి తనే నవ్వారు.
"బావగార్ని తోడు తెచ్చుకుందెందుకో మరిచిపోతున్నారు. అల్లుడి మర్యాదలకు పొంగిపోయి అటు మొగ్గుతున్నారు. సరే, కానీండి! నేను మాత్రం పరాయిదాన్నా? ఏమయ్యా, నవనీత కృష్ణా, మా అమ్మాయిని నీ కివ్వాలని మా అభిప్రాయం. సుజనను చూశావు కదా? ఏమంటావు?' అన్నదామె.
"మరదలు అసాధ్యురాలు! చదరంగంలో 'షా' అని రాజు అట కట్టినట్టు ఏకంగా పెళ్ళి కొడుకునే ముగ్గులోకి దించింది."
సుదర్శనం ఫెళ్ళున నవ్వి, "ఏం తప్పా? అతను పెళ్ళి చేసుకోడా? మన దగ్గర అమ్మాయి ఉంది, అడిగాం! ఏం , కృష్ణా?" అన్నారు.
"తప్పేముంది!" సిగ్గుపడుతూ అన్నాడు కృష్ణ.
ఇంతకుముందు పెళ్ళి చూపులయ్యాయన్నమాట. పిల్లనే పిల్లాడి దగ్గరికి తీసుకొచ్చారు ఏకంగా అనుకున్నాడు గిరిధారి. అతనింతవరకూ ఏమీ మాట్లాడలేదు.
"ముందు చెల్లాయి పెళ్ళి కావాలి."
"అదీ జరుగుతుంది. ఇందర మున్నాం -- దానికి వరుడిని తేలేమా? కలిసొస్తే రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చెయ్యచ్చు." అన్న సూర్యం గారు లేచి, "గిరిధారి గారూ! ఇలా రండి" అంటూ వాకిలి వరండా లోకి దారి తీశారు.
గిరిధారి అనుసరించక తప్పలేదు.
"మీరు కూడా ఒక మాట వెయ్యాలి. మీ మేలు మరిచిపోం" అంటూ ప్రారంభించారాయన.
"నన్నేం చెయ్యమంటారు? మీరూ, మీరూ కావలసిన వారు."
"కావచ్చు. కాని మీరలా తప్పుకోవద్దు! మిమ్మల్ని సంతోషపేడదాం. ఇంట్లో అందరికీ మీరన్నా, మీ మాట అన్నా ఎంతో గురి అని విన్నాం. ఇదుగో, ప్రస్తుతానికిది" అంటూ జేబులోంచి నూరు రూపాయల కాగితం తీశారు.
గిరిధారికి మండిపోయింది. "ముందు దాన్ని యధాస్థానంలో ఉంచండి! నా విషయంలో పొరబడుతున్నారు."
అయన కాస్త తికమకపడి, "సరే, సరే అయితే" అన్నారు.
"మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి! ఏదైనా జరిగితే సంతోషించే వాడినే నేను."
అయన నోచ్చుకున్నట్లు కనిపించి, "ఈ విషయం మరిచిపొండి!" అంటూనే లోపలికి వెళ్ళిపోయారు.
గిరిధారి మళ్ళీ లోపలికి వెళ్ళకుండా తన గదికి బయలుదేరాడు.
కస్తూరి గబగబా సందు నుంచి వచ్చి 'అమ్మాయిగారు పిలుస్తున్నారు." అంది. తిరిగి చూసేసరికి మందార చెట్టు పక్కగా అపర్ణ కనిపించింది. అటు వెళ్ళాడు.
"వెళ్ళిపోతున్నారేం?' అంది అపర్ణ.
అతను మాట్లాడలేదు.
"అంతా చూశాను. అన్నయ్య దగ్గర మాట తీసుకోనిది వదిలేలా లేరు వాళ్ళు. పిల్ల పెళ్ళి కేదిగేసరికి బీరకాయ పీచు చుట్టరికాల్ని తిరగేసి కలుపుకుని వచ్చారు. పిన్ని సుముఖంగా ఉందీ విషయంలో" అన్నది గబగబా.
"మంచిదేగా?"
"ఏం మంచి! ఇది జరగటానికి వీల్లేదు. రైతులో, కరణం గారో అవసరంగా రమ్మన్నారని అన్నయ్యను తీసుకెళ్ళండి! ఇక్కడి గొడవ నేను చూసుకుంటాను."
'అలా బాగుంటుందా? ఇంతకీ కృష్ణ అభిప్రాయం ఏమిటో?"
"అది తెలుసుకోవటానికి మనకు సమయం చాలా ఉంది. మీరు తాత్సారం చేస్తే అవతలి ఆ బసవన్న వాళ్ళ "డూ డూ' లకు తల ఊపుతాడు. అనక మనం చేసేదేమీ లేదు. వెళ్ళండి చప్పున."
అతను క్షణం యోచించి, "సరే' అంటూ లోనికి వెళ్ళాడు. లోపలి వాతావరణం చూస్తె అపర్ణ అంచనా కరెక్టే ననిపించింది.
"పిన్నికీ, అపర్ణ కూ అభ్యంతరం లేకపోతె నాకూ ఏమీ లేదు.' అంటున్నాడు కృష్ణ.
"మిస్టర్ కృష్ణా! ఎక్స్యూజ్ మీ! మనం అవసరంగా పల్లెకు వెళ్ళాలి. వర్తమానం వచ్చింది. వారు ఉంటారు గదా? తరవాత మాట్లాడవచ్చు." అన్నాడు గిరిధారి.
.jpg)
