Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 9

 

    "ఇంతకీ ఆ అమ్మాయికి ఎవరూ లేరా?' ఆశ్చర్యంగా అడిగింది ఇందిర.
    "ఎవ్వరూ లేరనే చెప్పాలి. కాని, ఇందిరా నీతో నేనెట్లా చెప్పాలి. నా అదృష్టం నన్ను వెక్కిరించింది. నా జీవితంలో శాశ్వతమైన మలుపు తిరిగింది ఆరోజు -- కాని లోకంలో ఎంతమంది మగవాళ్ళు ఎంత మందితో అక్రమంగా తిరగటం లేదు. సరోజ నన్ను రెచ్చగొట్టింది. ఆ మైకంలో నాకు ప్రపంచం కనబడలేదు. కొన్నాళ్ళ కు తాను తల్లి కాబోతున్నట్లుగా చెప్పింది. నా నెత్తిన పిడుగు పడ్డట్టయింది. నేనేం చెయ్యాలి? నా కర్తవ్యమేమిటి"
    ఆ రాత్రి తోటలో గుండెలు పగిలేలా ఏడ్చాను. ఎందుకు? నీరజను నా జీవితంలో నుంచి తొలగించాలనుకుంటే ఎందుకు బాధపడతాను. నేను ఘోరం చేశాను -- చూసి తొక్కినా, చూడక తొక్కినా నిప్పు కాలే తీరుతుంది. పొరపాటయినా తప్పు తప్పే కదా!" ఆయాసంతో క్షణం ఆగదు సురేంద్ర.
    లోపలి కెళ్ళి గ్లాసుతో నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది ఇందిర చేతితో గ్లాసు అవతలకు నెట్టేసి మళ్ళీ చెప్పటం మొదలు పెట్టాడు.
    "అసలు ఒక పొరపాటు చెయ్యకుండానే ఉండాలి గాని ఆ పొరపాటు దిద్దుకోవటానికి ఇంకా కొన్ని పొరపాట్లు విధిగా చెయ్యవలసి వస్తుంది. అందుకే పాప భీతి నన్ను రకరకాలుగా భయపెడ్తున్నా సరోజకు పది వేల రూపాయలు ఇచ్చి, ఈ సమస్యను ఏ విధంగా నైనా పరిష్కరించమని ప్రాధేయపడ్డాను. నా దీనత్వం. నా ఆత్మాభిమానం, నా హోదా , అంతస్తు -- అన్నీ మట్టి పాలు చేసి దీనాదిదీనంగా అర్ధించాను. నాకోసం కాకపోయినా అమాయకురాలైనా నీ తోటి స్త్రే కోసం చెయ్యమన్నాను."
    పదివేల రూపాయలు ఒక్క మొత్తంగా ఇవ్వ గలిగిన నన్ను- ఆ పది వెలతో వదిలి పెట్టటం ఏమంత లాభదాయకం కాదను కుందేమో మరి?
    నా మాటలకు సరోజ నవ్వింది. "అమాయకురాలైన తోటి స్త్రీ " అంటున్నానని పరిహాసించింది. మీ భార్య కాబట్టి ఆ మాటంటూన్నారు. ఆడదంటే అంత చులకన పనికి రాదు. మీరిచ్చిన డబ్బుతో పేపర్ల లో వేయిస్తాను ఫోటోలు పత్రికలకు పంపుతాను" అని బెదిరించింది అప్పటికే ఆఫీసంతా తెలిసిపోయింది. నీ ఇష్టమొచ్చినట్టు చేసుకోమన్నాను.మర్నాడు ఇన్ని మాత్రలు తీసుకొచ్చి "ఇవి నిద్రమాత్రలు నన్ను పెళ్ళి చేసుకుంటే సరే లేకపోతె ఇవి అన్నీ మింగి చస్తాను" అని రాగాలు మొదలు పెట్టింది. నిజంగా అన్నంత పని చేస్తుందేమోనని- ఈ చేసిన పాపం చాలదన్నట్టు స్త్రీ హత్యా దోషం -- అందులోనూ గర్భవతి -- ఆ ఆలోచనతో బెదిరిపోయాను. నీరజకు నెమ్మదిగా చెప్పి క్షమార్పణ కోరుకుందామని ఎన్నో అనుకున్నాను కాని చెప్పటానికి నాకు ధైర్యం చాలలేదు. సరోజ ను తీసుకొచ్చి తరువాత ఇటువంటి పరిస్థితిలో ఈ పెళ్ళి చేసుకోవలసి వచ్చింది అని చెప్పాలను కున్నాను కాని, సరోజ నాకా అవకాశమే ఇవ్వకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తరువాత ఆలోచించాను, నీరజను ఏ విధంగా ఒప్పించగలను? అభిమానవతయిన నీరజ -- సరోజ లో కలిసి వుండి నాతొ సంసారిక జీవితం గడపగలదా! అంతకంటే చిత్రహింస ఆమెకు మరింకేదైనా ఉంటుందా? అసలు సరోజను మా ఇంటికి తీసుకురాకుండా ఉండవలసింది కాని, అన్ని అట్లా జరిగినయ్యో , అదీ అట్లాగే జరిగింది. అందుకని ఆ ప్రయత్నం విరమించుకుని నీరజను తలుచుకుని నాలో నేనే కుమిలి పోయెవాడ్ని. ఆ దుర్మార్గురాలు ఏదైతే చెప్పి నన్ను మభ్యపీట్టి పెళ్ళి చేసుకుందో అది అబద్దం. తరువాత నాకీ విషయం తెలిసింది. ఏం చెయ్యను. ఆరోజు సరోజను కాలి బూటుతో నా చేతుల్లో సత్తువ కొలదీ కొట్టాను. రెండు రోజులు పిచ్చి పట్టినట్టు తిరిగాను.
    మూడో రోజు రాత్రి కాబోలు ఇల్లు చేరాను. సరోజ నా కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. తన తప్పులన్నీ మన్నించి నీరజను తీసుకు రమ్మని బ్రతిమిలాడింది. దేవత లాంటి నీరజ నీడ కూడా ఈ దౌర్భాగ్యుడు నోచుకోలేదు అని అనుకుని- ఏమీ మాట్లాడకుండా లోపలి కెళ్ళిపోయాను. ఇనుప కడ్డీల బోనులో చిక్కుకుపోయాను నేను.  ఆ జీవితం నాకెంత కంటకప్రాయమైనా  విధిగా అనుభవించక తప్పదు. ఆ ఫలితమే ఈ పాప" చెప్పవలసిందిం కేమీ లేనట్లు -- ఒకరకంగా ఇక చెప్పలేనట్లు నీరసంగా కూర్చుండి పోయాడు సురేంద్ర.
    ఇందిర నెమ్మదిగా లేచి లోపలి కెళ్ళింది. నీరజ స్థాణువు లా చలనం లేకుండా కూర్చుని ఉన్నది.
    "నీరూ, పద-- అతను ఎంత ఆవేదన  పడుతున్నాడో పాపం -- రా. అతనితో వెళ్ళు -- నా మాట వినవూ?"
    "నీ ఇంట్లో నీకు భారంగా బరువుగా ఉంటాననుకున్నావా?' రోషంగా అంది నీరజ.
    "నీరజా" చైతన్యమే లేనట్లు దిగ్భ్రాంతి గా చూస్తూ ఉండి పోయింది ఇందిర.
    "ఇందూ! తన నుంచి వేరైపోయిన ఈ జీవితం మళ్ళీ ఇక తనతో ముడి పడదని చెప్పు. వెళ్ళు ఇందూ. వెళ్ళు. నేను భరించలేను ఈ వాతావరణం.
    "నీరజ   ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. పోనీ నీ కోసం కాకపోతే పాప కోసమైనా..."
    "పాపకోసం నేను అక్కడికి వెళ్ళటం ఎందుకు?"
    "పోనీ అతనే నీ దగ్గరకు వస్తాడు."
    "ఇందూ! నీ డాక్టరు తెలివితేటలు కట్టిపెట్టు. వేళాకోళానికి కూడా ఒక హద్దు ఉంది తెలుసా" ఒకరకంగా కేకలు పెట్టినట్టే మాట్లాడసాగింది. "ఇంతకీ ఏమంటావు నువ్వు" విసుగ్గా అంది ఇందిర    
    "నేను రాను  - ఇక ఆ తలపే మనసులో పెట్టుకోవద్దని చెప్పు"
    "అంతే నంటావా"
    "అంతే" ఖచ్చితంగా చెప్తున్న నీరజ కళ్ళ నుంచి ముత్యాల్లాంటి బిందువులు ఉన్నతమైన వక్షస్థలం నుంచి జారి ముక్కలై పడిపోయినాయి. దీర్ఘంగా నిట్టుర్పు విడుస్తూ లేచి వెళ్ళింది ఇందిర హాల్లోకి వస్తూనే ఆశ్చర్యంగా నాలుగు వైపులా చూసింది. సురేంద్ర జాడ లేదు. గబగబా గేటు దగ్గరకు పరుగెత్తింది. బార్లాగా వేసి ఉంచిన గేటు లోంచి ఒకడుగు ముందు కేసింది. అప్పటికే సురేంద్ర చీకటిలో కలిసిపోయాడు.
    ఆ రోజు ఆదివారం . వంటమనిషి సుందరమ్మ ఇందిరకూ, నీరజ కూ కాఫీ టిఫిన్లూ ఇచ్చి వంట పనిలోకి వెళ్ళిపోయింది. కాఫీ త్రాగి కప్పు టీపాయ్ మీద పెడ్తూ "ఇందూ! మా ఇంటి వైపు వెళ్ళొస్తా! చాలా రోజులయింది. చీరెలు, సామాను కూడా కొద్దిగా ఉందనుకో -- అవన్నీ ఎక్కడి వక్కడ వదిలేసి వచ్చాను-- ఇంటావిడ కు అద్దె కూడా ఇవ్వాలి" అంది నీరజ.
    "ఆ! వెళ్ళు వెళ్ళి ఖాళీ చేసి - అద్దె ఇచ్చేసి సామానంతా తీసుకొచ్చేసేయి"
    "ఖాళీ చేసెయ్యమంటావా?' నసుగుతూ అంది నీరజ.
    "మరి లేకపోతె త్వరగా రా" అని మళ్ళీ నీరజకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలి కెళ్ళి పోయింది ఇందిర.
    నీరజ నెమ్మదిగా లేచి చెప్పులు తొడుక్కుని బయలుదేరింది.
    సుమారు పన్నెండు గంటల ప్రాంతంలో రెండు పెట్టెలు -- వెంట ఒక యువతితో వచ్చింది నీరజ. ఇందిర పెట్టెలు లోపల పెట్టించి ఆ యువతి వైపు ప్రశ్నార్ధకంగా చూసింది.
    "ఇందూ ఈ అమ్మాయి మా ఇంటి గలావిడ చెల్లెలు కూతురు . పేరు భార్గవి" అని పరిచయం చేసింది.
    విచ్చిన గులాబీ లా నాజూగ్గా అందంగా ఉన్న భార్గవి ని చూస్తూ ఆప్యాయంగా కూర్చోమంది ఇందిర.
    నీరజ పాపాయి దగ్గర కెళ్ళింది. హాలులోకి తొంగి చూసిన సుందరమ్మ ఎవరో వచ్చారని గబగబా కాఫీ కలుపు కొచ్చి ఇచ్చింది.
    "వద్దండీ! నేనిప్పుడే భోజనం చేశాను" మొహమాటంగా అంది భార్గవి. "ఫరవాలేదు -- కాఫీ కేం ? ఎన్నిసార్లయినా తీసుకోవచ్చు -- ఆ ఇంతకీ ఏం చదువుతున్నావు?'
    "బి.ఎ పరీక్ష వ్రాశానండీ? మా అన్నయ్య కలకత్తా లో ఇంజనీరు గా పనిచేస్తున్నాడు. నేను కొద్ది రోజుల్లో అన్నయ్య దగ్గర కెళ్ళి పోతాను. అందుకని మా పెద్దమ్మ దగ్గర రెండు నెలలు ఉండి పోదామని వచ్చాను.'
    'మీ నాన్నగారేం చేస్తుంటారు" భార్గవి ని చూడగానే కలిగిన ప్రేమ వల్ల కుతూహలంగా అడిగింది ఇందిర.
    భార్గవి విచారంగా తలవొంచుకుంది.
    "మాకు అమ్మా, నాన్నా ఇద్దరూ లేరండీ. నేనూ మా అన్నయ్యా మా అక్కయ్య దగ్గర పెరిగాం -- నేనూ- నాకు అన్నయ్య అంతే!'
    "ఓ సారీ! ఏమనుకోకమ్మా" - అంటూనే వాకిలి వైపు చూసి "అరె! శేఖర్ ఎన్నాళ్ళకు దర్శన భాగ్యం కలిగింది - రండి. రండి!" అని ఆహ్వానించింది. ఇందిర . శేఖర్ చిరునవ్వుతో లోపలికి వచ్చి కూర్చున్నాడు.
    "ఈరోజు ఆదివారం కదా" ఇంట్లో ఏం తోచలేదు. అందుకని ఇటువైపు వచ్చాను" భార్గవి ని ఇందిరకు అభిముఖంగా కూర్చుంటూ అన్నాడు శేఖర్.
    "సుందరమ్మ గారూ ఇంకో కప్పు కాఫీ తీసుకురండి" అని వంటింటి వైపు చూస్తూ పెద్దగా చెప్పి  భార్గవి వైపు తిరిగింది ఇందిర. భార్గవి ఇబ్బందిగా సోఫాలో ముడుచుకుపోయి కూర్చున్నది. బెడురుతున్నట్టుగా ఆ పిల్ల పెద్ద పెద్ద కళ్ళు చూస్తుంటే ఇందిరకు నవ్వు వచ్చింది.
    "భార్గవీ!నీరజ లోపల ఉంది వెళ్ళు" అంది నవ్వుతూ.
    భార్గవి వెంటనే లేచి గబగబా పరుగు లాంటి నడకతో లోపలి కెళ్ళింది. ఆమె వెళ్తున్నప్పుడు పొడుగాటి జడలో పెట్టుకున్న ఒక్క గులాబీ కింద పడిపోయింది. ఆ పువ్వును చేతిలోకి తీసుకుంటూ "ఎవరీ అమ్మాయి" అనడిగాడు శేఖర్ ఇందిరను.
    ఇందిర శేఖర్ ను - శేఖర్ చేతిలోకి తీసుకున్న గులాబీ ని మార్చి మార్చి చూస్తూ " మా నీరజ అద్దెకున్న ఇంటి వారమ్మాయి భార్గవి" అని చెప్పింది. ఇందిర చూపులు గ్రహించినట్లుగా శేఖర్ తన చేతిలోని గులాబీ ని ఎదురుగుండా వున్న టీ పాయ్ మీద పెట్టాడు.
    ఇందిర సన్నగా నవ్వింది.
    కొంచెం సేపు ఇద్దరూ యేవో మాట్లాడు కున్నారు. ఇంతలో నీరజ పాపాయిని తీసుకుని వచ్చింది. వెనకాలే భార్గవి కూడా వచ్చింది.

                                    
    "అక్కా! నేనింక వెళ్తాను" అంది భార్గవి నీరజ నుద్దేశించి.
    "అప్పుడే ఏం తొందర? సాయంకాలం వేల్దువు గానిలే" అంది ఇందిర.
    భార్గవి తటపటాయిస్తూ నిల్చున్నది.
    "అక్కా! సాయంత్రం నాతొ వస్తావా! ఈ రాత్రికి అక్కడే ఉందువు గాని" అంది నీరజ నుద్దేశించి.
    "ఇందూ! భార్గవి వాళ్ళ అన్నయ్య కలకత్తా లో ఇంజనీరుగా పని చేస్తున్నాడు రేపు వస్తాడుట. భార్గవి వాళ్ళన్నయ్య తో కలకత్తా వెళ్ళి పోతుందన్న మాట. అందుకని ఇవ్వాళం తా తనతోనే ఉండమంటున్నది" అంది ఇందిరతో నీరజ --
    "నువ్విక్కడ వుంటే నీరజ తో ఉన్నట్లు కాదా! రాత్రికి భోజనం చేసి వెళ్ళచ్చులే! నీకేం భయం లేదు- నా కారులో దింపుతాను" అంది ఇందిర భార్గవి చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చుండబెట్టుకుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS