భార్గవి అయిష్టం గానే కూర్చుంది. శేఖర్ చూపులు మాత్రం మనసుని చికాకు కలిగిస్తున్నాయి.
"మీ రాజారావు గారేరి?" శేఖర్ ఇందిర నడిగాడు.
"ఏదో కొంత సామాను ఉండి పోయిందిట , తెచ్చుకుంటానని వెళ్ళాడు. ఇవ్వాళో రేపో రావచ్చు"
"భార్గవీ! నీకు ఇంకో అక్కయ్య ఉంది కదూ?" నీరజ అడిగింది.
"ఆ! ఉంది -- నా కంటే, అన్నయ్య కంటే బాగా పెద్దది. కాకినాడ లో ఉంటారు వాళ్ళు.
"మరి నీ చదువు...."
"బి.ఎ అయిపోయిందిగా ! అన్నయ్య చదవ మంటే ఎం.ఎ కలకత్తా లో చదువుతాను"
"అక్కడ మీకు తోడేవరుంటారు?' కుతూహలంగా అడిగింది ఇందిర.
"మాకు ఎవరున్నారు? అన్నయ్యకు నేను-- నాకు అన్నయ్యే గా-- అసలిప్పుడు అన్నయ్య రానే రాకపోను. ఇక్కడికి వచ్చాడని తెలిస్తే అక్కయ్య మా ప్రాణాలు తీసేస్తుంది."
"అదేమిటి? ఎందుకని? తల్లి తండ్రి లేని మీకు పెద్ద దిక్కు తనే కదా" విస్మయంగా అంది నీరజ.
తన కూతుర్ని అన్నయ్య చేసుకోడేమోననో లేకపోతె తొందరగా పెళ్ళికి ఒప్పుకోవటం లేదనో ఆవిడ కోపం. మా నిర్మల - అంటే మా అక్కయ్య కూతురు అందంగానే ఉంటుంది. బి.ఏ ప్యాసయింది. అసలు అన్నయ్య పెళ్ళి ఎప్పుడో కావాల్సిన మాట! ఎందుకో కారణం చెప్పడు కాని ఎప్పుడు అక్కయ్య అడిగినా "ఇప్పుడు కాదు- "చూద్దాం లే" అంటాడు.
కొత్తపోయి మామూలుగా మాట్లాడుతున్న భార్గవి మాటలు కుతూహలంగా వింటూ కూర్చున్నాడు శేఖర్.
కొంచెం సేపు నలుగురూ పేకాడుతూ కూర్చున్నారు. రెండు గంటల కావడంతో నీరజ , ఇందిర భోజనానికి లేచారు. శేఖర్ భోజనం చేసి రావటం చేత భార్గవి, శేఖర్ ని హాలులో వదిలేసి వాళ్ళిద్దరూ భోజనానికి వెళ్ళారు.
భార్గవి కూడా వాళ్ళ వెనకాలే బయలుదేరింది. శేఖర్ ఒకడూ ఉంటాడని -- శేఖర్ కి తోడుగా కూర్చోమని ఇందిర వారించడం తో సభ్యత కాదని అక్కడే కూర్చుంది.
మీ పేరు భార్గవా?"
"మరే. ఇందాకటి నుంచి వింటూనే ఉన్నారుగా! కొత్తగా అడుగుతారేం?"
"మీకు కోపం ముక్కు మీదే ఉన్నట్టుంది?" నవ్వుతూ అంటున్న శేఖర్ ని చురచుర చూస్తూ 'అతి చొరవ మంచిది కాదు." అంటూనే లేచి లోపలి కెళ్ళింది భార్గవి. శేఖర్ క్షణ కాలం విస్తుపోయినా వెంటనే కులాసాగా నవ్వుకున్నాడు. సుమారు 5 గంటల ప్రాంతంలో శేఖర్ వెళ్ళిపోయాడు. భోజనాలయిన తరువాత భార్గవి ని ఇంటి దగ్గర దింపి వచ్చారు ఇందిర నీరజ.
* * * *
పాపకు పాలు పట్టి ఇందిర పక్కలో వచ్చి కూర్చుంది నీరజ.
"పడుకోబెట్టక మళ్ళీ తీసుకోచ్చావెం?' అంది జరుగుతూ ఇందిర.
"పడుకుంటుందిలే"
"నీరజానువ్వుత్త మూర్ఖురాలివి!' నీలంగా ఉన్న ఇందిర కళ్ళు కొద్దిగా రక్త వర్ణాన్ని పులుముకుని వింత కాంతితో మెరుస్తున్నాయి. ఆ కళ్ళను చూచిన నీరజ చిరునవ్వు నవ్వింది.
"ఎందుకు నవ్వుతున్నావు? నవ్వు చేసిన ఘన కార్యనికా?" ఇంకా కోపంగా అంది ఇందిర.
"అబ్బబ్బ! పోనిస్తూ ఒకటే గోల" ఎప్పుడూ ఈ గోలేనా?"
పాప బుగ్గలను తన బుగ్గల కానించుకుని కళ్ళు మూసుకుంది నీరజ.
"ఇందూ! చూడు పాప బుగ్గలెంత మెత్తగా ఉన్నాయ్యో"
పాప బుగ్గలు ఇందిర బుగ్గల కానించి పక పకా నవ్వుతూ అంది నీరజ.
"నీరూ! నువ్వు మనిషివా! లేక ఏదైనా శిలవా" విస్మయంగా అంది. నవ్వుతున్న నీరజ ముఖం క్షణ కాలం నల్లబదిపోయింది. అంతలోనే తెప్పరిల్లి "శిలగా మారిపోయిన నా జీవితం పాప రాకతో చైతన్యమవుతున్నది ఇందూ. అలా కావాలని నువ్వు కూడా భగవంతుడ్ని ప్రార్ధించు" పాపను తీసుకెళ్ళి ఉయ్యాలలో పడుకోబెట్టి ఇక మరేమీ మాట్లాడకుండా వెళ్ళి తన మంచం మీద బ్లాంకెట్ ముసుగు పెట్టుకుని పడుకుంది నీరజ.
ఇందిర లైటు ఆర్పేసి బెడ్ రూమ్ లైటు వెలిగించి వచ్చి పడుకున్నది. ఎంతకీ నిద్ర రాలేదు. ఆలోచనలు ఈగల్లా ముసురుకున్నాయి.అసలేమిటి తన జీవితం? క్షణ క్షణం నిరాశా నిస్ప్రుహాలె తనకైన వాళ్ళెవ్వరూ లేకుండా పోయారు. తను ఎవరికీ ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఎన్నాళ్ళిలా నిర్లిప్తంగా గడపగలను. తన జీవితంలోకి వెలుగనేది వస్తుందా? తన కన్నీటి మీద ఎందుకింత విరక్తి కలిగింది? ఈ ఒంటరి జీవితం ఎన్నాళ్ళు ? ఆఖరి క్షణాల్లో తండ్రి మనసుకు శాంతి కలిగించ లేకపోయింది. తనతో కలిసి చదువుకుని తనతోటే పనిచేస్తున్న ఆనంద్ విసుగు పుట్టేవరకు అడిగి అడిగి ఎవర్నో చేసుకున్నాడు. పువ్వుల్లో పెట్టి పూజిస్తా నన్నాడు రఘు రామ్ . మొదటి నుంచి తన జీవితం తమాషా గానే ఉంది. శ్రీధర్ మీద పగ తీర్చుకోవాలనుకుంది. నిజానికి అతను అంత పెద్ద అవమానం తననెం చెయ్యలేదు. ఆరోజుల్లో తనెంత పొగరుగా ఉండేది! డాన్సులనీ, డ్రామా లనీ తిరుగుతూ జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ హాయిగా గడుపుతున్న రోజుల్లో శ్రీధర్ తో విచిత్రంగా తగాదాలో పడ్డది. ఆ తగాదా అంతటితో పోకుండా తన జీవితాన్నే మార్చేసింది' హా, ఎక్కడున్నాడో శ్రీధర్! ఈ అభాగ్యురాలు ఇంకా జ్ఞాపకం ఉంటుందా? ఈ దేశంలో ఎంతమంది ఆడపిల్లల జీవితాలిలా అంధకారం లోనే అంతమై పోవటం లేదు. స్త్రీకి వ్యక్తిత్వం ఉన్నదని - ఆడదాని మనసు కూడా మనసే నని గుర్తించే మగవాళ్ళేరి....? ఎవరినయితే అవమానించి సాధించాలనుకుందో అతనిచేతే తను నిర్దాక్షిణ్యంగా వంచించబడింది.
నెమ్మదిగా ఇందిర కళ్ళు మూతలు పడి పోయినాయి.
తెల్లగా బలంగా ఉన్న అకారమేదో లీలగా కళ్ళలో మెదలసాగింది. అంతలో ఏదో పెద్ద ,సుడిగుండం వైపు ఆ ఆకారం కదిలిపోసాగింది. అందుకోవాలని అతని వైపు తనెంత వేగంగా పరిగెట్టినా అతను అందటం లేదు. నవ్వుతూ అతను వెళ్ళిపోతున్నాడు. ఇద్దరి మధ్యా అంతులేని దూరం -- అనంతమైన అగాధం తనలో శక్తి నశించి పోతున్నది. కాళ్ళల్లో సత్తువ లేదు. ఇంతలో ఏదో పెద్ద కాంతి పుంజం, కళ్ళు చెదిరి పోతున్నాయి. ఆ వెలుగు తన వైపే వస్తున్నది. తాను ఆ వెలుగు చూడలేదు. తన కళ్ళ మీదకే వస్తున్నది ఆ వెలుగు -- విపరీతమైన భయం.
కెవ్వున కేక వేసి లేచి కూర్చున్నాది ఇందిర. ముఖమంతా చెమట పట్టింది.
నీరజ ఆదుర్దాగా ఇందిరను కుదుపుతూ
"ఏమిటి? ఇందూ? ఏమైంది" అంది.
ఇందిర మాట్లాడలేదు. నీరజను బల్లిలా కరుచుకుపోయింది. "ఏదైనా కల వచ్చిందా?" వీపు నిమురుతూ అడిగింది నీరజ.
"నీరూ! ఏ పరిస్థితుల్లోనూ నన్ను వదలవు కదూ! నువ్వు వెళ్ళిపోకు నీరజా. నేను భరించలేను. నూతిలోంచి మాట్లాడుతున్నట్లున్నది ఇందిర గొంతు.
నీరజ ఇందిరను వదిలించుకుని సరిగ్గా కూర్చోబెట్టింది.
ఇందిర దీనంగా కళ్ళెత్తి చూసింది. నీరజ చిన్నగా నవ్వింది ఇందిరను చూసి.
"ఎందుకు నవ్వుతావు?"
"ఇంత పెద్ద డాక్టరువి. నిమిషాల మీద మనుషుల్ని కూరలు తరిగినట్టు తరిగిపారేయ గలవు?...."
నీరజ మాటలు పూర్తీ కాకుండానే "నీరజా" అని అరిచింది ఇందిర.
"నిజం. ఇందూ" నీకు ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి నీ వృత్తి . నీ వ్యక్తిత్వం సంఘంలో నీ హోదా గుర్తుకు తెచ్చుకో! ఇంత బేలవై పొతే ఎలా?"
"అంటే నాకు వృత్తి ధర్మం . హోదా వ్యక్తిత్వం తప్ప ఇంకే ఊహా ఉండకూడదా! నేనొక రాయి లాగ రాప్పలాగా ఉండాలనా నీ ఉద్దేశ్యం"
"నా ఉద్దేశం అది కాదు. కాస్త ధైర్యంగా గట్టిగా గంభీరంగా ఉండాలని. ఇందూ! ఒక్క విషయం ఆలోచించు -- నాకంటే దీనాతి దీనమైన స్థితిలో లేవు కదా నువ్వు? నాకు ధైర్యం చెప్పవలసింది పోయి నువ్వే -- ఇలా...."
"అపు నీరజా అపు! నా గుండెల్లో ఎంత అగ్ని మండుతున్నదో నీకు తెలియదు. భగవంతుడిచ్చిన ఆయుర్దాయం ఎప్పుడు తీరుతుందా అని ఎదురుచూస్తూ రోజులు, క్షణాలు లెక్క పెట్టుకుంటూ జీవిస్తున్నాను-- నీరజా , నీకు తెలియదు. నా హృదయంలో ఇది అరని మంట -- అది క్షణ క్షణం నన్ను దహించి వేస్తున్నది - నాకు శాంతి లేదు. నేనీ అశాంతిని భరించ లేకుండా ఉన్నాను" వెక్కి వెక్కి ఏడుస్తున్న ఇందిరను శిలా ప్రతిమలా చూస్తూ కూర్చుంది నీరజ.
"ఏమిటి పిల్ల హృదయంలో ఆరని అగ్ని - ఈ అశాంతికి కారణ మేమిటి?" ఆశ్చర్యంగా ఆలోచిస్తూ "ఇందూ! నీ బాధేమిటో నాతొ చెప్పు -- కొంతభారం తగ్గుతుంది." ఆప్యాయంగా అడిగింది. ఇందిర తలవొంచుకు ని నిశ్చలంగా చూస్తూ కూర్చుంది. మాట్లాడలేదు.
"ఇందూ! రాజారావు వచ్చిన తరువాత నిన్ను తనకి అప్పగించి నా దోవన నేను పోతాను-- అతనే నిన్ను సరయిన మార్గంలోకి తిప్పుకుంటాడు"
"వద్దు, వద్దు - అంత పని మాత్రం చెయ్యకు. నాకు ఎవరున్నారు నీరజా! నన్ను ఎందుకు నీ నుంచి వేరు చేస్తావు"
"పిచ్చిదానా! జీవితాంతం ఇట్లా ఎవ్వరూ లేకుండా ఉంటావా?"
"నీరూ! అడవి కాచిన వెన్నెలలా ఎండి మోడై పోతున్న నీ జీవితాన్ని చూస్తూ నేను హాయిగా పెళ్ళి చేసుకుని సుఖంగా వుంటానని ఎలా అనుకున్నావ్?"
"ఇది మరీ బాగుందే! నేను ఈ జీవితాన్ని కావాలని ఆహ్వానించాను. ఇప్పుడు అయన తప్పేం లేదుగా -- నేను కావాలని సంతోషంగా కోరుతున్న ఈ జీవితం అసంతృప్తి కరంగా వుంటుందని నేను కలలో కూడా అనుకోను. పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు"
అసలది కాదు -- నేను ఎప్పటికి పెళ్ళి అనేది చేసుకోబోవటం లేదు. ఇన్నాళ్ళు ఒంటరి జీవితానికి నీ రాకతో కాస్త మార్పు వచ్చింది -- మళ్ళీ నన్ను ఒంటరిగా వదిలేసి నీ దారిన నువ్వు వెళ్ళిపోతే ........"
"అగు, ఇందూ! ఆయనతో వెళ్ళిపోతే ఏం చేసేదానివి?"
"అది వేరు నీరజా! అప్పుడు సంతోషంగా నిన్ను పంపేదాన్ని. ఎలాగూ నువ్వు అతని దగ్గరకు వెళ్ళినప్పుడు నా దగ్గరే ఉంటె యేమని అడుగుతున్నాను" అంది అసహనంగా.
"జూగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్టు. నన్ను దగ్గర పెట్టుకున్నావంటే నీలో వేదాంతం ముదిరి సన్యాసుల్లో కలిసిపోతావు" అంది నీరజ హాస్యంగా నవ్వుతూ.
"నీరూ! చాలా మాటలు నేర్చుకున్నావు. నీతో నేను వాదించలేను. విసురుగా అంది ఇందిర.
"ఇన్ని మాటలు చెప్పావు - అసలు నువ్వు పెళ్లెందుకు చేసుకోవో నాకు చెప్పాలి ముందు - ఆ తరవాత నేను నీ దగ్గరే ఉండే విషయం నిర్ణయిద్దాం"
"నీరూ! పెళ్ళికి కొన్ని అర్హతలుండాలి కదూ"
"అర్హతలంటే!" ఆశ్చర్యంగా అంది నీరజ.
"అందం, చదువు, గుణం మొదలైనవి అని చెప్తారు -- నా దృష్టి లో కలుషితం కాని పవిత్రమైన మనసు ఉండాలి-- అది నాలో లేదు. అందుకని పవిత్రమైన వివాహ బంధానికి నేను అర్హురాలిని కాను" దృడంగా అంది ఇందిర.
"అంటే నీ భర్తను నీవు నిర్ణయించుకున్నా వన్న మాట! ఎవరతను ఇన్నాళ్ళు రహస్యంగా ఉంచావా" నేను నిర్ణయించు కోలేదు నీరజా! భగవంతుడే నిర్ణయించాడు -- కాని అతనికి భార్యను కాలేను -- ఆ విషయం వదిలెయ్యి. ఫలితం ఏమిటంటే నాకీ జన్మలో పెళ్ళి కాదు -- కాబట్టి నిరభ్యంతరంగా నువ్వు నా దగ్గరే ఉండవచ్చు."
నీరజకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కళ్ళు మూసుకుని పడుకుంది ఇందిర.
