Previous Page Next Page 
ఆఖరి మజిలీ పేజి 8

 

    "మరి ఈ విషయం మీ వారికి తెలియదా?'
    "ఏమో! తెలిస్తెం చేస్తారు?"
    "అదేమిటి! కనీసం ఈస్థితిలో నన్నా నిన్ను ఆడుకొని ఆ మనిషి మనిషా"
    'అంత అదృష్టమే నా కుంటే అసలిలా జరిగేది కాదు.అందుకే ఈ లోకంలో నేను ఎవరి కోసం జీవించాలో ఈనాటికీ నాకు సమాధానం ప్రశ్నగానే మిగిపోతున్నది...."
    ఇందిర కళ్ళు మేఘాల్లాగా వర్షించసాగాయి.
    నీరజ కళ్ళు తుడుచుకుని ఇందిర కళ్ళు తుడుస్తూ , "పిచ్చిదానా, నా కోసం బాధపడుతున్నావా?"
    "నీరజా! నిన్నా స్థితిలో చూడటం ....నా దురదృష్టం.
    "కాదు ఇందూ. ఎన్నటికీ కాదు -- జీవితం ఒక్కొక్క మలుపు తిరుగుతుంటే ఒక్కొక్క నిజాన్ని తెలుసుకోగలిగాను.  మనుషులంటే ఏమిటో అర్ధం చేసుకున్నాను. భగవంతుడికి దగ్గర కావటానికి ఇవన్నీ నాకు సహకరించి నయి....కాని భగవంతుడు నాకు ఇంకో పరీక్ష పెట్టాడు.
    "ఇంకా ఏముంది పరీక్ష పెట్టడానికి?"
    "ఇప్పుడీ స్థితిలో సరోజ పాపను నేను పెంచి పెద్ద చెయ్యాలి! ఇది విషమ పరీక్ష కదూ! సరోజకు ఆఖరి క్షణాల్లో నేనిచ్చిన మాటకు న్యాయం చేకూర్చగలనా. అని నా సందేహం"
    ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. నీరజ లేచి లోపలి కెళ్ళింది. ఇందిర తలుపు తీసింది.
    "డాక్టర్ ఇందిర మీరేనా?" ఒకడుగు లోపలి కేస్తూ అన్నాడా వ్యక్తీ.
    "అవును" ఎవరు మీరు?... తప్పుకుని లోపలి కోస్తూ అడిగింది ఇందిర. తలంతా చెరిగిపోయి మాసిన బట్టలతో ఆ రాత్రి వేళ వచ్చిన ఆ వ్యక్తీ ఎఱ్ఱని కళ్ళ వంక భయంగా చూస్తూ అనుమానంగా ఒక్క క్షణం ఆగింది. అంతలోనే అతను పెద్దగా "నీరూ....! అని కేకలాటిది పెట్టి నేల మీద కుప్పలా కూలిపోయాడు. ఇందిర తలతిప్పి చూసేసరికి గుమ్మంలో ప్రతిమలా నిల్చుని ఉంది నీరజ.
    ఒక్క అంగలో నీరజ దగ్గరకు పరుగు తీసి చెయ్యి గట్టిగా పట్టుకుంది.
    "ఇతను....ఇతను...."
    "సురేంద్ర గారు! సరోజ భర్త" నీరజ కంఠం ప్రశాంతంగా ఉంది. అతను దీనంగా కళ్ళెత్తి ఇద్దరి వంక చూశాడు. నీరజ కళ్ళల్లో చూపు నిలిపి క్షణ కాలం పిచ్చివాడిలా చూసి తల దించుకున్నాడు. ఇందిర అప్రతిభురాలై చూస్తూ నిలబడిపోయింది. ఇంతలోనే తెప్పరిల్లి నెమ్మదిగా సురేంద్ర దగ్గర కెళ్ళింది.
    "సురేంద్ర గారూ! లేవండి" లేచి సోఫాలో కూర్చోండి" అనునయంగా అంది.
    "డాక్టర్! మీతో నాకు పరిచయం లేదు కాని, కాని.... నేను దుర్మార్గుడ్ని " అందుకే భగవంతుడు నాకు మంచి శిక్ష వేశాడు. ఇది చాలదు డాక్టర్ , ఇంకా కావాలి. నాకేదైనా .... డాక్టర్ ! నాకేదైనా ఇంత విషం ఇప్పించండి. నేనీ జీవితాన్ని భరించలేను."
    "మీరు కాస్త ధైర్యం తెచ్చుకోండి . సరోజను బ్రతికించాలని విశ్వప్రయత్నం చేశాం? కాని లాభం లేకపోయింది. నెమ్మదిగా అంది ఇందిర    బెదిరినట్టుగా చూశాడు సురేంద్ర.
    "సరోజ పాపిష్టిది . ప్రశాంతమైన నా జీవితంలో సుడి గాలిలా వచ్చి నన్ను సర్వనాశనం చేసింది. ఏ దురాహా లేని నన్ను మాటలతో మభ్యపెట్టి నన్ను తన వైపు లాక్కుంది. ఆ మైకం లో నాకు కళ్ళు కనబడలేదు. నేను కళ్ళు తెరిచేసరికి పరిస్థితి చెయ్యి దాటిపోయింది. " అతను తల రెండు చేతుల్లో పట్టుకుని చెప్పుకు పోసాగాడు.
    "పోనీలెండి . ఇప్పుడవన్నీ ఎందుకు? పాపం నీరజ సరోజ కోసం ఎంతో బాధపడింది! విధి అలా ఉంది -- ఏం చెయ్యలేక పోయాం"
    "ఇందూ! ఇదిగో పాప! తీసుకెళ్ళి చూపించు" పొత్తిళ్ళ లలో పాపను తీసుకొచ్చింది నీరజ.
    ప్రశాంతంగా పడుకున్న పాపను-- ముమ్మూర్తులా సురేంద్ర ను పోలి ఉన్న ఆ చిన్నారి పాపను నెమ్మదిగా సురేంద్ర దగ్గరకు తీసుకు వచ్చింది ఇందిర. సురేంద్ర కన్నెత్తయినా చూడలేదు.
    "వద్దు డాక్టర్. వద్దు! నేను ఆ పాప ఫలాన్ని చూడాలని రాలేదు పోయిన అదృష్టాన్ని తిరిగి పొందుదామని వచ్చాను. నా ఇంటి వెలుగుని తీసు కేల్దామని వచ్చాను...."
    "చూడండి! ఈ విషయాలన్నీ ప్రశాంతంగా మాట్లాడుకోవలసినవి తొందర పడకండి! "ఇదిగో పాప!' అనునయంగా నెమ్మదిగా అంది ఇందిర.
    "తీసుకు వెళ్ళండి డాక్టర్. నేను చూడలేను. చూడాలని కూడా నాకు లేదు. నేను వచ్చిన పని చెప్పాను కదా!"
    "సరోజ లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు ఈ లోకంలో అని చెప్పు ఇందూ"
    బాణం లాగా ఇద్దరి చేవుల్లోనూ నీరజ మాటలు గుచ్చుకున్నాయి.
    "నీరజా!" నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూసాడు సురేంద్ర.
    "ఇంకా ఎందుకండి నన్నవమానిస్తారు? చేసిన అవమానం చాలదా. చచ్చిన పామును ఇంకా ఎందుకు కొట్టడం? మీకు నేనేం అపకారం చేశానని...." తలతిప్పుకుని వెక్కివెక్కి ఏడవసాగింది నీరజ.
    సురేంద్ర హృదయం వెన్నలా కరిగిపోయింది. ఒక్క ఉదుటున వెళ్ళి నీరజను బలంగా హృదయానికి హత్తుకుని ఓదార్చాలనిపించింది.
    "చచ్చిన పాము నువ్వు కాదు నీరజా. నేను..... చేసిన పాపాన్ని అనుక్షణం అనుభవిస్తూ ఎంత నరకాన్ననుభావించానో -- నిన్ను దూరం చేసుకున్న నా దౌర్భాగ్యాన్ని నిందించుకుంటూ ఎంత కుమిలి పోయానో - నీకెలా తెలుస్తుంది? నువ్వెలా నమ్ముతావు?"
    "నీరూ! ఏమిటిది? ఊరుకో. మందలింపుగా అంది ఇందిర.
    "విలువ కట్టలేని పవిత్రతతో ,మహోన్నతశిఖరం మీద నువ్వున్నావు" నీ నీడ కూడా తాకలేని అంధ కారంలో నేనున్నాను-- కాని, నీరజా! తన తప్పు తెలుసుకుని క్షమించమని అర్ధించిన వాళ్ళని క్షమించటం ధర్మం కాదా! చెప్పు నీరజా! చెప్పు...."
    ఇందిర ఆశ్చర్యంగా ఇద్దర్నీ మార్చి మార్చి చూడసాగింది.
    "స్త్రీ సహజమైన బలహీనత వల్ల ఏదో మాట్లాడాను-- మీరేం తప్పు చేశారని అంతగా క్షమార్పణ ఆడుగుతారు -- నేనే ఆవేశంగా మాట్లాడాను నన్ను క్షమించండి-- కాని నన్ను మాత్రం మళ్ళీ మీ ఇంట్లోకి ఆహ్వానించ కండి" దుఃఖంతో నీరజ గొంతు పూడుకు పోయింది.
    "నీరజా! మీ ఇద్దరి మధ్యా నేను కల్పించుకుని మాట్లాడటం సభ్యత కాదు -- కానీ నీ మేలు కోరే ఒక ఆత్మీయురాలిగా చెప్తున్నాను-- ఆలోచించుకో-- అనవసరంగా అవేహంలో జీవితం పాడు చేసుకోకు" లాలనగా నీరజ చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ అంది ఇందిర.
    నీరజ వస్తున్న వెక్కిళ్ళ ను ఆపుకుంటూ లోపలి కెళ్ళింది.
    ఇందిర కేం చెయ్యాలో పాలు పోలేదు. పాపాయి గుక్కలు పట్టి ఏడవసాగింది. గబగబా లోపలి కెళ్ళి అయిదు నిమిషాల్లో పాలు కలిపి తీసుకొచ్చి పాపాయికి పట్టసాగింది. పొట్ట నిండా పాలు తాగిన పాపాయి కొద్ది సేపట్లోనే నిద్ర పోయింది. అక్కడే సోఫాలో కూర్చున్న సురేంద్ర ఇదంతా గమనించకుండా ఉండలేక పోయాడు. సురేంద్ర మనసుకు ఒకరకమైన ఉద్వుగ్నత-- రక్తంలో ఒక లాంటి సంచలనమూ కలగసాగాయి.
    పక్క సర్ది తెల్లని చిన్న బ్లాంకెట్ పాపాయి కి కప్పి దిండ్లు సర్ది చిన్నగా ఉయ్యాల ఊపి సురేంద్ర కేసి తిరిగింది ఇందిర.
    ప్రతిమలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడతను. నెమ్మదిగా వచ్చి అతని కెదురుగా కూర్చుంది.
    "ఒక మనిషి అజ్ఞానం లో చేసిన తప్పుకి ఎందరు ఎన్ని విధాలుగా శిక్ష అనుభవిస్తున్నారా. అని ఆలోచిస్తున్నాను. నాతోటి ఏ రకమైన భాన్ధవ్యమూ లేని మీరు కూడా ఇందులో భాగం పంచుకుంటున్నారు కాని...కాని...మీరైనా నన్ను నమ్ముతారా? మీకు తెలియదు -- నీరజ నా ప్రాణం -- ఇది ఎవరు నమ్మినా నమ్మక పోయినా నా ఆత్మ సాక్షిగా నిజం -- ఇందిరా-- మీరెలా గినా నీరజను ఒప్పించాలి--"
    "సురేంద్ర గారూ ! నన్ను "మీరు" అని 'గారు' అని మన్నించనక్కరలేదు. నేను మీ చెల్లెలు లాంటిదాన్ని. నీరజకు నాకు మధ్య ఉన్న స్నేహం మీకు బాగా తెలియదు -- అన్ని సమస్యలు కాలమే తీర్చగలదు. ఈ సమయంలో మీకు కావలసింది సహనం -- ఓర్పు , అంతే -- మీరు బాధపడకండి -- నీరజ ఏదో అర్ధం లేని ఆవేశంలో ఉంది. దాని విషయం మీకు మాత్రం తెలియదా?" తలవంచుకుని నెమ్మదిగా అంటున్న ఇందిర ను విప్పారిత కళ్ళతో ఆశ్చర్యంగా చూడసాగాడు సురేంద్ర.
    "ఇందిరా! నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ స్థితిలో కూడా -- మీ స్నేహితురాలికి యింత ద్రోహం చేసిన నన్ను మీరు.....మన్నించి ఇంత మర్యాదగా ....." అతని మాటలను మధ్యలోనే త్రుంచేస్తూ "అనవసరంగా ఎందుకు మిమ్మల్ని మీరు కించపరుచుకుంటారు -- అన్నిటి కంటే విధి బలీయమైంది-- దాని చేతుల్లో మనం బొమ్మలం మాత్రమే కదా! నీరజ దేవత లాంటిది -- దాని మనసు వెన్న"
    కాదు ఇందిరా! నాకు తెలుసు. ఒక్కొక్క సారి పట్టుదల వస్తే నీరజ తన నిర్ణయాన్ని ఏ పరిస్థితుల్లోనూ సదలించుకోదు, లాభం లేదు-- మీ లాంటి మంచి మనుషుల మధ్యలో ఉండే అర్హత నాకు లేదు -- అందుకనే భగవంతుడు నన్ను దూర తీరాలకు చిక్కని చీకటిలోకి విసిరేశాడు"
    మీరలా భ్రమ పడుతున్నారంతే! అన్ని విషయాలకీ ఈ జీవిత సమస్యకూ సంబంధమేమిటి? మీరనుకునే విధంగా ఎన్నటికీ జరగదు. ఒక రకమైన ఆత్మవిశ్వాసంతో అంది ఇందిర.
    "నన్ను మీరైనా నమ్మితే కొంతవరకు అదృష్ట వంతుడ్నే...."
    "మీరు ముందు నన్ను మీ చెల్లెలిగా స్వీకరిస్తే తప్ప మీరు చెప్పేది నేను వినను. అంత దుఃఖం లోనూ నవ్వకుండా ఉండలేక పోయాడు సురేంద్ర.
    "ఓ అదా! సరేలెండి అలాగే"
    "ఇప్పుడు చెప్పండి. కొంచెం ముందుకు వంగి అడిగింది ఇందిర    "ఒకరోజు లంచ్ టైములో ఏదో ద్రాప్టు మీద సంతకం కావాలని వచ్చింది సరోజ. ఆరోజే ఆమెతో పరిచయం. తనంతట తనే ఏవేవో మాట్లాడింది. ఆ మర్నాడు కూడా సరిగ్గా నేను టిఫిను తినబోతుండగా వచ్చింది. ఒక అయిదు రూపాయలు కావాలని. రెండు రోజుల నుంచి అన్నం తినడం లేదని -- ఏమిటేమిటో చెప్పింది. ఆ క్షణంలో నిజంగా నాకు జాలేసింది. నేను ఆఫీసర్ని -- నన్ను అడగటానికి ఎందుకు వచ్చింది? తనతో పనిచేసే తోటి వాళ్ళేవార్నయినా ఎందుకు అడగలేక పోయింది. అన్న ఆలోచనే నాకు రాలేదు. అమ్మాయి మీద జాలి తప్ప వేరే ఏ భావమూ నాలో కలగలేదు. నా టిఫిను  బాక్సు సరోజ ముందుకు నెట్టి తినమన్నాను. మారుమాట్టాడకుండా గబగబా తినేసింది. పది రూపాయలిచ్చాను.
    బస్ స్టాండ్ ముందు నుంచి ఆఫీసు కి పోతుంటే చేయ్యూపేది. మర్యాదకు కారాపి ఎక్కించుకునే వాడ్ని. గంటల తరబడి కబుర్లు చెబుతూ కూర్చునేది. ఏ దురదృష్ట దేవతో నా నెత్తిన కూర్చుని సరోజ మాయలో పడవేసింది. నేనెందుకు ఆ పాపిష్టి దానికి బుద్ది చెప్పి ఉండకూడదు?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS