Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 9


    డాక్టరు కళ్యాణి యీవిడేనా? ఇంత చిన్నదా? తనేమో ఏ నలభై, నలభై అయిదేళ్ళో వుంటాయన్నట్లు ఊహించుకుంది. చూస్తే యీవిడకి ముఫ్ఫైరెండో, మహావుంటే ముఫ్ఫైఐదో వుంటాయి. బాగా తెల్లగా, పొడుగ్గా, లావు కాక సన్నంకాక చక్కగా వుంది. ఆధునికంగా ముడివేసుకుంది. తెల్లటి ఫారెన్ నై లక్స్ చీరమీద పెద్దపెద్ద గులాబీలు వున్న చీర, తెల్లటి బ్లౌజ్ వేసుకుంది. మెడలో సన్నటి గొలుసుంది. కుడిచేతికి యేమీ లేవు. ఎడంచేతికి వాచిమాత్రం వుంది. చాలా అందంగా సింపుల్ గా వున్న ఆమెని చూస్తుంటే సుజాత మనసుకి చాలా తృప్తిగా, హాయిగా వుంది. ఈమె దగ్గిరన్నమాట తను పని చెయ్యడం? చూస్తూంటే మనిషి లాగే మనసూ నిర్మలంగా వుండేటట్టుంది! ఈ ఇల్లు, ఇంత చక్కని ఆమెదగ్గిర తను పనిచెయ్యడానికి రావడం- అదృష్టంలాగే వుంది.
    "చూడు సుజాతా, 'నువ్వు' అంటున్నందుకు ఏమనుకోవడంలేదు గదా!" అంది చనువుగా ఆవిడ సుజాత సిగ్గుగా, కాస్త గాభరాగా తల అడ్డంగా తిప్పింది.
    "చూడు, నే నిప్పుడు ఆస్పత్రికి వెళ్ళిపోవాలి గానీ, మధ్యాహ్నం వంటిగంటకి వస్తాను మళ్ళీ అప్పుడు సావకాశంగా నీతో మాట్లాడుతాను. ఇప్పుడు నీవు స్నానం అదీ చేసి టిఫిను తీసుకో పద మేడమీదకి రా, నీ గది చూపిస్తాను. మధ్యాహ్నం వచ్చాక నీవేం చెయ్యాలో అన్నీ చెపుతాను. ఈ రోజుకి రెస్టు తీసుకో! నీకేం కావల్సినా ఇదిగో నాయర్ ని అడుగు, మొహమాట పడకుండా" అంది కళ్యాణి నడుస్తూ, మేడమీదకి దారితీసింది.
    మేడమీద మూడు గదులున్నాయి. అందులో మధ్యగదిలోకి తీసికెళ్ళింది కళ్యాణి. అక్కడ యెనిమిదేళ్ళ మగపిల్లాడు. ఆరేళ్ళ ఆడపిల్ల స్కూలు యూనిఫారాలు తొడుక్కుని టేబిల్ దగ్గిర కూర్చుని చదువుకుంటున్నారు.
    "వీళ్ళిద్దరూ నా పిల్లలు. వీడు రవి, అది రేఖ" అంది కల్యాణి. ఆశ్చర్యంగా చూస్తున్న పిల్లలతో "నిన్న చెప్పానుగా మీకు, మీకో క్రొత్త ట్యూటర్ వస్తారని! ఇదిగో యీ ఆంటీ పేరు సుజాత. ఏం బాగుంది కాదూ? మీరు చక్కగా రేపటినించి యీ ఆంటీ చెప్పినట్టు బుద్ధిగా వింటూ ఆంటీని అల్లరిపెట్టకుండా పాలు, స్నానం, భోజనం అన్నీ చేసెయ్యాలి. మీ హోం వర్కులు అన్నీ ఆంటీదగ్గర కూర్చుని చేసుకోండి-యేం? సుజాతా, నేను మధ్యాహ్నం వచ్చి అన్నీ చెపుతాను. ఇదిగో ముఖ్యంగా వీళ్ళిద్దరికోసమే నిన్ను పెట్టుకోడం, సరిగా స్నానం చేయరు, పాలు త్రాగరు, భోజనం చెయ్యరు. అన్నింటికీ ఆ పనివాళ్ళని నానా అల్లరి పెడతారు. వీళ్ళతో వేగలేకపోతున్నారు వాళ్ళు. ఏం చేస్తావో రేపటినించి నీదే బాధ్యత. వాళ్ళకి యే వేళకి యేం కావాలో చూసుకోడం, చదువు చెప్పడం నీ పనే. సరే, అవన్నీ తరువాత, ముందు నీవు నీ సామాను యీ గదిలో పెట్టుకో స్నానం అదీ చెయ్యి టిఫిన్ తీసుకో.
    "టైమయింది. ఇంక నేను వెళ్ళాలి. వచ్చాక మాట్లాడుకుందాం. రవీ, ఆంటీకి కొత్త, ఏం కావాలో చూడు కాస్త...." అంటూ క్రిందకి వెళ్ళడానికి బయలుదేరింది. "ఆ......రవీ, అన్నట్టు అమ్మమ్మ దగ్గిరకి తీసికెళ్ళు ఆంటీని. అమ్మమ్మకి చూపించు" అంది వెనక్కితిరిగి. రవి తల వూపాడు. కల్యాణి గబగబ క్రిందకి వెళ్ళిపోయింది.
    కాసేపు పిల్లలు, సుజాత, ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నిల్చున్నారు. పిల్లలిద్దరూ కాస్త క్రొత్తగా బిడియంగా సుజాతని చూస్తూ యేం చెయ్యాలో తోచనట్టు నిల్చున్నారు.
    "రవీ, ఏం చదువుతున్నావు నీవు?" సుజాత పిల్లలదగ్గిరకి నడిచి భుజంమీద చెయ్యివేసి నవ్వుతూ పలకరించింది వాళ్ళ క్రొత్త పోగొట్టడానికి.
    "థర్డ్ రేఖ సెకండ్ స్టేండర్ద్" అన్నాడు రవి.
    "ఆహా, స్కూలుకి యెలా వెడతారు? ఇక్కడికి దగ్గిరేనా? క్యారియర్ తీసికెడతారా?"
    "స్కూలు యెంతోదూరం లేదు ఆంటీ, అయినా అమ్మ రిక్షాలో పంపిస్తుంది. రిక్షా వస్తుంది రోజూ. భోజనం పన్నెండుగంటలకి. క్యారియర్ తీసుకుని వస్తుంది ఓ మనిషి. ఆంటీ, మరి.....మరి మా యింటిలోనే వుంటావు గదూ, ఈ గదిలోనే పడుకుంటావు గదూ" క్రొత్తపోయి చనువుగా చేయిపట్టుకుని అడిగాడు రవి. అన్ననిచూసి రేఖ కూడాదగ్గిరకి వచ్చింది. "ఆంటీ, నీకు కధలు వచ్చా?" కుతూహలంగా అడిగింది.
    పిల్లలిద్దర్నీ చూస్తే సుజాతకి ముచ్చటవేసింది. ఇద్దరూ తెల్లగా, బొద్దుగా వున్నారు. రేఖ అయితే డాక్టరుగారిలాగే వుంది. పిల్లలిద్దరి ఆరాటం, అమాయకత్వం అది చూస్తే సుజాతకి జాలి అన్పించింది. పాపంతల్లి యెప్పుడూయింట్లో వుండదు. వాళ్ళ సంగతి చూడడానికి ఆవిడకి టైముండదు. అంచేత తమతో మాట్లాడ్డానికి, తమ సంగతి చూసి తమతో వుండే మనిషి కన్పించగానే వాళ్ళకి యేదో సంతోషంగావుంది గాబోలు అనుకుంది సుజాత. ఇద్దరి భుజాలమీద చేతులు వేసి "ఆ....ఆ.....యిక్కడే వుంటాను. మనం ముగ్గురం ఒకగదిలోనే వుందాం. నేనిక్కడే పడుకుంటాను. మీకు రోజూ రాత్రి మంచి కథలు చెపుతాను, మరి నేను చెప్పినట్టల్లా మీరు వినాలి, బుద్ధిగా వుండాలి-యేం?" అంది.
    పిల్లలిద్దరి మొహాలు సంతోషంతో వికరించాయి. 'ఓ....అలాగే' అన్నారిద్దరూ.
    "సరే, అయితే యీ రోజునించి మనం ముగ్గురం ఫ్రెండ్స్!" సుజాత పిల్లల బుగ్గలు పుణుకుతూ అంది.
    "ఆంటీ, స్నానం చెయ్యండి, టిఫిన్ తిందాం. ఇదిగో బాత్ రూం ఇక్కడే వుంది" అన్నాడు రవి.
    సుజాత పెట్టెతెరిచి బట్టలు, సబ్బు అవి తీసుకుంటూంటే ఇద్దరూ చెరో ప్రక్కన నిలబడి యేవేవో అడగడం మొదలుపెట్టారు. సుజాత స్నానం చేసివచ్చి, జడ వేసుకుంటున్నంతసేపూ వాళ్ళిద్దరూ ఆ కాసేపటి లోనే తమ స్కూలు, టీచర్ల సంగతి, ఫ్రెండ్సు సంగతి-యిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్టు చెప్పడం ఆరంభించారు. సుజాత అన్నీ ఉత్సాహంగా వింటూ మధ్య మధ్య ప్రశ్నలు అడుగుతూ వాళ్ళ ఉత్సాహాన్ని యెక్కువచేసి క్రొత్త పూర్తిగా పోగొట్టింది ఒక గంటలోనే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS