Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 10


    "క్రిందకి వెడదామా ఇంక" ముస్తాబయ్యాక అంది సుజాత.
    పిల్లలిద్దరూ సుజాత చెరో చెయ్యిపట్టుకుని క్రిందకి తీసికెళ్ళారు. అమ్మమ్మ దగ్గిరకి వెడదామా ఆంటీ?" అన్నాడు రవి.
    "ఆ. ఆ, ఆవిడేది-ఎక్కడున్నారు?"
    "అమ్మమ్మ యీ గదిలోనే వుంటుంది. అమ్మమ్మ యెప్పుడూ ప్రక్కమీదే వుంటుంది. నడవలేదు, లేవలేదు, అన్నీ ప్రక్కమీదే. అమ్మమ్మకి పక్షవాతమట మమ్మీ చెప్పింది" అంటూ రవి మెట్లప్రక్కనే వున్న గదిలోకి తీసికెళ్ళాడు.
    మంచంమీద సరస్వతమ్మ పడుకునివుంది, మంచి పచ్చటి రంగులో నెరిసిన జుత్తుతోవున్న ఆమె వార్ధక్యంలో, జబ్బులో కూడా ఆమె మొహంలో కనిపించే కళా కాంతులకి సుజాత ఆశ్చర్యపడింది. వయసులో ఇంకెంత అందంగా వుండేవారో ననిపించింది. సుజాత, పిల్లలు గదిలోకి రాగానే ఆవిడ కాస్త కుతూహలంగా, ఆశ్చర్యంగా చూసింది.
    "అమ్మమ్మా, ఇదిగో యీ ఆంటీ మన యింట్లో వుండడానికి వచ్చింది! మాకు చదువు అదీ చెపుతుంది, మా దగ్గిరే పడుకుంటుంది" ఉత్సాహంగా అన్నాడు రవి.
    "ఆంటీకి బోలెడు కధలు వొచ్చుట, రోజూ చెప్పుతానంది" రేఖ అంతకంటే ఉత్సాహంగా అంది. సరస్వతమ్మ సుజాతని ఓసారి ఆపాదమస్తకం పరీక్షించింది. "కల్యాణి చెప్పింది నీవు వస్తావని వచ్చావన్న మాట. బాగుందమ్మాయి. రా, యిలా కూర్చో, నీ పేరేమిటి? మీ యింటి పేరేమిటి?" అంటూ మంచంమీద కూర్చోపెట్టి సుజాత యింటి సంగతులన్నీ అడిగిందావిడ. సుజాత వినయంగా అన్నింటికి జవాబులు చెప్పింది.
    "వేలకి వేలు ఖర్చవుతూంది. మళ్ళీ పిల్లలకన్నా శుభ్రంగా యేది తినడానికి లేదు. దీని లోకువ కనిపెట్టి వాళ్ళలా ఆడిస్తున్నారు. అంచేతే ఓ రెండుమూడు వందలు ఖర్చయినా నమ్మకంగా ఇల్లుని, పిల్లలని కనిపెట్టి వుండే మనిషి కోసం చూసింది. ఇంక నీవు యీ ఇంటి సంగతులన్నీ చూసుకోవాలమ్మాయీ, ఏమేం చెయ్యాలో మా కల్యాణి చెప్పే వుంటుంది నీకు?"
    "లేదండీ, ఇప్పుడు హడావిడిగా వెళ్ళారు. మధ్యాహ్నం వచ్చి అన్నీ చెప్తానన్నారు" అంది సుజాత.
    "అప్పుడు మాత్రం తీరికా యేమిటి దానికి? రెండు ముద్దలు తిని కాసేపు కళ్ళుమూసుకుంటే యెవరోవచ్చి లేపేస్తూంటారు. మళ్ళీ హడావిడిగా నాలుగు గంటలన్నా కాకముందే వెళ్ళిందంటే యే రాత్రోగాని తిరిగి యిల్లుచేరదు. ఆ మధ్యాహ్నం ఒకగంటే కాస్త యింట్లో వుంటుందనుకో. ఇన్నాళ్ళు నే నింట్లో వుండి చూసుకునే దాన్ని కనక సరిపోయేది. ఇదిగో యీ యేన్నర్ధం నించి నాకీ రోగంవచ్చి కదలలేక ప్రక్కలో పడుకుంటున్నాను. అప్పటినించి దానికి అవస్థలు మొదలు. ఏమిటో యీ రోగం తగ్గదు, మానదు. ఇలా ప్రక్క నంటిపెట్టుకుని యేడుస్తున్నాను అందరికీ బరువయి" ఆవిడ దైన్యంగా అంది.
    "అలా అనకండి, బరువుకి యేముంది మీరేం చేస్తారు జబ్బు వస్తే."
    "బరువుకాక మరేమిటమ్మాయి. దానికా తీరుబాటులేదు. నేనా కాళ్ళు, చేయి లేనిదాన్ని, నాకు అన్నందగ్గిరనించి ప్రక్కమీదే తినిపించాలి. ఆ నాయరు అన్నం తీసుకొచ్చి తినిపిస్తుంటే ప్రాణం చచ్చినట్టుంటుంది. కానీ యేం చెయ్యను. మరో గతిలేదు. ఎన్నాళ్ళో యీ బ్రతుకు. ఆ పనిమనిషే మొహం కడిగించి, బట్టలు అవి మారుస్తుందనుకో. ఇంత బ్రతుకూ బ్రతికి వాళ్ళచేతి తిండి యెలా తినను."
    "ఇంక మీరేం దిగులుపడకండి. మీకేం కావాలో అన్నీ నేను చూస్తాను. పిల్లల సంగతీ చూసుకుంటాను" అంది సుజాత. ఆవిడ తృప్తిగా నిట్టూర్చింది.
    "ఏదో నీ పుణ్యమా అని కాస్త యిల్లు -వాకిలి కనిపెట్టుకుని వున్నావంటే దాని ప్రాణం హాయిగా వుంటుంది" అందావిడ! పిల్లలిద్దరికీ యీ సంభాషణ యేమీ రుచించడంలేదు. అసహనంగా వింటున్నారు.
    "ఆంటీ, పద టిఫిను తిందాం, మా స్కూలుకి టైమవుతూంది" అన్నాడు రవి.
    "ఆ, ఆ వెళ్ళండి వెళ్ళండి" అంది సరస్వతమ్మ.
    "మీరు.....మీరు టిఫిన్ చేశారా" సుజాత అడిగింది.
    "నేనీ టిఫిన్లు తిననే అమ్మా ప్రొద్దుటే కాఫీ తాగుతాను. తొమ్మిది గంటలకి హార్లిక్స్ తాగి పదకొండుగంటలకల్లా అన్నం తినేస్తాను" అందావిడ.
    పిల్లలు, సుజాత డైనింగ్ టేబిల్ దగ్గిరకెళ్ళారు. 'ఆంటీ నా ప్రక్కన కూర్చోవాలి' అంటూ యిద్దరూ దెబ్బలాడు కుంటూంటే యిద్దరిని సమాధన పరిచి ఇద్దరినీ చెరోప్రక్కన కూర్చోపెట్టుకుంది సుజాత. నాయర్ ముగ్గురికి ఇడ్డెన్లు తెచ్చిపెట్టాడు. పిల్లలిద్దరికీ చెరో ఉడికించిన కోడిగుడ్డు, రెండు గ్లాసులలో పళ్ళరసం తీసుకొచ్చి పెట్టాడు.
    రవి, రేఖ యిద్దరి కిద్దరూ సుజాతని మెప్పించడానికి పోటీలు పడుతూ గబగబ టిఫిను తినడం ఆరంభించారు. రవి పెట్టిన రెండు ఇడ్డెన్లు తినేసి సుజాతవంక గర్వంగా చూసి 'నాయరూ, మరో ఇడ్డెన్లు తినేసి సుజాతవంక గర్వంగా చూసి 'నాయరూ, మరో ఇడ్డెను' అన్నాడు. రేఖ తనకి పెట్టినవి రెండూ పూర్తి చెయ్యలేక నానా అవస్థ పడుతూనే 'నాకూ మరోటితే' అంది. సుజాత ఇద్దరి తాపత్రయం గమనించి నవ్వుకుంది. అదేం పైకి తెలియనీకుండా "గుడ్ తినేశారన్న మాట! మీరింత బుద్ధిగా తింటే మీ మమ్మీ అలా అంటారేమిటి?" అంది తెలియనట్టు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS